యాస భాషల అలయ్‌ బలయ్‌

11 Dec, 2017 04:12 IST|Sakshi

తెలుగు పరభాషా పదాలను కలుపుకొని ఇంకా సుసంపన్నమవుతోంది – ‘సాక్షి’తో సుద్దాల అశోక్‌తేజ

పొద్దు పొద్దున్నే ముద్దబంతుల్లా ఆయన అక్షరాలను పూయిస్తున్నారు. ఆ చేతిలోని కలం చకచకా సాగుతోంది. ప్రపంచ తెలుగు మహాసభల కోసం నాలుగు పేజీల కవితను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అది పూర్తి కాగానే నేరుగా విషయానికి వచ్చేశారు. ‘తెలుగు స్థితిగతులెలా ఉన్నాయి?’ అని అడగ్గానే ‘భాష భేషుగ్గా ఉంది’ అంటూ ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు తెలుగు సినీ పాటల రేడు సుద్దాల అశోక్‌తేజ.

తెలంగాణ వాడు
బువ్వదినే ఏళయితే ఎవ్వరొచ్చినా సరే..
‘తిందాం రా’ అనేటోడే తెలంగాణవాడు
తురక, తెలుగు అనే అరమరిక లేక
తన పిల్లలను ‘బేటా’ అని పిలిచేటోడు

తెలంగాణ వాడు
జమ్మి చేతులుంటే చాలు జన్మ శత్రువెదురొచ్చినా
‘అలయ్‌ బలయ్‌’ ఇచ్చేటోడు తెలంగాణ వాడు
కొవ్వెక్కిన మదం కాదు పువ్వొసంటి మనసుతోని
‘నువ్వు’ అని పిలిచేటోడు తెలంగాణ వాడు

కారణాలేవైనా.. మన భాష, సంస్కృతులు మరుగునపడిపోయాయి. లేదా చీకట్లోకి నెట్టివేయబడ్డాయి. ఆ చీకటి పొరలను, దుమ్మూధూళిని తొలగించి.. వెలుగులోకి తెచ్చే సందర్భమే ఈ మహాసభలు. నేటితరానికి మన సంస్కృతీ సంప్రదాయాలను, మన భాషా సౌందర్యాన్ని తెలపడానికి ఇదే అదను.

మహానుభావులకు దక్కుతున్న గౌరవం
హాలుడు, పోతన, పాల్కురికి సోమనాథుడు, పంప మహాకవి, సుద్దాల హనుమంతు, భాగ్యరెడ్డి వర్మ, రుద్రమదేవి, సురవరం ప్రతాపరెడ్డి కవిత్వానికి, సంఘ సంస్కరణలకు, సాహిత్యానికి, పోరాటానికి పెట్టింది పేరైన వీరందరి పేరిట నగరం అంతటా స్వాగత తోరణాలు వెలియడం అద్భుతం. ఇది ఎనలేని సారస్వత సంపదను వారసత్వంగా అందించిన  మహానుభావులకు దక్కుతున్న గౌరవం. వీరంతా ఎవరనే ఆలోచన నేటితరానికి కలిగితే చాలు.

ఇలా చేస్తే తెలుగే వెలుగు భాష
తెలుగుకు పూర్వవైభవం కలిగించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తొలిమెట్టే ఈ మహాసభలు. ఇప్పటికే 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం నుంచి కృషి జరుగుతోంది. ఇంకా, న్యాయస్థానాల్లో తెలుగులోనే వాద ప్రతివాదనలు జరగాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలుగులోనే వ్యవహారాలు సాగాలి. తెలుగు వస్తేనే ఉద్యోగావకాశాలనే నిబంధన పెట్టాలి. ఇవన్నీ ప్రభుత్వం తరపున జరిగితే తెలుగు అధికారికంగా వ్యవహారికంలోకి వచ్చినట్టే.  తెలుగు భాష ముప్పు వాకిట లేదు. భాష ఖూనీ అయిపోవడం లేదు. పరభాష, యాసల వల్ల తెలుగు పలుచనైపోవడం లేదు. తనలో పరభాషా పదాలను కలుపుకొని ఇంకా సుసంపన్నమవుతోంది.

విశ్వమానవులం కావద్దా?
కొన్ని పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఆంగ్లం నేర్చుకోక తప్పని పరిస్థితి. మన పిల్లలు ‘విశ్వ మానవులు’గా ఎదగాలంటే దాన్ని నేర్వాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దంటే.. నిమ్న వర్గాల పిల్లల పురోగతిని అణచిపెట్టడమే. స్థానిక భాష, రాజభాష, ప్రపంచ భాష... ఈ మూడింటిలో నైపుణ్యం సాధిస్తేనే సంఘ వికాసం.

- సీహెచ్‌ఎమ్‌ నాయుడు

మరిన్ని వార్తలు