కమలంలో కలవరపాటు ఏల?

9 Dec, 2017 04:37 IST|Sakshi

జాతిహితం

ఆర్థికపరమైన తప్పుడు చర్యలు, అధ్వానమైన స్థానిక నాయకత్వం, రిమోట్‌ కంట్రోలు పరిపాలన విఫలం కావడం కలసి నల్లేరు మీద బండిలా సాగిపోవాల్సిన గుజరాత్‌ ఎన్ని కల్లో బీజేపీ గందరగోళపడటానికి కారణమయ్యాయి. రాహుల్‌ ఆ మేరకు విజయం సాధించారు. సమరాన్ని ఆయన ప్రత్యర్థి భూభాగంలోకి తీసుకుపోయారు. లోక్‌సభలో 46 సీట్లున్న పార్టీ నేతపైన దాడి చేయడానికే  బీజేపీ తన పూర్తి కాలాన్ని వెచ్చిస్తున్నది. ఇది బీజేపీ తన కోసం తాను రచించుకున్న కథనం కాదు.

మీరు గుజరాత్‌కు మళ్లి వచ్చారా? అక్కడ గాలిని బట్టి మీరు పసిగట్టింది ఏమిటి? అక్కడేమైనా మార్పు రానున్నదా? ఇవే నేటి ‘‘ట్రెండింగ్‌’’ (సోషల్‌ మీడియాలో హోరెత్తుతున్న) ప్రశ్నలు. వీటిలో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం తేలిక... లేదు, ఇప్పటికింకా నేను గుజరాత్‌ వెళ్లలేదు. ఇక పసి గట్టడానికి వస్తే, నాకు అలా వాసన పసిగట్టగల ఘ్రాణేంద్రియ శక్తులు లేవు. అలాంటి శక్తులున్న కుక్కలంటే నాకు ఇష్టమే, కానీ నేను వాటిలో ఒకణ్ణి కాను. కాకపోతే నేను చేయగలిగినది... రాజకీయ పార్టీల చర్యలను, ప్రతిస్పందన లను, ముఖ కవళికలను, అవి నొక్కి చెప్పే వాటినీ, వాటి ఎత్తుగడలు, వ్యూహాలు, లక్ష్యాలు, ప్రచార పదజాలం, వ్యాకరణాలు, నియమ నిబంధనల్లో వస్తున్న మార్పుల అంతరార్థాన్నీ విప్పి చదవగలను. వాటిని బట్టే గుజరాత్‌లో ఇప్పుడు వీస్తున్న గాలి మార్పును సూచిస్తున్నదో లేదో చెబుతాను. డిసెంబర్‌ 18న ఫలితం ఎలా ఉన్నా... నేడు బీజేపీ 2014 తర్వాత ఎన్నడూ ఎరుగని విధంగా ఆందోళనతో మునివేళ్లపై నిలిచిన స్థితిలో ఇరుక్కుంది.

ఆత్మస్థయిర్యం కోసం వెతుకులాట
బీజేపీ వారు గుజరాత్‌ గురించి ఆందోళనతో ఉన్నారు. రాహుల్‌ గాంధీ ప్రద ర్శిస్తున్న నూతన నిబద్ధతను, ప్రజలను ఆకర్షించడాన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నారు. తమ పట్ల క్షేత్ర స్థాయిలో, ప్రత్యేకించి యువతలో ఆగ్రహం ఉన్నదనే వాస్తవాన్ని వారు గుర్తిస్తున్నారు. తమ కీలక కుల సమీకరణలు, ప్రత్యే కించి పటేళ్లకు సంబంధించినవి ‘‘గందరగోళం కావడం’’ గురించి వాపోతున్నారు. స్థానిక నాయకత్వం అసమర్థతను గురించి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. 2013 శీతాకాలంలో ఆ పార్టీ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఎన్నడూ ఇలాంటి స్థితిలో ఉండటాన్ని మనం చూడలేదు.

బీజేపీలో ఏ ఒక్కరూ  తాము ఓడిపోతామని అస్పష్టంగానైనా అంగీకరిం చడం లేదా సూచించడం చేయడం లేదు. ఆహా, మేం గుజరాత్‌ను పోగొట్టు కోలేం. మోదీజీ, అమిత్‌బాయ్‌ అలాంటి ఉపద్రవాన్ని జరగనిస్తారనే అను కుంటున్నారా? ఇప్పుడు చూడండి, నరేంద్ర భాయ్‌ ప్రచారం సాగిస్తున్నారు. 22 ఏళ్లు అధికారంలో ఉన్నందువల్ల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నా, కాంగ్రెస్‌ పార్టీకి ఆ ఓటర్లను అందరినీ పోలింగ్‌కు తీసుకురాగల సాధనసంపత్తి ఉందని మీరు నిజంగానే భావిస్తున్నారా? ఓటింగ్‌ బూత్‌ సమరంలో అమిత్‌ భాయ్‌ వాళ్లను ఓడిస్తారు. ఆయన నిర్మించిన యంత్రాంగాన్ని చూడండి అంటూ బీజేపీ వారు నొక్కి చెబుతున్నారు. ఇవన్నీ  ప్రతికూలమైన స్థితిలో ఒక విధమైన ఆత్మస్థయిర్యాన్ని తెచ్చుకోవడానికి చెప్పుకునేవే.

మోదీ–షా హయాంలో బీజేపీ పోరాడిన ఇతర ఎన్నికలకంటే గుజరాత్‌ ప్రచారం భిన్నమైనది. ఈ పోరాటంలోనే వారు పైకి బలహీనుల్లా కనిపించ కుండా పోటీలో ముందున్నవారిలా, అధికారంలో ఉన్న వారిలా పోరాడుతు న్నారు. 2013లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో తప్ప, అన్ని ఎన్ని కల్లోనూ వారు అధికారంలో ఉన్నవారిని సవాలు చేశారు. పంజాబ్‌లో ఆ పార్టీ జూనియర్‌ భాగస్వామిగా, గోవాలో మరింత చిన్న భాగస్వామిగా ఉంది. కాబట్టి వాటిని వదిలేస్తున్నాను.  

గుజరాత్‌లో ఇందుకు భిన్నంగా, బీజేపీ పెద్ద బరువును లేదంటే తనకు వ్యతిరేకంగా భగ్గున మండగల రెట్టింపుస్థాయి అధికార పార్టీ వ్యతిరేకతను మోసుకుంటూ పోరాడుతోంది. ఆ పార్టీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికా రంలో ఉండ టమే కాదు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలే రెండు చోట్లా ప్రభు త్వానికి, పార్టీకి కూడా నేతృత్వం వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ప్రతి దానిలోనూ, గుజరాత్‌లో లాగే ఈ నూతన నాయకత్వమే నేతృత్వం వహి స్తోందనీ, ఇది నేటి వాస్తవికతని బీజేపీ నేతలు వాదించొచ్చు. కానీ ఇది మాత్రమే పూర్తి వాస్తవం కాదు. ప్రధాని, పార్టీ అధినేత ఇరువురూ గుజరాత్‌ నుంచి వచ్చి నవారు. వారు రెండున్నర దశాబ్దాలుగా గుజరాత్‌లో తాము సాధించిన వాటిని చూపించే దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లను మెప్పించిన వారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నట్టుగా రాష్ట్రాన్ని దృఢంగా పాలించినవారు.

అనుకున్నది జరగలేదా?
వారు అనుకున్నదానికి అనుగుణంగా ఇక్కడ జరిగినట్టు లేదనేది స్పష్టమే. పార్టీ హైకమాండ్‌ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉన్నా మూడేళ్లలో రాష్ట్రం దారి తప్పిపోయింది. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. వర్తకం, వస్తు తయారీ కార్యకలాపాలతో ఊపు మీదున్న ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. యువత కలత చెందుతుండటం అర్థం చేసుకోగలిగినదే. మూసపోత కథనా లకు భిన్నంగా గుజరాతీ యువత ఎన్నడూ రాజకీయంగా విధేయమైనదిగా లేదా ప్రశ్నించడం తెలియనిదిగా లేదు. అత్యవసర పరిస్థితికి ముందటి కాలంలో, నవనిర్మాణ్‌ ఉద్యమం ఇక్కడ కాళ్లూనుకోగలిగింది. తర్వాత, 1985లో మండల్‌ కమిషన్‌ తన నివేదికను సమర్పించిన వెంటనే మొదటి నిరసన ప్రదర్శన జరిగింది గుజరాత్‌లోనే. గుజరాత్‌లోని ఏ  అసంతృప్తి విష యంలోనైనా జరిగేదే అప్పుడూ జరిగింది. కులపరమైన అల్లర్లు మతపరమైన అల్లర్లుగా మలుపు తీసుకున్నాయి.

హిందీ మాట్లాడే ప్రధాన భూభాగం మాత్రమే రాజకీయంగా అస్థిరమైన దని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. గుజరాత్‌లో బహుశా ఇద్దరు నేతలు.. చిమన్‌భాయ్‌ పటేల్, నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పాటూ అధి కారంలో ఉండటం అందుకు కారణం కావచ్చు. హార్దిక్‌ పటేల్, జిగ్నేశ్‌ మెవానీ, అల్పేశ్‌ ఠాకూర్‌ల వంటి కుల బృందాల యువ నేతలు నేడు వెలుగు లోకి వచ్చారు. ఇది, గతంలో మనం చూసిన గుజరాత్‌ రాజకీయాల సిని మాకు తర్వాతి భాగం. మోదీ, షాలు కేంద్రంలోకి వెళ్లడంతో అధికారంలో ఏర్పడ్డ శూన్యాన్ని వారు పూరించారు. బలమైన నేతల హయాంలో రెండు తరాల గుజరాతీలు సుఖమయ జీవితాన్ని గడిపారు. ఆ ఏర్పాటును మెచ్చిన వారు ఇప్పుడు అది లేని లోటు గురించి చింతిస్తూ ఉండవచ్చు. మోదీ ముఖ్య మంత్రిగా ఉండగా పార్టీ హైకమాండ్‌ ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ముందుగా ఆయనను పిలిపించుకునేది. అలాంటి ముఖ్యమంత్రి వారికి నేడు లేరు. ఏది ఏమైనా, రిమోట్‌ కంట్రోల్‌ పాలన  ఎప్పుడూ కాంగ్రెస్‌ న మూనాగానే ఉండేది తప్ప, బీజేపీదిగా ఉండేది కాదు. రాష్ట్రంలో పార్టీ ఆకర్షణ శక్తికి కేంద్ర స్థానం ఢిల్లీకి మారడంతో గందరగోళం ఏర్పడింది. పార్టీ అక్కడ గ్రూపులుగా, వైరి వర్గాలుగా చీలిపోయి ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి, అది ఆందోళనతో ఉండటంలోనూ ఆశ్చర్యం లేదు.

వికాసం మరచి, అజెండా మార్చి..
‘గుజరాత్‌ నమూనా’ వాగ్దానం 2014లో నరేంద్ర మోదీని అధికారం లోకి తెచ్చింది. ఆయన హయాంలో గుజరాత్‌లో  పారిశ్రామిక, వ్యవసాయ, మౌలి కవసతుల రంగాలు మునుపెన్నడూ ఎరుగని విధంగా వృద్ధి చెందాయి. చెప్పుకోదగిన పాలనాపరమైన సంస్కరణలు, ఆవిష్కరణలు జరిగాయి. ప్రత్యేకించి విద్యుత్తు, నీటిపారుదల రంగాల్లో అవి చోటు చేసుకున్నాయి. వ్యాపారవేత్తల నుంచి ఆయన ప్రభుత్వానికి గొప్ప ప్రశంసలు, ఆమోదమూ లభించాయి. సంక్షోభపూరితమైన యూపీఏ రెండో దఫా పాలనలో ఐదేళ్లను వృధాగా కోల్పోయిన దేశం మోదీకి ఓటు చేసింది. 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల జ్ఞాపకాలను పక్కకు నెట్టింది. ప్రత్యర్థులు ‘వినాశ్‌ పురుష్‌’ (వి«నాశకా రుడు)గా పిలవడానికి అలవాటుపడ్డ మోదీని ‘వికాస్‌ పురుష్‌’ (అభివృద్ధిని సాధించేవాడు) అనే కొత్త అవతారంలో దేశం ఆమోదించింది.

మోదీ-బీజేపీలు సాగిస్తున్న ప్రచారంలో గత రెండు వారాలుగా అదృశ్యమైనది ఒక్కటే... ‘వికాస్‌’. ‘గుజరాత్‌ నమూనా’ ఆయనకు మూడు దశాబ్దాలుగా ఎవరికీ లభించనంతటి ఆధికారాన్ని కట్టబెట్టింది. అయితే, గుజరాత్‌ ఎన్నికల అజెండాలోనే అది కీలకమైనదిగా లేకుండా పోయింది. రాహుల్‌ గాంధీ, ఆయన నిర్లక్షంతో చేసే తప్పులు, ఆయనకు  ఔరంగజేబు, ఖిల్జీ గుర్తింపును అపాదించడం, నెహ్రూ, బాబ్రీ/అయోధ్య సమస్యపై సుప్రీం కోర్టులో కపిల్‌ సిబల్‌ ఏం అన్నారు అనేవి అజెండాలోకి ఎక్కాయి. ఎవరికీ అంతుపట్టని పాత పాకిస్తాన్‌ సైనికాధికారులు కమాండో–కామిక్‌ చానళ్లలో తిరిగి ప్రత్యక్షమై కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రిగా అహ్మద్‌ పటేల్‌కు మద్దతు తెలపడం, మైనారిటీల పట్ల, గాంధీ కుటుంబ వారసత్వం పట్ల వ్యతిరేకతా వాదంతో అది తిరిగి తన సొంత గుర్తింపునకు (‘నా పక్షం, నా ప్రత్యర్థుల పక్షం’) తిరిగి చేరుకుంది. దాదాపుగా ఇది 2002 నాటికి తిరిగి పోవడమే. ‘‘మియా ముషర్రాఫ్‌’’ అనే వేడుకోలు మాత్రమే తక్కువ.  

ఇదే మార్పు. మన ఎన్నికల రాజకీయాల్లో, ప్రచారంలో, ఓటర్ల పట్ల అనుసరించే వైఖరిలో కీలకమైన తేడాను తెచ్చే అంశం ప్రభుత్వ వ్యతిరేకత. బలీయమైన, రెండింతలు అధికారం (రాష్ట్రంలో, కేంద్రంలో) ఉన్న పార్టీ ప్రతి పక్షంలాగా బలహీనశక్తిగా, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పార్టీలా పోరాడటం జరుగుతున్న అరుదైన సందర్భం ఇది. కాంగ్రెస్‌ గత మూడు దశాబ్దాలుగా ఓడిపోతూనే ఉన్నా, దానికి రెండుగా చీలిపోయి ఉండే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ నమ్మకంగా వచ్చే ఓట్ల శాతం దాదాపు 40 శాతంగానే ఉంటోంది. కాబట్టి అది అక్కడ ఎప్పుడూ ఒక శక్తిగానే ఉంది. పాత ప్రచార రికార్డులను, ప్రత్యేకించి 2007, 2012, 2014 ఎన్నికలవి చూడండి. మోదీ ప్రచారంలోని కేంద్రీకరణ ప్రత్యర్థులపై నుంచి తన ప్రభుత్వం సాధించిన వాటిపైకి మరలుతూ వచ్చింది. దాంతో పాటే  ఆయన అధికారం వృద్ధి చెంది, సంఘటితమైంది.

ఆర్థికపరమైన తప్పుడు చర్యలు, అధ్వానమైన స్థానిక నాయకత్వం, రిమోట్‌ కంట్రోలు పరిపాలన వైఫల్యం కలసి నల్లేరు మీద బండిలా సాగిపోవాల్సిన రాష్ట్రంలోనే బీజేపీలో ఈ గందరగోళానికి కారణమయ్యాయి. డిసెంబర్‌ 18 ఫలితం సంగతి ఎలా ఉన్నా, రాహుల్‌ ఆ మేరకు విజయం సాధించారు. సమరాన్ని ఆయన ప్రత్యర్థి భూభాగం లోకి తీసుకుపోయాడు, ఇంతవరకు తనను చూస్తున్న దాని కంటే తాను గట్టి ప్రత్యర్థినని బీజేపీ గుర్తించేలా చేశారు. బలాధిక్యతగల, శక్తివంతమైన పార్టీ బీజేపీ లోక్‌సభలో కేవలం 46 సీట్లున్న పార్టీ నేతపైన దాడి చేయడానికే తన పూర్తి కాలాన్ని వెచ్చిస్తున్నది.
ఇది బీజేపీ తన కోసం తాను రచించుకున్న కథనం కాదు. అందుకే అది ఆగ్రహంగా, ఆందోళనగా ఉంది.


- శేఖర్‌ గుప్తా

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు