ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ

25 Apr, 2018 01:06 IST|Sakshi

విశ్లేషణ

పత్రికా స్వాతంత్య్రానికి ప్రమాదం, బెదిరింపులు అనేవి జర్నలిజం ప్రారంభ కాలం నుంచే మొదలవుతూవచ్చాయి. ఇవాళ, ప్రెస్‌పై అలాంటి దాడులు చిన్న చిన్న పట్టణాల్లో కూడా సర్వసాధారణమై పోయాయి.
ప్రపంచ స్వేచ్ఛా సూచిక (రిపోర్ట్స్‌ వితౌట్‌ బోర్డర్స్, 2017)లో భారత్‌ స్థాయి 3 స్థానాలు పతనమై 136కి దిగ జారింది. దక్షిణాసియాలోనే అత్యంత స్వేచ్ఛాయుత మైన దిగా భారత్‌ మీడియాను పరిగ ణిస్తుంటాం. కానీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలను చూస్తే మన మీడియా పాక్షికంగానే స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు భావించాలి. గత ఏడాది దేశంలో 11 మంది జర్నలిస్టులు హత్యకు గురికాగా, 46 దాడులు జరిగాయి. పోలీసు స్టేషన్లలో విలేకరులపై 27 కేసులు నమోద య్యాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో వార్తలను నివేదించిన సందర్భాల్లో జర్నలిస్టులకు ఎదురైన చిక్కులు మాత్రమే.

2017 సెప్టెంబర్‌ 5న బెంగళూరులో గౌరీ లంకేష్‌ హత్య ఘటన, పత్రికా స్వేచ్ఛ గురించి డబ్బా వాయిం చేవారిని తమ పగటి కలలనుంచి బయటపడేసింది. ఇలాంటి ఘటనలు దేశంలో సాధారణమైపోయాయి. గౌరీ లంకేష్‌ హత్య జరిగిన 2 రోజుల తర్వాత బిహార్‌ లోని అర్వాల్‌ జిల్లాలో రాష్ట్రీయ సహారా విలేకరి పంకజ్‌ మిశ్రాను బైక్‌మీద వచ్చిన ఇద్దరు హంతకులు కాల్చి చంపారు. గత దశాబ్ద కాలంలో జర్నలిస్టులను హత్య చేసినవారు ఏ శిక్షా లేకుండా తప్పించుకున్న వారి శాతం నూటికి నూరు శాతం పెరిగింది. 2016 గ్లోబల్‌ ఇంప్యు నిటీ ఇండెక్స్‌ (జర్నలిస్టుల సంరక్షణ కమిటీ) ప్రకారం భారత్‌ 13వ స్థానంలో ఉండటం హేయం. 

పత్రికా స్వాతంత్య్రానికి ప్రమాదం, బెదిరింపులు అనేవి జర్నలిజం ప్రారంభ కాలం నుంచే మొదలవుతూ వచ్చాయి. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ కాలంలోనే బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ కన్నింగ్‌ గ్యాగింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. ముద్రణా సంస్థల ఏర్పాటు, అవి ఏం ముద్రిస్తున్నాయి, సంబంధిత లైసెన్సులు వంటి వాటిని ప్రభుత్వమే ఈ చట్టం ప్రాతిపదికన క్రమబద్ధీక రిస్తూ వచ్చింది. బ్రిటిష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా దేన్ని  ప్రచురించినా ప్రభుత్వ ఉల్లంఘనగా పరిగణించారు. 1876–77 ధాతుకరువు గురించి స్థానిక పత్రికలు వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన ప్పుడు ప్రెస్‌ యాక్ట్‌ 1878ని తీసుకొచ్చి అమర్‌ బజార్‌ పత్రికతో సహా 35 స్థానిక పత్రికలపై చర్యలు తీసుకున్నారు. వలసప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకుగాను బాల గంగాధరతిలక్‌నే రెండుసార్లు జైల్లో పెట్టారు.

ఇవాళ, ప్రెస్‌పై అలాంటి దాడులు చిన్న చిన్న పట్ట ణాల్లో కూడా సర్వసాధారణమై పోయాయి. ప్రాంతీయ పత్రికలు లేదా చానల్స్‌లో ఫ్రీలాన్స్‌ ప్రాతిపదికన పని చేస్తున్న విలేకరులే చాలావరకు బాధితులుగా మిగులు తున్నారు. స్టూడియోలో లేక పత్రికాఫీసులలో పనిచేసే వారి కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరులే దాడుల పాలవుతున్నారు. ఒడిశాలో జీడిమామిడి ప్రాసెసింగ్‌ ప్లాంటులో బాలకార్మికులపై వార్త రాసి పంపిన తరుణ్‌ ఆచార్యను 2014లో కత్తుల్తో పొడిచారు. పంజాబ్‌ ఎన్ని కల నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించిన కారణంగా జర్నలిస్టు దేవిందర్‌ పాల్‌పై మద్యం బాటిల్స్‌తో దాడి చేశారు. ఇక అదే సంవత్సరం మార్చి 14న ఒక పాత్రి కేయురాలిపై సామూహిక అత్యాచారం జరిపారు. 

చట్టపరమైన రక్షణ పరిమితం కావడంతో పత్రికా స్వేచ్ఛ గణనీయస్థాయిలో ఆంక్షలకు గురవుతోంది. ఆన్‌ లైన్‌ దాడులు, లీగల్‌ నోటీసులు, సెక్షన్‌ 124 (ఎ) కింద జైలుకు పంపే ప్రమాదం వంటివాటితో పత్రికా స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడుతోంది. తమపై వ్యాఖ్యలు చేస్తున్న విలేకరులపై రాజకీయనేతలు, సెలబ్రిటీలు పరువు నష్టం కేసులు పెట్టడం సహజమైపోయింది. 1991–96 మధ్యలో జయలలిత ప్రభుత్వం ఒక్క తమి ళనాడులోనే 120 పరువు నష్టం కేసులు పెట్టింది. ఒక అనుకరణ ప్రదర్శనలో జయలలిత దుస్తులు ధరించి వచ్చినందుకు టెలివిజన్‌ యాంకర్‌ సైరస్‌ బరూచాపై కేసు పెట్టారు. చిన్న, మధ్యతరహా మీడియా సంస్థలు జర్నలిస్టులపై కేసులను పట్టించుకోక పోవడంతో కాసింత రక్షణ కూడా కోల్పోతున్నారు. క్రిమినల్‌ స్వభావం ఉన్న పరువునష్టం కేసులను రద్దు చేయడంపై జర్నలిస్టులు పోరాడాలి. అప్పుడే స్థానిక, ప్రాంతీయ పత్రికల విలేకరులు పరువునష్టం కేసుల భయం లేకుండా విధులు నిర్వర్తించే వీలుంది.

సైద్ధాంతికంగా పత్రికా స్వేచ్ఛ అనేది అవధులు లేని పరిపూర్ణ భావన. కానీ ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థ పత్రికాస్వేచ్ఛపై గణనీయంగా ఆంక్షలు విధిస్తోంది. అధి కారిక రహస్యాల చట్టం దేశ రక్షణకు చెందిన వ్యవహా రాలపై వార్తలు రాయడాన్ని కూడా నిషేధిస్తోంది. పార్ల మెంట్‌ కనీసంగానైనా జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసు కొచ్చి దేశద్రోహ చట్టాన్ని వారిపై ప్రయోగించ కూడా కట్టడి చేయడం అత్యవసరం. ఇతర దేశాల్లో పాత్రికేయు లకు రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో మార్పులు చేస్తు న్నారు. జర్నలిస్టులు మొదట పంపిన వార్తా కథనాల్లో ఏవైనా అతిశయోక్తులు ఉంటే వాటిని తొలగించుకోవడా నికి, మార్పులు చేయడానికి కూడా కొన్ని దేశాల్లో అవ కాశమిస్తూ వారిని చట్టం కోరల నుంచి బయటవేసేలా చట్టాలు చేస్తున్నారు. 

జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నందున, కీల కాంశాలపై నాణ్యమైన, పరిణామాత్మకమైన కథనాలకు అవకాశాలు రానురాను హరించుకుపోతున్నాయి. బార్‌ కౌన్సిల్‌ లాగే భారత పత్రికా మండలి కూడా జర్నలిస్టుల స్థాయిని పెంచేందుకు, రక్షణ కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. జర్నలిస్టుల్లో అనైతిక, వృత్తి వ్యతిరేక ప్రవర్తనను అదుపు చేసే చర్యలు చేప ట్టాలి. అదేసమయంలో అన్ని రకాల మీడియాలకు మరింత రక్షణ కల్పించకపోతే, ప్రజాస్వామ్యం బల హీనపడే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం భవిష్యత్తు కోసం జర్నలిస్టుల భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడకూడ దన్నదే కీలకం.


వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు
వరుణ్‌ గాంధీ
fvg001@gmail.com

మరిన్ని వార్తలు