వ్యవసాయాభివృద్ధితోనే గ్రామాల్లో వెలుగులు

29 Jan, 2019 01:37 IST|Sakshi

విశ్లేషణ

గ్రామీణ సమాజంలో వెలుగులు పూయించాల ంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయదారులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమమే వ్యవసాయాభివృద్ధికి కొలబద్ద. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా.. అధికారంలో ఉన్న వారు వ్యవసాయ అనుబంధ రంగాలైన చేపలు, ఆక్వారంగంలో అభివృద్ధిని వ్యవసాయరంగ ఆదాయంలో జోడించి వ్యవసాయరంగం రెండంకెల అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడం రైతాంగాన్ని వంచించడమే. కారణం ఆక్వా ఆదాయం రాష్ట్రంలో కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం.  2011 గణాంకాల ప్రకారం దేశంలో 55.49% జనాభా వ్యవసాయంపై ఆధారపడగా అందులో 33.6% వ్యవసాయ కార్మికులు. మిగతావారు వ్యవ సాయదారులు, కౌలు రైతులు. సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీ (సిఎస్‌పిఎస్‌) నివేదిక ప్రకారం 76% మంది రైతులు వ్యవసాయాన్ని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లోకి మరలాలని భావిస్తున్నారు. కానీ, ప్రత్యామ్నాయ మార్గాలు లేకనే.. నష్టాల్ని, కష్టాల్ని భరిస్తూ విధిలేక వ్యవసాయం చేస్తు న్నారనే నగ్నసత్యాన్ని పాలకులు మరవకూడదు.  

ప్రముఖ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ నేతృత్వంలోని కమిషన్‌ 2007లోనే ఓ సమగ్రమైన నివేదిక అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికలో విలువైన సూచనలు ఉన్నాయి. ఇదికాక, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో ఏర్పాటయిన నీతి ఆయోగ్‌ వ్యవసాయరంగంపై ఓ సమగ్ర విధాన పత్రాన్ని అందించింది. ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ (ఒఇసిడి) తాజా గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లల్లో వివిధ పంటలు చేతికొచ్చాక.. మార్కెట్‌కు చేరేలోపు జరిగిన నష్టం (పోస్ట్‌ హార్వెస్ట్‌ నష్టాలు) 4% నుంచి 16%కు పెరిగాయి. వీటిలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు లాంటివి ప్రధానమైనవి.  రైతులకు హెక్టారుకు ఏడు వేల రూపాయలు సబ్సిడీ అందించి ఎరువులపై నియంత్రణ ఎత్తివేయాలని సలహా సంఘం సూచించినప్పటికీ దానిని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలాగే, గోధుమ, వరి, బియ్యంలాంటి వాటిని ఎఫ్‌సీఐ ద్వారా సేకరించడం మానుకుని, ఆ బాధ్యతను రాష్ట్రాలకు వదిలి పెట్టాలన్న సూచన సత్ఫలితాలను సాధించకపోవడం. ముఖ్యంగా.. గత ఐదేళ్లల్లో విత్తనోత్పత్తిలో అధునాతన పద్ధతులేమీ పాటించకపోవడం వల్ల అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు అందుబాటులోకి రాలేదనే వాస్తవాన్ని నీతిఆయోగ్‌ ఎత్తిచూపింది.  

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదికాలంగా ఎకరాకు రూ. 4,000 నగదు నేరుగా రైతు ఖాతాలో వేసే పథకాన్ని అమలు చేస్తున్నది. రెండవసారి అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ. 5,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కాకుండా పంట నష్టపోయే రైతులను ఆదుకోవడానికి సమగ్ర బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న పథకాల పట్ల కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతృత్వం లోని ప్రభుత్వం.. గత ఐదేళ్లుగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నప్పటికీ.. రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత రైతాంగం సంక్షేమం కోసం రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్షల పేరుతో హడావుడి చేశారు. ఇక, 2014 ఎన్నికలముందయితే.. అధికారంలోకి రాగానే బేషరతుగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఏవిధంగా వంచించిందో అందరూ గమనించారు.

ఒక్కసారి కూడా చంద్రబాబు డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేలేదు. కనీస మద్దతు ధరలు పెంచితే వినియోగదారుడిపై భారం పడుతుంది కనుక స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు లను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిడ్‌ దాఖలు చేసినా.. బాబు పెదవి విప్పలేదు. ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో మైత్రీ బంధం ఉంది గనుక. దక్షిణాదిన కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇస్తున్నట్లు కనీసం బోనస్‌ కూడా ప్రకటించలేదు. ఇక, రైతు రుణమాఫీని ఓ ఫార్సుగా చేశారు. 2014 ఎన్నికల ముందు బాబు రైతుల రుణమాఫీ వాగ్దానం చేసే నాటికి రాష్ట్రంలో రైతుల అప్పులు రూ.87,612 కోట్లు. తరచూ రుణ మాఫీకి కటాఫ్‌ డేట్లు మార్చారు. కోటయ్య కమిటీ వేసి లక్షరూపాయల రుణం కంటే తక్కువ మొత్తాలకు మాత్రమే రుణమాఫీ అన్నారు. రుణభారం కేవలం రూ. 24,000 కోట్లుగా లెక్క తేల్చి... దానిని ఐదేళ్ల పాటు దఫాలవారీగా ఇస్తామని చెప్పి.. కేవలం 13,000 కోట్లు చెల్లించి, ఇప్పటికీ ఇంకా రూ. 11,000 కోట్లు చెల్లించలేదు. ప్రభుత్వం చేసిన రుణమాఫీ మొత్తం వడ్డీలకే సరిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. ఆకర్షణీయమైన నినాదాలు తప్ప టీడీపీ రైతుల సంక్షేమానికి నిర్దిష్టంగా చేసిన మేలు మచ్చుకైనా కనపడదు. మరోపక్క.. అనంతపురం జిల్లాలో ‘కరువే మనలను చూసి భయపడి పారిపోయేలా చేస్తాం’ అంటూ ఆర్భాటంగా వందల కోట్లతో రెయిన్‌ గన్‌లు కొని.. నీళ్లు లేక వాటిని మూలన పెట్టేశారు. ఈ ఏడాది 30.55 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా.. వివిధ ఎత్తిపోతల పథకాల కింది ఆయకట్టుకు నీరు అందించలేకపోవడంతో కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే నీరివ్వాలనే ప్రభుత్వ నిర్ణయం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. నాలుగున్నరేళ్లల్లో సంభవించిన కరువు, తుపాన్లతో భారీగా జరిగిన పంట నష్టానికి రైతులు కోలుకోలేని దైన్యస్థితిలో పడిపోయారు.

దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీని ఇటీవల 35,000 మంది రైతులు ముట్టడించి కేంద్రానికి చెమటలు పట్టించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు. మోదీ గద్దె దిగాలని కొన్నిరాజకీయ పార్టీలు నినదిస్తున్నాయి. కానీ, అధికారంలోకి ఎవరొచ్చినా వ్యవసాయరంగ పరిస్థితిలో మార్పురావడంలేదు. అధిక ఆదాయం చేకూర్చే రంగంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం అసాధ్యమేమీ కాదు. గ్రామీణ ప్రాంతం లోని యువత శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చాలి. విద్య, వైద్య సదుపాయాలు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలను విస్తృతపర్చాలి. ఈ చర్యలు చేపడితే వ్యవసాయరంగంలో వెలుగులు పూయించడం సాధ్యపడుతుంది.

వ్యాసకర్త శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మాజీ మంత్రి
డా‘‘ ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు

 

మరిన్ని వార్తలు