నిధుల వ్యవహారంలో నిజాయితీ లేమి

7 Nov, 2018 00:33 IST|Sakshi

సందర్భం

విభజన చట్టంలోని హామీలు, వాగ్దానాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రంపై ఎన్నో ఆరోపణలు చేసింది. వాటికి కేంద్రం మరెన్నో కారణాలు చెప్పింది. వీటిల్లో ఎవరు చెప్పేది నిజమో తెలియక ప్రజలు అయో మయంలో పడ్డారు. ఈ పరిస్థితిని సరిదిద్ది వాస్తవాలు బయటపెట్టా లనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో ఏర్పాటైన సంయుక్త నిజనిర్ధారణ సంఘం(జేఎఫ్‌ఎఫ్‌సీ) అందరూ అనుకున్నట్టు ప్రజల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించకపోగా, దాన్ని మరింత పెంచింది. ఇందులో ఉన్నవారంతా నిపుణులే. పద్మనాభయ్య, జయప్రకాశ్‌ నారాయణ్, ఐవైఆర్‌ కృష్ణారావు, తోట చంద్రశేఖర్‌ తదితర మాజీ ఐఏఎస్‌ అధికారులు, మాజీ ఎంపీ ఉండవల్లి అరు ణ్‌కుమార్‌ ఇందులో సభ్యులు.

ఈ కమిటీ వైఫల్యాలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇది తన పని ప్రారంభించిన మొదట్లోనే అనేక లుకలుకలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం యూసీ ఇవ్వటం అంత ప్రధానమైన అంశం కాదని దానిమీద పెద్దగా దృష్టి పెట్టా ల్సిన అవసరం లేదని జయప్రకాశ్‌ నారాయణ అభిప్రాయ పడ్డారు. ఐవైఆర్‌ కృష్ణారావు వెంటనే ఈ విషయాన్ని ఖండించి ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని, యూసీలు సమర్పించడం చాలా ప్రధానమని పేర్కొన్నారు. దీనిపై ఒక ఏకాభి ప్రాయం కుదరడానికి కొంత కాలం పట్టింది. చివరకు యూసీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కమిటీ తీర్మానిం చింది. కమిటీకి కావాల్సిన సమాచారం అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వచ్చింది. ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని సమాచారం అడిగిన కమిటీ,∙అందుకోసం గట్టిగా ప్రయ త్నించలేదు. దీంతో ఈ కమిటీ భుజాల మీద నుంచి చంద్రబాబు తన తుపాకీని కేంద్రంపై పేల్చడానికి ప్రయత్నం చేశారు అనే అనుమానం చాలామందికి కలగక పోలేదు.

ఇక ఆ కమిటీ పేర్కొన్న రూ. 75 వేల కోట్ల మొత్తంకు సంబంధించి గత ఆరు నెలల్లో జరిగిన పరిణామాలకు అనుగుణంగా పరిశీలిద్దాం. కమిటీ నివేదిక 75 వేల కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోవలసిన మొత్తంగా పేర్కొందేకానీ కేంద్రం నుంచి రావలసిన నిధుల కింద పేర్కొనలేదు. వివిధ పద్దుల కింద వారు పేర్కొన్న మొత్తాలు వాటి ప్రస్తుత పరిస్థితి పరిశీలిద్దాం. స్పెషల్‌ ప్యాకేజీ కింద రూ. 16,447 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాలని కమిటీ సూచించింది. ఎస్పీవీ ఏర్పాటు చేసుకుంటే ఈ మొత్తాన్ని ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నానని తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వమే రాజకీయ లబ్ధి కోసం యూటర్న్‌ తీసుకొని చర్చను ముందుకు సాగనివ్వడం లేదు. అందువల్ల∙ఈ మొత్తాన్ని రాష్ట్రం బాధ్యతగానే చూపాలి. రాష్ట్రం చొరవ చూపితే ఈ మొత్తాన్ని ఇవ్వటానికి కేంద్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెవెన్యూలోటు కింద రూ. 10,225 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవలసిన మొత్తంగా చూపటం జరిగింది. విభజన వల్ల ఏర్పడిన సాధారణ లోటును మాత్రమే భర్తీ చేస్తామని, అది కేవలం రూ. 4,118 కోట్లేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి చేసిన ఖర్చును కేంద్రంపై రుద్దటానికి ప్రయత్నించడం చెవిలో పువ్వు పెట్టడానికి చూడటమే.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే ప్యాకేజీ విషయానికి వస్తే బుందేల్‌ఖండ్‌కు రూ. 24, 350 కోట్లు ఇచ్చారని, దాని ప్రకారం ఇంకా రూ. 22, 250 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీలో సాధారణ బడ్జెట్లలో వచ్చే మొత్తాలను ఎంఎన్‌జీఆర్‌ఎస్‌ కింద వచ్చే మొత్తాలను కలిపి ప్రకటించారు. ఆ  పథకాల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది కూడా అంతే వస్తుంది. ఆ అంశాలను విస్మరించి బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీని పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ఇంతవరకు 853 కోట్లు వచ్చాయని ఇంకా 10,800 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కారం కావాలని పేర్కొన్నారు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వకుండా కమిటీని తప్పుదారి పట్టించింది. ఈ జాతీయ విద్యా సంస్థలకు మొదటి సంవత్సరం 50 కోట్లు వస్తే ఆపై సంవత్సరాల్లో పని ప్రగతిని బట్టి ఎక్కువ మొత్తాలు కేటా యించి అనతికాలంలోనే ఆ సంస్థలను పూర్తి చేయడం జరుగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా వేరే విధా నాన్ని అనుసరించాలనుకోవటం మన అవివేకమే. పన్ను విధానంలో ఉన్న వ్యత్యాసాలకు పరిహారంగా రూ. 3,820 కోట్లు కేంద్రంతో పరిష్కరించుకోవాలని కమిటీ సూచించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభ్యర్థన వెళ్లిందీ లేనిదీ ఇంతవరకూ తెలియదు. మరొకసారి చంద్రబాబు ఇంకొకరి భుజం మీంచి తుపాకీ పేల్చటానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడని దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.

వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
 raghuram.delhi@gmail.com
పురిఘళ్ల రఘురామ్‌

మరిన్ని వార్తలు