మాట్లాడే బొమ్మ

11 Jul, 2020 02:00 IST|Sakshi

అక్షర తూణీరం

‘‘నగరవాసులు తాము మేధావులమని భావిస్తారు గాని పల్లెల్లో ఉండేవారే చాలా సున్నితంగా ఆలో చిస్తారు. చాలా పరిశీల నగా ప్రతి చిన్న విష యాన్ని గమనిస్తూంటారు. చూశారా! యీ మధ్య యన్టీఆర్‌ మళ్లీ ఫ్రేములోకి వచ్చారు’’ అంటూ మా ఊరి ఓటరు మాట ప్రారంభిస్తే నాకేమీ అర్థం కాలేదు. పిచ్చి చూపు చూశాను. మా ఓటరు నవ్వి, ‘‘అదేనండీ జనంలో తనమీద నమ్మకం పడి పోయిందని సందేహం వచ్చినప్పుడల్లా  చంద్ర బాబు అన్నగారి బొమ్మని దగ్గరకి తీసుకుంటారు. గమనించండి కావలిస్తే, యీ మధ్య ఒకే ఫ్రేములో యిద్దరూ సన్నిహితంగా కనిపిస్తున్నారు’’ అంటూ నావంక చూశాడు.

నిజమే కావచ్చు గాని నేనె ప్పుడూ మా ఓటరు చూసినంత యిదిగా గమనిం చలేను. నేను మర్యాదకి ఔనన్నట్టు తలూపాను. ఓటరు మరోసారి నవ్వి, అన్నగారే పక్కన కూకుని నడిపిస్తున్నారన్న భ్రమ కలిగించే కోణంలో ఆ బొమ్మని పెట్టుకుంటున్నారీ మధ్య. అసలు అదెట్టా వుంటదంటే, అక్కడక్కడ తీర్థంలో తిరునాళ్లలో మాట్లాడే బొమ్మని చేతిలో పట్టుకుని ఒకాయన కనిపిస్తూ వుంటాడు. ఆ బొమ్మచేత చమత్కారంగా మాటలు చెప్పిస్తూ ఉంటాడు. నిజానికి బొమ్మ మాటలన్నీ ఆయనే మాటలాడతాడు, ఇక్కడ గారడీ ఏమిటంటే పెదాలు కదలకుండా మాట్లాడే కళని ఆయన నేర్చుకుంటాడు. చూసే వాళ్లకి వినేవాళ్లకి వినోదంగా, విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా మన వూరి రచ్చబండ జనాభాకి అన్నగారు మాట్లాడే బొమ్మలాగే కనిపిస్తున్నారు. 

రాష్ట్రంలో ఏం జరిగినా ఏ మంచి చేసినా దాన్ని క్షణంలో తిరగేసి దానికో వక్రభాష్యం చెప్పేసి హాయిగా ఓ పని అయిపోయిందన్నట్టు రిలాక్స్‌ అవటం చంద్రబాబుకి అలవాటు అయిపోయింది. కోట్లాది రూపాయలు, లక్షలాది కుటుంబాలకు సరాసరి తరుగులు లేకుండా పంచిపెడుతుంటే, ఓస్, యిదేనా... యిది తెలుగుదేశం బ్రెయిన్‌ చైల్డ్‌. ఆలోచించి... చించి డిజైన్‌ చేసింది నేనే! దాన్ని కొంచెం పాడుచేసి యీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇదొక పెద్ద మోసం. అంటూ చంద్రబాబు అంటుంటే అనుచరగణం అందుకు కోరస్‌ పాడుతోంది. టీడీపీ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు  అంత సునాయాసంగా మోసపోయే దశలో ఉన్నారా? ఉండి ఉంటే బాబూ! మీ పార్టీకి  ఇలాంటి దశ పడుతుందా? వాళ్లు అనుభవంతో చేవతేలారు. చంద్రబాబు హయాంలో వారు చెప్పుడు మాటలు వినీ వినీ చెడ్డారు. ‘‘అయన పుణ్యమా అని రాటు తేలాం’’ అంటున్నారు వాళ్లు.

అసలు అయినా ఎందుకీ అక్కర్లేని రాద్ధాం తాలు. టీడీపీ హయాంలో ఏ సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు చేశారో నిజంగా జనం చేతులకి అందాయో చెప్పండి. ఇప్పుడు ఎంతెంత అందు తున్నాయో చూడండి. ప్రతిదీ మైకు ముందు ఖండిస్తే చెల్లిపోతుందని మునుపటిలాగే చంద్ర బాబు భ్రమలో వుంటున్నారు. ముందు ఆయన ఆ పూర్వపు భ్రమలోంచి బయటపడాలి. అది చాలా మంచిది.

అవసరం కూడా. ప్రతిరోజూ చంద్రబాబు వదిలిపెట్టిన బకాయిలు వందల వేల కోట్ల రూపా యలు వద్దన్నా వార్తల్లోకి వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడరు. అమరావతి నూతన క్యాపి టల్‌ గురించి మాట్లాడతారు. చంద్రబాబు హయాంలో లండన్‌లో ప్లాన్లు గీయించారు, సింగపూర్‌తో చర్చలు నడిపారు. జపాన్‌తో యింకేదో జరిపారు. అయిదేళ్లలో వీసమంత పని జరగలేదు. భూములిచ్చిన వారిని ఒకే భ్రమలో ఒక రంగుల కలలో వుంచారు. అదేదో బంగారు గుడ్లు పెట్టే బాతుగా అభివర్ణించి చెబుతున్నారు.

ఒక క్యాపిటల్‌ దానికి తగ్గట్టు ఉండాలి గాని టూరిస్ట్‌ కేంద్రంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆదాయం  వచ్చే క్యాపిటల్‌ని చెయ్యాలనుకుంటే, హాయిగా మన నేటివ్‌ జూదాలు అంటే కోడి పందాలు, పేకాట లాంటి వాటిని అధికారికంగా నడిపిస్తే పిచ్చ బోలెడు ఆదాయం! మద్యానికి మూతలు తీసి విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసు కున్న చరిత్రగల గత పాలకులకు ఇందులో ఏ మాత్రం తప్పు అనిపించకపోవచ్చు.

వ్యాసకర్త:
శ్రీరమణ ప్రముఖ కథకుడు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా