న్యాయస్థానాలు మూడో సభ కానున్నాయా?

26 May, 2020 01:17 IST|Sakshi

సందర్భం 

ఈ మధ్య దేశ న్యాయస్థానాలు సంచలన తీర్పులు, కటువైన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. గతేడాది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల విచారణ, అనంతరం ఆయనకు లభించిన క్లీన్‌చిట్‌ వివాదాస్పదంగా మారింది. ప్రపంచ న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2018 జనవరి 12వ తేదీన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ న్యాయవ్యవస్థ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. రెండేళ్ళ తర్వాత దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే వారు చెప్పింది నిజమేననిపిస్తోంది. పార్లమెంట్‌ ఉభయ సభలకు తోడు న్యాయవ్యవస్ధ మూడో సభగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. కొందరు న్యాయమూర్తులు అత్యుత్సాహంతో  రాష్ట్రాల పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుం టున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్యనిర్వాహక, చట్ట సభల్లాగే న్యాయవ్యవస్థ కూడా వ్యవహరిస్తే న్యాయమూర్తులు కూడా అణచివేతదారులుగా మారి పౌర స్వేచ్ఛకు భంగం కలిగిస్తారని ప్రముఖ ఫ్రెంచ్‌ రాజనీతి వేత్త విలియం మాంటెస్‌క్యూ హెచ్చరించారు. కార్యనిర్వాక, చట్ట సభలు చేసే పనిని న్యాయస్థానాలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.

1950 జనవరి 28వ తేదీన భారత ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మాట్లాడుతూ, ‘దేశ  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన పార్లమెంట్‌ విధులకు సుప్రీంకోర్టు కానీ, న్యాయస్థానాల తీర్పులు కానీ ఆటంకం కాకూడదు. న్యాయ స్థానాలు గానీ, న్యాయవ్యవస్థ కానీ పార్లమెంట్‌ ఉభయ సభలకు తోడుగా మూడో సభగా వ్యవహరించకూడదు’’ అని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ కూడా ‘‘ఐదారుగురు పెద్దమనుషులు సుప్రీంకోర్టులో కూర్చుని శాసస వ్యవస్థ రూపొందించిన చట్టాలను తనిఖీ చేయడాన్ని, అలాగే వీరి వ్యక్తిగత చైతన్యం, లేదా పక్షపాత లేక దురభిప్రాయాల తోడుతో తీసుకునే నిర్ణయాలతో ఏ చట్టం సరైంది, ఏ చట్టం సరైంది కాదు అని నిర్ధారిస్తే వాటిని విశ్వసించడాన్ని నేను ఊహిం చలేను’’ అని విస్పష్టంగా చెప్పారు.

సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ ఖట్జూ కొంతకాలం క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ, సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం మంది అవినీతి పరులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2010 మట్టూ ప్రియదర్శిని కేసులో ఆయన తీర్పునిస్తూ, ‘న్యాయ వ్యవస్థ స్వయం నియంత్రణ పాటించాలి, సూపర్‌ లెజిస్లేచర్‌గా వ్యవహరించడానికి ప్రయత్నించకూడదు’ అన్నారు. న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్‌ మరో ముందడుగు వేసి సుప్రీంకోర్టులోని ఎనిమిది మంది న్యాయమూర్తులు అవినీతిపరులని ఆరోపిస్తూ, వారి పేర్లను సుప్రీంకోర్టుకు అందజేసి, ధైర్యం ఉంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్‌ విసిరారు.  

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. ఈ తీర్పులు, ఆదేశాలపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ సీఎం చంద్రబాబుని విశాఖ పోలీసులు సి.ఆర్‌.పి.సి.సెక్షన్‌ 151 క్రింద అరెస్ట్‌ చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. అంతేకాక రాష్ట్ర డి.జి.పి. గౌతం సవాంగ్‌ను కోర్టులో నిలబెట్టి ఆ సెక్షన్‌ మొత్తాన్ని చదివించింది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను ఎగువ కోర్టులు తప్పు పట్టి, కొట్టి వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి తప్పులు చేసిన కింది కోర్టుల వారిని ఉన్నత న్యాయస్థానాలు తమ వద్దకు పిలిపించుకుని సంబంధిత చట్టాలు, శాసనాలను చదవమంటే ఎలా ఉంటుంది? ఏ మాత్రం హుందాగా ఉండదు. 

ఇటీవల నర్సీపట్టణానికి చెందిన డాక్టర్‌  సుధాకర్‌ వ్యవహారంలో కూడా కోర్టు ఆదేశాలు వివాదంగా మారాయి. అతను విశాఖలో పబ్లిక్‌ న్యూసెన్స్‌కు పాల్ప డుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతున్నట్లు వీడియోల్లో ఉంది. అతనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు వచ్చారు. పోలీసులను కూడా తిడుతూ వారిని ఎదిరిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయి. ఒక వైద్యుడిపై లాఠీచార్జీ చేసి అమానుషంగా ప్రవర్తించారనే భావనతో న్యాయస్థానం ఉంది. మంచిదే, అయితే చట్టం ముందు అందరూ సమానులే. అందరికి సమాన హక్కులుంటాయి. కానీ లాక్‌డౌన్‌ సమయంలో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు వేలాది మందిని విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టారు. ఇటువంటి దృశ్యాలు న్యూస్‌ చానళ్ళలోనూ, పేపర్లలోనూ నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏపీతో సహా దేశం లోని ఏ న్యాయస్థానం ఈ అకృత్యాలపై సుమోటో కేసుగా తీసుకుని అమాయకులను కాపాడటానికి ఎందుకు ప్రయత్నించదు? న్యాయమూర్తులు తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా స్వయం నిర్ణయాధికారం పేరుతో సుమోటోగా కేసులు చేపట్టే ముందు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు లోని సహచర న్యాయమూర్తుల అంగీ కారం కూడా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనెల 24న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుసుప్రీంకోర్టు’ అనే అంశంపై ప్రసంగిస్తూ న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అంతరం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు కేసులు స్వీకరించే విషయంలో  విచక్షణ చూపుతున్నాయని చెబుతూ.. 2009లో మండల్‌ కమిషన్‌ నివేదికపై దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు దానికి సంబంధించిన కేసును అడ్మిట్‌ చేసుకుని విచారించిందని, అయితే ఇటీవల పౌరసత్వ బిల్లులపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే అవి సమసిపోయే వరకూ కేసును అడ్మిట్‌ చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. ‘వలస కార్మికుల వ్యవహారంలో జోక్యం చేసుకోలేని సుప్రీంకోర్టు.. జైపూర్‌ పార్క్‌ సుందరీకరణ పనులు పర్యవేక్షిస్తామని చెప్పింది. ఇలాగైతే న్యాయస్థానాల నుంచి ఏమి ఆశించగలం?’ అని జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ ప్రశ్నించారు. నిజమే.. ప్రశ్నించి, పరిశీలించి, న్యాయం చేయాల్సిన వ్యవస్థపైనే ప్రశ్నల వర్షం కురుస్తోంది. గతంలో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు చెప్పినట్లు ఇది మన ప్రజాస్వామ్యానికి ఏమంత మంచి పరిణామం కాదు.

వ్యాసకర్త : వి.వి.ఆర్‌. కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్
మొబైల్‌ : 95052 92299

మరిన్ని వార్తలు