రమజాన్‌ రోజాలు

18 May, 2018 03:09 IST|Sakshi

పవిత్ర రమజాన్‌ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లిములు ఎంతో ఉత్సాహంతో ఉపవాసదీక్షలు ప్రారంభించారు. భక్తిశ్రధ్ధలతో పవిత్ర ఖురాన్‌ పారాయణం చేస్తున్నారు. మసీదులన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. చిన్నపిల్లలు సైతం రోజా పాటించడానికి ఉబలాటపడుతున్నారు. దీనిక్కారణం ఏమిటి? అసలు ఉపవాసం ఎందుకుండాలి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దీనికి స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు.

భయభక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును,అసహ్యతను ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధికంగా మొగ్గుచూపే ఒకానొక స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవాసాల అసలు ఉద్దేశం. అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతఃశ్శుధ్ధిని కూడా పాటించాలి. ఉపవాసదీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లుకాదు. కేవలం పస్తులుండటంతో సమానం. ముహమ్మద్‌ ప్రవక్త(స) ఇలాచెప్పారు: ’ఉపవాసదీక్ష పాటించే చాలామందికి, తమ ఉపవాసాలద్వారా, ఆకలిదప్పుల బాధతప్ప మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’.    

అంటే, ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం ఎంతమాత్రం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవవిధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుంచి సురక్షితంగా ఉంచడం. ఏడాదికొకసారి నెలరోజులపాటు నైతిక విలువలు, దైవాదేశపాలనను అభ్యాసం చేయిం చడం. నెల్లాళ్ళ శిక్షణ అనంతరం మిగతా పదకొండు నెలలకాలం దీని సత్ప్రభావం జీవితాల్లో ప్రసరించే విధంగా ఏర్పాట్లుచేయడం.

పవిత్ర రమజాన్‌లో ఏవిధంగా అన్నిరకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దానధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో, అలాగే మిగతా కాలమంతా సమాజంలో శాంతి, న్యాయం,ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిధ్ధించాలన్నది అసలు ధ్యేయం. ఈ రమజాన్‌లో అటువంటి తర్ఫీదు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికీ దక్కాలని మనసారా కోరుకుందాం.
(రమజాన్‌ పర్వదినం ప్రారంభం సందర్భంగా)

– యండి.ఉస్మాన్‌ ఖాన్‌
 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు