యోగి ఆదిత్యనాథ్‌(యూపీ సీఎం) రాయని డైరీ

18 Mar, 2018 01:22 IST|Sakshi
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

మార్చి 14 నుంచి మోదీజీ లైన్‌లోకి రావడం లేదు! గోరఖ్‌పూర్‌ సీటు పోయిన రోజది. ‘‘పోతే పోయిందిలే ఆదిత్యా.. బాధపడకు’’ అంటాడని చూశాను. అనలేదు! వెంటనే అమిత్‌ షాకి చేశాను. ఆయనా ఎత్తలేదు! ఇద్దరూ పక్కపక్కనే ఉండి ఉంటారు.

మోదీజీకి ఫోన్‌ చేసినప్పుడు.. ‘ఎవరు చేస్తున్నారో చూడు’ అని, ఫోన్‌ని అమిత్‌ షాకి చూపించి ఉంటారు మోదీజీ. వెంటనే అమిత్‌ షా కూడా మోదీజీకి తన ఫోన్‌ చూపించి ఉంటారు.. ‘ఇదిగో.. నాక్కూడా చేస్తున్నాడు’ అని! ఇద్దరూ పక్కపక్కనే లేకపోతే కనీసం అమిత్‌  షా అయినా నా ఫోన్‌ లిఫ్ట్‌ చేసేవారేమో! 
ఓడిపోయిన రోజు అమిత్‌ షానే నాకు ఫోన్‌ చేశారు! ‘‘ఇప్పట్లో మోదీజీకి కాల్‌ చెయ్యకు’’ అన్నారు! ‘‘మీకు చెయ్యొచ్చా అమిత్‌జీ’’ అన్నాను. ‘‘నేనూ, మోదీజీ వేర్వేరు అనుకుంటే చెయ్యొచ్చు’’ అన్నారు. 
‘‘సారీ అమిత్‌జీ’’ అన్నాను. 
‘‘దేనికి ‘సారీ’ యోగీ.. గెలవలేకపోయినందుకా?!’’ అన్నారు. 
‘‘కాదు అమిత్‌జీ.. మీరూ, మోదీజీ ఒకటి కాదు అనే అర్థం వచ్చేలా ‘మీకు ఫోన్‌ చెయ్యొచ్చా?’ అని నేను అడిగినందుకు’’ అన్నాను. 
‘‘అంటే.. ఓడిపోయినందుకు నువ్వు సారీ చెప్పడం లేదా యోగీ’’ అన్నారు. 
అమిత్‌ షా మంచి మూడ్‌లో ఉన్నట్లు అర్థమైంది. నాలుగేళ్లుగా చూస్తున్నాను ఆయన్ని. ఎప్పుడూ గెలవని చోట గెలిస్తే డల్‌గా ఉంటాడు. ఎప్పుడూ ఓడిపోని చోట ఓడిపోతే మంచి ఊపులో ఉంటాడు! 
‘‘సారీ అమిత్‌జీ’’ అన్నాను. 
‘‘దేనికి సారీ యోగీ? అన్నారు. 
‘‘ఓడిపోయినందుకే అమిత్‌జీ’’ అన్నాను. 
‘‘ఓడిపోయినందుకు సారీ చెబుతున్నావా యోగీ! గెలవలేకపోయినందుకు సారీ చెప్పాలనిపించడం లేదా?’’ అని ఫోన్‌ పెట్టేశారు! మళ్లీ చేసినా ఎత్తలేదు.
నాలుగు రోజులుగా చేస్తూనే ఉన్నాను. మోదీజీ ఎత్తట్లేదు. అమిత్‌  షా ఎత్తట్లేదు. ఎత్తకపోవడం కాదు. ఎంగేజ్‌ వస్తోంది. మోదీజీ ఫోన్‌ ఎంగేజ్‌. అమిత్‌ షా ఫోన్‌ ఎంగేజ్‌. ఎత్తకుండా ఉండటానికి ఎంగేజ్‌లో పెట్టుకునే ఆప్షన్‌ ఏదో ఉన్నట్లుంది!
ఈ రోజు మార్చి 18. మోదీజీ నన్ను సీఎంని చేసిన రోజు. రేపు మార్చి 19. గవర్నర్‌ చేత మోదీజీ నాకు ప్రమాణస్వీకారం చేయించిన రోజు. థ్యాంక్స్‌ చెప్దామంటే చాన్స్‌ ఇవ్వడం లేదు మోదీజీ, అమిత్‌ షా.
కేశవ్‌ ప్రసాద్‌కి ఫోన్‌ చేశాను. ఎంగేజ్‌! దినేశ్‌ శర్మకి ఫోన్‌ చేశాను. ఎంగేజ్‌! ఇద్దరూ నా డిప్యూటీలు. 
‘‘ఎవరితో మాట్లాడుతున్నారయ్యా ఇంతసేపు!’’ అని అడిగాను లైన్‌లోకి వచ్చినప్పుడు. 
‘‘మోదీజీ లైన్‌లో ఉన్నారు ఆదిత్యాజీ’’ అన్నారు!
కేశవ్‌ ప్రసాద్‌ అదే మాట చెప్పాడు. దినేశ్‌ శర్మా అదే మాట చెప్పాడు!

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు