అమరావతి దుస్థితికి బాబే కారకుడు!

21 Jan, 2020 00:23 IST|Sakshi

సందర్భం

అమరావతి నేటి దుస్థితికి, అక్కడ ఉద్యమిస్తున్న స్థానికుల ఆందోళనలకు ప్రధాన కారకుడు చంద్రబాబునాయుడే. తమ త్యాగాలకు విలువ లేకుండా చేసి కలలను కల్లలు చేసినందుకు అమరావతి రైతులు, స్థానికులు ప్రధానంగా ప్రశ్నించాల్సింది చంద్రబాబునే. కేంద్రప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బందులు సవివరంగా చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. రాజధాని ఆగిరపల్లి–నూజివీడు మధ్య వస్తుందని వదంతులు సృష్టించడంతో అక్కడ సాధారణ పౌరులే కాక.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలతో కూడిన నారాయణ కమిటీ అమరావతిని రాజధానిగా సూచించడంతో ఆగిరిపల్లి–నూజివీడు మధ్య భూములు కొన్నవారందరూ అపారంగా నష్టపోయారు. కొందరు రియల్టర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అమరావతిలో భూ సమీకరణ పేరుతో రైతులను బెదిరించినప్పటికీ, వారి పంటలు అగ్నికి ఆహుతి చేసినప్పటికీ, కొందరు రైతులపై తప్పుడు కేసులు పెట్టినప్పటికీ మిగిలిన రైతులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆనాడే వీరు సంఘటితంగా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించి ఉంటే నేడు రోడ్డెక్కవలసి వచ్చేది కాదు. 

భూ సమీకరణ జరిగిన తర్వాత రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నిజాయితీగా నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ స్థానికులు ఆయనను పల్లెత్తు మాట అనలేదు. తమ భూములకు పరిహారంగా అమరావతి ప్రాంత రైతులు అభివృద్ధి పర్చిన 64,709 కమర్షియల్, రెసిడెన్షియల్‌ ప్లాట్లను పొందాల్సి ఉంది. వీటిలో 39,665 ప్లాట్లను రైతులకు రిజిస్టర్‌ చేశారు. కానీ వాటిని రైతులకు ఇప్పటివరకు స్వాధీనపర్చలేదు. నిజానికి బాబు ప్రభుత్వం ఈ ప్లాట్లను స్థానికులకు స్వాధీనపర్చి ఉంటే వారే అక్కడ వందలాది నిర్మాణాలను పూర్తి చేసి ఉండేవారు. రాజధాని ప్రకటించిన తర్వాత విజయవాడ–గుంటూరు మధ్య ప్రైవేట్‌ బిల్డర్లు వందలాది అపార్ట్‌మెంట్లు, కార్యాలయ భవనాలు నిర్మించారు. వారు చేసిన దానిలో పదోవంతు నిర్మాణాలను కూడా అమరావతిలో చేయకపోయినా స్థానికులు బాబుని ప్రశ్నించలేదు. 

అమరావతి నగర డిజైన్ల కోసం నియమించిన ’’మాకి అండ్‌ అసోసియేట్స్‌’’ అనే జపాన్‌ సంస్థ చంద్రబాబు ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లేదని, అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు ఫిర్యాదు చేసినప్పడే.. మేమిచ్చిన భూముల్లో అమరావతిని నిర్మించే సత్తా మీకుందా? అని స్థానికులు ప్రశ్నించి ఉంటే నేడు అక్కడ ఈ ఆందోళనలకు తావుండేది కాదు. తమకు రావల్సిన కమర్షియల్, రెసిడెన్షియల్‌ ప్లాట్లను తమకు ఇవ్వకుండా వందలాది ఎకరాలను ఇండో యూకే హెల్త్‌ కేర్‌ వంటి ఊరూ పేరూలేని సంస్థలకు కట్టబెట్టినప్పుడు కూడా స్థాని కులు చంద్రబాబును ప్రశ్నించలేదు. సింగపూర్‌కు చెందిన అసెండాస్‌ సింగ్‌ బ్రిడ్జ్‌ కన్సార్టియంకు కోర్‌ క్యాపిటల్‌ నిర్మాణానికి 1,691 ఎకరాల భూమిని కట్టబెట్టి రెండేళ్లు దాటినా అక్కడ ఆ సంస్థ ఒక్క ఇటుకను కూడా వేయకపోయినా చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు.

నిజానికి ఆ సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించి ఉంటే నేడు అక్కడ ఎంతో కొంత పురోభివృద్ధి కనిపించి ఉండేది. ఈ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణిని స్థానికులు ఆనాడే ప్రశ్నించి ఉంటే నేడు అక్కడ అనిశ్చితి ఏర్పడేది కాదు. కరకట్టమీది అక్రమకట్టడాలను కూల్చివేస్తామని ఆనాటి ఇరిగేషన్‌ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించిన కొద్ది రోజులకే చంద్రబాబు అక్కడి ఒక అక్రమ కట్టడంలో తిష్ట వేసి మిగిలిన అక్రమ కట్టడాలను కూడా పరోక్షంగా సక్రమం చేశారు.  ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఒక కిలోమీటర్‌ మార్గంలో కూడా నడవని హైపర్‌లూప్‌ రైలును అమరావతికి తెస్తామని చంద్రబాబు చెబితే వెంటనే నమ్మేయడం స్థానికుల పొరపాటే అవుతుంది. మొత్తంమీద చూస్తే చంద్రబాబు చేసిన, చేస్తున్న తప్పులకు అమరావతి స్థానికులు బలి కావడమే కాకుండా పెయిడ్‌ ఆర్టిస్టులన్న అపవాదును కూడా ఎదుర్కోవడం విచారకరం.

వి.వి.ఆర్‌. కృష్ణంరాజు
వ్యాసకర్త ప్రెసిడెంట్, ఏపీ ఎడిటర్స్‌
అసోసియేషన్‌ ‘ మొబైల్‌ : 95052 92299

మరిన్ని వార్తలు