దీపాలా? ద్వీపాలా?

23 Dec, 2017 01:10 IST|Sakshi

అక్షర తూణీరం

సోమనకీ, పోతనకీ, రామదాసుకీ ప్రాంతీయత ఆపాదించాం. విశ్వమానవుడైన కాళోజీకి కొలతలు నిర్ణయించాం. విడిపోయినంత మాత్రాన వివక్షలు చూపనక్కర్లేదు. అన్ని సందర్భాలకు ఉద్యమస్ఫూర్తి పనికిరాదు.

తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు ఆర్భాటంగా మొదలై ఆనందోత్సాహాలతో సాగి, విజయవంతంగా ముగి శాయి. తెలుగువారందరికీ ఒక మధుర స్మృతి. జరిగిన తెలుగు తిరునాళ్లవల్ల తెలుగు విస్తృతి పెరిగిందా తరిగిందా అన్నది ప్రశ్న. తెలుగు వైతాళికులను తమకు కావల్సిన రీతిలో జల్లెడపట్టి పాలకులు వారిని మాత్రమే ప్రదర్శిం చారన్నది నిజం. ఈ వడపోతవల్ల తెలుగు ప్రాభవం అందగించిందో, మందగించిందో ఆలోచించుకోవాలి. అందరూ కలిసి మాట్లాడితే పదికోట్ల గొంతులు, చీలి పోతే ఆరూ మూడూ!


పంచతంత్ర నిర్మాత, తెలుగు వ్యాకరణవేత్త అయిన చిన్నయసూరిని మద్రాసీ వంకన వదిలేస్తామా? తెలుగు భాషికి దాసుడై తెలుగుతల్లికి సేవచేసిన సీపీ బ్రౌన్‌ని ఆంగ్లేయుడని కడగా పెడదామా? షాజహాన్‌ కొలువులో గౌరవాలందుకున్న అలంకారవేత్త మన పండితరాయ లకు ఇలాంటి ఉత్సవాలలో పేరు దక్కద్దా? తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్‌ మానసపుత్రిక. ఆయన ముద్దుబిడ్డగా వన్నెలు, చిన్నెలు సంతరించుకుంది. బుద్ధ పూర్ణిమ పథకంతో భాగ్యనగరానికి వెన్నెల తెచ్చింది తారక రామారావు. ఎన్టీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు పట్టాకనే తెలుగుదనం పరిమళించింది. హైదరాబా దులో కమ్మని తెలుగుమాటలు వెరపులేక వినిపించసా గాయి. ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అనే సూక్తి నందమూరితోనే ప్రాచుర్యంలోకి వచ్చింది.

జీవనది గోదావరి ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. పాయలు వేరైనా నీరొకటే. ఆ నీటి గుణా లొక్కటే. అక్కడి జలచరాలు అన్ని పాయల్లో స్వేచ్ఛగా కలుపుగోలుగా తిరుగాడుతూ ఉంటాయ్‌. ఆ అలలు నేర్పిన భాషలోనే మాట్లాడుకుంటాయ్‌.

బంగారు పళ్లానికైనా గోడ చేర్పు కావాలి. ఆచార్య సినారెని ఆది నించి కడదాకా సమాదరించారు అన్న గారు. దాశరథిని అక్కినేని అక్కున చేర్చుకున్నారు. ఆస్థాన కవి పదవిలో జలగం గౌరవించారు. ఎంత పాతబడినా నిజాలు చెరిగిపోవు. ప్రారంభ సభలో ఎన్టీఆర్‌ పేరెత్తడానికి సంకోచించారు వెంకయ్యనా యుడు. అంతేకాదు మరెన్నో చెప్పదగిన, చెప్పాల్సిన పేర్లను దాటవేశారు. అప్పుడు డైలాగులు మర్చిపోయిన నటుడిలా ఉపరాష్ట్రపతి కనిపించారు. చివరి రోజు రాష్ట్ర పతి స్పష్టంగా పింగళి వెంకయ్యని, అల్లూరిని సైతం స్మరించుకున్నారు. ప్రథమ పౌరునికి ధన్యవాదాలు.

ఇవ్వాళ కవులుగా, కథ, నవలా రచయితలుగా ప్రసిద్ధులై సభల్లో కళకళలాడుతూ తిరిగిన వారంతా– పెరిగిందీ పేరు తెచ్చుకుందీ కోస్తా ప్రాంతపు పత్రి కల్లోనే. తొలి రచనలు ప్రచురించి, సానలు దిద్దిన పత్రికా సంపాదకుల్ని, తెలుగుమీరిన పాఠకుల్ని పూర్తిగా విస్మ రించి స్వయంభూలుగా ప్రవర్తించక్కర్లేదు.

అలిశెట్టి ప్రభాకర్‌ని గమనించిందీ, గుర్తించిందీ, నెత్తిన పెట్టుకు వూరేగించిందీ కోస్తా ప్రాంతం. సోమ నకీ, పోతనకీ, రామదాసుకీ ప్రాంతీయత ఆపాదించాం. విశ్వమానవుడైన కాళోజీకి కొలతలు నిర్ణయించాం. విడి పోయినంత మాత్రాన వివక్షలు చూపనక్కర్లేదు. అన్ని సందర్భాలకు ఉద్యమస్ఫూర్తి పనికిరాదు. పద్యనాటకం తెలుగువారి హంగు. బుర్రకథ తెలుగోడి పొంగు. చెక్కభజన, హరికథ తెలుగు భుజకీర్తులు. దీపంచెట్టు తెలుగు పల్లెల ఆనవాలు. ఇవన్నీ అలా ఉంచి ఇంతకీ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ సభలు ఎలాంటి అంచనాలు కలిగించాయి. ఒకజాతి దీపాల్లా వెలుగులు పంచాలిగాని ద్వీపాల్లా మిగలకూడదు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అన్నీ కలిసి ఉన్న ప్పుడే తెలుగు అక్షరమాల సంపూర్ణమవుతుంది. అప్పుడే మాటలన్నీ పలుకుతాయ్‌. ఉచ్ఛారణ స్వచ్ఛంగా, స్పష్టంగా, సలక్షణంగా వర్ధిల్లుతుంది. జై తెలుగుతల్లి!


వ్యాసకర్త ప్రముఖ కథకుడు
శ్రీరమణ

మరిన్ని వార్తలు