కుబేరుల యుద్ధ ప్రకటన

26 Jan, 2020 00:11 IST|Sakshi

ఉపోద్ఘాతం – 1
ఈ రోజు రిపబ్లిక్‌ డే. మన గణతంత్ర దినోత్సవం. ‘భారతీయులమైన మనం, ఈ దేశాన్ని సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం’గా ప్రకటించు కున్న తర్వాత ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో డెబ్బయ్యేళ్లు. ఈ గణతంత్ర పరిపాలనా విధానం మనకు పూర్తిగా కొత్తేమీ కాదు. క్రీస్తుకు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తుశకం రెండో శతాబ్దం దాకా ఉత్తర భారత దేశంలో చిన్న చిన్న గణరాజ్యాలు చాలాకాలం పాటు మనుగడలో ఉన్నాయి. మానవేతిహాసంలో అతిగొప్ప ప్రజాస్వామికవాదిగా చెప్పదగిన గౌతమ బుద్ధుడు మెచ్చిన పరిపాలనా వ్యవస్థ గణరాజ్యాల్లో ఉండేది. మహాపండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ తాను రాసిన అద్భుత చారిత్రక నవలల్లో గణసభల తీరుతెన్నులను తన్మయత్వంతో వర్ణించారు. జనం తమను తాము పరిపాలించుకోవడమే గణతంత్రమని స్థూలార్థం. పరి పాలనలో ప్రజల ప్రమేయం ఎంత ఎక్కువగా ఉంటే, ఆ పరిపాలనా వ్యవస్థ ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత బలమైన రిపబ్లిక్‌గా అర్థం చేసుకోవాలి.

ఉపోద్ఘాతం – 2
ఈ రిపబ్లిక్‌ డేకు నాలుగైదు రోజుల ముందు దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమావేశాలు జరిగాయి. ఏటా జరుగుతూనే ఉంటాయి. అందులో విశేషం ఏమీలేదు. ప్రతి యేటా ఈ సమావేశాల సందర్భంగా ఆర్థిక వ్యత్యాసాలపై ఆక్స్‌ఫామ్‌ అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేస్తున్నది. ఈసారి కూడా విడుదల చేసింది. ఇందులో మాత్రం విశేషం ఉన్నది. భారతదే శంలో సంపన్నులు–పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసం శర వేగంగా, ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నదని ఆక్స్‌ ఫామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనే అత్యంత సంపన్నులైన టాప్‌ 100 జాబితాను పరిశీలిస్తే వీరి సమష్టి ఆస్తి భారతదేశ ప్రస్తుత వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువ. 29 రాష్ట్రాలు కలిసి విద్య–వైద్య రంగాలకు కేటాయించిన సొమ్ము కంటే కూడా ఈ నూరుగురు కుబేరుల సంపద ఎక్కువ. దేశ సంపదలో 73 శాతం జనాభాలో ఒక్కశాతం మాత్రమే ఉన్న సంపన్నుల చేతిలో వుంది. చివరి పంక్తిలో వున్న నలభై శాతం మంది పేద ప్రజల ఉమ్మడి ఆస్తి దేశ సంపదలో కేవలం ఒక్క శాతం మాత్రమే.

ఈ ధోరణిని అరికట్టడానికి ఆక్స్‌ఫామ్‌ కొన్ని సూచనలు చేసింది. ఒక్క శాతం కుబేరుల సంప దకంటే వేగంగా నలభై శాతం మంది పేదల ఆదా యాలు పెరగాలి. వ్యవసాయరంగం వంటి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడి గణనీయంగా పెరగాలి. గ్రామీణ స్థాయిలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాలి. సంపన్నుల పన్ను ఎగవేత లను కట్టుదిట్టంగా అరికట్టే చర్యలను తీసుకుంటూ విద్య–వైద్య రంగాలలో భారీగా ప్రజాధనాన్ని వ్యయం చేయాలి. తారతమ్యాలు పెరగకుండా ప్రభుత్వం తీసు కునే చర్యలను పర్యవేక్షించడానికి వీలుగా అన్నిరకాల సమాచారాన్ని పారదర్శకంగా, అందరికీ అందుబాటు లోకి తేవాలి. భారతదేశానికి ఇటువంటి అనేక సూచనలు ఆక్స్‌ఫామ్‌ చేసింది.

ఉపోద్ఘాతం–3
ఇక్కడ ప్రస్తావించదలుచుకున్న మూడో అంశం గత సోమవారం నాడు జరిగిన ఒక ఘటన. ఒకటి రెండు పత్రికల్లో ఒక చిన్న వార్తగా తప్ప మీడియా దృష్టిని పెద్దగా ఆకర్షించని విషయం. డాక్టర్‌ ఏపీ విఠల్‌ అనే ఒక మార్క్సిస్టు విశ్లేషకుడు ఆరోజు విజయవాడలో చని పోయారు. మార్క్సిస్టు ఆలోచనా విధానం కలిగిన వారిని కమ్యూనిస్టులని పిలుస్తుంటాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు ఒక డజన్‌ కమ్యూనిస్టు పార్టీలు ఉనికిలో ఉన్నాయి. ఈ పార్టీల్లో వ్యవస్థీకృతమై వున్న వారి సంఖ్య కన్నా, ఏ పార్టీలోనూ ఇమడకుండా, స్వతం త్రంగా వుంటున్న మార్క్సిస్టు ఆలోచనాపరుల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. అటువంటి వారిలో మార్క్సిస్టు మేధావిగా పేరుగాంచిన డాక్టర్‌ విఠల్‌ ఒకరు. సొంత జిల్లా గుంటూరులో వైద్యశాస్త్రం చదివిన తర్వాత నెల్లూ రులో డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి స్థాపించిన ప్రజావైద్యశాలలో పనిచేసి, అదే స్ఫూర్తితో తెలంగాణ లోని సూర్యాపేటలో మరొక ప్రజావైద్యశాలను 1971లో డాక్టర్‌ విఠల్‌ నెలకొల్పారు. కొద్దికాలంలోనే గొప్ప డాక్టర్‌గా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేరు సంపాదిం చారు. రోజుకు వందమందికి తగ్గకుండా ఔట్‌ పేషం ట్లను చూస్తూ, కనీసం రెండు మూడు ఆపరేషన్లు చేస్తూనే సీపీఎం పార్టీ తరఫున అనేక సభల్లో పాల్గొంటూ ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేసేవారు.

ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ కార్యకలాపాలు బహిరంగంగా నిర్వ హించలేని స్థితిలో ఆంధ్ర ప్రజానాట్యమండలిని పునరు ద్ధరించి సాంస్కృతికరంగం ద్వారా ఆ పార్టీ కార్యక్రమా లను నడిపించడంలో కీలకపాత్ర విఠల్‌ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎమర్జెన్సీ కాలపు సీపీఎం చరిత్ర పుస్తకానికి ముఖ చిత్రం విఠల్‌. ఒక పుష్కరకాలం గడిచిన తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య పిలుపు మేరకు అద్భుతమైన తన మెడికల్‌ ప్రాక్టీసును వదిలేసుకొని పార్టీ తరపున పూర్తికాలం పని చేయడానికి విజయవాడకు వెళ్లిపో యారు. విఠల్‌ దవాఖానా అనే ల్యాండ్‌ మార్క్‌ మాత్రం ఇప్పటికీ సూర్యాపేట పట్టణంలో చెక్కు చెదరలేదు. సుందరయ్య చనిపోయిన కొంతకాలం తర్వాత సీపీఎం పార్టీకి విఠల్‌ దూరమయ్యారు. ఎందుకు దూరమ య్యారో ఆయనెప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఆ పార్టీ వారు కూడా బహిరంగంగా ఏమీ చెప్పలేదు. అయితే, జీవితాంతం ఆయన కమ్యూనిస్టుగానే కొన సాగారు. సమకాలీన రాజకీయ అంశాలను మార్క్సిస్టు దృక్ప«థంతో విశ్లేషిస్తూ గత పదిహేనేళ్లుగా వివిధ పత్రి కల్లో వ్యాసాలు రాస్తున్నారు. చివరి రోజుల్లో ఎక్కువగా సాక్షిలో రాసేవారు. ఏ పార్టీ చట్రంలోనూ లేని స్వేచ్ఛా జీవి కనుక, విస్తృత ప్రజాసంబంధాలు కలిగిన సునిశిత మేధావి కనుక ఆయన వ్యాసాలు సిసలైన మార్క్సిస్టు భావజాలానికి అద్దం పట్టేవి. ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌ పరి ణామాలను కూడా ఈ కోణం నుంచి ఆయన విశ్లేషిం చారు. అందుకే ఈ ఉపోద్ఘాతం.

యుద్ధ ప్రకటన
ఇప్పుడు నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రకూ పైన చెప్పుకున్న మూడు ఉపోద్ఘాతాలకూ ప్రత్యక్ష సంబంధం ఉంది. ప్రజాపరిపాలనను (రిపబ్లిక్‌)ను మరింత పరిపుష్టం చేసే ఉద్దేశంతో విప్లవాత్మకమైన కార్యక్రమాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రారంభిం చింది. మూడు ప్రాంతాల ప్రజలకు అధికార పీఠాన్ని చేరువ చేసే లక్ష్యంతో ప్రకటించిన ‘మూడు రాజధా నులు’ అతిపెద్ద సంస్కరణ. ఏ రాష్ట్రానికీ లేని మూడు రాజధానులు ఏపీకి ఎందుకు? అనే విమర్శ తర్కానికి నిలబడేది కాదు. ఎందుకంటే రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అనుభవం ఏ రాష్ట్రానికీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు కూడా మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవి. మూడు ప్రాంతాలకూ రాజధానిని చేరువ చేయడంతో పాటు, పరిపాలనను ప్రజల ముంగిట్లోకి చేర్చే ఉద్దే శంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ రిపబ్లిక్‌ స్ఫూర్తికి అద్దం పట్టే చర్యలుగా పరిగణించాలి. భారతదేశంలో ఇప్పటికే పెచ్చరిల్లిన ఆర్థిక తారత మ్యాలకు పగ్గం వేయడం కోసం ‘ఆక్స్‌ఫామ్‌’ సూచించే నాటికే ఆ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసింది. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తూ ఏటా ఐదారు వేల కోట్ల రూపాయలను వ్యవసాయరంగం మీద ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇదేకాకుండా మూడు వేల కోట్ల రూపా యలను మార్కెట్‌ స్థిరీకరణ కింద, నాలుగువేల కోట్ల రూపాయలను ప్రకృతి విపత్తుల పేరు మీద కేటాయిం పులు చేసింది.

గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించి నియామకాలు కూడా పూర్తిచేసింది. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక పక్రియ లను పూర్తిగా పారదర్శకం చేస్తూ గ్రామ సచివాలయాల్లో నోటీసు బోర్డుల మీద జాబితాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఇక మూడో విషయం... ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేసే వీల్లేని కమ్యూనిస్టు వ్యవస్థను నిర్మించడమే మార్క్సిస్టుల లక్ష్యమని చెబుతారు. ఆచర ణలో  ఈ సిద్ధాంతం ఎటువంటి ఫలితాలను ఇచ్చిందనే విషయం ఇక్కడ అప్రస్తుతం. కానీ, పేద ప్రజలకు అనుకూలమైన ప్రాపంచిక దృక్పథం నిజమైన మార్క్సి స్టులకు అలవడుతుంది. ఎత్తులు, పొత్తులతో పార్లమెం టరీ రాజకీయ అవసరాలతో సతమతమై చిక్కి శల్యమై పోతున్న కమ్యూనిస్టు పార్టీల కంటే స్పష్టంగా స్వతంత్ర మార్క్సిస్టు ఆలోచనాపరులు సమాజాన్ని విశ్లేషించగలు గుతున్నారు. అందులో ప్రముఖులు డాక్టర్‌ విఠల్‌. చంద్ర బాబు అనుసరించిన విధానాలు, ఆయన ఆలోచనా ధోరణి ఆధారంగా ఆయన ప్రభుత్వం కచ్చితమైన ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా విఠల్‌ తన వ్యాసాల్లో విశ్లేషిం చారు. ఆ ప్రభుత్వాన్ని ఓడించాలని కూడా అభ్యుదయ వాదులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి తీసుకున్న నిర్ణయాలను ఆయన గట్టిగా సమర్థించారు. ఈ నిర్ణయాలు ఏవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడగలవో విశ్లేషించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ఈ కోణం నుంచే ఆయన సమర్థించారు.

ఈవారం వ్యవధిలోనే జరిగిన ఈ మూడు పరి ణామాలు ఒక్క విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. గణ తంత్ర రాజ్యస్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పటిష్టం చేయడానికి శ్రీకారం చుట్టింది. పేదలు, ధనికుల మధ్య ప్రమాదకరంగా పెరుగుతున్న అంతరాలను తగ్గించడానికి ఆక్స్‌ఫామ్‌ అనే సంస్థ సూచ నలు చేయడానికి ముందే ఈ ప్రభుత్వం ఆ దిశలో నడకను ప్రారంభించింది. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం ప్రకారం కూడా ఇది పేద ప్రజల అనుకూల ప్రభుత్వం. ఇండియాటుడే పత్రిక నిర్వహించిన సర్వేలో జనరంజకమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రముఖ స్థానం లభించింది. స్వల్పకాల పరిపాలనలోనే ఆయన ఈ ఘన తను సాధించారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు అనతి కాలంలోనే సాధించిన ప్రభుత్వంపై అప్పుడే కుట్రలు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని బాహాటంగా కూడా ప్రకటిస్తున్నారు. ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని అక్కడ సృష్టించడానికి ప్రతిపక్షనేత ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. ఇంత స్వల్పకాలంలో ఎందుకింత అసహనం?
ఎందుకంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే వర్గాల ప్రయోజనాలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాలు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. పెరిగిపోతున్న ఆర్థిక తారతమ్యాలను నిలువరించి పేద వర్గాలను సాధికారిక శక్తులుగా మలిచే విధానాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్థిక సంస్కరణల తొలి రోజుల్లో అధికారంలో వుండి ఆ పరిణామాల ఫలితా లను స్వార్థం కోసం వాడుకొని బలిసిపోయిన నాయక శ్రేణిలో చంద్రబాబు ఒకరు.

చంద్రబాబుతో పాటు పయ నించిన మరికొన్ని స్వార్థశక్తులు కూడా లాభపడి వారి ప్రభావాన్ని సమాజంలోని వివిధ రంగాలకు విస్తరిం చాయి. సినిమా, మీడియా, రాజకీయాలు, పరిశ్రమలే కాదు రాజ్యాంగ వ్యవస్థల్లోకి కూడా ఈ ధనస్వామ్య శక్తుల ప్రభావం పాకిపోయింది. అందుకే అమరావతిలో బాబు వర్గం చేసే తాటాకు చప్పుళ్లకు కూడా ఈ వ్యవస్థ లన్నీ డీటీఎస్‌ సౌండ్‌ సిస్టమ్‌లో మోత మోగిస్తున్నాయి. ఆ మోతను విన్నవారు అక్కడేదో జరిగిపోతున్నదని అపోహ పడుతున్నారు. ఏమీ జరగడం లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజాదరణ చూరగొన్నది. సంపన్న వర్గాల్లోని స్వార్థశక్తుల పప్పులు ఈ ప్రభుత్వంలో ఉడికే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఆ శక్తులన్నీ ఏకమై ధనబలంతో మరికొన్ని శక్తులను అద్దెకు తెచ్చు కొని ప్రభుత్వంపై యుద్ధ ప్రకటన చేస్తున్నాయి. రెండో ప్రపంచయుద్ధంలో సోవియట్‌ రష్యా పాలిటి లెనిన్‌ గ్రాడ్‌లాగా ఒక 29 గ్రామాలను ఈ శక్తులు పరిగణిస్తు న్నాయి. అందులోని మూడు గ్రామాలను చైనా విముక్తి పోరాటంలోని యేనాన్‌లాగా వారి మీడియా ఫోకస్‌ చేస్తు న్నది. తనకున్న సంఖ్యాబలాన్ని వాడుకుని శాసనమం డలిని బాబు దుర్వినియోగపరుస్తున్న తీరు ఆలోచనాప రులను దిగ్భ్రాంతికి గురిచేసింది.  పరిస్థితులను నెమ్మ దిగా అర్థం చేసుకుంటున్న తటస్థులు, అభ్యుదయశక్తులు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు.

నివాళి
సూర్యాపేటలో డాక్టర్‌గా వున్న రోజుల్లో ఏపీ విఠల్‌ పూర్తి పేరు ఎవరికీ తెలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్‌ విఠల్‌ అని కొందరు సరదాగా వ్యాఖ్యానించేవారు. ఆయన చనిపో యిన తర్వాతనే పూర్తి పేరు ఆదుర్తి పాండురంగ విఠల్‌ అనీ, పుట్టి పెరిగింది ఒక అగ్రహారంలోననీ తెలిసింది. తనను తాను డీక్లాసిఫై (తన వర్గం నుంచి విడివడి) చేసుకొని పీడిత ప్రజల పక్షాన నిలబడిన ఆంధ్రప్రదేశ్‌ విఠల్‌కు నివాళి.

- వర్ధెల్లి మురళి

మరిన్ని వార్తలు