వీరులూ.. విదూషకులూ!

3 May, 2020 00:04 IST|Sakshi

జనతంత్రం

కళ్లకు గంతలు కట్టారు.
   తిమ్మిని బమ్మిని చేశారు. రాళ్లను రత్నాలన్నారు. ఆయన ఆలోచనలు అద్భుతం అన్నారు. తనంతవారిక లేరండీ అన్నారు. పత్రికలు ఊదరగొట్టాయి. టీవీలు భజన్స్‌ వినిపించాయి. ఆయన ఇరవయ్యేళ్లు ముందుగానే ఆలోచిస్తారని మీడియా అబ్బురపడింది. సదరు మీడియా పాతికేళ్లుగా అబ్బుర పడుతూనే ఉంది. ప్రజలందరూ కూడా తనలాగే బేషరతుగా అబ్బుర పడాలని ఆ మీడియా నిరంతరాయంగా డిమాండ్‌ చేస్తూ వస్తు న్నది. పెంపుడు మీడియా కోరిక మేరకు తన దగ్గరున్న కాలజ్ఞాన భూతద్దంలోంచి ఆయన ఒక ఇరవయ్యేళ్లు ముందుకు లుక్కే శారు. ఇదీ నా విజన్‌ అని ప్రకటించారు. పెంపుడు మీడియా ‘ట్వంటీ ట్వంటీ’ అని కోరస్‌ పాడింది. ‘అన్న విజిలేస్తే...’ అన్న స్టయిల్‌లో ‘ఆయన విజనేస్తే...’ అంటూ దరువేసింది కూడా.

ఆ విజన్‌ ట్వంటీ ట్వంటీని కళ్లతో చూచిననూ, చేతులతో తాకి ననూ, చెవులతో విన్ననూ జన్మ చరితార్థమవుతుందని పచ్చ మీడియా ప్రమాణ పూర్తిగా హామీ పడింది. ట్వంటీ ట్వంటీ రానే వచ్చింది. తనవెంట ఓ మహమ్మారిని కూడా తీసుకొని వచ్చింది. దీని ప్రస్తావన మన విజన్‌లో లేదు. ఇప్పుడాయన అధికారంలో కూడా లేరు. అయిననూ... విజనరీ కదా! ఆయనేమంటారో... ‘ఆయనుంటేనా, ఆయనుంటేనా’ అని పెంపుడు మీడియా టీజర్లు వదిలింది. ఆయన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు భౌతిక దూరం పాటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జూబిలీ హిల్స్‌లోని సొంత ప్రాసాదంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చకచకగా పూర్త య్యాయి. ఏం చెబుతారో? విజనరీ కదా!

అభిమానులు చూస్తున్నారు. ఆయన ప్రారంభించారు. ‘ఇది చాలా ప్రమాదకరమైన వైరస్‌’ అని ప్రకటించారు. ప్రజలందరూ భౌతికదూరం పాటించాలని పిలుపునిచ్చారు. కొత్త విషయం కాకున్నా మంచి విషయమే కదా. సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించారు. అప్పటికే చాలామంది చెప్పారు. కనీసం ఐదారువేలమంది. చివరగా జనతా కర్ఫ్యూకు మద్దతు నీయాలని కోరుతూ ముగించారు. విజన్‌ బయటకు రాలేదు. కేడర్‌లో ఒకింత నిరాశ. ఆ తదుపరి రోజు నుంచి మీడియా సమావేశాన్ని దినసరి కార్యక్రమంగా మార్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అస్సలు పనిచేయడం లేదనీ, కరోనా విజృంభి స్తున్నదని, ఇలాగే వుంటే పరిస్థితి అదుపుతప్పడం ఖాయమనీ, అందుకోసమే ఎదురుచూస్తున్నంత ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. గ్రామ వలంటీర్ల ద్వారా పెన్షన్‌ డబ్బులను అందజేస్తుంటే ఆయన గదమాయించారు.

వలంటీర్ల ద్వారా కరోనా వ్యాప్తి చేస్తున్నారంటూ కసురుకున్నారు. ఉచిత రేషన్‌ సరుకులను అందజేయడం కోసం ప్రజలకు టైమ్‌ స్లాట్స్‌ కేటాయించి భౌతికదూరం పాటించేలా చూస్తూ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక్కడాయన రివర్స్‌ వైఖరి తీసుకున్నారు. ఏం మీ వలంటీర్లు ఏం చేస్తున్నారు. ప్రజలొచ్చి తీసుకోవడం ఏమిటంటూ ప్రభు త్వంపై విమర్శలు కురిపించారు. ఆయన థియరీ ప్రకారం వలంటీర్లు పెన్షన్‌ ఇవ్వడానికి ఇంటికి వెళ్లొద్దు. సరుకులు ఇవ్వడానికి మాత్రం ఇంటికే వెళ్లాలి. ఇందులో లాజిక్‌ ఏమిటని అడగొద్దు. రసపట్టులో తర్కం కూడదంటాడు మాయాబజార్‌లో శ్రీకృష్ణుడు. రాజకీయంలో కూడా తర్కం కూడదనేది మన విజనరీ నేత ఫిలాసఫీ. అందువల్ల తర్కరహితమైన లేదా కుతర్కపూరితమైన విమర్శలను మండల దీక్ష బూనినంత నిష్టగా గత నలభై రోజుల నుంచి ఆయన సంధిస్తున్నారు. మధ్యలో మన నాయకుని ముఖ్య అనుచరులకు ఒక బ్రిలి యంట్‌ ఐడియా వచ్చింది. కరోనా వైరస్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఆవలకు తరిమికొట్టే ‘క్రిమివ్యూహ’ ఛేదనా విద్య ఆయన కొక్కరికే తెలుసు కనుక ఒక వారం రోజులపాటు సీఎం కుర్చీ అప్పగించాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.

సీనియర్‌ అర్జున్‌ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమా స్టోరీ లైన్‌ అది. ఆ సినిమా అంటే ఒకరకమైన అబ్సేషన్‌ ఆయనకు. తాను రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఆ సినిమా వచ్చింది. సినిమాలో ముఖ్యమంత్రి క్షేత్ర పర్యటనలు చేస్తూ పనిలో అలసత్వం చూపే అధికారులను మీడియా సమక్షంలో నిలదీ స్తుంటాడు. నిజజీవిత ముఖ్యమంత్రిగా అర్జున్‌ను మించి నటించాలన్న కోరిక ఈయనకు కలిగింది. అత్తవారి తరపున అందరూ నటులు కావడం కూడా ఆ కోరికకు కారణం కావచ్చు. పైపెచ్చు మహానటుడు ఎన్టీ రామారావు చనిపోవడానికి ముందు ‘నమ్మించి గొంతుకోసే గొప్ప నటుడు’ అనే కితాబును కూడా ఇచ్చి వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటన శిఖ రాగ్రాలకు చేరుకొని యంత్రాంగాన్ని నిలదీసే లక్ష్మణరేఖను దాటి నిందించే స్థాయికి వెళ్లిపోయింది. ఈ ఘటనలు ఆయనను ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అపఖ్యాతి పాలుచేశాయి. ఇటువంటి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన సినిమా కథను పార్టీ నేతలు ముందుకు తేవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీన్‌ కట్‌ చేస్తే, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో భారత సంతతికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్‌ శెట్టి. ఆయన దాదాపు 80 బ్యాంకులకు ఇండియన్‌ కరెన్సీలో సుమారు 45 వేల కోట్ల రూపాయలను ఎగవేసి దేశం నుంచి ఉడాయించాడు. అతని పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేసే కార్యక్రమం మొదలైంది. ఆ ఫలానా శెట్టి గారికి విజనరీ నేత అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలో 100 ఎకరాల భూమిని చౌకగా కట్టబె ట్టారు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మురికి డీల్‌ రద్దయింది. సదరు శెట్టి వ్యాపార రహస్యాలేమిటి? ఆయ నకు ఎవరెవరితో ఎటువంటి సంబంధాలున్నాయనే విచారణ సహజంగానే ప్రారంభమవుతుంది. మన అమరావతి తీగకూ, దుబాయ్‌ డొంకకూ ఒకవేళ ఏదైనా సంబంధం వుంటే అదీ ముంచుకొస్తుంది. శెట్టిగారి వ్యాపార బండారం, మనవారి ‘వారం కుర్చీ’ కోరిక ఒకదాని తర్వాత ఒకటి రావడంలో అనేక మందికి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. కేవలం తాము వాదన కోసమే కుర్చీ అడిగామనీ, దానివెనుక ఎటువంటి దురుద్దేశాలు లేవనీ శెట్టిగారి మీద ఒట్టేసి చెబితే వారి పిచ్చి డిమాండ్‌ నవ్వుకోవడానికి పనికి వస్తుంది. లేకుంటే అనుమా నించవలసి వస్తుంది.

కరోనా సంక్షోభ సమయంలో తమ నాయకుడిలో దాక్కొని వున్న విజనరీ బయటకు ఎప్పుడు వస్తాడోనని ఎదురు చూస్తున్నారు కేడర్‌. ఆరోజు రానే వచ్చింది. రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాజిటివ్‌ కేసుల ప్రాతిపదికగా రాష్ట్రంలోని మండలాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ అనే మూడు జోన్లుగా విభజించినట్టు తెలిపారు. మరుసటి రోజు కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా కేసుల ఆధారంగా దేశంలోని జిల్లాలను పైన పేర్కొన్న మూడు జోన్లుగా విభజించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భౌగోళికంగానూ, జనాభాపరం గానూ ఆంధ్రప్రదేశ్‌ జిల్లాలు పెద్దవి కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జిల్లాలను కాకుండా మండలాలను వర్గీకరించింది. కేంద్రం జిల్లాలుగా ప్రకటించింది. అంతే తేడా. కేంద్ర ప్రకటన రాగానే ఆగమేఘాలమీద మన విజనరీ మీడియాను పిలిచారు.

ప్రధానమంత్రికి జోన్ల సలహా తానే ఇచ్చినట్టు చెప్పుకున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో, ఏ హోదాలో... ఇత్యాది ప్రశ్నలకు తావు లేదు. అనగనగా ఒకరోజు ఒక కార్డు ముక్క రాసి పడేసినట్టు మాత్రం చెప్పారు. ఆయన ఆ తర్వాత కేంద్ర మంత్రులకూ, అధికారులకూ లేఖలు రాశారు. మీడియాకు విడుదల చేశారు. ముఖ్యమంత్రికీ, రాష్ట్ర అధికారులకూ లేఖలు రాశారు. మీడియాకు విడుదల చేశారు. ఐదుకోట్ల మంది ప్రజలకు టోకున ఒకే ఉత్తరం రాసి కూడా మీడియాకు విడుదల చేశారు. కానీ, ప్రధానమంత్రికి అప్పుడెప్పుడో రాసిన సలహా ఉత్తరాన్ని ఎందుకు ప్రకటించుకోలేదో మాత్రం ఆయన చెప్పనేలేదు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం పెను సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటికీ దానికి వైద్యం లేదు. వ్యాక్సిన్‌ లేదు. ఇది యథార్థం. కనుక దానితోనే కలిసి జీవించవలసిన అనివార్యత మానవ సమాజం ముందున్నది. అటువంటి జీవన దశను ప్రపంచవ్యాప్తంగా ‘న్యూ నార్మల్‌’ అంటున్నారు. నయా దునియా. కొత్త జీవితం. దీనికి వ్యాక్సిన్‌ లభించినా మరో ప్రమాదకరమైన వైరస్‌ దండెత్తబోదనే గ్యారంటీ ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘కరోనాతో కలిసి జీవించవలసిన పరిస్థితిలో ఉన్నాము. అంతమాత్రాన జీవితమంతా నాశనమైపోయిందని చింతించనవసరం లేదు, వచ్చినా జ్వరం మాదిరిగా వస్తుంది, పోతుంది. మందులు తీసు కుంటే చాలు. ఇమ్యూనిటీని పెంచుకోవాలి. కరోనా వచ్చిన వాళ్ల పట్ల ఎటువంటి వివక్షా చూపకండి’ అని చెప్పారు. అది నిజం. ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనం ప్రకారం నూటికి 81 మందికి కరోనా సోకినట్లు కూడా తెలియడం లేదు.

ఏ మందులూ వాడకుండానే వెళ్లిపోతున్నది. మిగిలిన వాళ్లలో 15 శాతం మందికి ఇంట్లో జాగ్రత్తగా వుండి మందులు తీసుకుంటేనే సరిపోతున్నది. మరో నాలుగైదు శాతంమందిపైనే ఇది తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నది. ఎక్కువగా వయోవృద్ధులూ, ఇతరత్రా జబ్బులున్న వారిపైనే దాని ప్రతాపం కనబడుతున్నది. ఈ దుస్థితిలో విజ్ఞులెవరైనా ఏం చెబుతారు. వైఎస్‌ జగన్‌ ప్రసంగం పూర్తికాగానే ‘విజన్‌ ట్వంటీ ట్వంటీ’ స్పందించారు. ‘కరోనాతో కలిసి జీవించాలంటున్న వ్యక్తి గురించి ఏం చెప్ప గలను? ఇక ఆంధ్రప్రదేశ్‌ను దేవుడే కాపాడాలంటూ’ ట్వీట్‌ చేశాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. గడిచిన నాలుగైదు రోజు లుగా ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానవేత్తలూ, ప్రముఖులూ సహ జీవనానికి సిద్ధపడాలని ప్రజలకు బోధిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ మాటే చెప్పింది.

అందులో చీఫ్‌ సైంటిస్టుగా పనిచేస్తున్న సౌమ్యా స్వామినా«థన్‌ అదే మాట అన్నారు. రఘురామ్‌రాజన్, నారాయణమూర్తిల సారాంశం అదే. మోదీ మాట అదే. మరో ఆరు నెలలకో అంతకంటే ముందుగానో ఏదో ఒక ఎల్లో మీడియాలో ఒక వార్తో వ్యాఖ్యో వస్తుంది. కరోనాతో కలిసి సహజీవనం సాగించక తప్పదనీ, అందువలన లాక్‌ డౌన్‌ను సడలించాలని మన విజనరీ నేతే ప్రధానికి సలహా ఇచ్చాడని అందులో ఉంటుంది. ఆయన మెడలో మరో వీర తాడును ఎల్లో మీడియా వేస్తుంది. కానీ, ఎంత ప్రయత్నించినా ప్రజలకు తెలిసిపోతూనే ఉన్నది. అవి మీడియా తగిలించిన భుజకీర్తులే తప్ప నిజకీర్తులు కావని స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఈ సంక్షోభాల వలన ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిలో కూడా ఒక సుగుణం ఉంది. వీరుడెవరో... విదూషకుడెవరో నిగ్గు తేల్చే సత్తా సంక్షోభాలకు ఉన్నది.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు