ఒక్క జగన్‌పై వంద గన్స్‌!

24 Nov, 2019 01:23 IST|Sakshi

వెయ్యి గోబెల్స్‌ పవర్‌ల శక్తి గలిగిన ఒక కొత్త థౌజండ్‌ వాలా టపాసును ఇటీవల చంద్రబాబు తయారు చేసు కున్నారు. ఒక్క గోబెల్స్‌ పవర్‌ ఈజ్‌ ఈక్వల్‌ టు థౌజండ్‌ హార్స్‌పవర్‌ అనే లెక్కతో దాన్ని చేయించి ఉంటారు. అందుకే ఈ థౌజండ్‌వాలాపై చాలా ఆశలు పెట్టు కున్నారు. ఎన్నికల్లో దారుణమైన, అవమానకరమైన ఓటమి ప్రాప్తించిన తర్వాత, కింకర్తవ్యస్థితిలో ఇంచు మించు క్షీరసాగర మథనం స్థాయిలో ఉభయకుశలో పరులతోటి ఆయన సంప్రదింపులు జరిపారని వినికిడి. తనవారు, తాను వివిధ రాజకీయ పార్టీల్లో, వివిధ రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన స్లీపర్‌ సెల్సూ, తనకు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల్లాగా పనిచేస్తూ జాబ్‌వర్క్‌ చేసి పెట్టే కొన్ని పొలిటికల్‌ పార్టీల ప్రొప్రయిటర్లు, తనకు విశ్వాసపాత్రులైన ‘స్వతంత్ర’ మీడియా పెద్దలు, ఇట్లు... తమ విధేయులని చెప్పుకునే సోషల్‌ మీడియా మేనేజర్లు వగైరాలతో జరిగిన మేధోమథనం అనంతరం ఈ థౌజం డ్‌వాలాను రూపొందించారు.

అంటే పాశుపతాస్త్రం కోసం అర్జునుడు చూపినంత తపన, అణ్వస్త్రం కోసం పాకిస్తాన్‌వాడు పూనినంత దీక్ష దీని వెనకాల ఉందన్న మాట. హిట్లర్‌ దగ్గర ప్రచార మంత్రిగా పనిచేసిన గోబెల్స్‌ అనే వ్యక్తి ‘ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుందనే’ సిద్ధాంతాన్ని తయారు చేశాడని మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీని దురాక్ర మణ చేసిన తర్వాత చంద్రబాబు ఈ గోబెల్స్‌ సిద్ధాంతా నికి మరింత మెరుగుపెట్టి పార్టీకి ప్రాణవాయువుగా మార్చిన సంగతి కూడా మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ గ్రాండ్‌ అలయెన్స్‌కు... (అంటే, దాని మిత్రపక్షాలు, మిత్ర సంస్థలు, మిత్ర వ్యవస్థలూ– కనిపించేవీ, కనిపించనివీ అన్నీ కలిపి) ఎన్నికల్లో ఎదు రైన ఓటమి ఒక ఎత్తయితే, ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ తీసుకుంటున్న విప్ల వాత్మక నిర్ణయాలు మరో ఎత్తుగా పరిణమించి బాధిస్తు న్నాయి.

ఆయన గతంలో అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ పోరాడి నిర్మించుకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత కారణంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 50 శాతం మంది ఓటువేసి  అధి కార పగ్గాలు అందించారు. ఆరు నెలల్లోనే మంచి ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని ప్రకటించిన జగన్‌ మోహన్‌రెడ్డి ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఈ విప్లవ ప్రస్థానాన్ని కొనసాగనిస్తే, భవిష్యత్తులో జరిగే ఏ ఎన్ని కల్లోనైనా వై.ఎస్‌. జగన్‌ను ఎదుర్కోవడం అసాధ్యమనే నిర్ణయానికి ప్రతిపక్ష శిబిరం వచ్చేసింది. ఆదిలోనే అడ్డు కోవాలన్న లక్ష్యంతో ‘మారీచ – సుబాహు విఘ్న క్రీడ’ను ఆశ్రయించింది.

ఆ విఘ్నక్రీడకు ఆధునిక రూపం గోబెల్స్‌ ప్రచారం. ఈ విద్యలో ఇప్పటికే ప్రావీణ్యం ఉన్న చంద్రబాబు అండ్‌ కో ఒకేసారి వెయ్యి గోబెల్స్‌ల పెట్టున ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారానికి తెరతీస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఓ థౌజండ్‌వాలా టపాసుకు నిప్పంటించింది. ఇప్పటి వరకూ ఆ థౌజండ్‌వాలాలో ఒక్క టపాసూ ఢామ్మని పేలలేదు. కానీ, తుస్సుమన్నప్పుడు కూడా కొంత పొగ వస్తుంది కదా! అనుంగు మీడియాలో ముందుగా ఆ పొగ కనిపిస్తుంది. అది కనిపించగానే తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష, ప్రచ్ఛన్న, పరోక్ష సేనలూ – ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ అద్దె నేతలూ ‘శరభ, శరభ’ అంటూ బృంద గానంతో కూడిన వీరనాట్యాన్ని మొదలుపెడతారు. ఆ వెంటనే ఢిల్లీ దర్బార్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన కోవర్టుల అభినయం మొదలవుతుంది. అనుంగు మీడి యాలో తమకు అవసరమైన కహానీ కనబడగానే మోదీ గారూ, మోదీగారూ అంటూ ఒకరు, షాజీగారూ షాజీ గారూ అంటూ ఒకరు మీడియా కెమెరాల ముందు నుంచి లోపలకు పరుగెత్తుతారట.

అక్కడ ఎవర్ని కలు స్తారో తెలియదు కానీ, బయటకు అంతే వేగంతో పరు గెత్తుకొచ్చి, ఓ కొత్తకథ వినిపిస్తారు. మరుసటిరోజు అనుంగు పత్రికలు అచ్చేస్తాయి. ఈ కోవర్టుల వ్యవహార శైలి చూసి ఉత్తరాది ఎంపీలు, మీడియా ప్రతినిధులు విస్తుపోతున్నారట. ‘వీధి నాటకంలో కేతిగాడి పాత్రకు ఎక్కువ, సర్కస్‌లో బఫూన్‌ పాత్రకు తక్కువ’ అంటూ వీరి ప్రవర్తనపై కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదే శ్‌లో జరుగుతున్న పరిణామాలపై జాతీయస్థాయి మీడి యాను తప్పుదోవ పట్టించడంకోసం ఒక ప్రత్యేక విభా గాన్నే ఏర్పాటుచేసినట్టు తెలిసింది. ఇటీవల హైదరాబా ద్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం జరిగిన మరునాడే ఐదారు జాతీయస్థాయి పత్రికల్లో ఒకే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంపాదకీయాలు రావడం గమనార్హం.

ఈ ప్రత్యేక విభాగం అనుసరించిన తప్పుదోవ పట్టించే వ్యూహం కారణంగానే ఈ ఘటన జరిగిందని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈరకంగా ‘ఒక్క జగన్‌పై వంద గన్స్‌’ అన్నట్టుగా అష్టదిక్కుల నుండి చుట్టుముట్టి తప్పుడు ప్రచారాలతో హోరెత్తించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్థాయిలో ప్రారంభించారు. దీనికి కనిపించే వ్యక్తులతో పాటు కనిపించని శక్తుల తోడ్పాటు కూడా ఉండవచ్చు. 
తొలుత ఇసుక తుపాను సృష్టించేటందుకు శాయ శక్తులా ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు ఇసుక సరఫరా రంగాన్ని మాఫియా ముఠాలు శాసించాయి. తివిరి ఇసుమున ‘తైలము’ తీయవచ్చునని నిరూపించాయి. వైఎస్‌ జగన్‌ అధికారం లోకి రాగానే ఈ దోపిడీని అరికట్టే చర్యలను చేపట్టారు. దానికితోడు, వేసవి కాలంలో ఇసుక డంపులను ఏర్పాటు చేయవలసిన కర్తవ్యాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించింది. రానున్న వర్షాకాలం వరదలను దృష్టిలో పెట్టుకుని వేసవిలోనే ఇసుక డంప్‌లను ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈసారి ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురిసి నదులూ, వాగులు, వంకలూ వరదె త్తాయి. ఇసుక తవ్వడంలో జాప్యం జరిగింది.

ఈ కార ణాల వలన సరఫరాలో రెండు నెలలపాటు కొన్ని ఇబ్బం దులు తలెత్తాయి. ఇప్పుడు సమృద్ధిగా ఇసుక లభిస్తు న్నది. శ్రీలంకలో నెత్తుటేరులు పారించిన జాతుల సమ స్యతో సమానస్థాయిలో ఇసుక సమస్యను చిత్రించడానికి ప్రయత్నించి చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్స్‌ నవ్వుల పాలయ్యారు. పేద ప్రజల ఆశలను, ఆకాంక్షలనూ అవహేళన చేసే విధంగా ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధనపై కూడా తప్పుడు ప్రచారాన్ని దండోరా వేశారు. ప్రతిపక్షాల వైఖరిపై బడుగు–బలహీన వర్గాల ప్రజల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తడంతో ఇంగ్లీషుపై తోకముడుచుకొని ఇప్పుడు తెలుగు నాశనమైపోతున్నదంటూ ఆరున్నొక్క రాగాన్ని అందుకున్నారు. నిజానికి తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘాలను పునరుద్ధరించి, పాలక మండళ్లను నియమించి తెలుగు వైభవానికి చర్యలు తీసుకున్నది జగన్‌ ప్రభుత్వమే. అంతేకాకుండా బోధనా భాషగా ఇంగ్లీషును ప్రవేశపెట్టినప్పటికీ తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు భాష కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినందున తెలుగు భాషకు జరగబోయే నష్ట మేదీ లేదని తేటతెల్లమైంది.

కానీ ఈ నెలరోజుల్లో అనుంగు మీడియాలో ఇంగ్లీష్‌ బోధనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం బహుశా వియత్నాంలో అమెరికా చేసిన దురాక్రమణ యుద్ధానికి కూడా ఆరోజుల్లో లభించి ఉండకపోవచ్చు. ఒక పత్రికకైతే ఇంగ్లీష్‌ మీడియం బోధన వెనుక మత మార్పిడి కోణం కూడా కనిపించింది. అదే నిజమైతే ఈపాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సగం జనాభా మతం మారి ఉండాలి.
మంచీ–చెడు విచక్షణను విడిచి, ఉచ్ఛ–నీచ వివే చనను వదిలి ఈ ముఠా చేస్తున్న మరో దుర్మార్గం – అన్యమత ప్రచారం పేరుతో సృష్టిస్తున్న దుమారం. రాజ్యంలో పాలితులది ఏ మతమైనా, ఏ విశ్వాసమైనా, ఎన్ని ఆరాధనా పద్ధతులను వారు అవలంభించినా, పాలకుడు అనుసరించవలసినది రాజధర్మమే. అశో కుడు, అక్బర్‌ వంటి గొప్ప చక్రవర్తులందరూ ఆ రాజ ధర్మాన్ని పాటించారు. గుజరాత్‌లో మత విద్వేషాలు చెలరేగిన సమయంలో అప్పటి ప్రధాని అటల్‌జీ నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ఉపదేశించింది కూడా రాజధర్మమే.

ఆ ఉపదేశాన్ని మోదీజీ శిరసా వహించారు. రాజుకు ప్రజలందరూ సమానులే. ప్రజలు వేర్వేరు మత విశ్వాసాలు కలిగివున్నా, భిన్నమైన ఆచార, సంప్రదా యాలను పాటించినా, వారందరి విశ్వాసాలు, ఆచా రాలు రాజుకు గౌరవప్రదమైనవే. ఇటువంటి రాజ ధర్మాన్ని త్రికరణశుద్ధితో అనుసరించిన ముఖ్యమంత్రు లలో నిస్సంశయంగా వై.ఎస్‌. జగన్‌ అగ్రగణ్యుడు. మసీదులో అల్లాను వేడుకున్నా, చర్చిలో ప్రభువును ప్రార్థించినా, గుడిలో స్వామిని కొలిచినా అరమోడ్పు కనుల మాటున అదే ఏకాగ్రత వై.ఎస్‌. జగన్‌లో కని పిస్తుంది. ఏ మందిరంలో ఉంటే అక్కడి ఆచారాన్ని, ఆహార్యాన్ని నిక్కచ్చిగా పాటించే ఆయన ఆత్మశుద్ధి ఇప్పటికే లోకానికి వెల్లడైంది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే పూజారుల చిరకాల వాంఛితమైన వంశపారంపర్య అర్చక హక్కులను పునరుద్ధరించారు. చర్చి పాస్టర్లకు, మసీదులో ఇమామ్‌లకు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచారు. పేద ముస్లింలకు హజ్‌ యాత్రకు, క్రైస్తవులకు జెరూసలేం యాత్రకు ప్రభుత్వ సాయాన్ని పెంచారు.

ఒక్క అభాగ్యుని కన్నీటి బొట్టు కనిపించనంత వరకూ, ఒక్క నిస్సహాయుని నిట్టూర్పు వినిపించనంత వరకు సంక్షేమ ఫలాలను అందజేయాలన్న లక్ష్యంతో వై.ఎస్‌. జగన్‌ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో భాగంగానే సమాజంలో గౌరవనీయమైన స్థానం ఉన్న ఈ వర్గాల ఆకాంక్షలను కూడా నెరవేర్చింది. ఇందులో మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అచ్చమైన రాజధర్మం ప్రాతిపదికపైనే ఇవన్నీ నెర వేర్చారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న జన రంజక పరిపాలన కారణంగా నిస్పృహకు లోనైన విపక్ష నేతలు కొందరు ప్లాన్‌ చేసి కొన్ని శక్తులను ప్రయోగించి రాష్ట్రంలో అన్యమత ప్రచారం పేరుతో కొన్ని వదంతు లను సృష్టించారు. ఆ వదంతులన్నీ నూటికి నూరుశాతం అబద్ధాలు, అభూత కల్పనలని విచారణలో రుజువైంది. బీజేపీ ముఖ్యనాయకుడొకరు ఈ విషయంపై కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన  అను చరుడొకరు సందేహం వెలిబుచ్చారట. అందుకు సదరు నాయకుడు బదులిస్తూ ‘ఎవరో ఆరోపిస్తున్నారు. మనం గొంతు కలిపితే తప్పేముంది. ఆ ప్రచారం పనిచేస్తే బల పడేది మన పార్టీయేగా’ అన్నాడట. ఇదీ సంగతి. చిత్త శుద్ధిలేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా!

    వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా