స్థిరమైన ప్రగతికే ఓటు వేయాలి

14 Nov, 2018 00:55 IST|Sakshi

అభిప్రాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పన్ను లు పెంచారు, అప్పులు చేశారు. కానీ, విద్య, వైద్య, రవాణా, కలుషితాల నివారణ, అవినీతి నిర్మూలన మొదలైన వాటి కోసం ఖర్చు చేయవలసినంత చేయలేదు. ఆ డబ్బంతా ఆడంబరాలకు, అట్టహాసాలకు ఖర్చుచేశారు. పాపం ప్రజలు.. ధరలు ఎంత పెరిగినా ఫరవాలేదు, నిరుద్యోగం ఎంత పెరిగినా ఫరవాలేదు, అవినీతి ఎంత పెరిగినా ఫరవాలేదు, అపరిశుభ్రత, కాలుష్యం, లంచగొండితనం, విచ్చలవిడిగా తాగుడు, ఆడుడు, హత్యలు, ఆత్మహత్యలు ఎంత పెరిగినా ఫరవాలేదు కానీ ఏవో కొన్ని పెన్షన్లు, సబ్సిడీలు, రుణమాఫీలు, నిరుద్యోగభృతులు ఇస్తే ప్రజలు సంబరపడిపోతారని భ్రమిస్తున్నారు. గవర్నమెంట్‌ను  చక్కగా నడిపి తద్వారా డబ్బు మిగిల్చి ఇచ్చేటివి ఇవ్వక, చేసేటివి చేయక ప్రజలు టాక్స్‌ల ద్వారా కట్టిన డబ్బును ఇలా ఖర్చు చేయడం ఎంతవరకు సబబు. 

ఒక చైనీస్‌ సామెతుంది... ‘ఎవరికైనా ఇవ్వదలచుకుంటే చేపను పట్టడానికి గాలాన్ని ఇవ్వు కాని నేరుగా చేపనే పట్టి ఇవ్వకు’ అని.  అంటే, జనాల్ని సోమరిపోతులుగా తయారు చేయకుండా, కష్టపడి సంపాదించుకోవడానికి అవసరమైన శిక్షణలను, పనిముట్లను, పరికరాలను మాత్రమే ఇవ్వాలి అని ఉపదేశించడమే.  ధరలు ఎంత పెరిగినా ఫరవాలేదు, నిరుద్యోగం ఎంత పెరిగినా ఫరవాలేదు, దవాఖానాలు, విద్యాలయాలు ఎంత భ్రష్టు పట్టినా, తోవలు ఎంత కంకర తేలినా, లంచగొండితనం ఎంత బాహాటమైనా, హత్యలు ఆత్మ హత్యలు ఎంత పెరిగినా పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని నడపడం గొప్ప పని అనిపించుకోదు. జనాలు ఈ పైపై మెరుగులకు మోసపోకూడదు.  అందుకే స్థిరమైన ప్రగతికి చెందిన వాటిని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. పైపై మెరుగులు ఎల్లకాలాలకు చెందినవి, స్థిరమైనవి కావు. ఎప్పుడూడిపోతాయో, మారిపోతాయో తెలియదు. అందుకే స్థిరమైన ప్రగతికి చెందిన కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. టెంపరరీ బెనిఫిట్స్‌ కాదు కావలసింది, పర్మనెంట్‌ బెనిఫిట్స్‌. వాటిని కల్పించే ప్రభుత్వాన్ని పాలకులను ఎన్నుకోవాలి.  

అభివృద్ధి చెందిన ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్‌ లాంటి దేశాలలో ఓటర్లు ప్రభుత్వాలను ధరల పెరుగుదల, తరుగుదలను బట్టే ఎన్నుకుంటారు. కానీ మన దేశంలో ధరల పెరుగుదలను అతి ముఖ్య అంశంగా భావించి ఓటు వేయరు. అటు తదుపరి అవి విపరీతంగా పెరిగితే తల బాదుకుంటారు.  కె.సి.ఆర్‌.గారు సి.ఎం. అయ్యాక ప్రభుత్వం ఖర్చు అయిదేళ్ళలో అయిదింతలు ఎక్కువయింది. దీనికి కారణం అప్పులు చేయుట, టాక్సులు పెంచుట, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ను కుంటుపరచి వాటికి చెందిన వనరులను ఏవేవో అట్టహాసాలకు, ఆర్భాటాలకు, పటాటోపాలకు తరలించడమే. వీటికి తోడు అయినవారికి, కానివారికి, అవసరమున్నవారికి, లేనివారికి అడిగినన్ని భూములు, నిధులు అవసరానికన్నా ఎక్కువ కేటాయించడమే. ఈ విచ్చలవిడి ఖర్చులకు దాదాపు రెండు లక్షల కోట్ల అప్పు చేసినట్లు పత్రికలు, తదితరులు పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారు. వీటిపై పౌరులు కోట్లాది రూపాయలు ‘మిత్తి’ కట్టవలసి ఉంటుంది. ఆ భారాన్ని ప్రజలు ధరల పెరుగుదల రూపంగా  మోయవలసి ఉంటుంది.  

మనకు కూడా ఈ పక్క ఆ పక్క రాష్ట్రాలుంటాయి. వాటితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే, రోడ్లు, రైళ్లు, జలవనరులు, వ్యాపారాలు, ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి ఒకరితో ఒకరికి. ఒకరు సహకరించంది మరొకరికి నడవదు. ఈ అవగాహన మన కె.సి.ఆర్‌.కి ఏమాత్రం ఉన్నట్లు లేదు. ఉదాహరణకు ఆంధ్రా నుండి తెలంగాణ విడిపోయాక ఏపీ సీఎంతో సుహృద్భావంగా, స్నేహంగా ఉంటే పరస్పర సహాయాలకు పనికొస్తుందన్న ఆలోచన లేకుండా విమర్శలు చేస్తున్నారు.  ఇక సీఎం చంద్రబాబు విషయానికి వస్తే దేశానికే పీఎం అవబోతున్నట్లు, దానికి కావలసినంత తెలివి తనవద్ద తప్ప మరెవ్వరి వద్ద లేనట్లు ఆదరాబాదరాగా అటు బెంగాల్‌కు, ఇటు కర్ణాటకకు, అటు ఒడిశాకు, ఇటు తమిళనాడుకు తిరిగొచ్చారు.  అచటి నేతలనందరినీ ఏకం చేసేసి ఒక కూటమిగా ఏర్పరచి, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో కూడా యు.పి. సి.ఎం., మాయావతి తదితరులతో సంప్రదింపులు జరిపి వారినందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పీఎం అవుదామనుకున్నారు. తన తదుపరి తన కుమారున్ని సీఎంగా చేయొచ్చునని కూడా భావిస్తున్నారు. అది మిస్‌ ఫైర్‌ అయి, అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. అది అతనిని దేశవ్యాప్తంగా నవ్వులపాలు చేసింది. అందుకే నేతలు స్థిరమైన ప్రగతిపై దృష్టి పెడితే ఎటు వంటి మ్యాజిక్కులు, జిమ్మిక్కుల అవసరం ఉండదు.

వెల్చాల కొండలరావు
వ్యాసకర్త, గౌరవ అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ సమితి, తెలంగాణ 

మరిన్ని వార్తలు