ఇవాంకం

2 Dec, 2017 03:49 IST|Sakshi

అక్షర తూణీరం

ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు.

నెలరోజుల్నించి సందడి.. సందడి, పండుగ.. పండుగ వాతావరణం భాగ్యనగరంలో. రెండు పెద్ద సందర్భాలు కలిసొచ్చాయ్‌–దసరా, దీపావళి లాగా. మెట్రో పట్టాలెక్కడం, ప్రపంచ పారిశ్రామికవేత్తల సమాలోచనలు– రెండూ కలసి నగరం రంగు మార్చాయి. ఇవాంకా ట్రంప్‌ రాక మొత్తం దృశ్యాన్ని ముంచెత్తింది. ఓ పక్కన మోదీకి, ఓ మూల కేసీఆర్‌కి చోటు దక్కింది. ఇవాంక కదిలే మార్గాలన్నీ రంగులు పులుముకున్నాయి. పాత చెట్లకి కొత్త రంగులు పడ్డాయ్‌. ఈతచెట్లు అసహజంగా కనిపిస్తూ కనువిందు చేశాయ్‌. గోడల మీది బొమ్మలు గాడీగా కనిపిస్తూ వచ్చేపోయే వారి దృష్టిని లాగేశాయి. ఇవాంక కోసం వచ్చిన అత్యాధునిక కార్ల టైర్లు కుదుపుకి లోనుకాకుండా రోడ్లని నునుపు చేశారు. దారికిరువైపులా పచ్చని తెరలు కట్టారు. గోల్కొండ శిథిలాల్లో ఎగిరే ఈగల్ని దోమల్ని వేటాడారు. ఇవాంక తిరిగే హద్దుల్లో వీధి కుక్కలు లేకుండా మోసేశారు. బిచ్చగాళ్లని ఏరేశారు. పనిలేని వారు వీధుల్లోకి రావద్దని పోలీసులు సలహాల్లాంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇవాంక అంటే అమెరికా అధ్యక్షుని గారాల పట్టి. పైపెచ్చు సలహాదారు. అసలు రెండుమూడు వారాల పాటు మీడియాలో ఇవాంక ముచ్చట్లు తప్ప వేరే వార్తలు లేవు. కారాలు మిరియాలు కూడా వైట్‌హౌస్‌లోనే నూరుకు తెచ్చారట! వంటవారు, నీళ్లవారు, ముందస్తుగానే తినేవారు, తిని పించేవారు అంతా అక్కణ్ణించే దిగారట. ఆవిడ చార్మినార్‌ తిలకిస్తారట. అక్కడ రంగురంగుల గాజులు చూస్తారట... ఇలా ఇవాంక రాక నగర చరిత్రలో సువర్ణాంకమైపోయింది.

ప్రధాని మోదీ విమానం దిగుతూనే పాలక వర్గానికి ఝలక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ పేరు చెబితే సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ గుర్తొస్తారని తొలి విసురు విసిరారు. ఆనాటి సాయుధ పోరాటంలో వీర మరణం చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, నాటి పీడకలని గుర్తుకు తెచ్చారు. కేసీఆర్‌ నిజాం గారికి నిత్య భజనలు చేస్తున్నారు. మెట్రోకి ‘నిజ్‌’ అన్నది ముద్దుపేరు. అక్కడి బీజేపీ శ్రేణులు తెగ సంబరపడి నేత ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. తర్వాత మోదీ గబగబా పైలాన్‌ని, చకచకా రైలుని ఆవిష్కరించేశారు. ఇంతపెద్ద సందర్భమైనా ఒక్కమాట మాట్లాడలేదు. ఏ ఒక్కరినీ అభినందించలేదు. ఆఖరికి గొప్ప సౌకర్యం పొందిన నగరవాసులని కూడా.

ప్రపంచ పారిశ్రామికవేత్తల సభలో మోదీ గళం విప్పారు. గార్గి నుంచి ఆధునికకాలం దాకా మహిళలని ప్రస్తుతించారు. తర్వాత తన పాలనలో తను చేపట్టిన అద్భుతాలను ఏకరువు పెట్టారు. ఇదే కొంచెం ఎక్స్‌ట్రా అయిందని విశ్లేషకులన్నారు. ఇవాంక స్పీచ్‌ ఒక ప్రదర్శనలా వీక్షకులని ఆకట్టుకుంది. ఫలక్‌నుమాలో ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? అన్ని వంటకాలా! తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు టీవీక్షకులు. క్షీరసాగర మథనం స్థాయిలో మేధో మథనం జరిగింది హైటెక్స్‌లో. ఇంతకీ కవ్వానికి వెన్న పడిందా? కుండలోనే కరిగిపోయిందా? ఈ నిజాలు మనదాకా రావు. ఈ ఇవాంకం నేపథ్యంలో ప్రజలొకటే కోరుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో దోమలు, వీధికుక్కల విషయంలో ఉండండి! తిరిగి జన జీవన స్రవంతిలోకి బిచ్చగాళ్లని ప్రవేశపెట్టండి, పాపం! ఏదో రకంగా అందరం బిచ్చగాళ్లమే కదా!


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వ్యవసాయంతోనే ఆర్థిక సంరక్షణ

జనరంజకం నిర్మల బడ్జెట్‌

ఈ అసమానతలు ఇంకా ఎన్నాళ్లు?

ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. ఒకే నేత!

నవ్యాంధ్రలో ‘నవ’శకం

మాండలిక మాధుర్యాల పదకోశం

రాయని డైరీ.. ఎం.ఎస్‌.కె. ప్రసాద్‌ (సెలక్టర్‌)

బాబుగారు నంది అంటే నంది!

అనుసరించారా? వెంబడించారా?

ఆధునికీకరణే అసలైన రక్షణ

ఆ ఎమ్మెల్యేలకు పదవులు గడ్డిపోచలా?

విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అత్యవసరం

సాహిత్య వేదికలపై ఫత్వాలు సరికాదు

వృద్ధి కేంద్రంగా క్రియాశీల బడ్జెట్‌

మాతృభాషలో పరీక్షలే మేలు

కర్ణాటకలో అసంబద్ధ నాటకం!

భస్మాసుర హస్తమవుతున్న ఫిరాయింపులు

నిరాశాజనకం.. నిరుత్సాహకరం

సామాజిక ఉద్యమ స్ఫూర్తి ‘దండోరా’

ప్రజాప్రయోజనాలకు పట్టం కట్టిన బడ్జెట్‌

సంక్షేమ రథ సారథి

కారుణ్యమూర్తికి అక్షరాంజలి

విశిష్ట ముఖ్యమంత్రి వైఎస్సార్‌

మధ్యతరగతిపై ‘మైనారిటీ’ ప్రేమ!

ప్రత్యక్ష పన్నులపైనే ప్రత్యేక శ్రద్ధ

‘నిషేధం’ చెరలో రైతుల భూములు

అడవి దొంగలెవరు?

ఆర్థికాన్ని బడ్జెట్‌ ఆదుకునేనా..?

సోషలిజానికి సరికొత్త భాష్యం

 ‘పోడు’ సమస్య ఇంకెన్నాళ్లు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’