మళ్లీ వేడెక్కిన దక్షిణపు గాలి

21 Mar, 2018 00:28 IST|Sakshi

దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ జాతీయవాద రాజకీయ ఎత్తుగడను నిరోధించడానికి ఈ పార్టీల అధినేతలు తమ అస్తిత్వం కార్డును ప్రయోగించే అవకాశం ఉంది. కానీ ఇది పెద్దగా అనుకూలించకపోవచ్చు. కేంద్రం తనది పై చేయిగా ఉండడానికి రాష్ట్రాల మధ్య ఉండే విభేదాలను ఉపయోగించుకుంటుంది. తెలుగు ప్రాంతమే ఒకటిగా ఉండలేక పోవడంతో 2014లో కేంద్రం విభజించి, తెలంగాణను ఏర్పాటు చేసింది. 

వింధ్య పర్వతాలకు దిగువన, అంటే దక్షిణ భారతంలో ఇప్పుడు ఓ బృందగానం వినిపిస్తోంది. అది ఢిల్లీ ఆధిపత్య «ధోరణికి నిరసనగా వినిపిస్తోంది. కేంద్రం రాష్ట్రాలను తోలుబొమ్మల మాదిరిగా ఆడించాలని చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ నెలలోనే విమర్శలు గుప్పించారు. సమాఖ్య వ్యవస్థ లక్షణాన్ని మరచి కేంద్రం రాష్ట్రాల మీద స్వారీ చేయాలని చూస్తోందని ఆయన తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు కూడా. అంతకు ముందు ఒక నెల క్రితం ఆయన కుమారుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు కూడా దక్షిణ భారత రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమం మీద కేంద్రానికి శ్రద్ధ లేదని ఆరోపించారు. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక నడవా అభివృద్ధి పట్ల ఉన్న దృష్టి దక్షిణాది మీద లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో కర్ణాటక నుంచి కూడా నిరసన గళం వినిపించింది.

తీసుకునేది ఎక్కువ ఇచ్చేది తక్కువ
భారతదేశం మొత్తం మీద వసూలవుతున్న పన్నులలో 9 శాతం కర్ణాటక నుంచి వెళుతున్నాయనీ, కానీ కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి అందుతున్నది మాత్రం 4.65 శాతమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆక్రోశం వెళ్లగక్కారు. ఇది ఆ మధ్య ఆయన తన ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్య. కాబట్టి వసూలవుతున్న పన్నులు మొత్తాన్ని బట్టి చూస్తే దేశంలో కర్ణాటక మూడో స్థానంలో ఉందని కూడా ఆయన చెబుతున్నారు. కర్ణాటక శాసనసభకు ఈ వేసవిలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. 

ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక పట్ల చూపుతున్నట్టు చెబుతున్న ఈ వివక్ష ఆ ఎన్నికలలో ఒక కీలకాంశంగా మారుతుంది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ దాదాపుగా ఒక ప్రాంతీయ పార్టీ అవతారంలోనే, ఆ పార్టీ సామంతుడు సిద్ధరామయ్య నాయకత్వంలో పోరాడబోతున్న విషయం కూడా సుస్పష్టం. కాబట్టి ఇలాంటి అంశాలు ఓటర్లలో భావావేశాన్ని రేకెత్తిస్తాయని ఆ పార్టీ అంచనా. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం పన్ను రూపంలో ప్రతి ఒక్క రూపాయికి, తిరిగి 1.79 రూపాయలు పొందుతోందని కూడా కర్ణాటక కాంగ్రెస్‌ వాదిస్తోంది. ఆ రాష్ట్రంతో పోల్చి చూసినప్పుడు కర్ణాటక చెల్లించే ప్రతి రూపాయికీ తిరిగి పొందుతున్నది కేవలం 47 పైసలు. తమిళనాడు పరిస్థితి ఇంతకంటే కనాకష్టం. ఆ రాష్ట్రానికి దక్కుతున్నది కేవలం నలభయ్‌ పైసలు. ఇలాంటి ప్రశ్నలు సహజంగానే అభివృద్ధికి దక్కే ప్రతిఫలం ఇదా అన్న సందేహానికి తావిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కేంద్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ కూడా కేంద్రం వైఖరి మీద ఆమధ్య రుసురుసలాడినవారే.

పార్టీల పరంగా చూస్తే కర్ణాటకలో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య అనివార్యం. కానీ ఈ పోటీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకూ, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ స్థాయికి దించాలని చూస్తున్నారు. బీజేపీని లక్ష్యం చేసుకోవడానికి ఇదొక వ్యూహం కూడా. అదెలాగంటే, దక్షిణాది దృష్టిలో బీజేపీ హిందీ ప్రాంతానికి చెందిన పార్టీ. అలాగే ఈ వాదన వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న ఆ ప్రాంతం దక్షిణ ప్రాంత వనరులను దోచుకుపోతున్నదని కూడా ధ్వనింపచేస్తుంది. 

సినిమా రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన కమల్‌ హాసన్‌ మొన్న ఫిబ్రవరిలో మధురైలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఒక జెండాను కూడా ఆవిష్కరించారు. దాని మీద ఆరు చేతులు గొలుసుకట్టుగా ఒకదానిని ఒకటి పట్టుకున్నట్టు చిత్రించారు. ఇదే చాలామందికి ప్రశ్నార్థకమైంది. ఆ ఆరు చేతులు దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాలను ప్రతిబింబిస్తాయనీ, ఒక దానికొకటి బాసటగా కలసి ఉన్నాయనీ కమల్‌ వివరణ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలసి ఒక ప్రెషర్‌ గ్రూప్‌గా కలసి ఉండాలని చెప్పడానికి ఇది దృశ్యాత్మక అభివ్యక్తిగా భావించవచ్చు. విధాన నిర్ణయాలలో గానీ, కేంద్రం కల్పించే ఆర్థిక ప్రయోజనాల విషయంలో గానీ దక్షిణ భారతదేశాన్ని ఢిల్లీ గమనంలోకి తీసుకోవడం లేదు. 

ఈ అంశంలో పరిగణనలోనికి తీసుకోవలసిన విషయం ఇంకొకటి ఉంది. కమల్‌ పెరియార్‌ ద్రవిడ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఆ సిద్ధాంతంలోని చాలా కోణాలలో ద్రవిడనాడు ఆలోచన కూడా ఒకటి. ద్రవిడనాడు వాంఛించదగినదా? అంటూ గడచిన వారం ఈరోడ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎంకే నాయకుడు ఎంకె స్టాలిన్‌ను ఒకరు ప్రశ్నించారు. ‘అలాంటి ఒక డిమాండ్‌ వినిపిస్తే, అది స్వాగతించదగినదే. అలాంటి డిమాండ్‌ వస్తుందనే ఆ ఊహ కూడా’అని స్టాలిన్‌ చెప్పారు. అయితే ఆధునిక భారత దేశంలో ద్రవిడనాడు అనే భావనను దేశ వ్యతిరేకంగా విశ్లేషిస్తున్నారు.

దీనితో స్టాలిన్‌ సమాధానం మీద కొంత రగడ చెలరేగింది. అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం నుంచి పొందవలసి ఉన్న ప్రయోజనాల విషయంలో గళమెత్తాయి. ఆ క్రమంలో, ఆ రగడలో స్టాలిన్‌ ప్రకటన వివాదాల వరకు వెళ్లలేదు. అలాగే ఆ మరునాడే స్టాలిన్‌ కూడా, ద్రవిడనాడును తానే కోరినట్టు పత్రికలు తప్పుగా రాశాయని వివరణ ఇచ్చారు. కానీ తమిళనాడులో హిందీ వ్యతిరేకతకు తోడు ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యమన్న భావన మరింత బలంగా ఉంటుంది. ఈ మధ్యనే మైలురాళ్ల మీద హిందీ అక్షరాలు రాయడం గురించే అక్కడ పెద్ద ఎత్తున అలజడి రేగింది. 

ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేరళలో పర్యటించినప్పుడు, వైద్య విధానం ఎలా ఉండాలో మా రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలంటూ ఇచ్చిన ఉపన్యాసం ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను కదిలించింది. ఎందుకంటే గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందుబాటులో లేకపోవడం వల్ల చిన్నారులు మరణించారు. అలాగే ఝాన్సీ ప్రభుత్వ వైద్యశాలలో తొలగించిన కాలునే దిండుగా చేసుకుని పడుకున్న ఉదంతం కూడా చోటు చేసుకుంది. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చి మాట్లాడిన ఇలాంటి మాటలు కేరళలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. నిజానికి కేరళలో సమస్యలు లేవని కాదు. కానీ ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించుకునే వెసులుబాటు అక్కడ ఉంది. 

కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలని అనాలోచితమైనవిగా తీసుకోవాలా? లేకపోతే, ఇది దేశంలోని ఒక లోపంగా భావించాలా? అంతకు మించి, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశానికి తక్కువ లోక్‌సభ స్థానాలు మిగులుతాయని, దీనర్ధం రాజకీయాధికారంలో దక్షిణాదిని పలచన చేయడమేనని రాజకీయ నాయకులు చెప్పే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ ఉత్తర, దక్షిణ భారత విభజన సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజాభిప్రాయానికి ఇదొక కొలబద్ద. కానీ దీనికి గొప్ప కచ్చితత్వం మాత్రం లేదు. రాజకీయ నాయకులు ఆ మనోభావాలను ఉపయోగించుకుంటున్నారు.

అస్తిత్వం కార్డుతో రాష్ట్రాలు
ప్రస్తుతం దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ జాతీయవాద రాజకీయ ఎత్తుగడను నిరోధించడానికి ఈ పార్టీల అధినేతలు తమ అస్తిత్వం కార్డును ప్రయోగించే అవకాశం ఉంది. కానీ ఇది పెద్దగా అనుకూలించకపోవచ్చు. 

కేంద్రం తనది పై చేయిగా ఉండడానికి ఉప ఖండంలో రాష్ట్రాల మధ్య ఉండే విభేదాలను ఉపయోగించుకుంటుంది. తెలుగు ప్రాంతమే ఒకటిగా ఉండలేక పోవడంతో 2014లో కేంద్రం విభజించి, తెలంగాణను ఏర్పాటు చేసింది. అలాగే కావేరీ జలాల గురించి తమిళనాడు, కర్ణాటక మధ్య విభేదాలు ఉన్నాయి. ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ విషయంలో తమిళనాడుకు కేరళతో కూడా వివాదం ఉంది. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న ప్రశ్న ఏమిటంటే, దేశంలో భాగంగా ఉన్నప్పుడు ప్రాంతీయ అసమానతలను తొలగించుకోవలసిన బాధ్యత దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఉంది కదా! ఎందుకంటే, ఉత్తరాదికి కూడా సముద్రతీరం ఉంటే ఇక్కడి రాష్ట్రాలు కూడా దక్షిణాదితో సమంగా ఉండేవని వారు వాదించవచ్చు. 

మిగిలిన భారతదేశం మొత్తం నుంచి వలసలు జరగడం లేదా అంటూ అపహాస్యం చేసినా, బిహార్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలను అలా వెనుకబడిన ప్రాంతాలుగా మిగిల్చితే, దక్షిణ భారతదేశంతో పాటు, ముంబై వంటి నగరాలు కూడా వలసలకు కేంద్రాలవుతాయన్నది నిజం. కాబట్టి దక్షిణ భారతదేశం తన వాటాను పంచడంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దానితో ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఇక ఈ అంశం గురించి ఇంత కలత ఎందుకంటే, ఈ విషయాన్ని శాంతిపూర్వకంగా పరిష్కరించే నాయకత్వం ప్రస్తుతం కేంద్రంలో లేదు. దక్షిణాదిన బీజేపీ అధికారంలో లేదు. కనుక ఈ ప్రాంతం అంటే ఆ పార్టీకి ఆఖరి ప్రాధాన్యతాంశంగానే ఉంటుంది. ఇదే ఆ ప్రాంతంలోని రాష్ట్రాలకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఉపఖండం ముక్కలు కావాలని ఎవరూ సలహా ఇవ్వడం లేదు. కానీ మనసులు విడిపోతే భవిష్యత్తులో జరిగే నష్టం అంతకంటే ఎక్కువే.

- టీఎస్‌ సుధీర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు

మరిన్ని వార్తలు