బాబు ఉచ్చులో మరో బలిపశువు!

22 Nov, 2018 02:11 IST|Sakshi

నిన్నటివరకు ఆమె సాధారణ గృహిణి మాత్రమే. కాకపోతే దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె. పేరు చుండ్రు సుహాసిని. బహుశా నందమూరి కుటుంబానికి తప్ప ఆమె గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ చంద్రబాబు కౌటిల్య వ్యూహంలో భాగంగా ఉన్నట్లుండి ఆమె టీడీపీ నామినీగా, నందమూరి వంశస్థురాలిగా కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. తన మురికి రాజకీయాల కోసం నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు ఎలా వాడుకుని తర్వాత కరివేపాకులా విసిరిపారేస్తారో ప్రపంచానికే తెలుసు. నందమూరి కుటుంబ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన భార్య భువనేశ్వరి చెప్పిందనే సాకుతో సుహాసినిని రాజకీయ ముగ్గులోకి దింపినట్లు సమాచారం.
  
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా భారతదేశంలోనే అత్యంత సంచలనాత్మకంగా ఆయన సొంత అల్లుడు చంద్రబాబు జరిపిన రాజకీయ కుట్రలో నందమూరి హరికృష్ణ, దగ్గుపాటి తదితర కుటుంబ సభ్యులు ఎలా పావుల్లాగా ఉపయోగపడ్డారో అందరికీ తెలుసు. తన కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అధికార రాజకీయాల్లో సుస్థిరపరిచేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు అధికారంతోనే బతుకీడుస్తారు. అధికారంతోనే నిద్రపోతారు. అధికారంతోనే చస్తారు కూడా. ఆ అధికారంకోసం ఎంతకైనా దిగజారతారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే దశాబ్దాల బద్ధశత్రువు కాంగ్రెస్‌ పార్టీ ముందు సాగిలపడి టీడీపీ ఆత్మగౌరవ నినాదాన్ని, దాని మూలసూత్రాలను తాకట్టుపెట్టేయడమే.

బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక చంద్రబాబు ప్రతిష్ట పాతాళానికి అడుగంటిపోయింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి నుంచి జనం దృష్టిని మరల్చడానికి యూపీఏ–ఎన్డీఏ రాజకీయాలను చర్చలోకి తీసుకొచ్చాడు బాబు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ స్పష్టవైఖరి, పాదయాత్ర భారీ విజయంతో పాటు తన నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క భారీ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టి, అంతవరకు బండబూతులతో సత్కరించిన అదే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి పరుగెత్తాడు. కాంగ్రెస్‌తో హనీమూన్‌ ఎపిసోడ్‌ చప్పబడిపోవడంతో నందమూరి కుటుంబ సెంటిమెంట్‌ని ట్రంప్‌ కార్డుగా బయటకు తెచ్చాడు. 

పైగా తెలంగాణలో ఎంత చిన్న పాత్రలో అయినా సరే తన ఉనికిని ప్రదర్శించుకోవాలనుకున్న యావతోనే ఇప్పుడు సుహాసినిని ఎన్నికల ముగ్గులోకి దింపాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్న చందంగా నారావారి ఫ్యామిలీ పన్నిన ఉచ్చులో సుహాసిని ఇరుక్కుపోయారు. ఆమె తెలుసుకోవలసిన చరిత్ర ఒకటుంది. ఆమె తాత ఎన్టీఆర్‌నే సీఎం పదవినుంచి దింపివేసిన ఘనత బాబుది. తర్వాత దగ్గుపాటి కుటుంబాన్ని తోసిపారేశాడు. టీడీపీలో తన స్థానం పదిలమయ్యేంతవరకు, ఆమె తండ్రి హరికృష్ణను వాడేసుకున్నాడు. తర్వాత హరికృష్ణను బాబు ఎంత ఘోరావమానాలకు గురిచేశాడో లోకానికే తెలుసు. మరణించేవరకు ఆ అవ మాన భారంతోనే హరికృష్ణ గడిపారు. ఇక జూని యర్‌ ఎన్టీఆర్‌ని కూడా స్టెఫ్నీ టైర్‌లా ఎన్నిరకాలుగా వాడుకుని బాబు వదిలేశాడో తెలిసిన విషయమే.

సుహాసిని తల్లీ... దయచేసి బాబు ఉచ్చులో మరోసారి చిక్కుకోవద్దు. నందమూరి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచే మరో కుట్రకు మీరు పనిముట్టుగా మారవద్దు. ఎన్టీఆర్‌ అభిమానులకు, కుటుంబ శ్రేయోభిలాషులకు, మీ కన్నతండ్రి ఆకాంక్షలకు వ్యతి రేకంగా మీరు ఇప్పటికీ బాబుతో కలిసి నడవాలనుకుంటే మీ తాతయ్య ఎన్టీఆర్, మీ కన్నతండ్రి హరి కృష్ణ ఆత్మలు శాంతించవని గ్రహించండి.
 
తెలంగాణలో సెటిలర్ల సెంటిమెంట్‌ గేమ్‌ ఆడేం దుకు చంద్రబాబు ఎందుకు హరికృష్ణ కుటుంబాన్ని ఎంచుకున్నట్లు? తన భార్యను, కుమారుడిని లేదా కోడలిని బాబు ఎందుకు ఎంచుకోలేదు? ఎందుకంటే తెలంగాణలో టీడీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదని బాబుకు బాగా తెలుసు. అందుకే తెలంగాణలో తన కుమారుడి, తన కుటుంబ సభ్యుల భవిష్యత్తును బాబు పణంగా పెట్టే చాన్సే లేదు. నందమూరి కుటుంబంపై నిజంగా బాబుకు ప్రేమ ఉంటే 2014 లోనే హరికృష్ణను బరిలో నిలిపి మంత్రిపదవిని ఇచ్చేవారు. కానీ ఎన్టీఆర్‌ కుటుంబీకులు ఇప్పటికీ ఈ మేకవన్నె పులిని ఎలా నమ్ముతున్నారనే ఆశ్చర్యం.

సుహాసిని ఇంటిపేరును చర్చలోకి దింపటం భావ్యం కాదు కానీ ఆమె మెట్టింటి పేరును మరుగుపర్చి పుట్టింటి పేరును మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చి తెలంగాణలో ఉనికికోసం బాబు చేస్తున్న కుట్రలకు తాజాగా ఆమె బలికాబోతున్నారన్నది వాస్తవం.
– బీజీఆర్‌

మరిన్ని వార్తలు