దిగుడుబావి జాతీయోద్యమం!

25 Aug, 2019 03:18 IST|Sakshi

జనతంత్రం 

తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ... ఈ మధ్యకాలంలో తామర పువ్వుల చెరువులు తెప్పలు తెప్పలుగా నిండిపోతున్నాయి. వాగుల్లోంచి, వంకల్లోంచి ప్రవహిస్తూ చెరువుల తెప్పలపైకి వేలు, లక్షల సంఖ్యలో కప్పలు కూడా చేరుకున్నాయి. అలాంటి ఓ చెరువుకట్ట పక్కన ఓ పాడుబడిన దిగుడుబావి. ఊటలు ఎండిపోయి బావి అడుగంటుతోంది. ఉన్న కొద్దిపాటి నిలువ నీరు పచ్చబారి ఆక్సిజన్‌ అందడం లేదు. బతుకు దెరువుకోసం కప్పలన్నీ వాటి నాయకుడి ఆధ్వర్యంలో చెరువు కట్టపైకి చేరుకున్నాయి. తుప్పల్లో దాక్కొని చూస్తున్నాయి. నెమ్మదిగా చెరువు నిండుతోంది. ఇక చెరువులో దూకాలి. కానీ, దిగుడుబావి కప్పనాయకుడికి చిన్న మొహమాటం. గతంలో ఒళ్లు మరిచిన ఆవేశంలో చెలరేగిపోయి చెరువును నానాతిట్లు తిట్టాడు. ‘చెరువెంత? దాని బతుకెంత... నా దిగుడుబావి ముందు దిగదుడుపే’నని సవాళ్లు కూడా విసిరాడు. అవన్నీ మనసులో పెట్టుకుని చెరువు తననేం చేస్తుందోనని భయం. కాస్త ఆలోచించి, నమ్మకమైన అనుచర కప్పల్ని ముందుగా దూకేయమన్నాడు. అవి దూకేశాయి. పొగడ్తలతో చెరువును మచ్చిక చేసుకుని తమ నాయకుడికి ప్రవేశార్హత సంపాదించడం వాటి తక్షణ కర్తవ్యం. చెరువులో వుండే కప్పలన్నీ ఆశ్రయం కల్పించినందుకు ఆ చెరువును కీర్తించడం, పాటలు పాడటం సహజమే. కానీ, వాటి బెకబెకలకు ఒక శ్రుతి వుంటుంది, ఒక లయ వుంటుంది. దిగుడు బావి కప్పలకు చెరువు కట్టుబాట్లు, చెరువు సంగీతం తెలియదు. వెంటనే చెరువు దృష్టిని ఆకర్షించి తమ నాయకుడికి రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కర్ణాటక సంగీతం కూడా కనిపెట్టని ఒక కర్ణకఠోర రాగాన్ని అందుకున్నాయి. 

తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే బీజేపీలోకి దూకేసిన నాయకులదీ సరిగ్గా ఇదే పరిస్థితి. ఇకముందు దూకబోయే వారిది కూడా ఈ కర్తవ్య నిర్వహణే. బీజేపీ మూల సిద్ధాంతం ‘హిందూ జాతీయవాదం’ అంటారు గనక, ఆ వాదంలో గండరగండడుల్లా కనిపించాలన్న తాపత్రయం ఈ బీజేపీ ‘తెలుగు’ బ్యాచ్‌కు ఎక్కువైంది. ‘కొత్త భక్తుడికి బొట్లెక్కువ’ అంటారు. ఈ ‘తెలుగు – బీజేపీ బృందానికి ట్వీట్లెక్కువ. కాషాయ కండువా కప్పుకోవడం వల్ల ఎవరు హిందువో, ఎవరు హిందూ వ్యతిరేకో తేల్చుతూ ధృవపత్రాలు జారీ చేసే అధికారం తమకు సంక్రమించినట్టుగా ఈ ‘నయా హిందూ జాతీయవాద’ బృందం భావిస్తున్నట్టు కనపడుతున్నది. తమ పాతనాయకుడికి ప్రత్యర్థి వర్గాలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా ద్వారా ధృవపత్రాల జారీ కార్యక్రమాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. కాంట్రాక్టులు, టెండర్లూ తప్ప మరేమీ తెలియని నాయకుడు కూడా ఆచార, సంప్రదాయాలను ఉటంకిస్తూ ట్వీట్‌ చేయడాన్ని చూసి, పూజారులు, పురోహితులు కూడా సిగ్గుపడాల్సి వచ్చింది.

‘ఆయన గుడికి వచ్చాడుగానీ గంట కొట్టలేదు – హిందూ వ్యతిరేకి’, ‘ఆవిడ టెంకాయ కొట్టడం మరిచిపో యింది – హిందూ వ్యతిరేకి’, ‘ఆ పిల్లోడు హుండీలో కానుక వేయలేదు – హిందూ వ్యతిరేకి’ – ఇలా సాగుతోంది తెలుగు – బీజేపీ నేతల ధృవపత్రాల జారీ కార్యక్రమం. వారి పాత నాయకుడు రూపొందించిన ఒక ప్రణాళిక ప్రచారం ఒక లక్ష్యంకోసం ఈ బృందం చేపడుతున్న కార్యక్రమాలను బీజేపీ శ్రేణులు కనిపెట్టకుండా వారితోనే జతకలిసిపోతే అంతిమంగా నష్టం జరిగేది బీజేపీకే. ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం అంశాన్నే తీసుకుందాం. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగానే, చాలామంది తెలుగు ప్రజలకు ఇదంతా గతంలో ఎక్కడో విన్నట్టుగా, ఏ చిత్రంలోనో చూసినట్టుగా అనిపించింది. అనగనగా ఒక కలవారి ఇల్లు. ఆ ఇంటికి ఓ గుణవంతురాలు పెద్దకోడలుగా వస్తుంది.  అత్తమామల మెప్పు పొందుతుంది. కోడలి దక్షతను మెచ్చి అత్తగారు బీరువా తాళాల గుత్తి కోడలికి అప్పగించి, తాను భాగవతం చదువుకోవడం మొదలుపెడుతుంది. ఎప్పటినుంచో ఆ ఇంటిపై ఆధారపడి బతుకుతున్న ఆశ్రిత బంధువులకు ఈ వ్యవహారం నచ్చదు. కుట్ర చేస్తారు. ఏదో అవసరంకోసం కొద్దిరోజుల ముందు మామగారు డబ్బు తెచ్చి బీరువాలో పెట్టి ఉంచుతారు. ఆ డబ్బును ఆశ్రిత బంధువర్గం చాకచక్యంగా అపహరించి కోడలి గదిలో, ఆమె పెట్టెలోనే రహస్యంగా పెట్టేస్తారు. ఒకరోజు మామగారు డబ్బు తెమ్మని అడుగుతారు. కోడలు బీరువా తెరుస్తుంది. డబ్బు కనిపించదు. గంభీరమైన సన్నివేశం. పోలీసుల్ని పిలవండి, లేకపోతే అంతా మమ్మల్నే అనుమానిస్తారని ఆశ్రిత బంధువర్గం శోకం పెడుతుంది. పోలీసులొస్తారు. అన్ని గదులూ వెతుకుతారు. కోడలి పెట్టెలో డబ్బు దొరు కుతుంది. అత్తగారు అసహ్యంగా చూస్తారు. ఇలాంటి సమయంలో అండగా వుండాల్సిన భర్త ఛీ అంటూ ముఖం తిప్పేస్తాడు. యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌ అంటాడు ఇన్‌స్పెక్టర్‌ పాత్రధారి. సినిమా మొత్తంలో తనకున్న ఒకే ఒక్క డైలాగ్‌ను బాగా చెప్పానన్న తృప్తి అతని కళ్లల్లో కని పిస్తుంది.

ఈ దృశ్యాన్ని ఎన్ని సినిమాల్లో చూడలేదు? కోడలి కష్టాల్ని చూసి ఎన్నిసార్లు  థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకోలేదు?. నిన్నటి ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్య మత ప్రచారం ఎపిసోడ్‌ కూడా ఇదే కదా? ఏమాత్రం క్రియేటివిటీ లేని స్క్రిప్టు కారణంగా వెంటనే అడ్డంగా దొరికిపోయారు. లేకుంటే  ఎన్ని అపార్థాలకు దారితీసేది? రానున్న రోజుల్లో మన ‘తెలుగు బీజేపీ’ బ్యాచ్‌ సోషల్‌ మీడియాలో మరింత ఉగ్రహిందూ అవతారమెత్తుతారు. ప్రధాన స్రవంతి మీడియా తోడ్పాటు ‘అవసరమైన మేర’కు ఉండనే ఉంటుంది. దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులను ఆకర్షించి, తద్వారా తమ నాయకు డికి శాపవిమోచన మార్గాన్ని కనిపెట్టడం, పనిలో పనిగా తమ ప్రధాన శత్రువైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై నిందలు మోపడం అనేదే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ దీక్షగా చేపట్టిన కార్యక్రమం. ప్రభుత్వ యంత్రాంగం లోనూ, అనేక వ్యవస్థల్లోనూ తెలుగుదేశం పార్టీ స్లీపర్‌ సెల్స్‌ పనిచేస్తున్నట్లుగా ఆర్టీసీ ఉదంతం ఎత్తిచూపింది.  

ఇలాంటి సంఘటనలు ఇంకా మరికొన్ని జరగవచ్చు. సోషల్‌ మీడియాలో మోహరించిన టీడీపీ సైనికులు వాటి ఆధారంగా వీరంగం వేస్తారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఏకపక్ష చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఆ చర్చల్లో బీజేపీ తరఫున కూడా తెలుగుదేశం ప్రతినిధే పాల్గొంటాడు. యాంకర్‌ మనవాడే ఉంటాడు. కొన్ని పత్రికల సహకారం ఎల్లవేళలా ఉంటుంది. స్లీపర్‌ సెల్స్‌ సృష్టించిన గాలిని సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, పత్రికలు దశలవారీగా జనంలోకి మోసుకెళ్తాయన్నమాట. చెట్ల ఆకుల్లో ఆకులా తిరిగే పసరిక పాముల పట్ల, బంగారు లేడి వేషంలో వున్న మారీచుల పట్ల ఏపీలో అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యంత జాగరూకతతో వుండాల్సిన అవసరం వుంది. 

తెలుగుదేశం పార్టీ ఏకకణ జలజీవి హైడ్రాలాగా నెమ్మదిగా బీజేపీ ప్రాపకం కోసం కదులుతున్నది. తన టెంటకిల్స్‌ను బీజేపీ వైపు సాచుతున్నది. తెలంగాణలో ఇప్పటికే టీడీపీ యూనిట్‌ మొత్తం బీజేపీలో చేరిపోయే విధంగా ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రజల్లో కేసీఆర్‌కు వున్న పాజిటివ్‌ వోటుతో పాటు కాంగ్రెస్‌ సేనలు ధరించిన కవచాల మీద వున్న చంద్రబాబు బొమ్మ కారణంగా తుక్కుతుక్కుగా ఓడిపోవాల్సి వచ్చింది. రేపు బీజేపీ శ్రేణుల నుదుటి బొట్టులో ప్రజలకు చంద్రబాబు బొమ్మ కనిపిస్తే అధికారం కాదుగదా, ప్రధాన ప్రతిపక్షం పాత్ర కూడా దక్కదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే  బీజేపీలో చేరిన, ఇకముందు చేరబోతున్న వ్యక్తుల చేతికే పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే, తెలుగుదేశం బినామీ సంస్థగా ఆ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ పనిచేయవలసి వుంటుంది.

తెలుగు దేశం పార్టీతో గతంలో చేసిన స్నేహం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చేదు అనుభవం తెలుగు రాష్ట్రాల బీజేపీకి ఉంది. 1998లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18.3శాతం ఓట్లను సంపాదించింది. ఆ ఎన్నికల తర్వాత జరిగిన కార్గిల్‌ యుద్ధం, ఫలితంగా అమాంతం పెరిగిన వాజ్‌పేయి ప్రతిష్టల నేపథ్యంలో 1999 ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు మంత్రాంగంలో పడి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అప్పుడు రెండు పార్టీలకు కలిపి ఉమ్మడిగా 44శాతం ఓట్లు పడ్డాయి. విడివిడిగా పోటీ చేసి ఉన్నట్లయితే అందులో సగానికిపైగా ఓట్లు బీజేపీ ఖాతాలో పడి ఉండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచేది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలబడేది. రాష్ట్రం దశ, దిశ మారి ఉండేది. ఇరవై ఏళ్ల కిందట రాష్ట్ర బీజేపీ చేసిన చారిత్రక తప్పిదం కారణంగా ఈనాటికీ జాతీయ రాజకీయాల ఊపులో కూడా బీజేపీ కోలుకోలేకపోతున్నది. ఇక ప్రస్తుతానికి వస్తే బీజేపీ ప్రవచించే సిద్ధాంతం హిందూ జాతీయ వాదమైతే, తెలుగుదేశం అనుసరించేది ‘దిగుడుబావి’ జాతీయవాదం.

ఇది సంకుచితమైన స్థానికమైన జాతీయవాదం. ఒక పక్క జాతీయ స్థాయిలో బీజేపీ మరింత విశాలమైన అర్థంలో జాతీయ వాదాన్ని విస్తరించుకోవాలన్న డిమాండ్‌ వస్తున్న  నేపథ్యంలో ఒక సంకుచిత ‘జాతీయ’ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకత్వం చేతిలోకి ఆ పార్టీ రాష్ట్ర శాఖ వెళితే, అదొక విషాదకర పరిణామమవుతుంది. అసలు హిందూ జాతీయవాదం అంటే ఏమిటి అనే అంశంపై అబూధాబీలోని న్యూయార్క్‌ యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ రాహుల్‌ సాగర్‌ ఒక బృహత్తర పరిశోధనను ఏడేళ్లపాటు నిర్వహించారు. ఇందులో 130 మంది పరిశోధకులు ఆయనకు సహాయం చేశారు. ప్రపంచ దేశాల్లోని 40 ప్రముఖ గ్రంథాలయాల నుంచి రెండులక్షల ఇరవైవేల డాక్యుమెంట్లను పరిశీలించారు. గడిచిన రెండు మూడు శతాబ్దాల్లో హిందూ ధర్మంపై వివిధ వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో వ్యక్తీకరించిన అభిప్రాయాలవి. ఈ పరిశోధనల ఫలితంగా హిందూ జాతీయవాదంలో రెండు ప్రధాన స్రవంతులున్నాయని గుర్తించారు. బంకించంద్ర ఛటర్జీ, అరబిందో, వీర్‌సావర్కర్‌ల మార్గం ఒకటైతే, రాజ్‌నారాయణ్‌ బోస్, స్వామీ వివేకానంద, మహాత్మాగాంధీల మార్గం మరొకటి. ఈ రెండు స్రవంతుల మధ్య సమన్వయం సాధించడంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ విజయం సాధించలేకపోయిందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ స్థితిలో సంకుచిత, స్వార్థ ‘జాతీయ’వాదులు కూడా తోడైతే... బాలగంగాధర్‌ తిలక్‌ తరహాలో నా దేశాన్ని కాపాడమని దేవుడిని కోరుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. 

‘‘దేవుడా రక్షించు నా దేశాన్ని, లక్షలాదిమంది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి’’ 

 
వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు