అర్చకుల నెత్తిన శఠగోపం

28 Jun, 2018 02:20 IST|Sakshi

శ్రీరమణ దీక్షితులు చెప్పిన ప్రకారం, వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవ నిర్వహించాలంటూ అర్చకుల మీద టీటీడీ అధికారులు ఒత్తిడి తీసుకురావడం వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు స్వామివారిని మేల్కొల్పడం అపచారం. తోమాల సేవను తూతూమంత్రంగా ముగించాలంటూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వీఐపీల కోసం కొన్నిసార్లు, జనం తాకిడి పేరుతో కొన్నిసార్లు సేవలను ఇలా అసంపూర్ణంగా ముగించేందుకు అధికారులు ఒత్తిడి తెచ్చారని శ్రీరమణ దీక్షితుల ఆరోపణ. శ్రీవారి పోటులో జరిగిన అపచారం మరొకటి.

తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య రేగిన వివాదాలు, విమర్శలు భక్తులను మనస్తాపానికి గురి చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, శ్రీవారి ప్రధాన అర్చకుల నిర్బంధ పదవీ విరమణకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కేవలం ప్రధాన అర్చకుల సమస్యగా చూడలేం. ఎందుకంటేæ ఇది మన సనాతన ధర్మానికి ఎదురైన సమస్య. కాబట్టి అందరూ తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. 

శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలూ ఆచారాలూ గతి తప్పుతున్నాయంటూ సాక్షాత్తు ప్రధాన అర్చకులు శ్రీరమణ దీక్షితులు ఆరోపించారు. కానీ ఆయన చేసిన ఆరోపణలకు, విమర్శలకు సమాధానం చెప్పకుండా కొన్ని స్వార్థపర శక్తులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయి. ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలక మండలి కూడా శ్రీరమణ దీక్షితులుకి రాజకీయ ప్రయోజనాలు అంటగడుతున్నాయి. ఇంతకీ ఈ పాలక మండలి అంటే ఏదీ? ప్రస్తుత ప్రభుత్వం ఎంపిక చేసిన భజన బృందమే. ప్రభుత్వం నుంచి స్వప్రయోజనాలనూ; టీటీడీ అధికారుల నుంచి ప్రత్యేక దర్శనం కోసం ఉచిత టికెట్లూ ప్రసాదం పొట్లాలూ ఆశించే ఒక వర్గం మీడియా వారికి వంత పాడుతున్నది. రామానుజుల వారు నిర్దేశించిన మేరకు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం జరిగే పూజాదికాలకి శ్రీవారి సన్నిధిలో భంగం వాటిల్లుతున్నది. అలాగే దారుణమైన రీతిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నది. అయినప్పటికీ హిందూ సమాజం మౌన ప్రేక్షక పాత్రకు పరిమితమౌతున్నది. ఇది మరింత బాధించే అంశం. 

ఈ రెండు దశాబ్దాలలో హిందూ ధర్మమే లక్ష్యంగా రెండు దారుణమైన దాడులు జరిగాయి. మొదటిది కంచి మఠం మీద జరిగిన దాడి. అప్పటి హిందూ సమాజం ప్రదర్శించిన ధోరణి మౌన ప్రేక్షక పాత్రకు ఉదాహరణగా నిలుస్తుంది. కొందరు భక్తులు వ్యక్తిగత స్థాయిలో స్పందించడం మినహా, మఠాల నుంచి, సాధుసంతుల నుంచి వచ్చిన స్పందన పరిమితం. మఠాచార్యులు ఆశించిన మేర హిందూ సమాజం స్పందించలేదు. అసలు ఆచార్యులు అంటే వ్యక్తులు కారు. వారు వ్యవస్థల వంటివారు. కానీ సనాతన ధర్మాన్ని సేవించేందుకు రెండున్నరవేల ఏళ్ల క్రితం స్థాపించిన ధార్మిక సంస్థల ఎడల మనం చూపవలసిన మర్యాదను చూపలేదు. రెండోది– తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకస్వామి మీద, ఆలయ సంప్రదాయ మర్యాదల మీద, సాంస్కృతిక సంపద మీద జరుగుతున్న దాడి. ఇప్పుడు కూడా హిందూ సమాజం అదే విధంగా మౌన ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. 

శ్రీరమణ దీక్షితులు (ఆయన మోలిక్యులర్‌ బయాలజీలో డాక్టరేట్‌ తీసుకోవడమే కాదు, వైఖానస ఆగమశాస్త్రంలో నిష్ణాతులు) దేవస్థానంలో జరుగుతున్న అపచారాల మీద ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి నిత్యోపచారాలలో రాజకీయనేతల, పాలక మండలి సభ్యుల, ఇతర ఉద్యోగుల జోక్యం వంటి అంశాలు అందులో ఉన్నాయి. కంచే చేను మేసిన చందంగా తయారయింది పరిస్థితి. శ్రీవారి ఆభరణాలపై ఏటా జరగవలసిన ఆడిట్‌ జరగడంలేదని ఆయన ఆరోపించారు. దీనిని పెడచెవిన పెట్టగలమా? పైగా ఇలాంటి ఆరోపణ చేస్తారా అంటూ ఆ వ్యక్తి మీద ప్రత్యారోపణలకు దిగడం, పరువు నష్టం దావాలు వేయడం సబబేనా? ఇంతకీ ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి? శ్రీవారి సేవల విషయంలో పాలక మండలి జోక్యం నిరంతరం ఉంటోం దని ఆయన చెప్పారు. శ్రీరమణ దీక్షితులు చెప్పిన ప్రకారం, వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవ నిర్వహించాలంటూ అర్చకుల మీద టీటీడీ అధికారులు ఒత్తిడి తీసుకురావడం వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు స్వామివారిని మేల్కొల్పడం అపచారం. తోమాల సేవను తూతూమంత్రంగా ముగించాలంటూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వీఐపీల కోసం కొన్నిసార్లు, జనం తాకిడి పేరుతో కొన్నిసార్లు సేవలను ఇలా అసంపూర్ణంగా ముగించేందుకు అధికారులు ఒత్తిడి తెచ్చారని శ్రీరమణ దీక్షితుల ఆరోపణ. 

శ్రీవారి పోటులో జరిగిన అపచారం మరొకటి. పోటు అంటే శ్రీవారి నిత్యనైవేద్యాల కోసం అన్నప్రసాదాలను వండివార్చే చోటు. అక్కడ హఠాత్తుగా మరమ్మతులు చేపట్టారు. కానీ ప్రధాన అర్చకులే పాలకమండలికి ఆగమశాస్త్ర సలహాదారుగా కూడా వ్యవహరిస్తారు. అలాంటిది ప్రధాన అర్చకులకు తెలియకుం డానే శ్రీవారి పోటులో మరమ్మతులు చేపట్టారు. లోపల ఉన్న గ్రానైట్‌ పలకలను మార్చారు. ఆ సమయంలో అన్నప్రసాదాలను బయట చేయిం చారు. ఇది ఆగమశాస్త్ర విరుద్ధం. పైగా ఆ నైవేద్యాలను కూడా చెల్లించవలసిన పరిమాణంలో చెల్లించలేదు. కానీ అలాంటిదేమీ జరగలేదంటూ పోటుకు చెందిన పేద పనివారితో ప్రకటనలు ఇప్పించి ఈ విషయం వెలుగులోకి రాకుండా అధికారులు ప్రయత్నించారు. 

నాలుగు కుటుంబాలకు చెందినవారే ప్రధాన అర్చక బాధ్యతలు నిర్వహిస్తారు. తమ వంతుగా ఆ సంవత్సరం బాధ్యతలు స్వీకరించే అర్చకులకు ఆభరణాలను అప్పగించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. శ్రీవారి ఆభరణాలను ఏటా ఆడిట్‌ చేస్తారు. ఇది బహిరంగ ఆడిట్‌ కూడా. బంగారు గొలుసులు, విడి వజ్రాలు, కెంపులు వంటి వాటిని కూడా ఆడిట్‌ చేస్తారు. అప్పుడే తమ వంతు మేరకు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాన అర్చకులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇదంతా టీటీడీ అధికారుల సమక్షంలోనే జరుగుతుంది. కానీ 1996 నుంచి ఈ విధానానికి మంగళం పాడారు. పైగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్వామివారి అలంకారానికి శ్రీకృష్ణదేవరాయల వంటి ప్రభువులు సమర్పించిన ఆభరణాలను ఇవ్వవలసిందని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కూడా శ్రీరమణ దీక్షితులు ఆరోపించారు. అధికారులు ఇచ్చిన ఆభరణాలతోనే స్వామివారు తృప్తిపడాలి. ఆయా కానుకలు సమర్పించడంలో అప్పటి భక్తులకు ఉన్న అభిమతానికి ఇలా గౌరవమే లేకుండా పోయింది. ఇలాంటి ధోరణి కొన్ని ప్రశ్నలకు కారణమవుతున్నది. ఆ ఆభరణాలన్నీ అక్కడ ఉన్నాయా? ఇక్కడ ఆ ప్రశ్న సబబైనదే కూడా. ఎవరైనా భక్తులు స్వామివారికి ఏదో ఒక ఆభరణం కానుకగా సమర్పించదలిచి పాలక మండలిని సంప్రతిస్తే వారు స్వామివారి పురాతన నగలలో ఒక దాని నమూనాను ఇస్తున్నారు.  అప్పటి నుంచి ఆ కొత్త ఆభరణమే స్వామి వారి అలంకారానికి నోచుకుంటున్నది. పాతది ఇనప్పెట్టెలలోకి పోతున్నది. నిజానికి ఆ రెండు అక్కడ భద్రంగా, అందుబాటులో ఉన్నాయా? 

కాబట్టి ఇలాంటి ఆరోపణలలోని వాస్తవాలను హిందూ సమాజం తెలుసుకోవలసిన అవసరం లేదా? మనం ఏం చేస్తున్నాం? మన ఆచార వ్యవహారాలపై నిర్ణయాలను కోర్టుల పరం చేసి చోద్యం చూస్తూ ఉండిపోవాలా? హిందువుల ప్రార్థనా స్థలాల మీద, దేవస్థానాల వ్యవహారాలలోను ఆదరాబాదరా నిర్ణయాలు వెల్లడిస్తూ అత్యున్నత న్యాయ స్థానం కూడా తన స్థాయిని దిగజార్చుకోరాదు. ఏ సేవకు, ఏ పూజకు ఎంత సమయం సరిపోతుంది, ఎలాంటి నైవేద్యం అర్పించాలి, ఎలాంటి ఆభరణాలతో అలంకరించాలి, బ్రహ్మోత్సవాల నిర్వహణ వంటి అన్ని అంశాలలో కోర్టుల ప్రమేయం సరికాదు. ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకునే అధికారం పండితులైన అర్చకస్వాముల పరం చేయాలి. తిరుమలకు కూడా గోపాల్‌ సుబ్రహ్మణ్యం వంటి అమికస్‌ క్యూరీ అవసరం ఉందా? నిజానికి దేవస్థానాలలో జరుగుతున్న ఇలాంటి అనర్థదాయక అంశాల మీద హిందూ సమాజంలో శ్రద్ధ చూపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన డాక్టర్‌ సుబ్రహ్మణ్యం స్వామి ఒక్కరే. వీటి గురించి సుప్రీంకోర్టులో పోరాడుతూనే, దేవస్థానంలో అవకతవకలపై నిజ నిర్ధారణ చేయడానికి, వాటిని సరిదిద్దడానికి ఆచార్యులను కూడా ఏకత్రాటి మీదకు తీసుకువచ్చే పనిని కూడా ఆయన చేపట్టాలని ప్రార్థిస్తున్నాను. 

ఒక సంఘంగా ఏర్పడడానికి మఠాధిపతులంతా వెంటనే ముందుకు రావాలి. తిరుపతి జీయరు, అహోబిల మఠం అధిపతి, త్రిదండి జీయరు, ఆండవర్, పెజావర్‌ స్వామి, హాథీరామ్‌ మఠం అధిపతి వంటి వారంతా కూడా ఆ సంఘంలో సభ్యులు కావాలి. తిరుపతి జీయరు ఇప్పటికే టీటీడీ పాలక మండలి/ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. అయితే వాస్తవాలు వెలుగులోకి రావలసిన ఈ సమయంలో ఆయనను ఈ పనికి ఒప్పించాలి. కంచి ఆచార్యులు, శృంగేరి మఠాధిపతి కూడా ఈ అంశానికి మద్దతు పలికితే వచ్చే ఊపు వేరుగా ఉంటుంది. ఈ సంఘం ఏం చేయాలి? మఠాధిపతులంతా తమ భక్తులైన ముగ్గురు లేదా నలుగురు ఆడిటర్ల పేర్లు సూచించాలి. అలాగే ఆభరణాల వెల కట్టే వారిని కూడా సూచించాలి. ఈ బృందం కూడా ఆభరణాల ఆడిట్‌లో ఉంటుందని ప్రకటించాలి. ప్రభుత్వం ఆమోదించక తప్పదు. సేవలు, పూజలు, నైవేద్యాల విషయంలో అధికారులకు సంబంధం లేదని స్వాములు ప్రకటించాలి. తమ అనుభవంలోకి వచ్చిన అన్ని వాస్తవాలను వారు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి. 22 ఏళ్ల క్రితం ఆభరణాల ఆడిట్‌ ఆగిపోయినప్పటికి, అప్పటి జాబితాను పరిగణనలోకి తీసుకోవచ్చు.

ఆ తరువాత భక్తులు సమర్పించిన అన్ని ఆభరణాల వివరాలను ఆ జాబితాకు జోడించాలి. ఇది డిజిటల్‌ యుగం కాబట్టి ప్రతి ఆభరణం వివరాన్ని డిజిటల్‌ విధానంలో నమోదు చేయాలి. మఠాధిపతుల సంఘం చేసే సేవ భవిష్యత్తులో హిందూ ధర్మానికి మార్గదర్శనం చేయాలి. మన ఆలయాలు, మఠాల నుంచి ప్రభుత్వాలను బయటకు నెట్టే విధంగా చేయాలి. ఏదో చేస్తారని నమ్మి ఓటు వేసిన నాయకులు మరింత కుహనా సెక్యులరిస్టులుగా కని పిస్తున్నారు. ఇలాంటి నేతలు, భక్తిలేని అధికారులు మన మందిరాలలోకి చొరబడ్డారు. అవి నాయకులవి కావు, కోర్టుల ప్రమేయం అవసరం లేదు. అవి స్వాములు, మఠాధిపతుల ఆవాసాలు. వాటిని వారే నిర్వహించాలి.


ఎస్‌వి. బద్రీ, వ్యాసకర్త తమిళనాడు ఆలయ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక సభ్యులు
contact@globalhinduheritagefoundation.org

>
మరిన్ని వార్తలు