లోపాలు సరిదిద్దితేనే అఘాయిత్యాలు ఆగుతాయి

15 Apr, 2018 01:07 IST|Sakshi

అవలోకనం

లైంగిక నేరాల బాధితులకు న్యాయం చేయలేకపోతున్నది మనం ఒక్కరం మాత్రమే కాదు. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి ఉంది. అన్ని దేశాల్లోనూ బాధితులకుండే ఉమ్మడి సమస్య...
ఆ నేరం జరిగిందని బయటికి చెప్పుకోలేకపోవడం. అందువల్లే అమెరికా వంటి దేశంలో కూడా వేయి నేరాలు జరుగుతుంటే సగటున 310 వెల్లడవుతాయి. ఇక శిక్షల శాతం మరింత తక్కువ. ఆ 310 మందిలో ఆరుగురికి మాత్రమే శిక్ష పడుతుంది. ప్రభుత్వాలు గట్టి సంకల్పంతో పనిచేసి భారీ మార్పులు చేస్తే ఈ స్థితి మారుతుంది.

కథువా, ఉన్నావ్‌లలో జరిగిన ఉదంతాల విషయంలో ఒక సమాజంగా మనం ఎలా స్పందించాలి? ప్రపంచ దేశాల్లో లైంగిక హింస పరంగా చూస్తే ఆడవాళ్లకూ, పిల్లలకూ భారత్‌ అరక్షిత దేశమన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. వాస్తవం ఇది కాకపోయినా ఇది స్థిరపడింది. మనం ఎంత నిజాయితీగా ఉంటు న్నామో, ఎంత మారాల్సి ఉన్నదో విదేశీ మాధ్యమాలు చెప్పే స్థితి రాకూడదు. ఇలాంటి సిగ్గుమాలిన ఉదంతాలను మనమెందుకు నివారించలేకపోతున్నాం? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి తగ్గించగలుగుతాం? కేవలం న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ మాత్రమే వీటిని నివారించలేవని ముందుగా మనం తెలుసు కోవాలి. విలువలు విచ్ఛిన్నమయ్యాయి. మహిళల్ని, అల్పసంఖ్యాకుల్ని గౌరవించే చోట పశు ప్రవృత్తికి ప్రోత్సాహం ఉండదు. మనం అలాంటిచోటే ఉంటున్నామా? నిజాయితీగా చెప్పాలంటే జవాబేమిటో అందరికీ స్పష్టంగా తెలుసు. ప్రభుత్వమే ఇలాంటి హింసను అరికట్టాలనడం మనం మన పాత్రను విస్మరించడమే అవు తుంది. ఆ అవగాహనతో ఏం చేయమని ప్రభుత్వాన్ని ఒప్పించాలో చూద్దాం. 

లైంగిక దాడుల్ని, అత్యాచారాలను నియంత్రించడానికి ప్రధానంగా రెండు అవసరమవుతాయి. అందులో ఒకటి చట్టం. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ రేపిస్టులను ఉరి తీయాలన్న డిమాండ్‌ తరచూ వినిపిస్తుంటుంది. కఠినమైన శిక్ష ఉంటే ఈ తరహా నేరాల్ని నివారించవచ్చునని, నేరగాడు తన చర్య పర్యవసానా లను గ్రహించి భయపడతాడని, కనుక తప్పు చేయడానికి సాహసించడని ఈ వాదన లోని ఆంతర్యం. దీనికి అనేక ప్రతివాదాలున్నాయి. అత్యాచారానికైనా, హత్యకైనా ఒకటే శిక్ష గనుక సాక్ష్యం లేకుండా చేయడానికి బాధితురాలిని రేపిస్టు హతమారు స్తాడని దీన్ని వ్యతిరేకించేవారంటారు. దాన్ని కాసేపు పక్కన పెడదాం. రేపిస్టులకు ఉరిశిక్షే సరైందని రాజకీయ నాయకులు ఎక్కువగా చెబుతుంటారు. మీరు ఇటీవలి పత్రికలు తిరగేస్తే ఈ వాదన సమర్థుకులే అధికంగా కనిపిస్తారు. మన దేశంలో హంతకులకు మరణశిక్ష ఉంది. ఇది నివారణగా పనిచేసి హత్యలు ఆగుతున్నాయా? గణాంకాలు ఒకసారి చూద్దాం. 2016లో 136 మందికి న్యాయస్థానాలు ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా 30,000 హత్యలు జరిగాయి. మరణశిక్షల విధింపు హంతకులను తగ్గించలేకపోయింది. మన చట్టాల్లో అప్పీళ్లకూ, రెమిషన్లకూ అవకాశం ఉంది. అందుకే ఆ ఏడాది ఎవరూ ఉరికంబం ఎక్కలేదు. మరణశిక్ష మంత్ర దండమని భావించేవారంతా దీన్ని గమనించుకోవాలి. 

ఇప్పుడు లైంగిక నేరాలు, అత్యాచారాలకు సంబంధించిన గణాంకాలు చూద్దాం. ఆ సంవత్సరం దేశంలో మొత్తం 38,947 అత్యాచారాలు జరిగాయి. పిల్లలపై 1,06,000 నేరాలు జరిగాయి. అత్యాచారాల సంఖ్యతో వచ్చే ఇబ్బందే మంటే 99 శాతంమంది బాధితులు వాటిపై ఫిర్యాదు చేయరు. ప్రభుత్వ డేటాయే ఈ సంగతి చెబుతోంది. అమెరికాలో ప్రతి వెయ్యి అత్యాచారాలు, లైంగిక నేరాల్లో 310(31 శాతం) మాత్రమే పోలీసుల వరకూ వస్తాయి. అందులో కేవలం ఆరు గురు దోషులకు (అంటే 1 శాతం కన్నా తక్కువ) మాత్రమే శిక్షపడుతుంది. దీనర్ధం ఏమంటే... జరుగుతున్న నేరాల విషయంలో బాధితులకు న్యాయం చేయలేక పోతున్నది మనం ఒక్కరమే కాదు. కనుక ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన, గట్టిగా పనిచేయాల్సిన సంక్లిష్ట సమస్య అని మనం గుర్తించాలి. ఇందులో అనేకానేక అంశాలున్నాయి. అందులో కొన్ని సామాజికమైనవి, మరికొన్ని ప్రభుత్వం సరి దిద్దాల్సినవి. మన దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ లైంగిక నేరాల బాధితులకుండే ఉమ్మడి సమస్య– అది బాగా వ్యక్తిగతమైన నేరం. తమకు అలా జరిగిందని ఎవరితోనైనా చెప్పుకోవడం అంత సులభం కాదు. ఇక మన దేశానికే ప్రత్యేకమైన సామాజిక అంశాలు కోకొల్లలు. అందులో మన సమాజంలో మహిళల కుండే స్థానం, వారిపట్ల వ్యవహరించే తీరు ప్రధానమైనది. రెండోది– కుటుంబ పరువు, ప్రతిష్టలు మొత్తం వారి శరీరాల్లో ఉన్నాయనుకునే విశ్వాసం. మహిళపై దాడి జరిగితే అది ‘కోల్పోయినట్టే’నని మన భావన. పర్యవసానంగా తనకు జరి గిన అన్యాయాన్ని పోలీస్‌స్టేషన్‌లోని అపరిచితులకు చెప్పడం సంగతలా ఉంచి చివరకు తన కుటుంబానికి కూడా ఏ మహిళా వెల్లడించలేదు.

పోలీసులు చేయగలిగింది ఒకటుంది–అది చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం. చట్టం ప్రకారం బాధితులెవరైనా తమకు నచ్చిన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్‌లో మాత్రమే ఫిర్యాదు చేయనవసరం లేదు. రెండు–బాధితురాలు తాను ఎంపిక చేసుకున్న భాషలో తన వాంగ్మూలాన్ని ఇవ్వొచ్చు. ఇది చాలా కష్టమైన సమస్య. ఎందుకంటే చాలా పోలీ స్‌స్టేషన్లలో ఇంగ్లిష్‌ కూడా సరిగా మాట్లాడలేనివారే ఉంటారు. వారు ఎఫ్‌ఐఆర్‌ను స్థానిక భాషలోనే రికార్డు చేస్తామంటారు. మూడు–బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా అధికారి మాత్రమే రికార్డు చేయాలి. ఇది జరగడం లేదు. తగినంతమంది మహిళా కానిస్టేబుళ్లు లేదా మహిళా పోలీసు అధికారులు లేకపోవడం ఇందుకు కారణం. ‘కనీస ప్రభుత్వం–గరిష్ట పాలన’ వంటి నినాదాలు అర్ధం లేనివి. ఎందు కంటే మనకున్న పోలీసులు, డాక్టర్లు, నర్సుల సంఖ్య ప్రపంచంలోని మరే ఇతర దేశాల తలసరి సగటు కన్నా చాలా తక్కువ. లైంగిక నేరాలను అరికట్టాలంటే మన సమాజంలో, మహిళలపట్ల వ్యవహరించే తీరులో భారీ మార్పులు తీసుకురావా లని వాస్తవాంశాలు చెబుతున్నాయి. లైంగిక హింసకు సంబంధించిన చట్టాల్లోని అంశాలను దేశంలోని పోలీస్‌స్టేషన్లన్నీ సక్రమంగా పాటించేలా చూడాలి. ఇది చాలా కష్టసాధ్యమైనదే. కానీ అలా చేయగలిగితే–కనీసం ఇతర ప్రపంచ దేశాలతో సమానంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదులు పెరిగాక వాటిపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలి. అందుకు వనరులు అవసరం. ఇప్పుడున్న పోలీసుల సంఖ్యతో, ఈ బడ్జెట్‌తో అది సాధ్యపడదు. అది చేస్తే శిక్షల సూచీ పెరుగుతుంది. ఇదంతా చాలా కష్టం. మన రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ సంగతి తెలుసు. కనుక ‘రేపిస్టులకు ఉరిశిక్ష వేయాలి’ అని వారు సులభంగా అంటుం టారు. హంతకులకు మరణశిక్ష విధిస్తున్నా హత్యలపై వాటి ప్రభావం లేదన్న వాస్తవం వారిని కలతపెట్టదు.


ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
ఆకార్‌ పటేల్‌

మరిన్ని వార్తలు