న్యాయ సమీక్షకు నిలుస్తుందా?

6 Aug, 2019 01:16 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తిరుగులేనట్టేనా? ఈ అంశాన్ని భారత్‌ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిలో చెలరేగుతున్నాయి. మోదీ, అమిత్‌ షా ద్వయం అత్యుత్సాహంగా తీసుకున్న నిర్ణయం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమా కాదా అన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంటుంది. జమ్మూకశ్మీర్‌ ముఖ చిత్రాన్ని మార్చివేసే రెండు తీర్మానాలు, ఒక బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీనికి తోడు జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్‌ 35ఏను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదేశాలు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ తీర్మానం చేశారు. అలాగే, జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు.

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున అక్కడి అసెంబ్లీకి ఉండే అధికారాలను కేంద్రం చేపట్టవచ్చనే నిబంధన ఆసరాగా ఈ చర్యలు తీసుకున్నారు. అంటే, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి బదులుగా పార్లమెంటే ఆర్టికల్‌ 370ని సవరిస్తూ ప్రతిపాదన చేసింది. దీంతో ఆర్టికల్‌ 370 రద్దును జమ్మూకశ్మీరే కోరినట్టు అయ్యింది. నిజానికి తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తొలగించే ఎటువంటి చర్యనూ కశ్మీరీలు అంగీకరించడంలేదు. స్వాతంత్య్రానంతరం భారత్‌లో కలవడా నికి ఈ ఆర్టికల్‌ 370 అనే తాత్కాలిక వెసులుబాటును కల్పించారు. ఈ ఆర్టికల్‌లోని 3వ క్లాజ్‌ ప్రకారం నోటిఫికే షన్‌ ద్వారా దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది.

రాష్ట్రపతి అలా రద్దు చేయా లని భావించినప్పుడు జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగ నిర్ణాయక సభ ఆమోదం తప్పనిసరి అని ఆర్టికల్‌ 370 పేర్కొంటోంది. దాన్ని 1956లో రద్దు చేశారు. అయితే, అదే స్థానంలో ఏర్పడిన అసెంబ్లీకి అటువంటి ప్రతిపాదన చేసే హక్కు ఉంది. కానీ, ఇక్కడ ఆ అవకాశం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ రాష్ట్రపతి పాలనలో ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంటే, అసెంబ్లీకి ఉండే అధికారాలన్నీ పార్లమెంటుకు ఉంటాయి. ఈ కారణంగానే మోదీ సర్కార్‌ జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయ గలిగింది. అయితే, ఇలా స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని అక్కడి నేతలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కేంద్ర నిర్ణయం సమాఖ్య స్ఫూర్తిపై దాడిగా పరిణమించింది.  

రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. కానీ, ఈ బీజేపీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అటువంటి నిబంధనేమీ లేదు. అంతేగాక, రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 367 కింద ఆర్టికల్‌ 35ఏను రద్దు చేసినట్టు కనిపిస్తోంది. అయితే, పార్లమెంట్‌ ఆమోదం లేకుండా, కేవలం ఒక ఆదేశం ద్వారా ఆర్టికల్‌ 370ని ఇతర రాజ్యాంగ నిబంధనల ద్వారా రాష్ట్రపతి సవరించవచ్చా అనేది మరో వివాదాస్పదమైన ప్రశ్న.  ఆర్టికల్‌ 370లోని నిబంధనల ఆధారంగా అదే ఆర్టికల్‌ను సవరించడంపై కూడా చాలా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆర్టికల్‌ 370లోని నిబంధనల ప్రకా రం జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఇతర రాజ్యాంగ నిబంధనలను సవరించగలమేగానీ, అదే ఆర్టికల్‌ను సవరించలేమని కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదం బరం రాజ్యసభలో వ్యాఖ్యానించారు.  

జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని సాంకేతికంగా అన్వయించడంకంటే కూడా కోర్టు ఎలా నిర్ణయం తీసుకుం టుందనేది ఆసక్తికర అంశం. గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి సుప్రీం కోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందనేది కూడా కీలకం. కేంద్రం ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, ఆ రాష్ట్ర స్వభావాన్ని పూర్తిగా మార్చి వేసే చర్యలు చేపట్టవచ్చా? కశ్మీరీ ప్రజలకు వ్యతి రేకమైన, ముఖ్యమైన మార్పును ఇంత సాధారణంగా చేపట్టవచ్చా? రాష్ట్రంలో బలగాలను మోహరించి, ఫోన్లు పనిచేయకుండా చేసి, ప్రజల కదలికలను నియంత్రించి ఈ మార్పులు చేయవచ్చా? రాజ్యాంగాన్ని మార్చే అధికారం లేని పార్లమెంట్‌ చేసిన ఈ నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్వభావంపైనే ప్రభావం చూపనున్నదా అనేది సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్న.

సీనియర్‌ జర్నలిస్ట్‌: శృతిసాగర్‌ యమునన్,  ‘స్క్రాల్‌’  సౌజన్యంతో 

>
మరిన్ని వార్తలు