వీల్‌చైర్‌ నుంచి విశ్వదర్శనం

20 Mar, 2018 01:03 IST|Sakshi

రెండో మాట
మానవజాతి క్రమంగా రోదసిని నివాసయోగ్యం చేసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదంలో చిక్కుకోవచ్చని హాకింగ్‌ ఊహించాడు. ‘ఆకస్మికంగా భూగోళం వేడెక్కిపోవడం, అణ్వస్త్ర యుద్ధాలు, కృత్రిమ పద్ధతుల ద్వారా జన్యుకణాలలో వ్యాప్తి చెందే వైరస్‌ తదితర ప్రమాదకర ప్రయోగాలతో భూప్రపంచంపై జీవరాశి ప్రమాద స్థితికి చేరువ కావచ్చునని హెచ్చరిం చాడు. సైన్స్, టెక్నాలజీ, రోదసీ, సౌరమండల వ్యవస్థ పరిణామాలను సాధారణ పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన బహుకొద్దిమంది శాస్త్రవేత్తలలో హాకింగ్‌ ఒకరు.

‘నేను నాస్తికుడిని. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తను. ఖగోళ శాస్త్రవేత్తను. ప్రపంచ ఆవిర్భావం, దాని ఉనికికి సంబంధించిన విశ్వదర్శనంలో శిథిల శరీరంతోనే దూర తీరాలు ప్రయాణించి శాస్త్ర పరిశోధనలు కొనసాగించిన నేను సృష్టికి కారకుడు దేవుడు కాదు, దేవుడే లేడన్న నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే విజ్ఞానశాస్త్రాన్ని (సైన్స్‌) అర్థం చేసుకోవడానికి ముందు మానవుడు ఈ విశ్వసృష్టికి కారకుడు దైవం అని భావించడం సహజం. కానీ శరవేగాన దూసుకుపోతూ ప్రగతిమార్గంలో ఉన్న విజ్ఞానశాస్త్రం అనేక పరిశోధనల తరువాత విశ్వసృష్టికి కారణాన్ని మరింత విశ్వసనీయతతో, వైజ్ఞానికంగా వివరించసాగింది. దైవ భావన ఉద్దేశం మాకు (శాస్త్రవేత్తలు) తెలుసునంటే అర్థం ఆ దైవానికి తెలిసిన ప్రతి విషయమూ మాకు తెలుసునని చెప్పడమే, దేవుడనేవాడుంటే, గింటే! నిజానికి అతడు లేడు. కనుకనే నేను నిరీశ్వరవాదిని, నాస్తికుడిని. దైవం ఉనికిని నా శిథిల శరీరమే ప్రశ్నిస్తోంది.’

– స్టీఫెన్‌ హాకింగ్‌ (విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త. ఇటీవల కన్నుమూశారు)
‘రెండు ప్రశ్నలు: 1. భగవంతుడు సృష్టికి కారకుడా? 2. కనీసం దేవుడికి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా? నిజం చెప్పాలంటే సృష్టి జరిగిన తరువాత వచ్చినవాడు భగవంతుడు. కాబట్టి దేవుడు సృష్టికర్త కాజాలడు. ఈ కారణం చేతనే ఈ సృష్టి ఎలా జరిగిందన్న విషయం కూడా భగవంతుడికి తెలియదు.’
– నాసదీయ సూక్తం (రుగ్వేదం, 10వ మండలం, 129వ సూక్తి)

అంటే రుగ్వేదకాలం నాటికే భారతీయ భౌతికవాదం ప్రచలితమవుతోందన్నది సుస్పష్టం. వివేచనతో, హేతుబద్ధతతో కూడిన వ్యాఖ్యానాలు ఈ భౌతికవాద ప్రపంచానికి అందుతూనే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2–4 శతాబ్దాలలోనే గణితశాస్త్రంలో ప్రసిద్ధుడైన యూక్లిడ్‌కు ఎంతో ముందే ఈ శాస్త్రంలో కొత్తపుంతలు తొక్కి, కొత్త భావధారకు రూపురేఖలు అద్దిన త్రయం– జీనో (క్రీ.పూ. 495–435), యూడోక్సిస్‌ (క్రీ.పూ. 408–355), ఆర్కిమెడిస్‌ (క్రీ.పూ. 287–212). ముగ్గురూ గ్రీకులే. ఇక ఆర్యభట్టు (క్రీ.శ.490–599), భాస్కరాచార్య (క్రీ.శ. 6వ శతాబ్దం) భారతీయ మహా గణిత, భౌతికశాస్త్రవేత్తలు. వీరంతా ఆధునిక ప్రపంచ భౌతిక విజ్ఞాన, ఖగోళ శాస్త్రవేత్తలు, అణు విజ్ఞానశాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్, పెన్‌రోజ్‌ వీలర్, స్టీఫెన్‌ హాకింగ్‌లకు గౌరవనీయులైన మార్గదర్శకులే. ప్రపంచం పరస్పర ఆధారంతో ప్రభావితమవుతుందని తన సాధారణ సాపేక్ష, విశుద్ధ (ప్రత్యేక) సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అణు శాస్త్ర విజ్ఞాన పరిధిని విస్తరించిన ఐన్‌స్టీన్‌ ఇటీవల దివంగతుడైన హాకింగ్‌కు గురుతుల్యుడే. కౌమారం దాటక ముందే దారుణమైన నరాల వ్యాధితో, శిథిల దేవాలయంగా మిగిలిన శరీరంతో దాదాపు 50 ఏళ్లు బతికాడు హాకింగ్‌. వీల్‌చైర్‌కు పరిమితమై రోదసీ, నక్షత్ర సౌర మండల పరిశోధనలను కొనసాగించడంలోని విశేషం– ఆయన మేధస్సు నిరంత పరిశోధనా తృష్ణతో ప్రకాశిస్తూ ఉండడమే. అందుకే ఇటీవలనే దక్షిణ కొరియాలో (ప్యాంగ్‌చాంగ్‌) జరిగిన పారాలింపిక్స్‌లో అంగ వైకల్యం కలిగిన కొందరు క్రీడాకారులు హాకింగ్‌కు ఘన నివాళి అర్పించారు. దివ్యాంగులకు హాకింగ్‌ గొప్ప స్ఫూర్తి. అంతకు ముందు హాకింగ్‌ దివ్యాంగులైన క్రీడాకారులకు ఆర్ద్ర మైన సందేశం ఇచ్చారు: ‘మీరు చూడవలసింది అంతరిక్షంలో తారాడుతున్న నక్షత్రాలకేసే. నాలా వైకల్య స్థితిలో ఉన్న మీ పాదాల కేసి మాత్రం మీ చూపులను నిలపకండి!’

విశ్వవీక్షకుడు
విశ్వవీక్షణ ఫలితాలకు అక్షర రూపమిస్తూ హాకింగ్‌తో పాటే ఉంటూ, తుది పత్ర రచనకు రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ థామస్‌ హెర్డాగ్‌. ఈ తుది పత్రంలోనే తన ‘బ్లాక్‌ హోల్స్‌(కృష్ణబిలాలు) సిద్ధాంతాన్ని హాకింగ్‌ సమర్ధించుకోవడానికి కొన్ని భావనలు చేశారు. ఈ పరిశోధనలకు అంతుండదు. అందుకే వాటిని శాస్త్రవేత్తల సమ్మతి పొందేవరకు సమాజానికి విడుదల చేయరు. మూఢ విశ్వాసులకు, మత ఛాందసులకు, వారి సంఘ వ్యతిరేక ధోరణులకు; హేతువాదానికి మధ్య తేడా, అసలు ఘర్షణ ఈ బిందువు దగ్గరే ఆరంభమవుతుందని గ్రహించాలి. భౌతిక ప్రపంచానికి పరిణామవాదమనే విలువైన కానుకను అందించిన చార్లెస్‌ డార్విన్‌ను ఇటీవలే కేంద్ర మంత్రి ఒకరు గేలి చేశారు. అలా తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. తాజాగా పదార్ధ సాంద్రత, దానిలోని శక్తి గురించి వెల్లడిస్తూ ఐన్‌స్టీన్‌ వెల్లడించిన (ఇ=ఎంసి స్క్వేర్‌) సిద్ధాంతాన్నీ, హాకింగ్‌ కృష్ణబిలాల సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ‘అన్నీ వేదాలలోనే ఉన్నాయిష’ రీతిలో మరో కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. అసలు సాపేక్ష సిద్ధాంతం కన్నా విశిష్టమైన సిద్ధాంతం వేదాలలోనే ఉందని హాకింగ్‌ చెప్పాడని కూడా ఆ మంత్రి చెప్పారు. దీనికి ఆధారాలు ఏమిటని అడిగితే అడ్డదిడ్డమైన సమాధానం చెప్పి తప్పించుకున్నారాయన. రేపు ఇలాంటి వాదనలు ఇంకా పుట్టవచ్చు. ఎందుకంటే డార్విన్‌ పరిణామవాదాన్ని కనీసం దశావతారాల కోణం నుంచి కూడా చూడలేని అంధులయ్యారు ఈ మూర్ఖశిఖామణులు.

గొప్ప హెచ్చరిక
ముందు ముందు మానవజాతి క్రమంగా రోదసిని నివాసయోగ్యం చేసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదంలో చిక్కు కోవచ్చని హాకింగ్‌ ఊహించాడు. ఇందుకు కారణాన్ని కూడా పేర్కొన్నాడు: ‘ఆకస్మికంగా భూగోళం వేడెక్కిపోవడం, అణ్వస్త్ర యుద్ధాలు, కృత్రిమ పద్ధతుల ద్వారా జన్యుకణాలలో వ్యాప్తి చెందే వైరస్‌ తదితర ప్రమాదకర ప్రయోగాలతో భూప్రపంచంపై జీవరాశి ప్రమాద స్థితికి చేరువ కావచ్చునని హెచ్చరించాడు. ‘కృత్రిమ మేధస్సు’ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) యంత్రాన్ని సృష్టించుకోవడం ద్వారా కొన్ని రోగాలను, దారిద్య్రాన్ని అదుపు చేయడానికి తోడ్పడవచ్చునేమోగానీ, దాని వల్ల చాలా ప్రమాదాలు, పొంచి ఉంటాయని ముందస్తుగా హెచ్చిరించినవాడు హాకింగ్‌. సైన్స్, టెక్నాలజీ, రోదసీ, సౌర మండల వ్యవస్థ పరిణామాలను సాధారణ పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన బహుకొద్దిమంది శాస్త్రవేత్తలలో హాకింగ్‌ ఒకరు.

రాజకీయ పరిణామాలపై కూడా నిశిత వ్యాఖ్యలు చేయగల నిపుణ శాస్త్రవేత్త ఆయన. కనుకనే ‘బుద్ధి జాఢ్య జనితోన్మాది’గా పలువురు ప్రపంచ వ్యాఖ్యాతలు, నాయకులు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ను అంచనా కడుతున్న పరిణామాన్ని గమనించిన హాకింగ్, ‘తన ఎన్నికకు ముందు ట్రంప్‌ పేదవాళ్ల ప్రతినిధిగా తనను చిత్రించుకోడానికి ప్రయత్నించిన పచ్చి వదరుబోతు’ అన్నాడు. నిజానికి మానవజాతిలో, దేశ దేశాల పాలకుల్లో ‘బ్లాక్‌ హోల్స్‌’ ఉంటారని ఊహించిన హాకింగ్‌ నిరంతరం ప్రజా బాహుళ్యాన్ని హెచ్చరిస్తూ సామాజిక చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నించిన కమ్యూనిస్టు– సోషలిస్టు మానవతావాది. ఆయన కుటుంబ పునాదులే సమాజవాదం, సమానత్వ సిద్ధాంతాలు. ఆయన ‘బ్లాక్‌ హోల్స్‌’ సిద్ధాంతం, ఆ ‘కృష్ణబిలాలు’ ఎంత ఆకర్షణీయమైన అంశంగా మారాయంటే అవి భౌతిక విజ్ఞాన శాస్త్రానికి చెందిన ప్రాథమిక భావనలకు నాటికీ నేటికీ పెద్ద సవాళ్లుగా మారాయి. 

అంతు చిక్కనివి అనేకం
ఆకాశంలో మన కంటికి కనిపించేవి కొన్ని వస్తువులే. కానీ టెలిస్కోప్స్‌లో కనిపించేవి మరికొన్ని, అలాగే ఏ దృష్టికీ అంతు చిక్కనివి అనేకం. అలాంటి వాటిని కనిపెట్టే యత్నంలో లాప్లాస్, హాకింగ్‌ల పరిశోధనల్లో అందినవని భావిస్తున్న ‘కృష్ణ బిలాలు’ ఒక భాగం. ‘బ్లాక్‌ హోల్‌’ పదంలో అర్థవంతమైన ఆంతర్యం ఉంది. ఆ ‘కృష్ణ బిలం ప్రాంతం దిశగా చివరికి కాంతి కిరణం ప్రయాణించినా ఆ కిరణాన్ని పట్టుకుని బ్లాక్‌ హోల్‌ తనలోకి గుంజేసుకుం టోంది’. పదార్థం లేదా శక్తీ నశించటం ఉండదు, కానీ ఒక రూపం నుంచి మరో రూపంలోకి (రూప పరివర్తన) మారుతుంది.

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న సామెత లాగా వేదాల్లో లేనిది లేదు, సర్వం వేదమయం, ప్రపంచ విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ వైజ్ఞానిక కేంద్ర భూమిక వేద వాఙ్మయం– నిజమే ఒప్పుకుందాం. కానీ ఆ మహత్తర వాఙ్మయం వృద్ధిలోకి రాకుండా అడ్డుకున్నవాడెవడు? అడ్డుకునే స్వార్థపరులైన బ్రిటిష్‌ సామ్రాజ్య పాలకులకన్నా ముందు వైదిక శాస్త్రవాదులు మన స్వీయప్రతిభను ఎందుకు విస్తరించలేకపోయారు? వేల సంవత్సరాల వేద కాలం నాటికే చార్వాకుడు, కపిలుడు, వాత్సాయనుడు, బుద్ధుడు లాంటివారు ప్రవేశపెట్టిన హేతువాదాన్ని, భౌతికవాదాన్ని ఎందుకు ఎదగనివ్వకుండా అడ్డుకట్టలు వేయాల్సి వచ్చింది? అణువును బద్ధలుకొట్టలేమని ఒకప్పుడు పాశ్చాత్యులే నిర్ణయించి నిస్తేజులై ఉన్న సమయంలో ప్రాచీన కాలంలోనే మన కపిలుడు అణువు రహస్యాన్ని ఛేదించి ‘పేలవః పేలవః పేలవః’ సిద్ధాంతం రూఢి పరచగా, ఆ తరువాత ఆ సిద్ధాంతం ఆచరణలో ముందుకు సాగకుండా అడ్డుకున్న వారెవరు? స్వార్థ ప్రయోజనాల కోసం, ఉచితంగా ప్రజల శ్రమశక్తిని దోచుకుని సంపదను అనుభవిస్తూ యాచక వృత్తిని ఒక ఉపాధి మార్గంగా భావించి ప్రోత్సహించిన స్వార్థపర శక్తులే దేశంలో భౌతికవాద వినాశనానికి క్రమంగా గోతులు తవ్వాయి. మైథిలీ భాషావేత్త, సుప్రసిద్ధ సాహితీ, తాత్విక, భౌతికవాద ఆచార్యుడయిన పండిత హరిమోహన్‌ ఝా ‘దుర్గా స్తోత్ర పారాయణం’ గురించి పురాణ కాలక్షేపం చేస్తూ ‘‘రూపం ‘దేవి’/ జయం ‘దేహి’/ యశో ‘దేహి’/ ద్విషో దేహి’’ అంటూ స్తోత్రం చదువుతున్నారు. ఒకరు ప్రశ్నించాడట. అసలు ఈ యాచించే ప్రవృత్తి, సంస్కృతి ఎక్కడినుంచి వచ్చిందని. అందుకు సమాధానంగా పండితుడు ‘‘అరె అబ్బీ! ఈ రోగం చాలా పాతదిరా. వేద కాలం నుంచీ మన నాలుకల మీద ‘ద’ కూర్చుని ఉంది’’ అన్నాడు. ‘దేహి/దేహి/దేహి!’ అందరి దేవతలతో మనకున్న సంబంధం ఒకే ఒక అక్షరం ద్వారానే– ‘దే’. చివరికి ఉపనిషత్తు కూడా ‘ద, ద, ద’ (దానం/దయ/దమనం) అనే గురు మంత్రమే తీసుకొచ్చింది.

ఇలా వేదం, ఉపనిషత్తు రెండింటి ముగింపు ‘ద’అక్షరంతోనే మొదలవుతుంది. చివరికి దర్శనం కూడా ‘ద’అక్షరంతోనే ఆరంభమవుతుంది. అసలు మన సంస్కృతే ‘దానం’ పైన ఆధారపడి ఉంది. అంటే, శ్రమ చేసుకోకుండా ఇలా యాచక ప్రవృత్తి (దేహి)నే బతుకులు చాలించుకోమన్న సిద్ధాంత బోధ వల్లనే దేశంలో భౌతికవాదం ఎదగకుండా స్వార్థపరులు జాగ్రత్త పడ్డారని ఝా నిర్ధారించాడు. చివరికి ప్రాచీన సాహిత్యంలో జాబాలి రాముడికి చేసిన బోధలు భౌతికవాదమే. చార్వాకాచార్యుడు భారతీయ భౌతికవాద ఆది పురుషులలో ఒకరు. హేతువును ఆశ్రయించని, నిరూపణకు నిలబడని వాదనను తిరస్కరించమన్నవాడు వివేకానంద.


వ్యాసకర్త
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

మరిన్ని వార్తలు