ఇతిహాసపు వెలుతురు కోణం

10 May, 2020 00:24 IST|Sakshi

జనతంత్రం

ఈ కాక్‌టెయిల్‌ కిక్కే వేరప్పా!
హిస్టరీలో ఎకనామిక్స్‌ను మిక్స్‌ చేసి, మ్యాథమెటిక్స్‌ గుణ కారాలతో గార్నిష్‌ చేసుకొని కొంచెం కొంచెం సిప్‌ చేస్తుంటే కలిగే వ్యక్తావ్యక్త అనుభూతులు... వెన్నెల సముద్రాల్లో స్విమ్మింగ్‌ చేస్తు న్నట్టు, చందమామ మీద నిద్రపోతున్నట్టు... అదో అద్భుత ప్రపంచం.

ఆంగస్‌ మాడిసన్‌ అందుకే అంతగా అడిక్టయ్యాడు. మాడి సన్‌ బ్రిటిష్‌ ఆర్థిక చరిత్రకారుడు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నుంచి వేరువేరు కాలాల్లో ప్రపంచ దేశాల స్థూల జాతీయో త్పత్తుల (జీడీపీ)ను లెక్కగట్టిన ఘనత ఆయనది. వివిధ కరె న్సీల తులనాత్మక మారకపు విలువల ఆధారంగా డాలర్లలో ఆయా దేశాల జీడీపీలను లెక్కకట్టడానికి ఆయన ఉపయోగిం చిన సూత్రానికి ఆర్థికవేత్తల  ఆమోదం లభించింది. ఆయన లెక్క ప్రకారం సరిగ్గా వెయ్యి సంవత్సరాల కింద ప్రపంచ దేశాల ఉమ్మడి జీడీపీలో ఇండియా, చైనాల వాటా 50.5 శాతం. క్రీస్తుశకం 1600 నాటికి ఈ వాటాను 51.4 శాతంగా మాడిసన్‌ తేల్చారు.

ఇందులో చైనాది 29 శాతం. భారత్‌ భాగం 22.4 శాతం. ఆ తర్వాత నుంచి రెండు దేశాల ఆర్థిక తిరోగమనం ప్రారంభమైంది. మళ్లీ ఇప్పటివరకూ ఆనాటి స్థాయి రెండు దేశా లనూ ఊరిస్తూనే ఉన్నది. 1500 నుంచి 1600 మధ్యకాలంలో ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండు పెద్ద నగరాలు ఈ రెండు దేశాల్లో ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలు (1509–1529) కాలంలో విజయనగరం పట్టణ జనాభా ఐదు లక్షలతో రెండో స్థానంలో ఉంటే, మింగ్‌ వంశ పాలనలో రాజధానిగా బీజింగ్‌ ఆరు లక్షల పైచిలుకు జనాభాతో అగ్రస్థానంలో ఉండేది. విజయ నగర సామ్రాజ్య పతనం తర్వాత ఐదు దశాబ్దాలకు మళ్లీ ప్రపం చంలో జనాభాపరంగా రెండో పెద్ద పట్టణం హోదా ఢిల్లీకి ఇప్పుడు దక్కింది.

ఆ శతాబ్దం చివరి రోజుల్లో గోల్కొండ రాజ్యంలో లభించే అత్యంత విలువైన వజ్రాలు, మేలిమి ముత్యాలకోసం ప్రపంచం మొత్తం నుంచి వచ్చే యాత్రికులు, వ్యాపారుల రద్దీని గోల్కొండ పట్టణం తట్టుకోలేకపోవడంతో హైదరాబాద్‌ నగర నిర్మాణం ప్రారంభమైంది. వైభవ దశలో ఉన్నప్పుడు విజయనగరం వీధుల్లో రాశులుగా పోసిన రత్నా లను కొనుగోలు చేయడానికి కూడా పెద్దఎత్తున యాత్రికులు వచ్చేవారు. ఉత్తర భారతదేశంలో అక్బర్‌ పాదుషా పాలనలో రాజకీయ సుస్థిరత నెలకొన్నది. కృష్ణా తీరంలో దొరికిన జగత్‌ ప్రసిద్ధమైన కోహినూర్‌ వజ్రం మొఘల్‌ చక్రవర్తుల మకుటాన్ని అలంకరించింది. ఈ పరిణామాలన్నీ ఆంగస్‌ మాడిసన్‌ జీడీపీ లెక్కల్లో ప్రతిబింబించాయి.

బ్రిటిష్‌ వలస పాలన ఫలితంగానే ఇన్ని శతాబ్దాలు గడిచినా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో మునుపటి స్థానంవైపు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నామని మన ఆర్థికవేత్తలు ఇప్పటికీ సాక్ష్యాలతో నిరూపిస్తున్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ నుంచి వలస పాలన పగ్గాలను బ్రిటిష్‌ సింహాసనం ప్రత్యక్షంగా చేతుల్లోకి తీసుకున్న తొలిరోజుల్లోనే ‘గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన దాదాభాయ్‌ నౌరోజీ వారి దోపి డీని నిరూపిస్తూ ‘పావర్టీ అండ్‌ అన్‌బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ఆయన చేసిన విశ్లేషణ ‘డ్రెయిన్‌ ఆఫ్‌ వెల్త్‌’ థియరీగా ప్రసిద్ధిగాంచింది.

ఈ సిద్ధాంతాన్ని మరింత ప్రామాణికంగా సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ, ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్‌ రాసిన వ్యాసాలను రెండేళ్ల కిందట కొలంబియా యూనివర్సిటీ ప్రచురించింది. 1765 నుంచి 1938 మధ్యకాలంలో భారతీయులు చెల్లించిన పన్నులు, విదేశీ వర్తక వాణిజ్యాల లెక్కల ఆధారంగా ఆమె తన వ్యాసాలను రూపొం దించారు. 173 సంవత్సరాల కాలంలో 45 ట్రిలియన్‌ డాలర్ల విలువైన భారతీయుల సంపదను బ్రిటిషర్లు కొల్లగొట్టారని ఆమె  నిరూపించారు.

అంటే 45 లక్షల కోట్ల డాలర్లు. దీన్ని రూపా యల్లోకి మార్చి చెప్పాలంటే 45 లక్షల కోట్లను డాలర్‌ మారకపు విలువైన రూ. 75తో హెచ్చవేయాలి. ఆ వచ్చే విలువ సగటు మనుషుల ఊహలకు అందనిది. ఇప్పటి ద్రవ్యోల్బణం లెక్క లతో పోల్చి చూసుకుంటే బహుశా మన ప్రస్తుత వార్షిక జీడీపీతో సమానమైన మొత్తాన్ని బ్రిటిష్‌ వాళ్లు ప్రతియేటా తరలించుకు పోయి ఉంటారు. ఒక సంపన్న దేశం పేద దేశంగా మిగిలిపోవ డానికి ప్రధాన కారణం ఇప్పుడు సశాస్త్రీయంగా బోధపడింది.

తాజా లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల మొత్తం జీడీపీలో మన దేశం వాటా 4.7 శాతం. మాడిసన్‌ లెక్క ప్రకారం మన ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ 22.4 శాతం. దాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న దూకుడు ఐదింతలు పెరగాలి. కనీసం రెండింతలైనా దూకాల నేది తన కలగా ప్రధానమంత్రి మోదీ గత ఐదేళ్లుగా చెప్పుకొస్తు న్నారు. ఆ కల నెరవేరే అవకాశాన్ని కరోనా సంక్షోభం మనకు ప్రసాదించిందనే అభిప్రాయం ఆర్థికవేత్తల్లో ఇప్పుడు వ్యక్తమవు తున్నది. కరోనా కారణంగా దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కనీసం రెండు నెలలపాటు లాక్‌డౌన్‌లో ఉండిపోవలసి వచ్చింది. ఆర్థిక చక్రాలన్నీ ఆగిపోయాయి. అందరి బ్యాంక్‌ అకౌంట్లూ బ్యాలెన్స్‌ జీరో.

కనుక ఇప్పుడు పరుగెత్తడానికి అందరికీ సమాన అవకాశాలున్నాయనే వాదన ఒకటి ముందుకు వచ్చింది. ఆ వాదన ప్రకారం బడా వ్యాపారి ముకేశ్‌ అంబానీకీ, భోనగిరి బజ్జీల వ్యాపారి మల్లేశ్‌కు కూడా కొత్తగా పరిగెత్తడానికి అవకాశం వుంది. కానీ, పూర్వాశ్రమంలో ఇద్దరి అనుభవాల మధ్యన వైరుధ్యం ఉన్నది. హైవే మీద రెండు మూడు పెద్ద హోటళ్ల భారీ విస్తరణ కారణంగా మల్లేశ్‌ బజ్జీల బండి చితికిపోయింది.

కానీ, ముకేశ్‌ అంబానీ ఏ వ్యాపారంలో ప్రవేశించినా, అక్కడ ముందు నుంచీ పోటీదారులుగా వున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలన్నీ దెబ్బతిని చేతులెత్తేశాయి. అంటే చినచేపను పెదచేప, పెద చేపను పెనుచేప తినేస్తున్నాయి. కరోనా అనంతరం సరికొత్త పరుగు పందెంలో కూడా ఇదే వ్యాపార నీతి ఉంటుందా, లేక మారుతుందా అనేదే మల్లేశ్‌ వంటి వ్యాపారులకు ప్రధాన సమస్య. ఇదే సూత్రం దేశాలకు కూడా వర్తిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడు స్తంభాలు ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. అవి చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌. స్థూల అంతర్జాతీయ ఉత్పత్తిలో యాభై శాతానికి పైగా ఈ దేశాలదే. విడిగా చూస్తే ఇండియా వాటా ఐదు శాతం లోపే. అదేవిధంగా ఆర్థిక రంగంలో డైనమిక్‌గా కనిపిస్తున్న ఏసియాన్‌ (ఆగ్నేయాసియా దేశాలకు) దేశాల సమష్టి వాటా కూడా ఇండియాతో సమానంగా ఐదు శాతం లోపే. ఈ రెండు కలిస్తే ఐదు ప్లస్‌ ఐదు అవుతుంది. ఇది గణితం. ఏసియాన్‌ కూటమితో భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరస్పర వ్యాపార సహకారాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, వీటి ఉమ్మడి వాటా ఐదూ ఇంటూ ఐదు అవుతుంది.

ఇది ఆర్థికం. ఎందుకంటే అటువంటి స్థితిలో భారత్‌ చిన్న చేపగా వుండదు. పెదచేప అవు తుంది. మూడు పెదచేపల్లో ఒకదానిని మింగేస్తుంది. ముందుగా ‘ఈయూ’ చేపను. ఐఎమ్‌ఎఫ్‌ ముందస్తు అంచనాల ప్రకారం 2020లో ‘ఈయూ’ 7.5 శాతం తిరోగమన వృద్ధిలోకి జారి పోతుంది. ఆ తదుపరి సంవత్సరం (2021) 4.7 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేస్తుంది. అదే అంచనాల మేరకు 2020లో భారత్‌ 1.9 శాతం వృద్ధిరేటు సాధిస్తుంది. తదుపరి సంవత్సరం 7.4 శాతం పాజిటివ్‌. ఏసియాన్‌ దేశాలపై కూడా ఇదేరకమైన అంచనా వున్నది. అందువల్ల ఏసియాన్‌తో కూడిన భారత్‌ ఇప్పు డున్న మూడు స్తంభాల్లో ఈయూ స్తంభాన్ని తొలగించి, ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశముంటుంది.

నరేంద్రమోదీ కలలు కంటున్నట్టు ఒక ప్రబల ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదగడానికి పోస్ట్‌–కరోనా అవకాశాల నేపథ్యంలో ఆర్థిక నిపుణులు మూడు సూచనలు చేస్తున్నారు. ఒకటి: ఏసియాన్, సార్క్‌ కూటములతో జట్టుకట్టడం. రెండు: అమెరికాతో ఇప్పటి లాగానే సన్నిహిత సంబంధాలను కొనసాగించడం. మూడు: కరోనా విషయంలో చైనా వ్యవహారశైలిపై ఆగ్రహంతో వున్న బహుళజాతి కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అక్కడినుంచి తరలిం చాలనుకుంటే భారత్‌ను అందుకు సరైన వేదికగా సిద్ధం చేయడం. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. కరోనాను ఎదుర్కొనే విష యంలో పొరుగు దేశాల అధినేతలతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. సౌహార్దత పునరుద్ధరణ ప్రయ త్నాలు మొదలుపెట్టారు.

ఇప్పటికే అనుసరిస్తున్న ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానం వల్ల ఏసియాన్‌ దేశాలు దగ్గరయ్యాయి. అమెరికాతో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం నడుస్తూనే వున్నది. చైనా నుంచి తరలించబోయే వస్తు తయారీరంగ పరిశ్రమలకోసం ప్రధాని ప్రవచించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ విధానం ఉండనే ఉన్నది. ఈ విధానానికి అనుగుణంగా కార్మిక చట్టాలను సవరించే పనులను బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రారంభించాయి. ఇకపై ఎనిమిది గంటల పని చట్టం ఉండకపోవచ్చు. పన్నెండు గంటలు పని చేయవలసి రావచ్చు. అందుకోసం జపాన్‌ దేశభక్తిని ఆదర్శంగా తీసుకోండని బోధించవచ్చు.

పని గంటల తగ్గింపుకోసం చికాగో కార్మికులు చేసిన పోరాటం, వారి రక్తంలో తడిసి ఎగిరిన ఎర్రని జెండా, అప్పుడు పుట్టిన మే దినోత్సవం ఇక నిషేధిత పదాలు కావచ్చు. పారిస్‌ కమ్యూన్, అక్టోబర్‌ విప్లవం, లాంగ్‌ మార్చ్‌లు భ్రష్ట శబ్దాలుగా మారిపోవచ్చు. ఇటువంటి స్థితినే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అంటాము. మన ఆర్థిక అభివృద్ధి లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రభుత్వం ఈ మార్గాన్ని అనుసరించవచ్చు. ఇందుకు మరో ప్రత్యామ్నాయం లేదా? ఎందుకు లేదు.

మన చరిత్ర వెలుతురు కోణం చూపిన మార్గం ఉండనే ఉన్నది. అదే మేడిన్‌ ఇండియా. మన చేనేత కళాకారులు ఉత్పత్తి చేసిన వస్త్రాలతోనే, మన రైతన్నలు పండించిన ఆహార ధాన్యాలు, సుగంధ ద్రవ్యా లతోనే, మన స్వర్ణాభరణ కళాకారులు మెరిపించిన వజ్ర వైఢూ ర్యాలతోనే ప్రపంచ వాణిజ్యాన్ని శాసించిన అనుభవం భారత్‌కు ఉన్నది. ప్రొఫెసర్‌ ఉత్సా పట్నాయక్‌ అధ్యయనంలోనే వెల్లడైన మరో అంశం 1929కి ముందు వరుసగా 30 సంవత్సరాలపాటు జరిగిన ఎగుమతి దిగుమతుల్లో ఏయేడూ భారత్‌ లోటు అనేది ఎరుగలేదు. అదే మన మానవ వనరుల ప్రతిభ. ఇప్పటికీ నైపుణ్యం కలిగిన మానవ వనరులు మనకు విస్తారంగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మరింత మెరుగు పెడితే ఖండాంతరాల్లో ఎక్కడయినా రాణిస్తారనడానికి నేటి రవి అస్తమించని భారతీయతే ప్రబల సాక్ష్యం.

భారతీ యులు లేని దేశం ప్రస్తుతం భూఖండంలో లేదు. చీకటి వాలని సూర్యతేజంతో ప్రతి క్షణం భారతీయత ప్రకాశిస్తూనే ఉన్నది. మన నైపుణ్యం మీద నమ్మకం వుంచి, మన సంప్రదాయ బలాన్ని నమ్ముకుంటే ‘మేడిన్‌ ఇండియా కూడా’ ఇప్పటికీ లక్ష్యం చేరే మార్గమే. అయితే చేరవలసిన గమ్యం చాలా దూరం ఉన్నది. రెండు దారులున్నాయి. అటు చూస్తే గాంధీ మోడల్‌ను గుర్తుకు తెచ్చే ‘మేడిన్‌ ఇండియా’. ఇటు చూస్తే నయా ఆర్ధిక విధానాలతో కలిసి నడిచే ‘మేకిన్‌ ఇండియా’. అటో ఇటో...ఏదో ఒకవైపు పయనం మాత్రం ఆగొద్దు.
-వర్ధెల్లి మురళి

muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు