బొటనవేలు తెగొద్దు!

12 Jul, 2020 00:54 IST|Sakshi

జనతంత్రం

అనగనగా ఒక ఏకలవ్యుడూ, అతని కుడిచేతి బొటనవేలు వృత్తాంతం తరతరాలుగా వింటున్నదే. భారతమంత వయ సున్న ఈ ప్రాచీన కథ ఇప్పుడు మరింత ప్రాసంగికతను సంత రించుకున్నట్టు కనిపిస్తున్నది. శ్రమజీవులకు చదువుసంధ్యలు నిషేధించిన అలిఖిత రాజ్యాంగపు వేల సంవత్సరాల ఏలు బడిలో.. ఎప్పుడో ఒక్కసారి, ఒక్కడే ఏకలవ్యుడు. అందరికీ చదువుకునే హక్కును ప్రసాదించిన వర్తమాన లిఖిత రాజ్యాంగ పాలనలో ఏటేటా సమానావకాశాల బొటనవేళ్లు తెగిపడుతున్న ఎందరెందరో అనేకలవ్యులు.

సామాజిక అసమానత్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ వెనుకబడిన వారిలో అత్యధిక శాతం ప్రజలు ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఆర్థిక అసమానత్వం ఇప్పుడు దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూనే ఉన్నది. వీటికి తోడుగా ఇప్పుడు డిజిటల్‌ అసమానత్వమనే నవీన యుగరీతి శిరమెత్తుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సాంఘి కంగా, ఆర్థికంగా వెనుకబడినవారే డిజిటల్‌ పరిజ్ఞానంలోనూ వెనుకబడతారు. ఒక సరికొత్త బానిస వ్యవస్థగా ఘనీభవిస్తారు. డిజిటల్‌ వేదికపై భాగ్యవంతుల పిల్లలతో సమానంగా అభాగ్య యువతకు కూడా అవకాశాలు కల్పిస్తే ఆగామి కాల పురోగామి దళంగా సాంఘిక, ఆర్థిక రంగాల్లోనూ వారు పైకి ఎగబాకుతారు. ‘డిజిటల్‌ డివైడ్‌’ను బద్దలుకొట్టడానికి ఇదే సరైన అదును.

కరోనా మహమ్మారి ఏ ప్రపంచ దేశాన్నీ విడిచిపెట్టలేదు. ఏ జీవన రంగాన్నీ కటాక్షించలేదు. విద్యారంగం కూడా మినహా యింపు కాదు. మార్చి నెల నుంచి పిల్లలు బడిముఖం చూడలేదు. ఎప్పుడు చూడగలుగుతారో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏదో అద్భుతం జరిగి తక్షణమే ఏ వ్యాక్సినో, ఔషధమో మార్కెట్లోకి ఓ నెల రోజుల్లోపల వస్తే సెప్టెంబర్‌ మాసం నుంచి పాఠశాలలు ప్రారంభం కావచ్చు. మరి అద్భుతం జరగకపోతే విద్యా సంవత్సరం ఏం కావాలి? ఒక సంవత్సరాన్ని కోల్పోవడమేనా? అకడమిక్‌ క్యాలెండర్‌ నుంచి 2020ని డిలీట్‌ చేయడమేనా? ఈ ప్రశ్నలు అన్ని దేశాల్లోనూ తలెత్తాయి. ఇందుకు సమాధానంగా ముందుకు వచ్చిందే ‘ఆన్‌లైన్‌’ విద్యావిధానం.

ఆన్‌లైన్‌ విద్యాబోధనను అమలులోకి తేవాలంటే విద్యా ర్థులకు వాళ్ల ఇంటి దగ్గర ఒక కంప్యూటర్‌ ఉండాలి. లేదంటే ఒక ట్యాబ్‌ లేదా స్మార్ట్‌ఫోన్, ఎప్పుడూ ఎడతెగక పారే కరెంటు, తెప్పలుగా సిగ్నల్స్‌ నిండిన ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. విద్యార్థికి ఏకాంత భంగం కలుగకుండా ఒక ప్రత్యేక గది ఉంటే మరీ మంచిది. ఇక పాఠశాల వైపు నుంచి ఉపాధ్యాయుల సన్నద్ధత కూడా ముఖ్యం. ఆన్‌లైన్‌ మాధ్యమానికి అనుగుణంగా బోధనా ప్రణాళికను డిజైన్‌ చేసుకోవాలి. క్లాస్‌ రూమ్‌లో టీచర్‌ ఎదురుగా ఉన్నప్పుడు చచ్చినట్టు వినే పరిస్థితి ఇక్కడ ఉండదు. కనుక పాఠ్యాంశాన్ని ఆసక్తికరంగా చెప్పగలిగే సాధనాలను జోడించుకోవాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి అవకాశం ఉండదు. సాధారణ సందేహాలను ముందుగానే ఊహించి సమా ధానాలను పొందుపరిచేవిధంగా పాఠ్య ప్రణాళిక రూపొందాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ బోధన జరగాలి.

ఆన్‌లైన్‌ విద్యావిధానానికి విద్యార్థులూ, పాఠశాలలూ, ప్రభుత్వాలూ ఏమేరకు సన్నద్ధమై ఉన్నాయో చూడాలి. యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దరిదాపు 150 కోట్లమంది విద్యార్థులపై కరోనా ప్రభావం పడింది. ఇందులో 83 కోట్లమందికి ఇంటి దగ్గర కంప్యూటర్‌ లేదు. 60 కోట్లమందికి ఇంటర్నెట్‌ సౌలభ్యం లేదు. ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రాంత దేశాల్లో 90 శాతం మందికి కంప్యూటర్‌ అందుబాటులో లేదు. దాదాపు ఆరుకోట్ల మంది నివసించే ప్రాంతాలకు మొబైల్‌ నెట్‌వర్క్‌ కూడా లేదు. ఇక భారతదేశం విషయానికి వస్తే 2018 నాటి నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం 11 శాతం ఇళ్లలో కంప్యూటర్‌ ఉన్నది. 

24 శాతం మందికి సొంత స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో 42 శాతం మందికి, గ్రామాల్లో నూటికి పదిహేను మందికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నది. భార తీయ సమాజపు పైశ్రేణిలో ఉన్న 20 శాతం మంది గృహాల్లోనే 27.6 శాతం కంప్యూటర్లు ఉన్నాయి. 50.5 శాతం ఇంటర్నెట్‌ కనెక్షన్లు వీరికే ఉన్నాయి. అట్టడుగున ఉన్న 20 శాతం జనాభాకు 2.7 శాతం కంప్యూటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వృత్తి, ఉద్యోగాల రీత్యా అందుబాటులో ఉన్నవి మాత్రమే. 8.9 శాతం ఇంటర్నెట్‌ కనెక్షన్లు మాత్రమే అందు బాటులో ఉన్నాయి. ఈ డిజిటల్‌ డివైడ్‌లో అంతర్లీనంగా ఉన్న జెండర్‌ డివైడ్, రూరల్‌–అర్బన్‌ డివైడ్‌ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దేశంలో ఆన్‌లైన్‌ తరగతుల ప్రారంభానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కచ్చితమైన నిర్ణయాన్ని ఇంకా తీసుకోనేలేదు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఇంకా రూపొందించనే లేదు. ఈలోగానే ఆన్‌లైన్‌ బోధన పేరుతో ప్రైవేట్‌ స్కూళ్లు ప్రారంభించిన హడావుడితో సమాజంలో కల్లోలం బయల్దేరింది. కరోనా మహమ్మారి ఫలితంగా వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. పెద్ద పరిశ్రమలు– కార్పొరేట్‌ సంస్థలు సైతం ఎంతోమందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉద్యోగా లున్నవారి జీతాల్లో కోత పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఈ కోత తప్పలేదు. నిర్మాణ రంగం, హోటల్‌ పరిశ్రమ, వినోదరంగం, టూరిజం వగైరాలన్నీ స్తంభించిపోయాయి. లక్ష లాది కుటుంబాలు పెను సంక్షోభపు తుపాను ధాటికి విల విల్లాడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండులాగా ఫీజులకోసం ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి వచ్చి పడుతున్న హుకుమ్‌నామాలతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. 

అటు ప్రైవేట్‌ స్కూళ్ల దోపిడీకి ముడుపు కట్టలేక ఇటు పిల్లలను చదువులకు దూరం చేయలేక సతమత మవుతున్నారు. ఈ ప్రైవేట్‌ స్కూళ్లు హడావుడి చేస్తున్న ఆన్‌లైన్‌ చదువుల నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవడానికి ప్రముఖ ఉపా ధ్యాయ సంఘం యు.టి.ఎఫ్‌. ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ఆన్‌లైన్‌లో అభ్యసిస్తున్న తొమ్మిదివేల మంది విద్యార్థులను పలకరించింది. వీరిలో కేవలం 3.6 శాతం విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌ పాఠాలు అర్థమవుతున్నాయని చెప్పారు. 27.7 శాతం మంది కొంచెంకొంచెంగా అర్థమవు తున్నాయని చెప్పారు. 68.7 శాతం మంది ఏమాత్రం అర్థం కావడం లేదని చెప్పారు. ఆన్‌లైన్‌ బోధనా ప్రణాళిక మీద ఎటువంటి కసరత్తు ఈ పాఠశాలలు చేయలేదని సర్వే నిరూ పించింది. శవాలను పీక్కుతినే రాబందుల రెక్కల చప్పుడు లాగా ప్రైవేట్‌ స్కూళ్ల ఆన్‌లైన్‌ హడావుడి అంతా ఫీజులను పిండుకోవడంకోసమేనని తేలిపోయింది.

దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను అమలుచేయడం ప్రారంభించిన తర్వాత వైద్యరంగంలో ప్రవేశించినట్టుగానే విద్యారంగంలో కూడా వ్యాపార సంస్కృతి ప్రవేశించింది. క్రమంగా వ్యాపార సంస్కృతి పరిధిని కూడా దాటి మెజారిటీ ప్రైవేట్‌ విద్యాసంస్థలు సంపాదన పిచ్చిలో కూరుకుని పోయాయి. ప్రాథమిక విద్యను స్వయంగా నిర్వహించవలసిన ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఇదే కాలంలో ఊపందుకుంది. మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పాఠశాలలను పాడుపెట్టడం, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు నియోగించడం మొదలైన కారణాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పో యాయి. 

ఈ వ్యాపార పాఠశాలల ప్రచార పటాటోపానికి జనం లొంగిపోయారు. సేవా దృక్పథంతో దశాబ్దాల పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంప్రదాయ ప్రైవేట్‌ పాఠశా లలు కూడా ఈ వ్యాపార పాఠశాలల ప్రభ ముందు నిలవలేక పోయాయి. క్రైస్తవ మిషనరీలు స్థాపించిన విద్యాసంస్థలు, సేవా భావంతో ఏర్పాటైన ట్రస్టులు నిర్వహించే పాఠశాలలు, సరస్వతీ విద్యామందిరాలు ఎటువంటి వ్యాపార ధోరణి అవలంబించ కుండానే అత్యున్నత విద్యాప్రమాణాలను నెలకొల్పగలిగాయి. ఇప్పుడు కూడా కొందరు వ్యక్తులు, సంస్థలూ వ్యాపార ధోరణికి దూరంగా నడుపుతున్న విద్యాసంస్థలు లేకపోలేదు. కానీ వాటి సంఖ్య బహు స్వల్పం.

మొత్తం ప్రైవేట్‌ స్కూళ్లలో తొంబై శాతానికి పైగా వ్యాపార సంస్థల సామ్రాజ్యమే. ఒక దశలో ఈ వ్యాపార పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్యను కూడా దాటేసింది. దీంతో ఇవి మరింత చెలరేగిపోవడం ప్రారంభించాయి. కరోనా సంక్షోభ కాలంలో ట్యూషన్‌ ఫీజు కంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆన్‌లైన్‌ క్లాసులకు ట్రాన్స్‌పోర్టు ఫీజును కూడా హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు వసూలు చేస్తున్న వార్తలు వెలుగుచూశాయి. ఈ వికృత క్రీడకు స్వస్తి చెప్పాలంటే ప్రాథమిక విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడమే మార్గం. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు జోరందుకోనున్నది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రారంభించిన గురుకుల పాఠశాలలు కూడా సత్ఫలి తాలను అందిస్తాయి.

కరోనా సంక్షోభం మరికొన్ని మాసాలపాటు కొనసాగే అవ కాశాలు కనిపిస్తున్నందువలన విద్యా సంవత్సరాన్ని పరిరక్షిం చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే ఆన్‌లైన్‌ చదు వులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న సూచనల ప్రకారం, బహుశా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వవచ్చు. విద్యా సంవత్సరాన్ని పరిరక్షించడంతోపాటు పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు వివక్షకు గురికాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ఆన్‌లైన్‌ బోధనా ప్రణాళిక ప్రభుత్వ–ప్రైవేట్‌ పాఠశాలలకు కామన్‌గా ఉండాలి. దానికి పూర్తి సన్నాహాలు ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే జరగాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠా లపై శ్రద్ధపెట్టలేరని నిపుణులు చెబుతున్నారు. ఆ వయసు పిల్లలు మొబైల్‌/ట్యాబ్‌లకు త్వరగా అడిక్ట్‌ అవడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెబు తున్నారు. అందువల్ల ప్రాథమిక (1 నుంచి 5) విద్యార్థులకు రికార్డెడ్‌ పాఠాలను టీవీ చానళ్ల ద్వారా ప్రసారం చేయడం మేలు. ఇందుకోసం అందుబాటులో ఉన్న కొన్ని చానెళ్లను

అద్దెకు తీసుకోవడమో, ఫైబర్‌నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ఎడ్యుకేషన్‌ చానళ్లను ప్రారంభించడమో చేయవలసి ఉంటుంది. ఆపై తరగతుల విద్యార్థుల్లో స్తోమత లేని పిల్లలకు డిజిటల్‌ ఉపకరణాలను అందుబాటులో ఉంచే సమస్యను అధిగమిం చవలసి ఉంటుంది. లేనట్లయితే ఇప్పుడు ఏర్పడే డిజిటల్‌ అస మానతలు ముందు ముందు పరిష్కరించలేని స్థాయికి చేరు కుంటాయి. ఈ సంధి కాలాన్ని విద్యారంగంలో సంస్కరణల కోసం కూడా వినియోగిం చుకోవచ్చునని మరికొందరు నిపు ణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఉపా ధ్యాయ కేంద్రక పాఠ్య ప్రణాళిక స్థానంలో విద్యార్థి కేంద్రక పాఠ్యప్రణాళికను ప్రవేశ పెట్టాలన్న సూచనలు వస్తున్నాయి. ఈ విధానం వలన విద్యార్థుల్లో సృజనశీలత పెరుగుతుందని చెబు తున్నారు. ఇప్పుడు ప్రారంభించే ఆన్‌లైన్‌ విధానాన్ని అవసర మైన మేరకు భవిష్యత్‌లో కొనసాగిస్తూనే, క్లాస్‌రూమ్‌లో సమష్టి విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాలి. సమష్టి విధానం వల్ల ఏర్పడే ‘సోషల్‌ కేపిటల్‌’కు మరేదీ సాటిరాదు.


వ్యాసకర్త:
 వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా