విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్ట సుఖముల పారమెరిగితి

27 Nov, 2017 02:03 IST|Sakshi

యుగస్వరం

తన 53వ ఏటే కన్నుమూశారు గురజాడ అప్పారావు(21 సెప్టెంబర్‌ 1862 – 30 నవంబర్‌ 1915). ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు సాహిత్యానికి దీపధారిగా నిలిచారు. కన్యాశుల్కం నాటకంలో వాడుక భాషకు పట్టం కట్టారు. దిద్దుబాటు ద్వారా ఆధునిక కథాప్రక్రియకు కీలకమలుపుగా నిలిచారు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌’; ‘విరిగి పెరిగితి పెరిగి విరిగితి/ కష్ట సుఖముల పారమెరిగితి’ అంటూ తేలికమాటల్లో అనితరసాధ్య కవిత్వం వెల్లడించారు. ‘దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ చైతన్యం, సంఘ సంస్కరణ వంటి ఎన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వచించి, నిర్వహించి వెళ్లిన కావ్యకర్త, కార్యకర్త’ గురజాడ అంటారు తెలకపల్లి రవి. గురజాడ జీవితాన్నీ సాహిత్యాన్నీ– యువకవిగా యుగకవి, గిరీశం పాత్ర–అపార్థాలు, ముత్యాల సరాలు! సత్యాల స్వరాలు, నైతిక విలువలపై వాస్తవిక దృక్పథం... ఇలా 17 అధ్యాయాలుగా విశ్లేషిస్తూ ఆయన ‘యుగస్వరం’ వెలువరించారు. ‘గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణలో భాగంగా మత, మార్కెట్‌ తత్వాలు విజృంభించిన నేపథ్యం ఇందుకు ప్రధాన భూమిక’ అంటూ అప్పటికి ఆధునికుడైన గురజాడ సాహిత్యానికి ఇప్పటి ఆధునిక కాలంలో ఉన్న ప్రాసంగికతను చర్చించారు.

గురజాడ: యుగస్వరం; రచన: తెలకపల్లి రవి; పేజీలు: 208; వెల: 125; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27–1–64, కారల్‌ మార్క్స్‌ రోడ్, విజయవాడ–520002. ఫోన్‌: 0866–2577533

మరిన్ని వార్తలు