విస్మృత కవి వేణుగోపాలాచార్య

12 Jun, 2020 02:22 IST|Sakshi
నేడు వేణుగోపాలాచార్య జయంతి

సందర్భం

‘పట్నంలో షాలిబండ –పేరైన గోలకొండ ’’–అని జానపద శృంగార భావాలతో రస తరంగాలలో ఓలలాడించిందా కలం ... ’’కౌసల్య తనయ శ్రీ రామ కౌస్తుభాగా ’ –అని తెల తెలవారుతున్న సమయంలో తెలుగు పదచిత్రాలతో గంభీర స్వరంతో శ్రీనివాసునికి  మేలుకొలుపు పాడినదా గళం .. అంతేకాదు ’’జయ జయ జయ శ్రీ వెంకటేశా ’ అని శ్రీవెంకటేశ్వర స్వామి  అవతార గాథను తేట తెలుగులో వినిపించి దృశ్యమానం చేసిందా స్వరం. ఆలా  కవిత్వంలో, పాండిత్యంలో ,వ్యక్తిత్వంలో పరిపూర్ణతను సాధించినా, మబ్బు చాటు చంద్రుని వలె  మసక బారిన  ప్రతిభా మూర్తి  ఆచ్చి వేణుగోపాలాచార్య. 1959–75 మధ్య కాలంలో తెలుగు, హిందీ సినిమాలకు కథ, మాటలు,పాటలు, రాయడమే కాదు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించిన వేణుగోపాల్‌ సంస్కృతం, తెలుగు, హిందీ ఉర్దూ భాషలలో పండితుడు . తెలుగు, సంస్కృతంలలో కథలు, నవలలు, ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బుర్రకథలు, అసంఖ్యాకంగా రాశారు.  

కానీ అటు సినీ రంగంలో, ఇటు సాహిత్య రంగంలో విస్మృత కవిగా మిగిలి పోయారు. వేణుగోపాలాచార్య 1930 జూన్‌ 12న హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్‌లో నర్సమ్మ, నరసింహాచార్యులు దంపతుల తొమ్మిదిమంది సంతానంలో రెండవవారుగా జన్మించారు. బాల్యంలోనే రామాయణ, భారత, భాగవతాల్లో పద్యాలూ, సంస్కృత నీతి  శ్లోకాలు నేర్చుకున్నారు.  1952లోఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అలా ఉద్యోగం చేస్తూనే ఎంఏ (తెలుగు, సంస్కృతం ) డిగ్రీ సాధించారు. అలహాబాద్‌ యూనివర్సిటీ నుంచి’’ హిందీ సాహిత్య రత్న’’, పాసై  తదుపరి అదీబ్‌ మహర్‌ అలీఘడ్‌ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. ఉర్దూ కూడా చదివి తన భాషా పిపాసను జ్ఞానతృష్ణను తీర్చుకున్నారు.  

వేణుగోపాల్‌ పేరును తారాపథంలోకి తీసుకెళ్లిన చిత్రం ’అమాయకుడు’ (1968). కృష్ణ, జమున నటించిన ఈ సినిమాలో వేణుగోపాల్‌ రాసిన ’’పట్నంలో షాలిబండ –పేరైన గోలకొండ, సూపించు సూపు నిండా పిసల్‌ పిసల్‌ బండ ’  అని రాసిన పాటను  బి.శంకర్‌ స్వరపరచి ఎల్‌. ఆర్‌. ఈశ్వరితో పాడించగా అది  తెలుగునాట మారుమోగింది. 1970ల్లో పీసీ రెడ్డి పిలుపు మేరకు చెన్నై వెళ్లి కొన్ని చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. 1975 లో సౌభాగ్యవతి చిత్రానికి íపీసీ రెడ్డి నామ మాత్ర దర్శకునిగానే గానే ఉండగా, వేణుగోపాల్‌ కథ కొన్ని పాటలు రాసి దర్శకత్వం వహించారు. కానీ సినీ రాజకీయాల్లో ఇమడలేకపోయారు. ’’ శ్రీవెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని ’’ కౌసల్య తనయ శ్రీ రామ కౌస్తుభాంగ .తూర్పున భానుడుదయించె తోయజాక్ష’’  అంటూ సుమారు 15 పద్యాలు  రాయ గా ఘంటసాల గాత్రంలో అవి జనరంజకమయ్యాయి.’’ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’’ కూడా ఆయన రచనే.  ఇంకా తిరుప్పావై, శ్రీవినాయక వ్రతకల్పము, శ్రీ గోదా తృష్ణ కృష్ణ , గీతా గోపాలం  తదితర గ్రంథాలు రచించారు. తన పూర్వీకుల గ్రామం ప్రస్తుత రాజన్న సిరిసిల్లలోని ఆవునూరుపై  ‘‘మావూరు’’ అనే ఖండ కావ్యం  రాశారు . తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావాన్ని చూసి  మురిసిన  వేణుగోపాల్‌ 85 ఏట 2015 లో దివంగతులయ్యారు.


-డాక్టర్‌ వి.వి.రామారావు

వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త 

మరిన్ని వార్తలు