గీత కార్మికుల తలరాత మారదా?

22 May, 2018 02:17 IST|Sakshi

క్షణ క్షణం భయం భయం. బతుకే ప్రమాదకరం. వెళ్లిన కార్మికుడు క్షేమంగా తిరిగొస్తాడో రాడో అన్న ఉత్కంఠ. తెలంగాణ గీత కార్మికుల దైన్య స్థితి ఇదే. నిజాం సుదీర్ఘ పాలన నాటినుంచీ ఇప్పటికీ వేదనాభరిత జీవితాలను అనుభవిస్తున్న గీత కార్మికుల అభ్యున్నతిపై పాలకులు నిర్లక్ష్యం వహించడం బాధాకరం. తెలంగాణలో సుమారు 30 కోట్ల తాటి చెట్లున్నాయి గీత వృత్తిపై సుమారు 75 లక్షలమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవిస్తున్నారు. అయితే ప్రతి జూన్‌ నెల నుంచి వీరికి ప్రమాదకరమైన సమయమే. తాటి చెట్టు నుంచి కింద పడి, లేదా చెట్టుకు వేలాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలంలో నారాయణ గౌడ్‌ అనే వ్యక్తి చెట్టుపై నుంచి తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలు కోల్పోవడం ప్రత్యక్ష ఉదాహరణ.

అయితే తెలంగాణ జిల్లాల్లో గీత కార్మికుల ప్రాణాలు ప్రతి ఏటా గాలిలో కలిసిపోతున్నా ప్రభు త్వం నుంచి వచ్చే నష్టపరిహారం ఏమీ అందడం లేదు. కల్లుగీత ద్వారా, తాటివనాల ద్వారా ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తున్నా, గీత కార్మికులు తాటిచెట్టు పన్ను, భూ యజమాని పన్ను, ఎక్సైజ్‌ సుంకం కడుతూ ప్రభుత్వాన్ని పోషిస్తున్నప్పటికీ గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఇచ్చిందేమీ లేదు. తాటిచెట్టుపైనుంచి పడి ప్రమాదానికి గురై, అంగవైకల్యం లేదా మరణం సంభవించిన వారి కుటుంబాలకు ఏళ్లు గడిచినా ఎక్స్‌గ్రేషియా అందడంలేదు. పైగా రెక్కలు ముక్కలు చేసుకుని శరీరబాధలు అనుభవించి చేసిన కష్టానికి ప్రతిఫలం రాక మార్కెట్లో డిమాండ్‌ లేక ఆత్మహత్యల పాలవుతున్న గీత కార్మికులను ఆదుకునే యంత్రాంగం లేదు. పైగా తెలంగాణ గీత కార్మికులకు ప్రపంచీకరణ పుణ్యమా అని గౌడ వృత్తి దెబ్బతినిపోయింది.

తాటివృత్తి గౌరవాన్నికాపాడి ఆ వృత్తిపై ఆధారపడిన లక్షలాది కార్మికులకు ఆత్మస్థైర్యం కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలంగాణలోని గీత కార్మిక సంఘాల కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సర్వేను నిర్వహించి జనాభాలో 40 శాతంగా ఉన్న వృత్తి కళాకారులకు రక్షణ కల్పించాలి. లంచాల కోసం గీత సంఘాలను వేధిస్తున్న అధికారులను, నంబరు పంతుళ్లు, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గీత కార్మికుల తలరాతను ఇప్పటికైనా మార్చాలి.- రావుల రాజేశం, లెక్చరర్, జమ్మికుంట, మొబైల్‌ : 98488 11424

మరిన్ని వార్తలు