కొత్త నమూనాతో పట్టణాభివృద్ధి

24 Oct, 2018 01:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తమ గ్రామాన్ని పట్టణాభివృద్ధి సంస్థ అహ్మదాబాద్‌లో కలపడాన్ని నిరసిస్తూ 15కి.మీ.దూరంలోని భావన్‌పూర్‌ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సూరత్, హిమ్మత్‌నగర్‌ సమీప గ్రామాల్లో కూడా ఇటువంటి నిరసనలే కొనసాగుతున్నాయి. పట్టణ అభివృద్ధి ఫలాలను తిరస్కరించడం ఆశ్చర్యకరమైన ధోరణి. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం కూడా వలసదారులు తిరుగుముఖం పట్టడానికి కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ సంక్షోభం కారణంగా హరియాణా నుంచి ఢిల్లీ, గుర్‌గావ్‌లకు  వచ్చి, డ్రైవర్లుగా, క్లీనర్‌లుగా పనిచేసేవారంతా చలికాలం రాగానే కాలుష్యాన్ని భరించలేక గ్రామాలకు తిరుగుముఖం పడుతున్నారు. ఈ ధోరణి పెద్ద నగరాల్లోనే కాదు. కాన్పూర్, గ్వాలియర్‌ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. 

దేశంలోని జనాభాలో 34శాతానికి పైగా జనం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 2011తో పోలిస్తే ఇది మూడు శాతం ఎక్కువ. 2005 వరకు 50 లక్షల వరకు జనాభా వున్న నగర పరిధి అలాగే వుండగా, చిన్న సమూహాలు పెరుగుతూ వచ్చాయి.   దేశంలోని పట్టణాలన్నీ పేదరికంతో, మౌలిక సదుపాయాలు లేకుండా, చిన్నపాటి ప్రణాళిక కూడా లేనట్టు కనిపిస్తాయి. దేశంలోని పట్టణాలన్నీ ఒక్కలాంటివే. ప్రాంతీయ, భౌగోళిక, సాంస్కృతిక వంటి భేదాలేవీ వీటి మధ్య కనిపించవు. పట్టణ జనాభా పెరగడంతో కనీస అవసరాలైన తాగునీరు, ప్రజా రవాణా, మురుగునీటి పారుదల, వసతి సౌకర్యాల అవసరం పెరిగింది.

ఇదిలావుంటే, స్మార్ట్‌ సిటీల వ్యవహారం చూస్తే 90 స్మార్ట్‌ సిటీలలో 2,864 ప్రాజెక్టులు చేపట్టగా కేవలం 148 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 70శాతానికి పైగా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చివరికి, ఇంకా కోటికిపైగా గృహాలు అవసరం పడుతున్నాయి. ఇక ప్రతి ఏడాది వచ్చే వరదలు, డెంగ్యూ వంటి వ్యాధులు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలను మసకబారుస్తున్నాయి. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్, బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చినప్పటికీ పట్టణానికి ఉండే సమస్యలు తీరవు.

పట్టణం అని దేనిని పరిగణించాలనేది కూడా ఒక ప్రాథమిక సమస్యే. పట్టణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి రావడంతో జనాభా, స్థానిక పాలనా సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగుల శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గవర్నర్‌ ఒక ప్రాంతాన్ని పట్టణంగా, మున్సిపాలిటీగా గుర్తిస్తారు. ఇంత అస్పష్టమైన నిర్వచనం కారణంగా పట్టణంగా పరిగణించడంలో అనేక వ్యత్యాసాలు తలెత్తుతున్నాయి. కొండప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాల్లో పట్టణాలను చూస్తే జనాభా వందల్లోనే ఉంటారు. గుజరాత్, మేఘాలయల్లోని వలసల్లో 13 వేలమంది వున్నా గ్రామాలుగా భావిస్తారు. 

పట్టణ మౌలిక వసతుల కోసం పెడుతున్న ఖర్చు చాలా స్వల్పం కావడం మరో సమస్య. ఇప్పటికీ మన దేశం తలసరి 17 డాలర్లు ఖర్చు చేస్తుం డగా, చైనా 116 డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఎన్నెన్నో విభిన్నమైన పథకాలను ప్రకటిస్తున్నాయి. కానీ, అమలు మాత్రం జరగడం లేదు. ఆర్థిక వనరులు కూడా అంతంతమాత్రమే. జైపూర్, బెంగళూర్‌ తమకు రావల్సిన ఆస్తి పన్నులో కేవలం 5 నుంచి 20 శాతం మాత్రమే వసూలు చేయగలుగుతున్నాయి.

ఇంత స్వల్ప ఆర్థిక వనరులతో స్థానిక సంస్థలు ఎలా మనుగడ సాగించాలి? దీంతోపాటు స్థానిక సంస్థలకు నైపుణ్యం కలిగిన వారు లేకపోవడం మరో కొరత. వనరుల తరలింపు, కనీస సేవలు అందించడానికి, ప్రాథమికమైన పద్దుల నిర్వహణకు నగరాల్లో కూడా తగినంత మంది సిబ్బంది లేరు. పట్టణ వలసలకు సంబంధించి ఒక స్పష్టమైన విధానం ఉండాలి. వలసలను దృష్టిలో పెట్టుకుని పట్టణ పథకాలు, కార్యక్రమాలు రూపొందించుకోవాలి. వలసదారులపై వివక్షను రూపుమాపడం, వాళ్ల హక్కులను కాపాడటం అభివృద్ధికి దోహదపడతాయి. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వలసలను తగ్గించవచ్చు. 

పట్టణ ప్రణాళికలు రూపొందించేవారు మన పట్టణాభివృద్ధి చారిత్రక సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గత శతాబ్దంగా మన పట్టణాలు ఎన్నో మార్పులకు గురయ్యాయి. ఈశాన్య భారతంలో హిల్‌ స్టేషన్లు నెలకొల్పాలి. వాటి ఆర్థిక అవసరాల కోసం టీ, కాఫీ తోటల సాగు పెంచాలి. అలాగే, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలి. చాలా పట్టణాలు అస్తవ్యస్తంగా పెరిగిపోయాయి. కంటోన్మెంట్‌లు, సివిల్‌ లైన్లను ఏర్పాటు చేసి, రైల్వే సౌకర్యం కూడా కల్పించాలి. పట్టణాభివృద్ధికి మనకో ప్రత్యేకమైన నమూనా కావాలి. భారత్‌ వెలిగిపోవాలంటే, పట్టణాభివృద్ధి అత్యవసరం.

వ్యాసకర్త: వరుణ్‌ గాంధీ, పార్లమెంటు సభ్యులు
ఈ–మెయిల్‌ : fvg001@gmail.com

మరిన్ని వార్తలు