కాలంతో నడక

15 Sep, 2019 01:03 IST|Sakshi

జనతంత్రం 

దాదాపుగా ముప్పయ్‌ సంవత్సరాల కిందటి నాటి ముచ్చట. ఇళ్లలోకి టెలివిజన్‌ సెట్లు నెమ్మదిగా చేరుకుం టున్న రోజులవి. దూరదర్శన్‌లో ‘మహాభారత్‌’ సీరియల్‌ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం పూట ప్రసారమయ్యేది. ఆ సమయంలో వీధుల్లో కర్ఫ్యూ వాతావ రణం కనిపించేది. జనం టీవీలకు అతుక్కుపోయేవారు. అది హిందీలో వచ్చినా, భారతం కథ కనుక తెలుగు వాళ్లకు కూడా బాగానే అర్థమయ్యేది. హిందీయేతర ప్రాంతాల ప్రజలకు నాలుగు హిందీ ముక్కల్ని ఈ సీరి యల్‌ నేర్పించింది. టీవీ భారతం ఒక కొత్త పాత్రను ప్రజలకు పరిచయం చేసింది. అదే ‘కాలం’ పాత్ర. కాలం ఈ సీరియల్‌కు యాంకర్‌. సీరియల్‌ ప్రారంభం కాగానే తెరపై కాలచక్రం తిరుగుతూ వుండేది. నేపథ్యంలో హరీశ్‌ భిమానీ గొంతులోంచి కాలం సంభాషణ గంభీరంగా వినిపించి ప్రజలకు బాగా చేరువయ్యింది. తొలి ఎపిసోడ్‌లో కాలం తనను తాను పరిచయం చేసుకు న్నది. ‘‘మై సమయ్‌ హు!... మేరే జన్మ్‌ సృష్టికే నిర్మాణ్‌ కే సాత్‌ హువా థా! మై పిచ్‌లే యుగోంమే థా, ఇస్‌ యుగోంమే హు, ఔర్‌  ఆనేవాలే సబీ యుగోంమే రహూంగా...’’. ఆ సంభాషణలోనే తన స్వభావాన్ని కూడా కాలం చాటుకుంది. ‘‘ఈ భూమ్మీద పుట్టిన సమస్త జీవరాశిని, వాటి ఉత్థాన పతనాలను నేను  చూశాను. నాతో కలిసి నడవలేక బ్రహ్మాండమైన డైనోసార్లు నశించాయి. నాతోపాటు మారలేకపోవడం వలన రోమ్‌ వైభవం, గ్రీకు రణతేజం, మొఘల్‌ ప్రాభవం నశిం చాయి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం పతనమైంది. నాతోపాటు నడుస్తూ, నేను చేసే మార్పులను అనుసరిస్తూ వచ్చేవాడే విజయ శిఖరం మీద నిలబ డగలుగుతాడు’’. ఇది టీవీ సీరియల్‌ సంభాషణే అయిన ప్పటికీ, నిజంగా కాలం లక్షణం అదే. కాలం మానవా తీతమైనది. అందువల్ల దానికి జాలి, దయ, క్రోధం, ప్రేమ వగైరా మానవ వికారాలేమీ వుండవు. కదిలిపోవ డమే దాని కర్తవ్యం. ఎవరికోసమూ ఆగదు. ‘కదిలే కాలమా... కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుకా... కళ్లార చూడవమ్మా’ అని కమ్మని కంఠంతో యేసుదాసు వేడు కున్నా అది ఆగదు.

అనంత కాలగమనంలో డెబ్బయ్‌ ఒక్క సంవత్స రాల క్రితంనాటి ఒకానొక తారీఖు గురించీ, దాని చుట్టూ ముసురుకుంటున్న తత్వాల గురించే ఈ ఉపోద్ఘాతం. ఆ తారీఖు సెప్టెంబర్‌ 17. ఆ సంవత్సరం 1948. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటివరకూ బ్రిటిష్‌ ఇండియాలో భాగం కాకుండా విడిగా వున్న స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించారు. అన్ని సంస్థానాల్లోకీ పెద్దది హైదరాబాద్‌. ఇది నిజాం రాజ్యం. హైదరా బాద్‌తోపాటు కశ్మీర్, జునాగఢ్‌ రాజ్యాలు విలీనానికి కొద్దిరోజులు మొరాయించాయి. ఆ తర్వాత విలీనమ య్యాయి. సెప్టెంబర్‌ 17వ తేదీనాడు అధికారికంగా హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీన మైంది. నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఎయిర్‌ పోర్ట్‌లో సర్దార్‌ పటేల్‌కు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం కూడా నవాబును హైదరాబాద్‌ రాష్ట్రా నికి రాజ్‌ ప్రముఖ్‌గా ప్రకటించింది. ఏటా యాభై లక్షల రూపాయల రాజభరణం చెల్లించేందుకు అంగీకరిం చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకుంది. విలీన కార్యక్రమానికి ముందు మొరాయించిన మూడు సంస్థానాలను లొంగ దీసుకోవడానికి మూడు రకాల వ్యూహాలను భారత ప్రభుత్వం అమలుచేసింది.

హైదరాబాద్‌కోసం ‘ఆపరేషన్‌ పోలో’ అనే యుద్ధవ్యూహాన్ని రచించారు. ఆంధ్ర సరి హద్దు ప్రాంతంలో ఒకటి, బొంబాయి సరిహద్దు ప్రాంతంలో ఒకటి చొప్పున జనసంచారం లేని గుట్టల్లో రెండు బాగా చప్పుడయ్యే బాంబుల్ని వదిలారు. యాభై వేల మందితో కూడిన యూనియన్‌ మిలిటరీ దిగింది. నిజాం ఆదేశాల మేరకు నిజాం సైన్యం వెంటనే లొంగి పోయింది. పారా మిలిటరీ దళంలాగ వ్యవహరిస్తూ ప్రజ లను పీడిస్తున్న రజాకార్లు గ్రామాల నుంచి నెమ్మదిగా పలాయనం చిత్తగించారు. అయితే విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా యూనియన్‌ సైన్యాలు మూడేళ్ల పాటు తెలంగాణలోనే తిష్టవేసి, చెమటోడ్చవలసి వచ్చింది. ఎందుకోసం? ఆరోజుల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆంధ్ర మహాసభలో భాగంగానూ, స్టేట్‌ కాంగ్రెస్‌ పేరుతోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ పార్టీ గానీ, తెలంగాణ  ప్రాంతంలో సాయుధ పోరును నడిపిన కమ్యూనిస్టులు గానీ ఈ సెప్టెంబర్‌ 17 నాడు పెద్దగా హడావుడి చేయక పోవడానికి కార ణమేమిటి? ‘ఊరూరా పండుగ చేద్దాం, ఊరినిండా జాతీయ జెండాను ఎగురవేద్దాం’ అంటూ హడావుడి చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ, దానికి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌ కానీ అప్పటికి పుట్టనే లేదు. మరి ఎందుకని ఇంత ఉత్సాహం చూపుతు న్నట్టు? ఈ డెబ్బయ్యేళ్ల కాలగతిలోనే ఈ ప్రశ్నలకు సమా ధానాలున్నాయి.

ఆనాటి నిజాం రాజ్యమైన హైదరాబాద్‌ రాష్ట్రంలో పదహారు జిల్లాలున్నాయి. ఎనిమిది జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రజలున్న తెలంగాణ ప్రాంతం. ఐదు జిల్లాల్లో మరాఠీ మాతృభాష, మూడు జిల్లాలు కన్నడ ప్రాంతాలు. మాతృభాషలో విద్యాబోధన వుండేది కాదు. ఉర్దూ మీడియం స్కూళ్లు కూడా స్వల్పంగానే వుండేవి. వ్యవసాయ భూమిలో 70 శాతానికి పైగా దొరలు, జాగిర్దార్లు, దేశ్‌ముఖ్‌ల చేతుల్లో వుండేది. రైతు లందరూ దాదాపుగా కౌలుదార్లే. ఏ కొద్దిమంది రైతులకో సొంత భూమి వుండేది. గ్రామాల్లో పరిపాలనంతా దొరలూ, దేశ్‌ముఖ్‌లదే. ఇష్టానుసారం రైతులను భూముల నుంచి బేదఖల్‌ (కౌలు తొలగింపు) చేసేవారు. కింది కులాల ప్రజలు దొరలకు, అధికారులకు వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. మరాఠీ, కన్నడ ప్రాంతాల్లో కూడా ఇదేవిధమైన సంస్థలు ఏర్ప డ్డాయి. తొలిరోజుల్లో చిన్నచిన్న రాయితీలకోసం, కనీస మైన ప్రజాస్వామిక హక్కులకోసం (సభలు జరుపుకో వడం వంటివి) మహజర్లు సమర్పించుకోవడానికి ఆంధ్ర మహాసభ పరిమితమైంది. గ్రామ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్న ధనిక రైతు కుటుంబాల వారి సంఖ్య  ఆంధ్ర మహాసభలో పెరగసాగింది.

కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడ పాటి హనుమంతరావు, మందుముల నర్సింహారావు వగైరాలు జాతీయవాదాన్ని బలంగా వినిపించేవారు. అంటే భవిష్యత్తు కాంగ్రెస్‌ పార్టీకి పూర్వరూపంలా వీరు వ్యవహరించారు. మహాసభలో చురుగ్గా వుంటున్న రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహా రెడ్డి మొదలైన వారిపై కమ్యూనిస్టు భావాల ప్రభావం పడింది. వారి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ సమర శీల స్వభావాన్ని సంతరించుకోసాగింది. వెట్టిచాకిరీని, బలవంతపు లెవీ వసూళ్లను నిషేధిస్తూ నిజాం జారీచేసిన ఫర్మానాలను అమలు చేయించుకోవడం కోసం కూడా న్యాయపోరాటాలు చేయవలసి వచ్చేది. అప్పటి నల్ల గొండ జిల్లాలో సూర్యాపేట, జనగామ తాలూకాలు భౌగోళికంగా దగ్గరగా వుండేవి. ఈ ప్రాంత నాయకులైన దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు తదితరులు మిలిటెంట్‌ పోరాటా లతో భూస్వాములను హడలెత్తించారు. సూర్యాపేట తాలూకాను ఆనుకుని వున్న మునగాల పరగణా అప్పుడు బ్రిటిష్‌ ఇండియాలో భాగం. పరగణాలో జమీందారీ వ్యతిరేక పోరాటాలను పర్యవేక్షించడానికి వచ్చే ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావుల ప్రభావం ఈ నాయకులపై పడింది. 

పాలకుర్తి, కడవెండి గ్రామాల్లో భూస్వాముల ప్రైవేట్‌ సైన్యాలకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలను సమీకరించి వడిసెల రాళ్లతో యుద్ధం చేసే వ్యూహాన్ని కమ్యూనిస్టులు అమలు చేసి విజయం సాధించారు. పాలకుర్తి పోరాటానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి. కడవెండి పోరులో దొడ్డి కొమరయ్య తుపాకీ కాల్పులకు నేలకొరి గిన తొలి అమరుడిగా నిలిచిపోయాడు. ఆ వెంటనే బాలెంల, పాతసూర్యాపేట గ్రామాల్లో ఇదే తరహా ప్రజా యుద్ధం. ఈసారి నిజాం సేనలనూ ప్రజలు తరిమికొ ట్టారు. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటంలోని తొలి తుపాకీని భీమిరెడ్డి నర్సింహారెడ్డి చేతబూనాడు. సాయుధ దళాలు ఏర్పడి రైతులకు భూస్వాముల భూములను పంచడం ప్రారంభించాయి. దొరలు గడీ లను వదిలి పారిపోయారు. మూడువేల గ్రామాల్లో కమ్యూనిస్టులు గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఊరిలో సాయుధ రక్షణ దళాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు, నిజాం సేనలకు ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. గ్రామాల మీద రజాకార్లు, నిజాం సేనలూ దాడిచేసి బీభత్సం సృíష్టించేవారు. ఒక్క భైరాన్‌పల్లి గ్రామంలోనే వందమందికి పైగా కమ్యూని స్టులను ఊచకోత కోశారు.

ఎంత బీభత్సం జరిగినా రైతులు తమకు కమ్యూనిస్టులు పంచిన భూములను సాయుధులై రక్షించుకున్నారు. మూడువేల గ్రామాల్లో నిజాం పాలన దాదాపుగా అంతమైంది. ఈ దశలోనే నిజాంరాజుకు, ఢిల్లీ సర్కార్‌కు మధ్య ఉత్తర ప్రత్యుత్త రాలు జరిగాయి. విలీనఘట్టం పూర్తయింది. యూని యన్‌ మిలిటరీ కమ్యూనిస్టుల వేట మొదలుపెట్టింది. ‘విముక్త’ గ్రామాల నుంచి పారిపోయిన భూస్వాములు, షేర్వాణి, రూమీటోపీలను పడేసి, ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలు ధరించి మళ్లీ గ్రామాల్లోకి ప్రవేశించారు. రావి నారాయణరెడ్డి తదితర కమ్యూనిస్టులు ఇక సాయుధ పోరాటం అనవసరమని వాదించారు. కొందరు కొన సాగించాలని పట్టుపట్టారు. విలీనం తర్వాత కూడా మూడేళ్ల పాటు యూనియన్‌ సైన్యాలతో పోరాటం సాగింది. నిజాంసేనలు – రజాకార్ల దాడుల్లో మరణిం చిన వారికంటే భారతసైన్యం దాడుల్లోనే ఎక్కువమంది కమ్యూనిస్టులు, వారి సానుభూతిపరులు చనిపోయారు. ఈ పోరాటాల్లో ఐదువేల మంది చనిపోయారు. 1951 చివర్లో సాయుధపోరును విరమిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. యాదృచ్ఛికమే అయినా, ఈ పోరా టంలో తొలి తుపాకీని అందుకున్న భీమిరెడ్డి నర్సింహా రెడ్డే విరమణ తర్వాత తుపాకీ దించిన ఆఖరివాడుగా మిగలడం విశేషం.

పోరాట విరమణ జరిగిన కొద్ది రోజులకే దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్‌ రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో తెలంగాణ ప్రాంతం సీట్లు 95. అప్పటికింకా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగుతున్నది. పీడీఎఫ్‌ పేరుమీద ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. మిలిటెంట్‌ నాయకత్వ మంతా అజ్ఞాతంలోనే ఉంది. ఎన్నికల సన్నద్ధత లేకుం డానే పోటీ చేసి తెలంగాణ ప్రాంతంలో 36 సీట్లలో గెలిచారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ గెలిచింది 38 సీట్లు. పూర్తి సామర్థ్యంతో ఎన్నికల్లో పాల్గొని వున్నట్లయితే ఆ రోజున తెలంగాణలో నెంబర్‌ వన్‌ స్థాయిలో కమ్యూని స్టులే వుండేవారు. ఆ స్థాయి నుంచి జారుకుంటూ దాదాపు ఉనికిలేని స్థాయికి కామ్రేడ్స్‌ చేరుకున్నారు. ఈ పరిస్థితికి చీలికలు పేలికలు కావడం ఒక కారణమైతే, మారుతున్న దేశ కాల పరిస్థితులను అవగతం చేసుకోవ డంలో వైఫల్యం, మారుతున్న ప్రజల ఆకాంక్షలను, అవసరాలను చదవడంలో దారుణ వైఫల్యం ఇతర ప్రధాన కారణాలు.

ప్రజలకోసం పోరాడినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు కాబట్టి, నిజాయితీపరులూ, నిరాడంబరులు కాబట్టి చాలాకాలం పాటు కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించినప్పటికీ, ఆ పార్టీ నాయకుల ఉపన్యాసాల్లో వాడే యాంత్రిక భాషతో వారు కనెక్ట్‌ అయ్యేవారు కాదు.  కాలం అనేక అవకాశాలను వారికి కల్పించింది. అందిపుచ్చుకోవడంలో వారి వైఫల్యం కారణంగా ప్రత్యా మ్నాయాలను కాలం సృష్టించుకున్నది. తెలంగాణ కాంగ్రెస్‌ దృష్టిలో సెప్టెంబర్‌ 17 అంటే తలమీద రూమీ టోపీకి బదులు గాంధీ టోపీ వచ్చిన రోజు. కమ్యూనిస్టుల దృష్టిలో మరింత కడగండ్లపాల్జేసిన రోజు. కనుక వారి దృష్టిలో ఈ తారీఖుకు ప్రాధాన్యత లేదు. మరి అప్పుడు ఉనికేలేని బీజేపీకి ఎందుకింత ఉబలాటం? తెలంగాణ భావోద్వేగ కెరటాల్లో తేలిపోయి అధికారాన్ని అందుకోగల ఒక అవకాశంగా సెప్టెంబర్‌ 17ను ఆ పార్టీ భావిస్తున్నది.

బీజేపీతో పోల్చదగిన విజయగాధ ఈ దేశంలో మరో పార్టీకి లేదు. 1951లో జనసంఘ్‌ పేరుతో దాని పుట్టుక. తొలి ఎన్నికల్లో పార్లమెంట్‌లో వచ్చిన సీట్లు మూడు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనతా పార్టీగా విలీనమయ్యే వరకు జనసంఘ్‌ పేరుతో పార్ల మెంట్‌లో సాధించిన అత్యధిక సీట్ల సంఖ్య 35. జనతా పార్టీ నుంచి బయటికి వచ్చిన అనంతరం బీజేపీ ఏర్పడి తొలి ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత కాలానుగుణమైన వ్యూహాలతో ప్రజల భావోద్వే గాలను ఆసరా చేసుకొని అనూహ్యస్థాయి విజయశిఖరా లకు చేరుకున్నది. ఇప్పుడు తెలంగాణలో గద్దెనెక్కడానికి పనికొచ్చే అస్త్రాల్లో సెప్టెంబర్‌ 17 ఒక దివ్యాస్త్రంగా ఆ పార్టీకి కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ప్రజాభిప్రాయాలను గమనంలోకి తీసుకుంటే మరో రెండు మూడేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని మూడో స్థానంలోకి నెట్టి వేసి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించవచ్చని అనిపిస్తు న్నది. బీజేపీ కలలు ఫలించి ఒక రోజున ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే తెలంగాణలో సెప్టెంబర్‌ 17 ప్రభుత్వ సెలవు దినంగా మారుతుంది. లేకుంటే మీడి యాలో ‘చరిత్రలో ఈ రోజు’ శీర్షిక కింద ఒక అంశంగా మిగులుతుంది.


వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు