నిర్భరమో.. దుర్భరమో!

17 May, 2020 00:48 IST|Sakshi

జనతంత్రం

ఎంత కర్ణపేయమైన మాట అది. ఈ కరోనా రుతువులో మన ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ఐదోసారి చేసిన ప్రసంగంలో ఒక వీనుల విందైన మాట దొర్లింది. ఆత్మ నిర్భర భారత్‌! ఆ లక్ష్యసాధన కోసం కంకణం కట్టుకుందామని ఉత్తేజపూరితమైన పిలుపునిచ్చారు ప్రధాని. గతంలో మన ప్రధానులు, జాతీయ నాయకులు ఇదే మాటను ఇంగ్లిష్‌లో సెల్ఫ్‌ రిలయన్స్‌ అనే వారు. మనం తెలుగులో స్వావలంబన అని రాసుకునేవాళ్లం. చదువుకునేవాళ్లం. స్వతంత్రం వచ్చిన డెబ్బయ్‌ మూడేళ్లలో కనీసం నూటా డెబ్బయ్‌మూడు సార్లు మన దేశాధినేతలు మనచేత స్వావలంబన కంకణాన్ని కట్టింపజేసి ఉంటారు.

కానీ, చిత్రమేమిటంటే ఇప్పటికీ చాలామందికి ఆ మాటకు అర్థం తెలియదు. అయినా చెవులు తుప్పుపట్టేంత డెసిబుల్స్‌ మోతను ఆ శబ్దం మోసుకొచ్చింది. తొలి భారత ప్రధానమంత్రి పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ 1951లో పంచవర్ష ప్రణాళికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ, వీటి లక్ష్యం ‘సెల్ఫ్‌ రిలయన్స్‌’ అంటూ తొలి బాణాన్ని సంధించారు. అప్పటి నుంచి ప్రతి పంచ వర్ష ప్రణాళికలోనూ ప్రధాన లక్ష్యంగా ఈ మాట చోటు చేసు కుంటూనే ఉన్నది. ప్రతియేటా భారత రాష్ట్రపతి పార్లమెంట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ ఈ లక్ష్యాన్ని నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు.

ప్రతి వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలోనూ అప్పటి ఆర్థిక మంత్రి ఈ గణపతి పూజను నిష్టగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి పంద్రాగస్టునాడు భారత ప్రధాని గాత్రంలోంచి వెలువడే ఈ మాటకు ఎర్రకోట కోరస్‌ పాడుతూనే వస్తున్నది. ఇన్నేళ్లుగా తపస్సు చేస్తూ వస్తున్నా సాక్షాత్కరించని స్వావలంబన శబ్దంపై ఒకరకమైన నిర్లిప్తత జనంలో ఏర్పడిపోయింది. అందువల్లనే భారత ప్రధాని మొన్నటి ప్రసంగంలో ఈ మాటను హిందీలో రీడిజైన్‌ చేసి వాడటంతో గొప్ప రిలీఫ్‌ లభించింది. నిజం చెప్పా లంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ చేసిన ‘ఉద్దీపన’ కంటే ‘ఆత్మనిర్భర్‌’ అనే పంచాక్షరీ వల్ల కలిగిన ఉద్దీపనే గొప్ప.

నిజంగానే ఈ పంచాక్షరీ మంత్రం ఫలితమిచ్చి, కరోనా నంతర ప్రపంచ పరిణామాల్లో భారత్‌ స్వావలంబనను సాధిం చగలిగితే, చరిత్రలో ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, డెంగ్‌ షియావో పింగ్‌ల సరసన నరేంద్ర మోదీ పేరు చేరిపోతుంది. 1929–30ల నాటి మహా మాంద్యం (గ్రేట్‌ డిప్రెషన్‌) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అమెరికాను మరింతగా. ఈ సంక్షోభం అనంతరం అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ ‘న్యూడీల్‌’ పాలసీతో ఆర్థిక స్థితిని చక్కదిద్దడం ప్రారంభించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకూ మూడు పర్యాయాలు పదవిలో కొనసాగారు.

ఆ తర్వాత అమెరికా వెనుతిరిగి చూడలేదు. సైనికపరంగా కొంత కాలంపాటు సోవియట్‌ రష్యాతో పోటీపడవలసి వచ్చినప్పటికీ, ఆర్థికంగా మాత్రం అజేయశక్తిగానే కొనసాగుతున్నది. 1950వ దశకంలో అప్పటికి వ్యవసాయిక దేశంగా ఉన్న చైనాను ఉన్న పళంగా కమ్యూనిస్టు వ్యవస్థగా తీర్చిదిద్దడంకోసం చైర్మన్‌ మావో జెడాంగ్‌ ప్రారంభించిన ‘గొప్ప ముందడుగు’ (గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌) అనే ఆర్థిక ఉద్యమం విధ్వంసకరంగా తయారైంది. లక్ష లాదిమంది గ్రామీణ ప్రజలు ఆకలి చావులకు బలయ్యారు. మావో ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం కూడా వికటించి చైనా పెను సంక్షోభంలో కూరుకొనిపోయింది.

ఈ దశలో చైనా విప్లవ అగ్ర నాయకత్రయంగా ప్రసిద్ధిచెందిన చైర్మన్‌ మావో, ఝౌ ఎన్‌లై, జనరల్‌ ఝూడే ఏడాదికాల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు కన్నుమూశారు. అప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు చేతబట్టిన డెంగ్‌ షియావో పింగ్‌ ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించి దేశంలో సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీని ప్రారం భించి తొలిసారిగా అంతర్జాతీయ సమాజానికి చైనా తలుపులు తెరిచారు. అక్కడి నుంచి బయల్దేరిన చైనా ఆర్థిక ప్రగతి పయనం రెండో బలమైన ఆర్థిక వ్యవస్థ దశకు చేరుకున్నది. నేడు ప్రపం చంలో రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాలూ పెను సంక్షోభాల్లోంచి ఫీనిక్స్‌ పక్షుల్లాగా పైకెగసిన పాఠం మనముందున్నది. ఇప్పుడు భారత్‌ ఎదుర్కొంటున్నది కూడా పెను సంక్షోభ దశే. ఈ దశ దాటిన తర్వాత దేశ భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతున్నదనేదే మిలియన్‌ డాలర్‌ ప్రశ్న.

పారిశ్రామిక విప్లవం ఫలితంగానే యూరప్‌ దేశాలు ప్రపంచం మీద పెత్తనం చేశాయనీ, వలస దేశాలను పీల్చి పిప్పి చేసిన కారణంగానే అవి అభివృద్ధి చెందాయనే విషయాలు మనకు తెలుసు. తొలి పారిశ్రామిక విప్లవం యూరప్‌ కంటే కనీసం వెయ్యేళ్లు ముందుగానే భారత్‌లో వచ్చి ఉండాల్సిందని చాలామంది చరిత్రకారులు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే, వేదకాలం నుంచే ఈ దేశంలో శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్‌ రంగాలకు సంబంధించిన అద్భుత పరిజ్ఞానం ఉంది.

14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ఆస్థానంలో కొలువుదీరిన సాయన సంస్కృతంలో మహాపండితుడు రుగ్వే దానికి భాష్యం రాశాడు. ఒక రుగ్వేద శ్లోకానికి అర్థం చెబుతూ కాంతివేగాన్ని సెకనుకు 3,25,940 కిలోమీటర్లుగా నిర్ధారించా రని పేర్కొన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఆ వేగాన్ని 3 లక్షల కిలోమీటర్లుగా తేల్చింది. దాదాపు కచ్చితత్వంతో రెండువేల సంవత్సరాలు ముందుగానే భారతీయ విజ్ఞానం లెక్కతేల్చింది. ప్రస్తుత కొలమానాల ప్రకారం చూస్తే ఒక మీటర్‌ పరిమాణాన్ని వందకోట్ల భాగాలుగా విభజిస్తే చివరికి మిగిలే పరిమాణమే పరమాణువు అని అగ్నిపురాణం పేర్కొన్నదనీ, ఆ లెక్కను ఆధు నిక విజ్ఞానం అంగీకరించిందనీ చెబుతారు.

సున్నాను ప్రవే శపెట్టి గణిత శాస్త్రాన్ని మలుపుతిప్పిన ఆర్యభట్ట అంతరిక్ష శాస్త్రానికి కూడా పితామహుడు. ఘనమైన వైజ్ఞానిక నేపథ్య మున్న దేశంలో ముందుగా పారిశ్రామిక విప్లవం ఎందుకు పురివిప్పలేదన్న అంశంపై భిన్నమైన వాదనలున్నాయి. బౌద్ధ మతం ప్రబలంగా ప్రచారంలో ఉన్నంతకాలం కులాలకు అతీ తంగా విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టే ప్రయత్నం చేశారు. ప్రబుద్ధ కాత్యాయనుడు ఆటమిక్‌ థియరీని, ఆచార్య నాగా ర్జునుడు రసాయన శాస్త్రాన్ని బోధించేవారని చెబుతారు. మనం స్వర్ణయుగంగా కొనియాడుతున్న గుప్తుల కాలం వచ్చేనాటికి బౌద్ధవ్యాప్తి క్షీణించడం మొదలైంది. వైదికం రాజ్యమతమైంది. వేదవిజ్ఞానం పూజాక్రతువుగా మారిపోయింది.

సంస్కృతం కులీన వర్గానికే పరిమితమైంది. శ్రామికవర్గాలు, ఉత్పత్తి కులాల వారు పొరపాటున వేదం వింటే చెవుల్లో సీసం పోసే మనుధర్మ శాస్త్రం నాలుగు పాదాల మీద నడవడం ప్రారంభమైంది. విద్యకు, విజ్ఞానానికి ఉత్పత్తి కులాలను దూరం చేసిన ఫలితంగా ఉత్పత్తి రంగంలో నూతన ఆవిష్కరణలు సాధ్యంకాలేదు. రవి అస్తమించని భారతీయ సామ్రాజ్యం ఏర్పడే అవకాశాన్ని చెరిపి వేసి బానిస దేశంగా బతికే దౌర్భాగ్యాన్ని ఈ సామాజిక వివక్ష ప్రసాదించింది. నాడు సంస్కృతాన్ని, విద్యనూ పేదవర్గాలకు నిరాకరించినట్లే ఈనాడు ఇంగ్లిష్‌ విద్యను కూడా శ్రామిక కులా లకు నిరాకరిస్తే ఇకముందు కూడా ఈ దేశ భవిష్యత్తు దౌర్భా గ్యమస్తుగానే మిగులుతుంది.

దేశంలో ఈనాటికీ సగం జనాభా వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి వుంది. అందువల్ల ఈ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి చర్యలు తీసుకుని, లాభ సాటి రంగంగా మార్చడం ద్వారానే భారత ఆత్మ నిర్భరత గమ్యంలో తొలి అడుగు వేయడం సాధ్యమవుతుంది. అగ్రికల్చర్‌ సెన్సస్‌ 2015–16 ప్రకారం దేశంలోని మొత్తం రైతు జనాభాలో 86 శాతం మంది ఐదెకరాల లోపు చిన్న రైతులే. సగటు కమతం విస్తీర్ణం రెండున్నర ఎకరాలు. ఇందులో కూడా అత్యధిక సంఖ్యా కులు ఒకటిన్నర ఎకరం వారే. ఈ ఒకటిన్నర ఎకరం రైతు కుటుంబం స్వయం సమృద్ధమైతేనే వ్యవసాయ రంగం లాభ సాటిగా మారినట్టు.

అర ఎకరం విస్తీర్ణంలో రైతు కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరగాయలను ఉత్పత్తి చేసుకొని మిగిలిన ఎకరం ద్వారా రెండు లేదా మూడు పంటలు తీసి, కోళ్ల పెంపకం, పాడి వగైరా సమీకృత విధానాల ఆచరణతో, ఖర్చులు పోను సాలీనా లక్ష రూపాయల లాభం తీస్తేనే రైతు ఆత్మగౌరవంతో జీవిస్తాడు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర తకు ఇదే గీటురాయి. ఈ దిశలో ఇప్పటికే అడుగులేసిన తెలుగు రాష్ట్రాల కార్యక్రమాలను కేంద్రం అధ్యయనం చేయాలి.

రైతు భరోసా, రైతు బంధు పేర్లతో రెండు రాష్ట్రాలూ రైతుకు పెట్టుబడి ఖర్చులను ముందుగానే అందజేస్తున్నాయి. కేంద్రం కూడా ఆలస్యంగా రంగంలోకి దిగినా నామమాత్రంగా రెండు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నది. ఐదెకరాల లోపు చిన్న, సన్నకారు రైతులందరికీ కనీసం పదివేలు చొప్పున పెట్టు బడి ఖర్చుల కింద కేంద్రం కూడా అందజేస్తే వ్యవసాయ రంగంలో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. తెలం గాణ ప్రభుత్వం రాష్ట్రంలో పంటలు పండించే తీరుతెన్నులు, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది.

ఆ సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో వినియోగమయ్యే ఆహార ఉత్పత్తులను సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలోనే పండించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించింది. ఏయే ప్రాంతంలో రైతులు ఏయే పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో నిపుణుల చేత అంచనాలు వేయించి రైతులకు సూచించబోతున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం నాడు రైతుబంధు సమితి సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉన్న రైతుబంధు సమితుల పర్యవేక్షణలో ఈసారి రైతులు క్రమబద్ధీకరించిన విధంగా పంటలు వేయబోతున్నారు.

ఈనెల 30వ తేదీనాడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ప్రారంభం కాబోతు న్నాయి. ప్రతి గ్రామంలో ఈ ఆర్‌బీకేలు రైతులకు అందుబా టులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు మొదలైనవన్నీ గ్రామంలోనే ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అగ్రీ ల్యాబ్స్‌ పరీక్షించి ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులనే ఆర్‌బీకేలలో విక్రయిస్తారు. వాటిని రైతు ఇంటికే చేరుస్తారు. ఈ కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయాధికారి రైతులకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు.

గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఇప్పటికే పునరుజ్జీవం పొందిన పల్లెసీమలు ఆర్‌బీకేల ఏర్పాటుతో మరింత కళకళలాడబోతున్నాయి. 3 వేల సంవత్సరాల నాగరిక చరిత్ర అనంతరం చేనులో కలుపు తీసే యంత్రాన్ని కూడా దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉన్న భారత వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్భరత దిశగా మళ్లించాలంటే తెలుగు రాష్ట్రాలు చూపుతున్నటువంటి చొరవనే కేంద్రం కూడా చూపవలసి ఉంటుంది. అంతే తప్ప బ్యాంకుల ద్వారా అప్పు లిప్పించి, పీఎఫ్‌లో దాచుకున్న సొమ్మును అడ్వాన్స్‌గా ఇప్పించి పండుగ చేసుకోమనే ప్యాకేజీల ద్వారా వచ్చేది ఆత్మ నిర్భరత కాదు. ఆత్మ దుర్బలతో, ఆర్థిక బర్బరతో అనాల్సి ఉంటుంది. 
-వర్ధెల్లి మురళి

muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు