తసమదీయ మాయాబజార్‌!

22 Sep, 2019 01:06 IST|Sakshi

జనతంత్రం

‘శశిరేఖ కనికట్టు నేర్చిందా?... లేక నా కన్నేమైనా చెదిరిందా?’ అంటాడు శకుని, కేవీరెడ్డి తీసిన మాయాబజార్‌ సినిమాలో. శశిరేఖ రూపంలోకి పరకాయ ప్రవేశం చేసిన ఘటోత్కజుని విన్యాసాలు చూసి కంగు తింటాడు. కాబోయే అత్తగారి హోదాలో శశిరేఖను తన చెంతకు పిలిపించుకున్న భానుమతీదేవి (దుర్యోధనుని భార్య) దిగ్భ్రాంతికి గురవుతుంది. కొడుకు లక్ష్మణ కుమారుడు గుర్తుకొచ్చి కలవరపడుతుంది. శకునికి కూడా గాభ రాయే. తానే మాయగాడు. తనకే అంతుపట్టడం లేదు. అయినా భానుమతీదేవికి ధైర్యం చెబుతాడు. మనవడు మాలోకం అని మనసుకు తెలిసినా, ఆమె ముందు మాత్రం మనవాడు మందలగిరి పర్వతాన్నయినా సరే పెకిలించగల మొనగాడన్నంత బిల్డప్‌ ఇస్తాడు. సిని మాలో అక్కడినుంచి మొదలవుతుంది ఘటోత్కజుని విన్యాసం. కనిపించేది శశిరేఖే... కానీ శశిరేఖ కాదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అంతా కనికట్టు అన్నట్టు సాగుతుంది కథ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయా లనూ, పరిణామాలనూ దూరం నుంచి చూసేవారికి కూడా ఒక మాయాబజార్‌ బైస్కోపు కనబడుతుంది. కాక పోతే ఇది రివర్స్‌గేర్‌లో వుంటుంది. అది సన్మార్గులైన పాండవులకు అనుకూలంగా శ్రీకృష్ణుడి ప్రేరణతో ఘటో త్కజుడు సృష్టించిన మాయాబజార్‌. ఇది ప్రజల ఛీత్కా రానికి గురై, చేసిన తప్పులకు ఎక్కడ బోనెక్కవలసి వస్తుందోనన్న భయంతో ఏపీ ఎల్లో సిండికేట్‌ అల్లుతున్న మాయాబజార్‌. సినిమాలోనే చెప్పినట్టు అది అసమదీ యుల (అస్మదీయులు) కోసం. ఇది తసమదీయులు సృష్టించుకున్న మాయాబజార్‌.

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మొన్ననే వందరోజులు దాటింది. ఇంకా నాలుగు నెలలు కూడా నిండలేదు. ఐదేళ్ల పదవీకాలంకోసం ఏర్ప డిన ప్రభుత్వానికి మామూలుగానయితే మొదటి ఆరు నెలల కాలాన్ని టేకాఫ్‌ టైమ్‌గానే పరిగణిస్తారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఈ 114 రోజుల్లోనే సాధించిన విజ యాలు ఒక సరికొత్త జాతీయ రికార్డు. జాతీయ పత్రికలు సంపాదకీయాలతో శ్లాఘించతగిన, మొదటి పేజీల్లో విస్తృత ప్రచారం ఇవ్వదగిన ప్రజోపయోగ కార్యక్రమా లను ప్రభుత్వం చేపట్టింది. ఇది మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరం. భారతదేశం పల్లెల్లోనే వుందని నమ్మిన వ్యక్తి ఆయన. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరా జ్యమని బోధించినవాడు. కానీ మన పాలకులు పల్లె సేవలను పడకేయించారు. ఐదారు గ్రామాలకు కలిపి కూడా ఒక పంచాయతీ కార్యదర్శి లేడు. సర్వేయర్‌ అనే ఉద్యోగి అంతరించిపోతున్న జాబితాలో చేరాడు. ఎల క్ట్రిక్‌ లైన్‌మన్‌ సేవలకోసం రోజులతరబడి ఎదురు చూడ వలసిన పరిస్థితి. చిన్నచిన్న వైద్యసేవలందించే ఏఎన్‌ఎమ్‌ పోస్టులను కూడా భర్తీ చేయకపోవడంతో అరకొరగా వున్న కాంట్రాక్టు ఉద్యోగులతోనే సర్దుకోవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో మారిన అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని దాదాపు 133 రకాల సేవలను 72 గంటల లోపల పరిష్కరించే వ్యవస్థకు శ్రీకారం చుడుతూ గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయడమే కాదు, అందులో పూర్తిస్థాయిలో పనిచేసే 1 లక్షా 34 వేల ఉద్యోగాల భర్తీకి పరీక్షలను కూడా పూర్తిచేశారు. మరో వారం పదిరోజుల్లో వారు ఉద్యోగాల్లో చేరిపోతారు. ఇప్పటికే సుమారు 2 లక్షల 60 వేలమంది గ్రామ వలంటీర్లు కూడా ఉద్యోగాల్లో చేరిపోయారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సేవలను వారు డోర్‌ డెలివరీ చేయబోతున్నారు. ఒక సంచెడు బియ్యంకోసం కొండలు దిగుతూ, వాగులు, వంకలు దాటుతూ మైళ్ల దూరం కాలినడకన వెళ్లి, రేషన్‌ దుకాణం మూసివేసి వుంటే ఈసురోమంటూ వెనక్కువెళ్లే గిరిజన గ్రామాలున్న మన ఏజెన్సీ ప్రాంతాల్లో, వారి వాకిట్లోకే రేషన్‌ సంచిని చేర్చే వ్యవస్థను ఏర్పాటు చేయడం కన్నా మహాత్మునికి ఈ యేడాది ఇవ్వగలిగే నివాళి ఇంకే ముంటుంది?. కేవలం నాలుగు నెలల కాలంలో దాదాపు నాలుగు లక్షల ఉద్యోగావకాశాలను సృష్టించి, భర్తీ చేయడం దేశమంతటా చాటింపు వేయదగిన విజయ గాథ కాదా? దేశం సంగతి దేవుడెరుగు. మన తెలుగు మీడియాను గత మూడు దశాబ్దాలుగా తగులుకున్న పక్షపాతం అనే పక్షవాత రోగం మరింత ముదిరి తెలుగు రాష్ట్రాల్లో కూడా సరైన ప్రచారం లభించలేదు. దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇరవై లక్షలమంది రాసిన పరీక్షను పారదర్శకంగా నిర్వహించి, కేవలం 11 రోజుల్లో ఫలితాలను విడుదల చేయడాన్ని అరిగించుకోలేని ఒక మీడియా సంస్థకైతే వెంటనే డయేరియా సోకింది. ఈ వ్యాధి లక్షణాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం ప్రజారోగ్యం దృష్ట్యా క్షేమకరం కాదు. ప్రభుత్వాధికారులు విరుగుడు చర్యలు చేపట్టి ఉండవలసింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పదవీకాలం అవినీతి ప్రభుత్వాల చరిత్రలో అత్యంత హేయమైన అధ్యాయం. ఇరిగేషన్‌ను, ఇసు కనూ, మట్టి తవ్వకాలనూ, చివరికి సంక్షేమ కార్య క్రమాలను కూడా స్కామ్‌లుగా మార్చిన ఘనత దానిది. రాజధాని ఏర్పాటు ప్రహసనాన్ని మొత్తంగా తవ్వితీయ గలిగితే అది ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌’గా ప్రపంచ చరిత్రలో నిలబడిపోతుందని అనేకమంది పరిశీలకుల అభిప్రాయం. ఈ స్కామ్‌లన్నీ బయటపడితే తమకు పుట్టగతులుండవన్న సంగతి తెలుగుదేశం అధిష్ఠానానికీ, ఆ పార్టీతో అల్లుకుపోయిన మీడియా – కాంట్రాక్టర్లు – వ్యాపారస్తుల సిండికేట్‌కు బాగా తెలుసు. అందుకే డబ్బులతో ఎన్నికల్లో గెలవడానికి తీవ్రమైన పోరాటం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చివరిదశలో సంబంధాలు చెడిపోవడం వల్ల, కాంగ్రెస్‌తో జతకట్టి, ఆ పార్టీకి భారీఎత్తున ఆర్థిక సహకారం చేశారనీ ప్రచారం వుంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించడం కోసం వందలకోట్లు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిందని మిత్రపక్షమైన కాంగ్రెస్‌ నేతలు బహి రంగంగానే అంగీకరించారు. అంటే ఏ స్థాయిలో అక్రమ సంపాదన పోగుబడిందో అర్థం చేసుకోవచ్చు.

వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా అన్నట్టు ప్రజల ఆగ్రహానికి గురైన తెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని స్థాయిలో ఓటమిపాలైంది. తెలంగాణ లోనూ, కేంద్రంలోనూ కూడా అంచనాలు తప్పాయి. ఈ నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని శరవేగంగా అమల్లోకి తెచ్చారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఆ పార్టీకి ఉన్న నైపుణ్యానికి మరింత పదునుపెట్టారు. ముందుగా తమ పార్టీలో ఉన్న ‘బిజినెస్‌ బ్యాచ్‌’ను బీజేపీలో చేర్పిం చారు. వీరిలో కొంతమంది బీజేపీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వుంటారు. కొందరు జాతీయ మీడియాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని తప్పుడు సమాచారాన్ని ఇక్కడి ఎల్లో మీడియా క్లిప్పింగుల సాయంతో వారికి చేరవేసే పనిలో వుంటారు. సోషల్‌ మీడియాలో జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబా బుకు అనుకూలంగా పనిచేయడానికి వెయ్యిమందికి పైగా నెలజీతంపై నియమించినట్టు సమాచారం. స్థానిక మీడియాతో ఇంతకుముందే వున్న సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకున్నారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం పాలు కానివ్వకుండా కాపాడేందుకొరకు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ ప్రవేశ పెట్టిన రివర్స్‌ టెండరింగ్‌ తెలుగుదేశం గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నది. ఇది ఆచరణలోకి వస్తే తాము చేసిన పాపాలు బట్టబయలవుతాయన్నది ఆ పార్టీ నేతల భయం. అందుకే తొలినుంచీ రివర్స్‌ టెండరింగ్‌కు వ్యతి రేకంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. బీజేపీ మాస్క్‌లు ధరించిన తెలుగుదేశం నేతలు తప్పుడు సమాచారాన్ని, తప్పుడు లెక్కలను అందజేసి కొందరు మంత్రుల చేత తొలుత వ్యతిరేకంగా మాట్లాడించగలిగారు. కొన్ని జాతీయ మీడియా సంస్థలకు కూడా ఇదేరకమైన సమా చారాన్ని అందజేశారు. సమాచారమిచ్చింది బీజేపీ మాస్కుల్లో వున్నవారు కాబట్టి ఇందులో టీడీపీ కుట్రకోణాన్ని ఆ పత్రికలు గుర్తించలేకపోయాయి. నిజంగానే ఆర్థికాభివృద్ధికి నష్టం కలుగుతుందేమో నంటూ కొన్ని పత్రికలు కామెంట్లు రాశాయి. స్థానిక ఎల్లో మీడియాకు ఈమాత్రం చాలు కదా!. మమ్మల్ని ఎల్లో మీడియా అన్నారు.. ఇప్పుడేమంటారు? అంటూ సంపాదక వ్యాఖ్యలు రాసిపారేశారు. ఆ వ్యాఖ్యానం చూసినప్పుడు ఒక సినిమా సన్నివేశం గుర్తుకు వచ్చింది. మహేశ్‌బాబు నటించిన అతడు అనే సినిమాలో హీరోను చంపేయడానికి తనికెళ్ల భరణితో బ్రహ్మాజీ ఒక ప్లాన్‌ చెబుతాడు. ‘ఎల్లుండి నూకాలమ్మ జాతర, వాడు గుడి కొస్తాడు. వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు పెడతా, గట్టు దాటగానే వేసేస్తా.

అక్కడ తప్పించుకుంటే చుక్కలకొండ దగ్గర మూడు సుమోలు పెడతా, అక్కడ తప్పించుకుంటే సర్వి తోపు దగ్గర ఐదు సుమోలు పెడతా, అక్కడ వేసేస్తా’ అంటాడు. అన్ని సుమోలు ఎందుకురా బుజ్జీ అంటాడు తనికెళ్ల భరణి, అఘోరించావులే అన్నట్టు చూస్తూ. అదే విధంగా పంజాబ్‌లో రాశారు, ఢిల్లీలో రాశారు అంటూ ఎల్లో మీడియా పెట్టిన ఏకరువును కూడా బ్రహ్మాజీ మాటలకు భరణి స్పందన లాగే జనం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులోని 65వ ప్యాకే జీకి శుక్రవారం జరిగిన రివర్స్‌ టెండర్‌ ఏపీ ముఖ్య మంత్రి ఆలోచన నూటికి నూరుపాళ్లు సరైందేనని నిరూ పించింది. 274 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఈ ప్రక్రియ ద్వారా 58 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగారు. అంటే 20 శాతానికి పైగా ప్రజా ధనాన్ని కాపాడారు. గడిచిన నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ వాస్తవి కతకూ, ప్రయత్నపూర్వకంగా మీడియాలో వెలువరి స్తున్న కథనాలకు పొంతనలేదు. ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా రూపుదిద్దుకొంటున్నాయి. అన్ని వసతు లనూ శరవేగంగా కల్పిస్తున్నారు. తొలిదశలో 16 వేల పాఠశాలలు స్వచ్ఛ దేవాలయాలు కాబోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల రూపు మారుతున్నది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నది. నాణ్యమైన ఉచిత విద్యకూ, వైద్యానికి ప్రభుత్వం పూచీపడుతున్నది. రైతుల్లో భరోసా ఏర్పడింది. పదేళ్ల తర్వాత రిజర్వాయర్లన్నీ నీటితో కళ కళలాడుతున్నాయి.

తొలిసారిగా పులిచింతల కూడా నిండుగా కన్పిస్తున్నది. పెన్నానది చాన్నాళ్ల తర్వాత ఉరకలేస్తున్నది. కృష్ణా, గోదావరులతోపాటు తుంగభద్ర కూడా కనికరించింది. వర్షాలు కొంత ఆలస్యమైనా అత్య ధిక ప్రాంతాల్లో సగటు వార్షిక వర్షపాతాన్ని దాటాయి. సీజన్‌ ముగిసేలోపు మిగిలిన ప్రాంతాల్లో కూడా సగటు వర్షపాతం నమోదు కావచ్చు. వచ్చే రబీలో రికార్డు స్థాయిలో పంటల సాగు వుంటుందని అంచనా వేస్తు న్నారు. మద్యనియంత్రణ విధానం ప్రభావం చూపడం ప్రారంభమైంది. కానీ, ఈ సానుకూల వార్తలకు మెజా రిటీగా వున్న మీడియా సంస్థలు పెద్దగా స్థానం కల్పించ లేదు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్న సంద ర్భంలో అందుకు కారణాలను ప్రభుత్వంపైకి నెట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నానికి యథాశక్తి తోడ్పడ్డాయి. కానీ, స్థానిక ప్రజలకు నిజానిజాలు తెలుసు కనుక ఈ పిచ్చిప్రయత్నం ఫలించలేదు. కోడెల నిర్వాకంపై ప్రజల వైఖరి ఏమిటో పోలింగ్‌ రోజే తేటతెల్లమైంది. అధికారం కోల్పోయిన తర్వాత, కోడెల కుటుంబ దోపిడీలపై పెద్ద  ఎత్తున జనం కేసులు పెట్టారు. వారిలో తెలుగుదేశం సానుభూతి పరులే ఎక్కువ. కోడెల కుటుంబాన్ని జనం ఛీత్కరించుకుంటున్నంత కాలం బాబు ఆయనను దూరం పెట్టారు. నియోజకవర్గంలో పోటీ నాయక   త్వాన్ని ప్రోత్సహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తుంటే ఆ పక్కన పార్టీ సమావేశంలో పాల్గొని వెళ్లిపో యాడే తప్ప కోడెలను పరామర్శించలేదు. కానీ, చని పోయిన వెంటనే ఇదేదో అందివచ్చిన అవకాశం అన్న ట్టుగా వాలిపోయి విజయ చిహ్నాలు చూపుతూ ఊరే గడం ‘దేశం’ కార్యకర్తలక్కూడా వెగటు పుట్టించింది. అస్మదీయ ఛానళ్లు మాత్రం ఆయన సేవలో తరించాయి.

అలాగే, ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలను నాలుగు నెలల్లో కల్పిస్తే చోటు కల్పించని మీడియా, సానుభూతికోసం చంద్రబాబు తలపెట్టిన ఆత్మకూరు యాత్రకు మాత్రం బ్రహ్మరథం పట్టింది. బహుశా, రాజరాజ చోళుడు లంకను జయించినప్పుడుగానీ, శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించినప్పుడుగానీ ఇంత హడావుడి జరిగి ఉండదు. మాయోపాయాలతో, మీడియా ప్రచారాలతో తాత్కాలిక లబ్ధి జరుగుతుందే మోగానీ, తుది విజయాలు సాధ్యంకావని హిట్లర్‌–గోబె ల్స్‌ల నుంచి చంద్రబాబు–ఎల్లో మీడియాల కాలం వరకు ఎన్నోసార్లు రుజువైంది. వెలుగు రేకలు పుడమిని తాకకుండా మబ్బులు అడ్డు కోలేవు. ‘అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతినాపలేరని’ ఏనాడో సుబ్బారావు పాణి గ్రాహి గొంతెత్తి ఆలపించాడు.


వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు