రసపట్టులో అన్నదమ్ముల సవాల్‌

5 Sep, 2018 00:33 IST|Sakshi

పార్టీపై స్టాలిన్‌ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం పరిశీలకులందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్‌ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. స్టాలిన్‌ పార్టీ మనిషిగానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్‌ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాకపోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరే పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.

చెన్నైలోని మెరీనాలో తన తండ్రి ఎం.కరుణానిధి సమాధి వద్దకు ఆయన రెండో కొడుకు డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి నేడు (బుధవారం) ఊరేగింపుగా వెళుతున్నారు. 1980ల్లో తన ఇద్దరు కొడుకుల మధ్య వైరంతో విసిగిపోయిన కరుణానిధి పార్టీ దక్షిణాది వ్యవహారాలు చూసుకో మని అళగిరిని మదురైకు పంపించారు. ఉత్తర తమిళ నాడులో పార్టీ పనిని చెన్నై నుంచి నడపాలని స్టాలిన్‌కు అప్పగించారు. స్టాలిన్‌ కార్యక్షేత్రంలోనే ఆయనకు అన్న సవాలు విసురుతున్నారు. కుటుంబ పోరు ఇక బహిరంగమే. తోబుట్టువుల మధ్య ఈ యుద్ధంలో అళగిరే బలహీనుడు. ఆగస్టు చివరి వారం స్టాలిన్‌ తండ్రికి వారసునిగా డీఎంకే అధ్యక్ష పదవి చేపట్టారు. కరుణ ఈ పదవిలో 49 ఏళ్లున్నారు. 2014లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళ గిరి ప్రస్తుతం పార్టీ సభ్యుడు కూడా కాకపోవడంతో తమ్ముడిని అడ్డుకోలేకపోయారు. ప్రతి జిల్లాలో అన్ని పదవుల్లో్ల తన మనుషులను నియమిస్తూ గత నాలు గేళ్లలో పార్టీపై స్టాలిన్‌ పూర్తి పట్టు సాధించారు.

ఈ నాలుగేళ్లలో అళగిరి రాజకీయాల్లో చురుకుగా లేరు. తమ్మునితో పోరు సలపకుండా వెనుదిరగడం ఆయ నకు ఇష్టం లేదు. మళ్లీ డీఎంకేలో చేరాలనుకున్న ఆయనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. దీంతో ఇక బాహాటంగానే స్టాలిన్‌తో తలపడాలను కుని, తన తండ్రికి నిజమైన, విధేయులైన కార్యకర్త లంతా నాతోపాటే ఉన్నారని చెప్పారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్‌ కార్యసాధకుడు కాదని, పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఆయనకు లేదని అళగిరి చెప్పారు. స్టాలిన్‌కు ఎక్కడ నొప్పి పుడు తుందో అక్కడే అళగిరి గురిచూసి కొడుతున్నారు. కరుణానిధి బతికుండగానే 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌ నాయకత్వంలోనే డీఎంకే పోటీచేసింది. డీఎంకేకు ఒక్క లోక్‌సభ సీటూ దక్క లేదు. రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను గద్దె దింపలేకపోయింది. అందుకే, 2019 పార్లమెంటు ఎన్నికలు స్టాలిన్‌కు అగ్నిపరీక్ష వంటివి. మూడోసారి ఎన్నికల్లో డీఎంకేను గెలిపించ లేకపోతే స్టాలిన్‌కు ప్రమాదం ముంచుకొస్తుంది. అళగిరి పార్టీని చీల్చలేక పోయినా, స్టాలిన్‌ను ఇబ్బం దిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అన్న పేరెత్తని స్టాలిన్‌!
అళగిరి విమర్శలకు స్టాలిన్‌ స్వయంగా స్పందించ లేదు. పార్టీ నేతలతోనే జవాబు చెప్పించారు. పార్టీపై స్టాలిన్‌ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం డీఎంకే వ్యవహారాలు గమనిస్తున్నవారందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్‌ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరారు. స్టాలిన్‌ పార్టీ మనిషి గానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్‌ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాక పోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరేక పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. జయలలిత మరణించాక ఏఐఏడీఎంకేలో వచ్చిన చీలిక, బల హీన నాయకత్వంలో పార్టీ నడవడాన్ని తమకు అను కూలంగా మార్చుకోవడానికి డీఎంకే ప్రయత్నిస్తున్నట్టే, డీఎంకేను నడిపే కరుణానిధి కుటుంబంలోని కీచులాటలను వాడుకోవడానికి కూడా అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి డీఎంకే నేతలు, కార్యకర్తలను చెప్పుకోదగ్గ సంఖ్యలో అళగిరి తనవైపుకు తిప్పుకోలేరు.. 

రెండేళ్ల క్రితం స్టాలిన్‌ అడ్డపంచె వదిలి ప్యాంటు, రంగు చొక్కా బదులు తెల్ల షర్టు వేసుకునేలా సలహాదారుల బృందం ఆయనను ఒప్పించింది. ఇలా ‘గెటప్‌’ మార్చితే తమిళనాడు యువతను వారిలా కనిపిస్తూ ఆకట్టుకోవవచ్చనేది ఈ సలహాబృందం అభిప్రాయం. కొత్త రూపంలోని స్టాలిన్‌ మీడియా తీసిన ఫొటోల్లో ఆసక్తికరంగానే కనిపించారుగాని ఎన్నికల్లో మాత్రం డీఎంకే గెలిచేస్థాయిలో ఓట్లు పడలేదు. కనీసం కరుణానిధి, జయలలిత లేని తమిళ రాజకీయక్షేత్రంలోనైనా ఎన్నికల్లో కొత్త అంశాలు జోడించి విజయానికి బాటలు వేయాలనే వత్తిడి స్టాలిన్‌పై పెరుగుతోంది. రెండేళ్లకు పైగా అధికారంలో ఉన్న పాలకపక్షమైన ఏఐడీఎంకేపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిపైనే పార్టీ గెలుపునకు పూర్తిగా ఆధారపడితే స్టాలిన్‌కు విజయం గ్యారంటీ అని చెప్పడం కష్టం. తన తండ్రి సీఎంగా అందించిన డీఎంకే పరిపాలన నాణ్యత తన నాయకత్వంలో బాగా మెరుగవుతుందని, సుపరిపాలనకు తన పార్టీ మంచి నమూనాగా నిలుస్తుందని స్టాలిన్‌ సరికొత్త ఇమేజ్‌తో ప్రజలను నమ్మించగలిగితేనే పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది.

గతంలో మాదిరిగా పాలక పక్షంపై జనంలో పేరుకుపోయే వ్యతిరేకత ఈసారి డీఎంకే అధికారంలోకి రావడానికి తోడ్పడకపోవచ్చు. తమిళనాడులో 1984, 2016లో మినహా ప్రజలు అధికారంలో ఉన్న ద్రవిడ పార్టీలను ఓడించారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలో ఈ రెండు సందర్భాల్లో తప్ప ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి ఫోర్ట్‌ సెయింట్‌ జార్జిలో (తమిళ అధికారపీఠం ఉండే ప్రాంతం) అధికారం చేపట్టాయి. కరుడుగట్టిన ఏఐఏ డీఎంకే కార్యకర్తకు సీఎం పళనిస్వామి– ఓపీఎస్‌ నేతృత్వంలోని అసలు ఏఐఏడీఎంకేనుగాని, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని చీలికవర్గమైన కొత్త పార్టీని(అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం)గాని ఎంచుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకేలోని అసంతృప్తి జ్వాలలపైనే తమిళ నాడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి స్టాలిన్‌ పూర్తిగా ఆధారపడలేరనేది వాస్తవం. ఖాయంగా అధికారం లోకి రావాలంటే కొత్త సీసాలో పాత సారా పోసి చూపించకుండా, తమిళనాడు ప్రగతికి కొత్త విజన్‌ ఏమిటో స్టాలిన్‌ ప్రజలకు చెప్పగలగాలి. 

కొత్త పార్టీ పెట్టినా పెద్దగా లాభం ఉండదు!
అళగిరి కొత్తగా పార్టీ పెట్టినా ఎన్నికల ఫలితాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులో ఓట్లు చీల్చి డీఎంకేను ఓడించగలిగితే అళగిరికి అంతకన్నా ఆనందించే విషయం ఉండదు. ఈ లక్ష్య సాధనకు స్టాలిన్‌ రాజ కీయ ప్రత్యర్థులతో కలిసి పనిచేయడానికి కూడా ఆయన సిద్ధమే. ప్రస్తుతానికి ఏ రాజకీయ సంస్థతో అనుబంధం లేకుండా కనిపిస్తున్నాగాని కరుణానిధికి ప్రత్యామ్నాయ వారసునిగా అళగిరి తాను జనం ముందు కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత తనను తప్పనిసరిగా డీఎంకేలోకి తమ్ముడు స్టాలిన్‌ తీసుకునే పరిస్థితిని అళగిరి ఈలోగా సృష్టించగలగాలి. అంటే ఎన్నికల్లో తన వల్ల డీఎంకే దెబ్బతినేలా చూడాలి. రాజకీయంగా తన ఉనికి చాటాలనే ఆతృత ఆయనలో కనిపిస్తోంది. తన కొడుకులు, మనవళ్లకు డీఎంకేలో రాజకీయ, ఆర్థిక వారసత్వం, వాటా దక్కించుకోవాలనేది కూడా అళ గిరి కోరిక. భారీగా డబ్బున్న డీఎంకే నిర్వహణలోని ట్రస్టుల్లో అళగిరి కుటుంబసభ్యులెవరికీ సభ్యత్వం లేదు.

ఆయనలో అసలు అసంతృప్తికి ఇదో ప్రధాన కారణం. అందుకే ఆయన కొంత తగ్గివచ్చి తమ్ముడికి కొత్త ప్రతిపాదన చేశారు. తనను డీఎంకేలోకి మళ్లీ తీసుకుంటే స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధమేనని ఇటీవల ప్రకటించారు. కరుణానిధి గోపా లపురం ఇంట్లో డీఎంకే ప్రథమ కుటుంబానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. కరు ణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోవడానికి తన కుటుంబసభ్యుల ద్వారా అళగిరి ఒత్తిడి తెచ్చారట. తమ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచే బాధ్యత తనపై ఉందని చెప్పుకునే ఆయన సోదరి సెల్వికూడా తన వంతు ప్రయత్నం చేశారు. తన సోదరులిద్దరూ కలిసి ఉండేలా చూడ డానికి అమె గట్టి కృషి చేశారు. కాని, అళగిరిని మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్‌ తేల్చి చెప్పారు. ఆయనకు ఈ విషయంలో సవతి చెల్లెలు కనిమొళి, దగ్గర బంధువులైన మారన్‌ సోదరులు బాసటగా నిలబడ్డారు. తన తండ్రి మంచి ఆరో గ్యంతో ఉన్నప్పుడే మళ్లీ పార్టీలో చేరడానికి తాను గట్టి ప్రయత్నాలు చేయాల్సిందనీ, కాని ఆ పని చేయలేదని మదురైలోని తన మద్దతుదారులతో మాట్లాడుతూ అళగిరి తన బాధ వెళ్లబోసుకుంటు న్నారని తెలుస్తోంది. తన తండ్రి నిర్ణయం మార్చా ల్సిన అవసరం కనిపించడం లేదని స్టాలిన్‌ అంటు న్నారు. సోషల్‌ మీడియా అత్యంత చురుకుగా పని చేస్తున్న ఈ రోజుల్లో అళగిరి తరహా దురుసు రాజ కీయాల వల్ల పార్టీకి చేటేగాని లాభం ఉండదని భావి స్తున్నారు.

డీఎంకే అగ్రనాయకత్వం కూడా అళగిరి మళ్లీ పార్టీలోకి రావాలని కోరుకోవడం లేదు. 2001లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినం దుకు అళగిరిని సస్పెండ్‌ చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. తనకు పలుకుబడి ఉన్న మదురై చుట్టుపక్కల ప్రాంతాల్లో డీఎంకే అభ్య ర్థుల ఓటమికి ఆయన పనిచేశారనే ఆరోపణలు న్నాయి. అళగిరి దెబ్బతో పరాజయం పాలైనవారిలో డీఎంకే సీనియర్‌ నేత పీటీఆర్‌ పళనిరాజన్‌ కూడా ఉన్నారు. ఆయన 1996–2001 మధ్య తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. మదురై పశ్చిమ స్థానంలో ఆయన కేవలం 708 ఓట్ల తేడాతో ఓడి పోయారు. అళగిరి 17 ఏళ్ల క్రితంలా ఇప్పుడు లేకున్నా డీఎంకేను దెబ్బదీయడానికి ఆయనకున్న శక్తియుక్తులను ఎవరూ తక్కువగా అంచనావేయడం లేదు. అళగిరి పొరపాటు చేశారా? అంటే అవుననే చెప్పాలి. తన తండ్రి మరణించాక ఆయన కొంత కాలం వేచి చూడాల్సింది. వారంలోపే దూకుడుగా మాట్లాడారు. ఎన్నికల్లో స్టాలిన్‌ బోల్తాపడే వరకూ ఆగి తర్వాతే అళగిరి విమర్శిస్తే బావుండేది. తొంద రపడి తన బలహీనత బయటపెట్టుకున్నారు. బుధ వారం ర్యాలీకి తెలిసిన నేతలు, జనం తగినంత మంది హాజరుకాకపోతే అళగిరి రాజకీయ జీవితం ముగిసినట్టేననుకోవచ్చు.

టీఎస్‌ సుధీర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
ఈ–మెయిల్‌ : tssmedia10@gmail.com

మరిన్ని వార్తలు