వాస్తవాలు చెబితే అదే పదివేలు!

22 Nov, 2017 01:02 IST|Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించబోతున్న  కేసీఆర్‌కు నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు?

జాతీయ స్థాయిలో పద్మావతి సినిమా గొడవ, ఆంధ్రప్రదేశ్‌ స్థాయిలో నంది పురస్కారాల రగడ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నవారు ఇద్దరు– ఏడవ నిజాం, ఎన్టీ రామారావు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆయనను మహానీయుడిగా చిత్రించడానికి చరిత్ర తిరగరాస్తానని చెప్పినా; ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు.

ఎన్టీ రామారావు జీవితం మీద ఎవరో సినిమాలు తీస్తే చంద్రబాబునాయుడుకు ఏం సంబంధం అని ప్రశ్నించేవాళ్లూ ఉండొచ్చు. ప్రత్యక్షంగా చంద్రబాబునాయుడుకు ఆ  సినిమాలతో ఏమీ సంబంధం లేకపోయినా ఆ సిని మాలు తీస్తున్న వాళ్లు ఎవరు, దాని వెనక వాళ్ల ప్రయోజనాలు ఏమిటి, అంతి మంగా అవి ఎవరికి ప్రయోజనకరంగా మారతాయి? అన్న విషయాలు కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఎన్టీ రామారావు జీవితం మీద మూడు సినిమాలు రాబోతున్నట్టు వార్తలొచ్చాయి. అందులో ఒకటి స్వయానా ఎన్టీ రామారావు కుమారుడు, చంద్రబాబునాయుడి బావమరిది, వియ్యంకుడు, ఆయన పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నిర్మించబోతుంటే, మరొకటి ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ తీయబోతున్నారు. మూడో సినిమా నిర్మిస్తున్నవారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఆయన ఎన్టీఆర్‌ అభిమాని. ఈ మూడు సినిమాలూ కూడా ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం, ముఖ్యంగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం, ఆయన మరణించే వరకు జరి గిన ఘట్టాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాయన్నది నిజం.

ఎన్టీఆర్‌ అంటే భక్తితోనేనా!
నటుడు బాలకృష్ణ తాను నిర్మించబోయే సినిమాకు సంబంధించి ఇంకా వివరాలు బయటపెట్టకపోయినా అది కచ్చితంగా లక్ష్మీపార్వతి పట్ల ప్రేక్షకులలో అంటే ప్రజలలో వ్యతిరేక భావాన్ని పెంచేదిగానే ఉంటుంది. అంతే తప్ప అధికారంలో లేనప్పుడు అందరూ ఎన్టీఆర్‌పై కనీసం జాలి లేకుండా గాలికి వది లేస్తే ఆమె చేరువయింది, సపర్యలు చేసింది, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నది అన్న కోణంలో నుంచి మాత్రం తీయబోరనేది స్పష్టం. రాజకీయంగా చంద్రబాబునాయుడుకు తద్వారా తన సొంత అల్లుడికి నష్టం జరిగే విధంగా బాలకృష్ణ ఈ సినిమాలో వాస్తవాలు చిత్రీకరిస్తారని ఎవరయినా ఎందుకనుకుం టారు? ఇక రాంగోపాల్‌వర్మ సినిమా! ఆయన తీసే సినిమాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ముఠా తగాదాల నేప«థ్యంలో పరిటాల రవి, మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి మధ్య కక్షలకు సంబంధించి రక్తచరిత్ర పేరిట ఆయన తీసిన రెండు సినిమాలలో వాస్తవాల వక్రీకరణ తెలిసిందే. అది వాస్తవాలకు కల్పన జోడించి తీసిన సినిమా అంటారాయన. ఇప్పుడు తీయబోయే సినిమా మాత్రం వాస్తవ జీవితచిత్రణేనని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఒకరు నిర్మాత అంటూ వార్తలు వచ్చాయి కాబట్టి చంద్రబాబునాయుడి ప్రయోజనాలతో సంబంధం లేకుండా జరిగింది జరిగినట్టు చిత్రీకరిస్తారన్న భావన కొందరిలో ఉండొచ్చు. కానీ వర్మ సినిమా టైటిల్, దానికి సంబంధించి బయటికొచ్చిన ఒక పోస్టర్‌ చూస్తే ఈ సినిమాది కూడా బాలకృష్ణ సినిమా దారేనని అర్థం అవుతుంది. ఈ సినిమా పేరు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. రాజకీయ రంగంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా వర్మ తీసిన సినిమాలన్నీ వివాదాస్పదమే అయ్యాయి. ఇదేమవుతుందో చూడాలి! ఇక తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినిమా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీయబోయే మూడో సినిమా పేరు ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ (వెంకట సుబ్బారావు పేరు గుర్తుకొచ్చే విధంగా పెట్టిన పేరు). టైటిల్‌ చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మీపార్వతి పాత్రను అవమానకరంగా చిత్రించబోతున్నారని! సినిమా కథ ఏమిటో తెలియకుండా ఆ మాట ఎట్లా అంటారని అడగొచ్చు ఎవరయినా! ఎన్టీఆర్‌తో వివాహానికి ముందు లక్ష్మీపార్వతి వీరగంధం వెంకటసుబ్బారావు అనే ఆయన భార్య. కారణాలు ఏమయినా... అవి మనకు అనవసరం కూడా, ఆయన నుంచి విడాకులు తీసుకుని ఆమె ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకున్నారు. సినిమా పేరు వీరగంధం అని పెట్టడంలోనే చిత్రకథ ఏ వైపు వెళుతున్నదో అర్థమవుతుంది.

ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆమె మీద బురద చల్లడానికీ, తద్వారా ఎన్టీఆర్‌ ప్రతిష్టను దిగజార్చడానికీ అప్పటి కొందరు కాంగ్రెస్‌ నాయకులు బహిరంగంగానూ, తెలుగుదేశం పార్టీ లోనే చంద్రబాబు నాయుడు వంటి నాయకులు రహస్యంగానూ వీరగంధం సుబ్బారావును పావుగా వాడుకోజూసిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిల పెళ్లి క్షమించరాని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది. అనారోగ్యం పాలయి సేవలు చేసే దిక్కులేని పరిస్థితులలో తోడు అవసరం కాబట్టి పెళ్లి చేసుకుంటే మిన్ను విరిగి మీద పడ్డట్టు ఎన్టీ రామారావు మీద విరుచుకుపడ్డ వాళ్లే ఎక్కువ. అందులో తెలుగుదేశం నాయకులు తక్కువ తినలేదు. చంద్రబాబునాయుడు అందుకు మినహాయింపు కాదు. స్త్రీల పట్ల ఏమాత్రం గౌరవం లేని ఎంతో మంది చీకటి జీవితాల కంటే ఎన్టీఆర్‌ చాలా గొప్పవాడు. ఆయనను పెళ్లి చేసుకున్నాక తెలుగుదేశం రాజకీయాల్లో ఆమె జోక్యం కానీ, పరిపాలన విషయంలో ఎన్టీఆర్‌ ఆమె ప్రభావానికి లోనై నిర్ణయాలు తీసుకోబోయారన్న విషయంలో కచ్చితమైన సమాచారం ఉంటే ఎవరయినా విమర్శనాత్మకంగా చర్చించవచ్చు. కానీ దాదాపు 22 ఏళ్ల క్రితం మరణించిన ఎన్టీఆర్‌ జీవితం తెరకెక్కించే ప్రయత్నం చేసేవారు ఎవరయినా సంపూర్ణ సమాచారం సేకరించుకుని చేస్తే బాగుంటుంది. ఆత్మకథలు రాసే వారికి నిజాయితీ, జీవిత చరిత్రలు రాసే వారికి పరిశోధన చాలా ముఖ్యం అన్న విషయం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్‌ పేరు ప్రతిష్టలను, ప్రజాభిమానాన్ని ఎన్నికల రాజకీయాల కోసం మాత్రమే వాడుకునే చంద్రబాబునాయుడి తెలుగుదేశం ఈ మూడు సినిమాల నుంచి లబ్ధి పొందే హడావుడిలో ఎన్టీఆర్‌ను నవ్వుల పాలు చేసే అవకాశాలే ఎక్కువ.

నిజాం బూజును దులపాలి
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను పొగుడుతున్న తీరు జుగుప్సాకరంగా తయారయింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆంధ్రా వలస పాలకుల కంటే నిజాం రాజు పాలనే మెరుగ్గా ఉండేది అనేమాట ఉద్యమకారుల నుంచి తరచూ వినబడేది. మూర్ఖుడూ, ప్రజా కంటకుడూ అయిన నిజాం కంటే ఎక్కువ దుర్మార్గులు వలస పాలకులు అన్న అర్థం స్ఫురించే విధంగా ఉండేది ఆ పోలిక. నిజానికి అందులో వాస్తవం లేకపోయినా ఉద్యమ కాలంలో ఇటువంటివి సహజం అని సరిపెట్టుకునేవాళ్లం. నిజాం రాజు, ఆయన కిరాయి సైనికులు(రజాకార్లు) తెలంగాణ ప్రాంత ప్రజల మీద సాగించిన దమనకాండను మరచిపోయి, ఆయనో మహనీయుడు అని తాను కీర్తించడమే కాక భావితరాల వారికి తప్పుడు సమాచారాన్ని పంపే ప్రయత్నంలో భాగంగా చరిత్రను తిరగ రాస్తానని అంటున్నారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో చంద్రశేఖరరావు, ఆయన నాయకత్వం వహించిన టీఆర్‌ఎస్‌ల పాత్ర విస్మరించడానికి వీలు లేనిదే అయినా, అందుకు ప్రతిఫలంగా రాష్ట్రాన్ని ఏలే అధికారం ప్రజలు ఆయన పార్టీకి కట్టబెట్టినా చరిత్రను వక్రీకరించి తిరగరాస్తానంటే కుదరదు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు పన్నెండు శాతం ముస్లింలను ఆకర్షించడానికీ, మజ్లిస్‌ పార్టీ సహకారంతో వచ్చే ఎన్నికలలో గట్టెక్కడానికీ మైనారిటీ సంక్షేమం పేరిట ఎన్ని పథకాలయినా తీసుకురావచ్చు, ఎన్ని వందల, వేల కోట్ల రూపాయల నిధులయినా కేటాయించవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. ముస్లింలు ఈ దేశ పౌరులు. తెలంగాణ సమాజంలో వాళ్లు భాగంగా ఉన్నారు. తెలంగాణలో ముస్లింలకు నిజాం ప్రతినిధి కాదు, మజ్లిస్‌ నాయకులు అంతకన్నా కాదు. తెలంగాణ ప్రజల ఆస్తులు కొల్లగొట్టి, స్త్రీల మాన ప్రాణాలను హరించి, వందలాది మందిని ఊచకోత కోసి సంపాదించిన నెత్తుటి బంగారాన్ని నిజాం రాజు ఆస్పత్రి కట్టించడానికి దానం చేశాడని పొంగిపోయి శాసనసభ సాక్షిగా ఆ క్రూరుడిని, అతడి పాలనను వేనోళ్ల కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజాస్వామ్యాన్ని, ఆ అద్భుత పునాదుల మీద నిర్మించుకున్న విలువలను ధ్వంసం చేసేందుకు పూనుకున్నారు.

మేధావులు వాస్తవాలు చెప్పాలి
తెలుగుభాషను గొప్పగా కీర్తిస్తూ, ఆ కీర్తిని నేల నాలుగు చెరగులా వ్యాపింపచేసే ప్రయత్నంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబోతున్న ముఖ్యమంత్రికి నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో, ఉర్దూ రాజభాషగా వెలుగొందుతూ ఉంటే అజ్ఞాతంలో ఉండిపోయిన తెలుగు భాషకు మద్దతుగా ఉద్యమాలు సాగాయనీ, అందులో భాగంగానే గ్రంథాలయోద్యమం వేళ్లూనుకున్నదనీ ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు?

రావణాసురుడిని కొలిచే వాళ్లు ఉంటారు. అది వాళ్ల ఇష్టం. నిజాం రాజును కొలిచే వాళ్లూ ఉంటారు, అది కూడా వాళ్ల ఇష్టం. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ రాజ కీయ ప్రయోజనాల కోసం ఆ పని చెయ్యడం తగదు. రామాయణ కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు. రావణుడు మంచివాడా, ప్రజాకంటకుడా అన్నదీ మనకు తెలియదు. కానీ నిజాం కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు, ఆయన దుష్పరిపాలనా మనకు తెలుసు. ఆయన రాజ్యంలో ప్రజల మీద జరిగిన దమనకాండ గురించి మనకు తెలుసు. తెలిసీ మౌనంగా ఉండటం నేరం.


- దేవులపల్లి అమర్‌

datelinehyderabad@gmail.com

మరిన్ని వార్తలు