గురువును మరువని కాలం

2 Jul, 2019 04:17 IST|Sakshi

సందర్భం

గురుశిష్యుల మధ్య సంబంధాలు మృగ్యమై పోయాయని, వీళ్ల మధ్య సంబంధాలు చాప్టర్‌లెక్చరర్స్, మార్కెట్‌ సంబంధాలని చర్చలు చేస్తున్న సందర్భంలో గురువును గురువుగా ప్రతిష్టించడం మొత్తం సమాజం గర్వించతగింది. గురువుకు ఉన్న మహోన్నత స్థానం నేటికీ చెక్కుచెదరలేదనే సంఘటనలు అరుదుగా జరుగుతాయి.  ఉపాధ్యాయులను విద్యార్థులు నేటికీ తమ గుండెల్లో దాచుకుంటూనే ఉన్నారు. తన బోధనతో భావితరాన్ని సాధకులుగా మార్చగల శక్తి ఒక్క  ఉపాధ్యాయునిలోనే ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువుదే ఉత్తమ స్థానమని నిర్వచనాలు చెప్పటం, ఉపాధ్యాయ దినోత్సవాల నాడు మననం చేసుకోవటం మాత్రమే కాదు, పిల్లలకోసం తపించి, పిల్లల కోసం తమ జీవితాలను అర్పించి, తరగతి గదే దేవాలయంగా భావించిన ఉపాధ్యాయులను ఏ తరమూ మర్చిపోదని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సోషల్‌వెల్ఫేర్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఆదివారం పదవీ విరమణ చేసిన పసుపులేటి విద్యాసాగర్‌రావు సన్మానసభలో కళ్లకు కట్టినట్లు కనపడింది.

గురుకుల విద్యావ్యవస్థలో తన సర్వీసు కాలం చదువుకుని వివిధ రంగాలలో స్థిరపడ్డ విద్యార్థులంతా తమ గురువును బండి మీద నిలుచోబెట్టి ఊరేగింపుగా ఆ స్కూల్‌ ప్రాంగణంలోకి బండిలాగుతూ తీసుకుపోవటం ఒకింత ఆశ్చర్యంగా, పరమానందంగా అనిపించింది. ఈ అత్యాధునిక మార్కెట్‌ సమాజంలో ప్రతిదానిని వినిమయ వస్తువుగా మార్చి, అమ్మకాలు కొనుగోళ్లు చేస్తున్న కాలంలో తమ గురువు పదవీ విరమణ సభలో గురువుకు కృతజ్ఞతగా దంపతులను బండిమీద కూర్చోబెట్టి బండిని విద్యార్థులు వేదికదాకా తీసుకొని పోయే సంఘటనను ఈ కాలంలో చూస్తాననుకోలేదు. ఇది మంచి ఉపాధ్యాయుడు విద్యాసాగర్‌కు దక్కిన గౌరవం మాత్రమేకాదు, తమను కంటిపాపలా చూసుకుని జ్ఞానబోధన చేసిన గురువులను ఏ విద్యార్థులూ మర్చిపోరనడానికి నిదర్శనం. ఇది ఒక్క గురువుకు చేసిన సన్మానం మాత్రమేకాదు మొత్తం గురుకుల విద్యావ్యవస్థకు ఉపాధ్యాయలోకానికి అత్యంత ఘనంగా జరిగిన సన్మానంగా భావించాలి.

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాసులో రైలు దిగగానే, ఆయన విద్యార్థులు ఇదే రీతిలో బండిపై కూర్చోబెట్టి  విద్యాసంస్థదాకా తీసుకుపోయారని పాఠంగా చదువుకున్నాంకానీ, అదే సన్నివేశం ఈ కాలంలో కూడా చూడగలగటం ఒక విశేషం. ఇది మంచి పరిణామం. ఇది విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉండే అనుబంధానికి తార్కాణంగా నిలుస్తుంది.   తమ విద్యార్థులు ఉన్నతస్థాయికి వెళ్లాలని ప్రతి టీచర్‌ కోరుకుంటారు. ఎదుగుతున్న సమాజ పురోభివృద్ధి వెనుక ఉపాధ్యాయులు, తరగతి గది పాత్రే ప్రముఖంగా ఉంటుంది. దేశాన్ని సుభిక్షంగా ఉంచేది, అత్యున్నతంగా తీర్చిదిద్దేది తరగతిగదేనన్నది గుర్తించే తరగతి గదిలో ప్రపంచం రూపొందుతుందని కొఠారి కమిషన్‌ చెప్పింది. తెలంగాణను తీర్చిదిద్దటానికి గురుకుల పాఠశాలలు గొప్ప కృషిచేస్తున్నాయి. పీవీ గురుకులవిద్యావ్యవస్థను తెలంగాణలో ప్రారంభించి, మానవవనరుల శాఖా మంత్రి అయ్యాక∙దేశవ్యాపితంగా జిల్లాకొక గురుకుల పాఠశాలను నెలకొల్పారు. లక్షమంది బీసీ కుటుంబాలకు చెందిన పిల్లలు నేడు గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన చదువును పొందగలుగుతున్నారు. తెలంగాణ గురుకులాల నుంచి రాబోయే విద్యార్థులు రేపటి బంగారు తెలంగాణకు పునాదులుగా నిలుస్తారు. సంచారజాతుల పిల్లలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా దేశ సంపదగా మారటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. శక్తిమంతమైన సమాజనిర్మాణం చేయటానికి పునాదులుగా నిలిచి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి మరువలేనిది. 

మొత్తం సమాజం ఉపాధ్యాయులు చేస్తున్న సేవకు వారిని గొప్పగా సత్కరించుకోవాలి. ప్రతి ఊరులో దేవాలయాన్ని చూసినంత పవిత్రమైన భావనను పాఠశాలలపై చూపి ఆ పాఠశాలల రక్షణ కోసం, వాటి ఉన్నతి కోసం అందరూ సహకరించాలి. గుడిలోకి పోతే ముక్తి లభిస్తే, బడిలోకి పోతే సమాజ విముక్తి లభిస్తుంది. అందరికీ చదువు అందాలన్న మహాత్మాజ్యోతిబాపూలే, అంబేడ్కర్‌ ఆలోచనలకు రూపంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యలభిస్తోంది. ఇది శుభతరుణం.
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌సభ్యులు ‘ 94401 69896 


జూలూరు గౌరీశంకర్‌ 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు