కన్నడ రాజ్యం ఎవరిది?

16 May, 2018 02:14 IST|Sakshi

బీజేపీ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు రెండురోజులు గడువు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత ఆధిక్యం లేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ బేరసారాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థులుగా గెలిచిన పలువురు లింగాయత్‌ వర్గ శాసనసభ్యులు ఒక వక్కలిగ ముఖ్యమంత్రి కింద పని చేయడానికి సముఖంగా లేరన్నది మరొక అంశం. కాబట్టి బల నిరూపణ సమయంలో శాసనసభ రణరంగంగా మారడానికి అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలలో అసలు లబ్ధిదారు దేవెగౌడ. ఆయనే ఈ మంగళవారాన్ని అసలు మరచిపోలేరు.

దేశ రాజకీయాలను పరిశీ లించేవారికి ఈ మంగళవారాన్ని (15వ తేదీ) మరచిపోవడం సులభం కాదు. కారణం– కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఉదయం పదకొండు గంటల వేళ మొత్తం 120 నియోజకవర్గాలలో బీజేపీ ముందంజలో ఉండడంతో ఇక కాంగ్రెస్, జేడీ(ఎస్‌)ల ఆట కట్టేనని అనిపించింది. కానీ తరువాత జరిగిన పరిణామాలే ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్టు మారిపోయాయి. నెమ్మదిగా బీజేపీ వెనకపడింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 112 స్థానాల సంగతి దేవుడెరుగు, 104 స్థానాల దగ్గర ఆ పార్టీ విజయయాత్ర ఆగిపోయింది. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లు ఎదురు చూస్తున్నాయి.

ఆ రెండు పార్టీలకు కలిపి 116 స్థానాలు దక్కాయి. సాయంత్రానికి జేడీ (ఎస్‌) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి గవర్నర్‌ను కలసి కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం ఇచ్చివచ్చారు. కానీ ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చినప్పటి కథ వేరు. కాంగ్రెస్‌ గెలుపు మీద సర్వేలు రెండుగా చీలిపోయాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినవారికి కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న అభిప్రాయం కలిగింది. తరువాత బీజేపీ ముందంజలోకి రావడానికి కారణం ఏమిటి?

ఏప్రిల్‌ 30 వరకు కూడా బీఎస్‌ యడ్యూరప్ప, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు సాగించిన ప్రచారం పేలవంగానే సాగింది. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి 21 బహిరంగ సభలలో ప్రసంగించడంతో పార్టీలో ఉత్సాహం వెల్లువెత్తింది. కాంగ్రెస్‌ పార్టీ చతికిలపడిందని ఆ పదిరోజులలో ఆ పార్టీల నేతలు కొందరు నా దగ్గర అంగీకరించారు కూడా. కానీ ఆ స్థితి నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదు. ఇటు మోదీ తన ‘కాంగ్రెస్‌ రహిత భారతం’ నినాదంతో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను కూడా విశేషంగా ప్రభావితం చేశారు. ఈ ఎన్నికలలో ఆరెస్సెస్‌ నిర్వహించిన పాత్ర కూడా గణనీయమైనది. అన్ని నియోజక వర్గాలలోను ఆ సంస్థ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.

కోస్తా, మధ్య, ముంబై కర్ణాటక ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. హిందూ పార్టీకే ఓటు వేయమని కోరారు. హిందువులు కోసం హిందువులు అన్న కార్డు బాగానే పని చేసిందని ఫలితాలు రుజువు చేశాయి కూడా. బీజేపీకి రాష్ట్రంలో 20,000 వాట్సప్‌ గ్రూపులు ఉన్నాయి. తమ రాజకీయ సందేశాన్ని ఓటర్లకు చేరవేసేందుకు వాటిని పార్టీ విశేషంగా ఉపయోగించుకుంది. ఇలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ యడ్డీ ప్లస్‌ 2 రెడ్డీస్‌ నినాదాన్ని నమ్ముకుంది. బీజేపీ అవినీతి గురించి అలా ప్రచారం చేయదలిచింది. కానీ హైదరాబాద్‌–కర్ణాటక ప్రాంత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అవినీతి అనేది అసలు విషయమేకాదని తేలుతుంది. ఇక్కడి నియోజక వర్గాల వ్యవహారం గాలి జనార్దనరెడ్డి, బి. శ్రీరాములు స్వీకరించారు.

కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపు సంతృప్తికరంగా లేదు. దాదాపు అందరు సిటింగ్‌ సభ్యులకు టికెట్లు ఇచ్చారు. సిద్ధరామయ్య అనుసరించిన వ్యూహం కూడా విమర్శల పాలైంది. చాముండేశ్వరి నియోజకవర్గం ఆయనకు కలసి రాలేదు. గతంలో తన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన జీటీ దేవెగౌడ చేతిలోనే సిద్ధరామయ్య ఓడిపోయారు. ఇదంతా చూస్తే ఆయన వ్యూహాల మీదే అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఆయన సురక్షితమైన వరుణ నియోజక వర్గాన్ని తన కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేశారు. అదృష్టవశాత్తు బాదామి నియోజకవర్గంలో కూడా పోటీ చేయడంతో సిద్ధరామయ్య గట్టెక్కారు. ఒక దశలో ఆయన బి.శ్రీరాములుపై వెనుపడిపోయారు.

నిజానికి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలి ప్రకారం ఇలాంటి పరిస్థితులలో నెపమంతా ఎలాగూ సిద్ధరామయ్య మీదే పడుతుంది. కానీ ఈసారి అలాంటి నెపం వేయడానికి సందేహించనక్కరలేదు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికీ లేనంత అధికారాన్ని సిద్ధరామయ్య దక్కించుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం అంతా తానే అయి చేశారు. ఎన్నికల కోసం సిద్ధరామయ్య చేసిన ట్వీట్‌లు పరిహా సానికి గురయ్యాయి. వాటిలో ఆయన ప్రయోగించిన వ్యంగ్యం ఓట్ల రూపం దాల్చలేదు. ప్రధాని మోదీని ‘ఉత్తర భారత బయటి మనిషి’ అని సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. తరువాత మోదీ మీద పరువునష్టం దావా దాఖలు చేస్తానని బీరాలు పలికి, తాను సరైన పంథాలో నడవడంలేదని నిరూపించారు.

ప్రాంతీయ అస్తిత్వం, లింగాయత్‌లకు వేరే మతం హోదా వంటి చర్యలతో కొద్దిరోజుల క్రితం వరకు ఆయన బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగిన నేతగా కనిపించారు. కానీ ఆయన విభజన రాజకీయాలను ఓటర్లు ఆమోదించలేదు. మళ్లీ తమ పార్టీ మీద ప్రజలలో విశ్వాసం కల్పించడానికి అమిత్‌షా శ్రమించారు. ఎన్నో మఠాలకు తిరిగారు. లింగాయత్, దళిత సాధువులను కలుసుకుని పార్టీకి బలం చేకూర్చే యత్నాలు చేశారు. సిద్ధరామయ్య హిందూమతంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అని బీజేపీ ప్రచారం చేయగలిగింది. దక్షిణ భారత రాష్ట్రాల విముక్తి కారుకునిగా అవతరించాలన్న కోరి కతో సిద్ధరామయ్య అతిగానే ప్రవర్తించారు. ఉత్తర, దక్షిణ భారత విభజన గురించి మాట్లాడారు. అలాగే బీజేపీయేతర రాష్ట్రాల మీద ఢిల్లీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ మీద కూడా వివక్ష ఆరోపణ గుప్పించారు.

తన ఐదేళ్ల పాలనలో ఆయన దళిత వ్యతిరేక, వక్కలిగ వర్గ వ్యతిరేక నాయకునిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో దళిత నాయకుడు జి. పరమేశ్వరను నియమించడానికి విముఖత చూపడం, మరో దళిత నాయకుడు శ్రీనివాస ప్రసాద్‌ నిష్క్రమణ సిద్ధరామయ్య మీద దళిత వ్యతిరేకి ముద్రను బలోపేతం చేశాయి. నిజానికి 2015లో సిద్ధరామయ్య స్థానంలో దళిత ముఖ్యమంత్రిని నియమించాలన్న వాదన వినిపించింది. ఆ సమయంలో ఆయన తాను కూడా దళితుడనేనని, తాను సైతం సమాజంలో అణగారిన కుటుంబాల నుంచి వచ్చిన వాడినేనని వాదించారు. రాహుల్‌ మెప్పు కోసం కర్ణాటక ప్రముఖుడు దేవెగౌడను అవమానించడానికి కూడా సిద్ధరామయ్య వెనుకాడలేదు.

జనతాదళ్‌ (ఎస్‌)ను జనతాదళ్‌ (సంఘ్‌ పరివార్‌) అని కొత్తగా నామకరణం చేశారు. జేడీ(ఎస్‌), బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని, దేవెగౌడ పార్టీ బీజేపీకి ‘బీటీమ్‌’ మాత్రమేనని సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం మాజీ ప్రధానిని కలవర పెట్టింది. ఈ వ్యాఖ్యల వెనుక సిద్ధరామయ్యకు ఒక ఉద్దేశం ఉంది. కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లు శత్రువులుగానే కొనసాగడం, భవిష్యత్తులో కాంగ్రెస్‌ నుంచి ఎవరూ జేడీ(ఎస్‌) మద్దతుతో సీఎం అయ్యే అవకాశం రాకుండా చూడడం సిద్ధరామయ్య ఉద్దేశం.

సిద్ధరామయ్య 2006లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో బయటి మనిషిగానే మిగిలిపోయారు. 2013లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి సిద్ధరామయ్య ఈ విషయం మీదే పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. కానీ మంగళవారం నాటి ఫలితాల తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవెగౌడను ఆశ్రయించింది. ఆయన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే, సిద్ధరామయ్య మాట్లాడినదానిని పట్టించుకోవద్దని దేవెగౌడకు, ఆయన కుమారులకు చెప్పినట్టే ఉంది. అలాగే సిద్ధరామయ్య కాంగ్రెస్‌ వైఖరికి ఇకపై ప్రాతినిధ్యం వహించబోరని వారికి స్పష్టం చేసినట్టు కూడా ఉంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్‌ నుంచి సిద్ధరామయ్యను బయటకు నెట్టివేసే ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే.

ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు రెండురోజులు గడువు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత ఆధిక్యం లేదు కాబట్టి ఇప్పుడు రాజ కీయ బేరసారాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థులుగా గెలిచిన పలువురు లింగాయత్‌ వర్గ శాసనసభ్యులు ఒక వక్కలిగ ముఖ్యమంత్రి కింద పని చేయడానికి సముఖంగా లేరన్నది మరొక అంశం. కాబట్టి బల నిరూపణ సమయంలో శాసనసభ రణరంగంగా మారడానికి అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి.

అయితే ఈ ఫలితాలలో అసలు లబ్ధిదారు దేవెగౌడ. ఆయనే ఈ మంగళవారాన్ని అసలు మరచిపోలేరు. ఆయన ఒకప్పటి అంతేవాసి, ఇప్పటి శత్రువు సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుకు మంగళం పాడారు. తన కుమారుడికి మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. అయితే ఒకటి. కర్ణాటక నాటకం ఇప్పుడే మొదలయింది. కాంగ్రెస్, జేడీ(ఎస్‌) సంకీర్ణం మనుగడ సాగించగలదా? కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మొదటిగా బీజేపీకే గవర్నర్‌ అవకాశం ఇవ్వక తప్పదు. ఒకవేళ గవర్నర్‌ కనుక జేడీ (ఎస్‌), కాంగ్రెస్‌ సంకీర్ణానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జేడీ (ఎస్‌)ను చీల్చడానికి బీజేపీ పావులు కదుపుతుంది.

టీఎస్‌ సుధీర్‌, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
ఈ–మెయిల్‌ :tssmedia10@gmail.com

>
మరిన్ని వార్తలు