కావాల్సింది ‘పౌష్టికాహార భద్రత’

28 Oct, 2018 04:39 IST|Sakshi

విశ్లేషణ

‘ఈసురోమని మనుషులుంటే.. దేశమేగతి బాగు పడునోయ్‌’ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ జాతి నిర్మాణానికి అక్కరకొచ్చే ఆరోగ్యవంతులు ఎంతమంది అన్నది ప్రశ్నార్థకం. దేశంలో మెజారిటీ ప్రజ లకు సమతులాహారం, ఆహార భద్రత మాట అటుంచి కనీసం పొట్ట నింపుకోవడానికి కనీస పోషకాహారం కూడా దొరకని దుస్థితి ఈనాటికీ సమాజంలో తొలగిపోలేదు. అక్టోబర్‌ 16న జరిగిన ‘ప్రపంచ ఆరోగ్య దినం’ సందర్భంగా వివిధ దేశాల ఆహార భద్రతపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదిక భారతదేశానికి సంబంధించి మింగుడుపడని ఓ చేదు మాత్ర. ఈ నివేదికలో అనేక ఆందోళనకర వాస్తవాలు వెలుగుచూశాయి. 

130 కోట్లమంది భారతీయుల్లో 14% మంది ప్రజలు ప్రతిరోజూ కడుపునిండా తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. దేశంలోని ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు పోషకాహారలేమితో బాధపడుతుంటే, 5 ఏళ్లలోపు పిల్లల్లో 20% మంది పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. ఏటా దేశంలో 10 లక్షల 95 వేల మంది పోషకాహార లేమికి సంబంధించిన జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధిక శాతం ప్రజలకు కేవలం పోషకవిలువలున్న సమతుల ఆహారం అందుబాటులో లేదు. 

ఆర్థిక ప్రగతిలో భారత్‌ వేగం రెండంకెలు దాటుతున్న మాట నిజం. గత రెండు దశాబ్ధాలకుపైగా భారతదేశం సాంకేతికంగా, వైజ్ఞానికంగా వడివడిగా ముందుకు సాగుతున్నది. 2022 నాటికి భారత్‌ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్‌ను దాటుతుందని ప్రపంచ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రగతిని చూసి సగటు భారతీయుడు మురిసిపోవాలా? లేక ఆర్థికాభివృద్ధి రేటుతో సమాంతరంగా పెరుగుతున్న సగటు మానవుని ఆకలి కేకల్ని చూసి బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితి దేశంలో నెలకొంది. ఇందుకు ఆర్థిక అసమానతలు పెరగడం, పేద, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తి క్షీణించడమే.  2014–2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆకలికి బలైపోయిన వారి సంఖ్య 82 కోట్లకు చేరగా అందులో భారత్‌లో 32 లక్షల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. 

ఆహారధాన్యాల లభ్యత, పౌష్టికాహార లోపం, అస్తవ్యస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తయారుచేసిన ఈ నివేదికలో.. 119 దేశాల ఆకలి సూచీలో భారత్‌ 100వ స్థానంలో నిలిచింది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ మనకంటే మెరుగ్గా 88వ ర్యాంకులో నిలువడం గమనార్హం! తలసరి ఆదాయాలు పెరుగుతున్నా, కేంద్ర బడ్జెట్‌  రూ. 30  లక్షల కోట్లు చేరుతున్నదని గొప్పగా చెప్పుకున్నా అవేవీ దేశ ప్రజల ఆకలిని సంపూర్ణంగా తీర్చలేకపోతున్నాయి. పరిస్థితి చేయి దాటుతోం దంటూ ఐక్యరాజ్య సమితి భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 

60వ దశకం చివర్లో సాధించి, అమలులోకి తెచ్చిన హరితవిప్లవం 90వ దశకం వరకూ దేశ ఆహార భద్రతను పెంచింది. అయితే, ఆ తర్వాత దేశంలో, అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీశాయనే చెప్పాలి. 1954లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత సగటున ఏడాదికి 167.1 కిలోలు ఉండగా, హరిత విప్లవం వచ్చాక అది గరిష్టంగా 1968లో 187.2 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత ఆ మొత్తం తగ్గుతూ 2005 నాటికి 154.2 కిలోలకు పడిపోయింది. 2016–17 నాటికి దేశంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఏడాదికి 160 కిలోల వద్దకు చేరుకొంది. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగడం లేదన్నది సుస్పష్టం. 

ఐక్యరాజ్య సమితి రూపొందించిన 17 అభివృద్ధి లక్ష్యాలలో ప్రజ లందరికీ ఆహార భద్రత ప్రధానమైనది. నిజానికి, దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పించడమే కాకుండా పోషకాహార భద్రతపైకి దృష్టి మళ్లిం చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.  కేంద్ర, రాష్ట్ర పథకాలు అన్నీ వ్యవసాయ, ఆరోగ్య, పోషకాహార రంగాలను అనుసంధానం చేసి అమలు చేస్తే.. దేశంలో ఆహార భద్రతతోపాటు పౌష్టికాహార భద్రత కూడా సాధించవచ్చు.

వ్యాసకర్త: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
మొబైల్‌ : 99890 24579
 

మరిన్ని వార్తలు