మెట్రో రైలుకి స్వాగతం

25 Nov, 2017 01:53 IST|Sakshi

అక్షర తూణీరం

భాగ్యనగరానికి వొంకుల వడ్డాణమై మెట్రో రైల్వేట్రాక్‌ అమరింది. ఒక ఉక్కు సంకల్పం సాకారమైంది. చిత్తశుద్ధి, పథక రచన, కార్యదక్షత తగుపాళ్లలో ఉంటేనే ఇది సాధ్యం.

చిన్నప్పుడు హైదరాబాదు రావడమంటే విదేశం వెళ్లి నట్టే. డబుల్‌ డెక్కర్‌ బస్సు అన్నిటికంటే మించిన ఆక ర్షణ. అసలు దాంట్లో ప్రయాణించడమే ఓ ఎడ్యుకేషన్‌ అనిపించేది. మా కోస్తా ప్రాంతం వాళ్లకి ఇరానీ చాయ్, సమోసా, డబుల్‌ కా మీఠా, షర్బత్‌ లాంటివన్నీ కొత్తే. ఇరానీ కేఫ్‌లో ఓ పక్కన గ్రాంఫోన్, పక్కన హిందీ పాటల ప్లేట్లు అమర్చి ఉండేవి. అక్కడ మనం పావలా కాయిన్‌ వేయగానే, చిన్న హ్యాండిల్‌ కదుల్తుంది. ఓ ప్లేటుని డిస్క్‌ మీద అమరుస్తుంది. ఆ వెంటనే సౌండ్‌పీస్‌ వొయ్యారంగా ప్లేటు మొదట ముల్లుమీద నిలబడేలోగా డిస్క్‌ తిరగడం మొదలవుతుంది. పావలాతో ఈ గారడీ చూడవచ్చు, పాట కూడా వినవచ్చు. సంగం సినిమాలో ‘‘బోల్‌ రాధా బోల్‌ సంగం హోగాకే నహీ’’ పాటమీద చాలా పావలాలు వదిలించుకున్న తీపి జ్ఞాపకం. అప్పటి గౌలిగూడ బస్టాండు నవాబుగారు విమానం పెట్టుకునే హ్యాంగరు పాపం! నౌబత్‌ పహాడ్‌ ఎక్కడం ఓ అడ్వెంచర్‌. యువతీ యువకులు, జంటలుకాని జంటలు అక్కడ కనిపించేవారు. తర్వాత అది బిర్లామందిర్‌గా మారింది. ఒకచోట గోపీ హోటల్‌ ఉండేది. అక్కడ ఇడ్లీమీద జీడిపప్పు అద్దేవారు. బర్కత్‌పురా నించి కాలినడకన వెళ్లి చార్మినార్‌ ఎక్కి, చుట్టాల పిల్లలతో కలిసి అక్కడ నించి నగరాన్ని చూశాం. అందరితోపాటు మేం కూడా అక్కడ పడి ఉన్న తుప్పట్టిన మేకుల్ని, రాళ్లని వాడి మా పేర్లు పొడి అక్షరాల్లో చెక్కు కున్నాం– చేసిన పాపం చెబితే పోతుంది.

సాలార్జంగ్‌ మ్యూజియంలో స్వయంగా గంటలు కొట్టే మర మనిషి కోసం పన్నెండు అయ్యే దాకా నిరీక్షించేవాళ్లం. కరెక్ట్‌గా వేళకు వచ్చి సుత్తితో గంటలు కొట్టేసి వెళ్లిపోయేవాడు. హైకోర్టు మెట్లు, లోపల వరండాపై కప్పు చుట్టూ పెద్ద పెద్ద తేనెపట్లు ఇప్పటికీ గుర్తొస్తుంటాయ్‌. విగ్రహాలు లేని టాంక్‌బండ్, బుద్ధుడు లేని హుసేన్‌ సాగర్‌ నాకు తెలుసు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రన్‌ వేకి గేట్లుండేవి. విమానం వచ్చేటప్పుడు అడ్డంగా వెళ్లే ట్రాఫిక్‌ని నియంత్రించేవారు. మామిడిపళ్లు ఆ దేశంలో తూకానికి అమ్ముతారని మా ఊర్లో ఆశ్చర్యపోయేవారు. ఇక్కడ్నించి వెళ్లేటప్పుడు అక్కకి గాజులు, అమ్మకి అనాబ్‌ షాహిలు, నాన్నకి పుల్లారెడ్డి మిఠా యిలు తీసికెళ్లడం రివాజు.

ఇప్పుడు చూస్తే మహానగరమై పోయింది. భాగ్యనగరానికి వొంకుల వడ్డా ణమై మెట్రో రైల్వేట్రాక్‌ అమరింది. ఒక ఉక్కు సంకల్పం సాకారమైంది. చిత్తశుద్ధి, పథక రచన, కార్యదక్షత తగుపాళ్లలో ఉంటేనే ఇది సాధ్యం. అసలీ మహా నిర్మా ణంలో పాలుపంచుకోని శాఖ లేదు. ఇది సమైక్య, సమష్టి కృషికి నిదర్శనం. ఇదొక మహత్తర సందేశం. నగరంలోని ప్రధాన వీధుల మధ్య స్తంభాలు నాటి, వాటి మీంచి ట్రాక్‌నే కాదు స్టేషన్లని, షాపింగ్‌ మాల్స్‌ని, కదిలే మెట్లని, కదలని మెట్లని సమకూర్చడం ఒక గొప్ప ఇంజనీరింగ్‌ ఫీట్‌. ఈ మహా నిర్మాణ క్రతువులో ఎన్ని జాగ్రత్తలు వహించినా కొన్ని అపశ్రుతులు తప్పవు. అపశ్రుతులకు బలైన వారిని ఇప్పుడు సంస్మరించుకోవాలి. ఈ మెట్రో ట్రాక్‌ని ఎక్కడ తట్టినా యన్వీఎస్‌ రెడ్డి పేరు ఖంగున వినిపిస్తుంది. శరవేగంతో పనులు సాగేందుకు నాయకుడై ముందు నిలిచిన కేసీఆర్‌కి ప్రజలు సదా రుణపడి ఉంటారు. ‘‘నిజ్‌’’ రైలు మార్గాన్ని జాతికి వరంగా అందిస్తున్న ప్రధాని మోదీకి హార్థికాభినందనలు.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు