పౌరుల దృష్టి మళ్లించే ఈ–దర్బార్‌లు ఆపండి!

29 Oct, 2017 01:39 IST|Sakshi

అవలోకనం

మన విదేశాంగ విధానపరమైన కృషిలో చాలా వరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోంది. దీంతో సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా కనిపిస్తున్నారు. ఒకటి రెండు కేసులను పరిష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలిస్తున్నారు.

మొగలాయిలు భారతదేశాన్ని జయించాక, అంతకు మునుపటి రాజుల రివాజైన రాజదర్శనాన్ని కొనసాగించారు. మొగల్‌ చక్రవర్తి పర్యటనలో ఉన్నప్పుడు తప్ప, ప్రతి రోజూ ప్రజలు తనను ‘చూడటానికి’ బాల్కనీలో నిల్చునేవాడు. ఈ దర్శనం, విగ్రహాన్ని చూడటం లాంటిదే. ఆ దర్శనం సామ్రాజ్యం పదిలంగా ఉన్నదని పౌరు లకు భరోసా కలిగించడం కోసమే. చక్రవర్తి గైర్హాజరీలో రాజ్యమంతటా వెంటనే పుకార్లు వ్యాపించి, అరాచకం నెలకొనేది. అందువల్లనే ఈ దర్శనం ముఖ్యమైనదిగా మారింది. 1627లో, జహంగీర్‌ చనిపోయినప్పుడు నేరస్తులు నగరాలను ఆక్రమిం చారని, వర్తకులు తమ వస్తువులను నేలలో పాతిపెట్టాల్సి వచ్చిందని జైన వర్తకుడు బనారసీదాస్‌ తన స్వీయ జీవిత చరిత్ర అర్థకథానక్‌లో రాశారు. మొగల్‌ రాకుమా రుడు కుర్రం వారసత్వ యుద్ధంలో నెగ్గి, షాజహాన్‌ పేరుతో చక్రవర్తి అయ్యాడనే వార్త దేశవ్యాప్తంగా వ్యాపించే వరకు ఈ గందరగోళం అలాగే ఉండి పోయింది.

నిజానికి జహంగీర్‌ చక్రవర్తుల్లోకెల్లా ఎక్కువ సోమరి. అతిగా మద్యం లేదా నల్లమందు సేవించడం వల్ల సాయంత్రం దర్బారు అర్ధంతరంగా ముగుస్తుండేదని యూరోపియన్‌ పర్యాటకులు నమోదు చేశారు. జహంగీర్‌ చక్రవర్తి దర్శన కార్యక్ర మానికి న్యాయమనే కొత్త అంశాన్ని చేర్చారు. రాజప్రాసాదంలో ఒక గొలుసును వేలాడదీసి ఉంచేవారని, సమస్యలున్న సామాన్య పౌరులెవరైనా దాన్ని లాగవచ్చని చెప్పేవారు. ఆ గొలుసుకు ఓ గంట కట్టి ఉండేదని, అది మోగినప్పుడల్లా చక్రవర్తి, వ్యవస్థ నుంచి పొందలేకపోయిన న్యాయాన్ని చేయడానికి బయటకు వచ్చేవారని అంటారు. దీన్ని అదిల్‌ ఎ జహంగీర్‌ లేదా జహంగీర్‌ న్యాయం అనేవారు. అది పౌరులందరికీ తక్షణ న్యాయాన్ని అందించేది. అయితే ఇదంతా ఉత్త బూటకమే. చక్రవర్తులెవరికీ, ప్రత్యేకించి జహంగీర్‌కు అంతటి తీరిక ఉండేది కాదు. నేనింతకు ముందే చెప్పినట్టు అతడు సోమరి, స్వార్థపరుడు. న్యాయం చేయడంలో ఆసక్తికి అతడు ఆమడ దూరంలో ఉండటమే కాదు, మహా క్రూరుడు. ఇద్దరు వ్యక్తుల కాలి వెనుక పిక్కలను కోసేయించి, వారికి శాశ్వత వైకల్యాన్ని కల్పించిన వాడు. అడవిలో వాళ్లు చేసిన అలజడికి, జహంగీర్‌ తుపాకీ గురిపెట్టి చంపాలని చూస్తున్న పులి భయ పడి పారిపోయింది. అదే వాళ్లు చేసిన నేరం. తుజుక్‌ ఎ జహంగీరి అనే తన స్వీయ జీవిత చరిత్రలో ఈ విషయాన్ని రాసుకున్నాడు కాబట్టే ఇది మనకు తెలిసింది.    

కాబట్టి అదిల్‌ ఎ జహంగీర్‌ తెరచాటున భారతదేశంలో నెలకొని ఉండిన సర్వ సాధారణ పరిస్థితి అదే. అది నేటికీ కొనసాగుతోంది. పాలకులు, ప్రత్యక్ష జోక్యం ప్రదర్శనను రక్తి కట్టించడంలో ఆసక్తిని చూపవచ్చు. అంతేగానీ, ప్రపంచం లోని అత్యధిక భాగంలో జరుగుతున్నట్టుగా వ్యవస్థాగతంగా అందుతున్న సహా యానికి, సేవలకు హామీని కల్పించడంపై మాత్రం ఆసక్తిని చూపరు. సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌ ఖాతా అదిల్‌ ఎ జహంగీర్‌కు ఆధునిక అవతారం కావడం వల్లే ఇది రాస్తున్నాను. ఆమె ట్విటర్‌ ఖాతా నుంచి ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కిన కొన్ని ఇవి. ‘బిడ్డ అస్వస్థత గురించి సుష్వా స్వరాజ్‌కు ట్వీట్‌ చేసి మెడికల్‌ వీసాను పొందిన పాకిస్తానీ’ (జూన్‌ 2). ‘లాహోర్‌ పసి బిడ్డ గుండె ఆపరేషన్‌కు సుష్మా స్వరాజ్‌ ఆపన్న హస్తం’ (జూన్‌ 11). ‘సౌదీ అరేబియా నుంచి కర్కలా నర్సు తిరిగి వచ్చే ఆశ లను పెంచిన సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌’ (జూన్‌ 25). రియాద్‌లోని భారత రాయబార కార్యాలయపు ట్విటర్‌ ఖాతాకు స్వరాజ్‌ పంపిన ఈ ప్రత్యేక ట్వీట్‌లో ఆమె, ‘‘జావెద్‌: ఈ మహిళను కాపాడటానికి దయచేసి సహాయం చేయండి’’ అని రాశారు. ఒక వార్తా కథనం నుంచి ఆమె ఆ మహిళను గుర్తించారు. అక్టోబర్‌ 27, శుక్రవారం రోజున స్వరాజ్‌ దుబాయ్‌లోని భారత కాన్సల్‌కు ‘‘విపుల్‌ – దయచేసి అతను తన తల్లి అంత్య క్రియలకు చేరుకునేలా సహాయపడండి’’ అనీ, మరెవరి ప్రయాణ పత్రాలనో భోపా ల్‌లోని భారత పాస్‌పోర్ట్‌ ఆఫీసుకు పంపమని రాశారు.

ఆమె చేస్తున్న ఈ ట్వీటింగ్‌ను మీడియా క్రియాశీలమైన, సానుభూతిగల రాజ కీయవేత్త చర్యలుగా చూపుతోంది. ట్విటర్‌ ద్వారా ఒకటి రెండు కేసులను పరి ష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలుస్తున్నారు. పౌరులు తమ సమస్యలకు పరి ష్కారం భారత విదేశాంగ మంత్రి చూపే వ్యక్తిగత శ్రద్ధ మాత్రమేనని నమ్మేలా తప్పు దోవ పట్టిస్తున్నారు. మేడమ్‌ ట్వీట్లపై శ్రద్ధ చూపడం కోసం దౌత్యవేత్తలు, ఉన్నతాధికారవర్గం వ్యవస్థాగతమైన తమ పనులను వదిలిపెట్టాల్సివస్తోంది.

పాకిస్తాన్‌పై పొందికైన విదేశాంగ విధానమే మనకు లేదు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ లేదా మయన్మార్‌ విషయంలోనూ అంతే. అయితే, ఈ–దర్బార్‌ లేదా ఈ–దర్శన్‌.. వ్యవస్థకు మరమ్మతులు చేసే గొప్ప నిపుణులు ఒకరు తలమునకలై పనిచేస్తున్న భ్రమను కలిగిస్తుంది. వ్యాధిగ్రస్తురాలైన పాకిస్తానీ బిడ్డకు శస్త్ర చికిత్స! ఊబకాయమున్న ఈజిప్ట్‌ మహిళకు బేరియాటిక్‌ శస్త్రచికిత్స! ఇలాంటి వీసాలకు ఒక కేంద్ర మంత్రి జోక్యం ఎందుకవసరమౌతోంది? ఏ నాగరిక దేశమైనా ఇలా ట్విటర్‌ ద్వారా వీసాలకు హామీని కల్పిస్తుందా? అమెరికా లేదా బ్రిటన్‌లు ఇలాగే చేస్తాయా? లేదు. వాటికి అందుకు తగ్గ యంత్రాంగాలున్నాయి. మనకు దర్బార్‌లున్నాయి.

మన మంత్రులకు చేయడానికి మరే పనీ లేదా? నాకో క్రమబద్ధమైన ఉద్యోగం ఉంది. దానితో పాటే నా రాత పనీ చూసుకుంటా. అయినా నాకు ట్విటర్‌ కోసం సమయం చిక్కడం లేదు. ఆమెకు ఎలా దొరుకుతోంది? మన విదేశాంగ విధానంలో చాలావరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోందనే మాట నిజమే. చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్‌ వ్యవహారాలన్నీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పరిధిలోకి వస్తాయి. భారత విదేశాంగ విధానం మన నాగరికతా విలువల ప్రాతి పదికపై సాగాలనేది నెహ్రూవాద దృష్టి. అందుకు భిన్నంగా మోదీ ప్రధానంగా రక్షణ, ఉగ్రవాద దృక్కోణం నుంచి విదేశాంగ విధానాన్ని చూస్తుండటమే అందుకు కారణం. ఈ విధంగా తన వృత్తిపరమైన బాధ్యతలలో అత్యధిక భాగాన్ని ఇతరులు హస్తగతం చేసుకోవడంతో స్వరాజ్‌ తాను చేయదగిన ఇతర పనులను వెతుక్కో వాల్సి వస్తోంది. ట్విటర్‌ వాటిలో ఒకటనేది స్పష్టమే. అది, ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా ఆమె ప్రముఖంగా కనిపించేలా చేస్తుంది. కనీసం మీడియాలోనైనా అలా కనిపిస్తారు. కానీ అలాంటి దర్శనం అవసరమేమీ లేదని ఆమెకు చెప్పాల్సి ఉంది. అది చేసేదేమైనా ఉందంటే దర్బారీ సంస్కృతిని పెంపొందింపజేయడమే. కొందరు వ్యక్తులకు అది ఉపయోగం చేకూర్చవచ్చు, కానీ వ్యవస్థకు ప్రతిబంధకమౌతుంది.



ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘
ఈమెయిల్‌ : aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు