ఒక కన్ను ఔట్, రెండో కన్ను డౌట్‌

16 Dec, 2018 00:59 IST|Sakshi

సందర్భం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చంద్రబాబు ప్రకటించుకొన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రెండు కళ్ల సిద్ధాం తంలో ‘‘ఒక కన్ను ఔట్, రెండో కన్ను డౌట్‌’’ అనే విధంగా పరిణమించాయి.  కానీ, కొందరు పరిశీలకులు రెండో కన్ను ఆంధ్ర కూడా పోయినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ‘‘ప్రజాకూటమి’’లో చేరడంలో చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యం కూటమి బలపడటం కాదు. కనీసం తెలంగాణలో తనపార్టీ టి.డి.పి. బలపడటం కన్నా, ఆంధ్రలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని తిరిగి అధికారాన్ని పొందడమే ప్రధానం.

ఏదో ఒకపార్టీతో జట్టుకట్టి గెలుపొందడమే చంద్రబాబు చరిత్ర, చాణక్యనీతి. ఆంధ్రరాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుకు అవకాశాలు కనిపించడం లేదు. కనుక, ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీయే కనుక, ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండానే, తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకి చంద్రబాబు సిద్ధపడ్డారు. మరోవైపు అధికారం కోసం ఆవురావురుమంటోన్న కాంగ్రెస్‌ నాయకత్వం, బాబుతో జతకట్టి తెలంగాణ గడ్డపైకి ఆహ్వానించి పప్పులో కాలేసింది. బాబు ట్రాప్‌లో (ఉచ్చుల్లో) పూర్తిగా పడిపోయింది. మొత్తంమీద చంద్రబాబు ప్రజాకూట మిలో ‘‘ఐరన్‌లెగ్‌’’ పాత్రని అద్వితీయంగా పోషించారు.

ఇకపోతే, మహత్తర చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిన తెలుగు గడ్డపైన కమ్యూనిస్టు ప్రతినిధి ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేకపోవడం ఆ రెండు పార్టీల దురవస్థను తెలియచేస్తోంది. మరోవైపు అణచబడ్డ సామాజిక వర్గాలకు చెందిన బహుజన సమాజ్‌పార్టీ ఒంటరిగానే పోటీచేసి తన రాజకీయ వ్యక్తిత్వాన్నీ స్వతంత్రతనీ నిలబెట్టుకొన్నది. అయితే, తెలంగాణలో బీఎస్పీకి వెలుపల ఉన్న సామాజిక రాజకీయ శక్తులతో ఆ పార్టీ జతకట్టి, ఒక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసి, మరింత శక్తివంతంగా ఎన్నికలబరిలో నిలబడిఉంటే, ఇప్పుడు ఒక్కస్థానం కూడా పొందలేని దుస్థితి నుండి ఈ శక్తులు బయటపడి ముందంజవేసి ఉండేవి.        

వాస్తవానికి, తెలంగాణలో ఆధిపత్య, సంపన్నవర్గాల కాంగ్రెస్, టి.డి.పి., తదితర పార్టీల ‘ప్రజాకూటమి’ మట్టికరిచినప్పటికీ, అక్కడ గెలుపొందింది కూడా అవే సామాజిక రాజకీయ శక్తులేనన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. చాడా వెంకటరెడ్డి గారి సి.పి.ఐ.తో కలుపుకొని చూసినా, ఆ కూటమి ఆధిపత్య కులాల గుంపేననేది సుస్పష్టం. ఆధిపత్యకుల సి.పి.యమ్‌. నాయకత్వంలో ఏర్పడిన కూటమికి  ఏ పేరుపెట్టుకొన్నా, దానిని కూడా ఆధిపత్య కులాల కూటమిగానే ప్రజలు, ముఖ్యంగా దళిత, బహుజనులు, ఆదివాసీ, మైనారిటీలు భావించి, తిరస్కరించి, దాని నాయకత్వ ముసుగును చీల్చారు. అందరూ గ్రహించవలసిన మరోసత్యం ఏమంటే, యస్‌.సి., యస్‌.టి., బి.సి., మైనారిటీలకు చెందిన రాజకీయ శక్తులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శిబి రంగా రూపొంది, శక్తివంతమైన స్వతంత్ర పోరాటం చేయలేకపోవడం ఒక కీలకమైన లోపం. ఈ లోపాన్ని ఆ సామాజిక శక్తులు సవరించుకొని ముందుకు పోవాల్సి వుంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలోనే గాక, దేశవ్యాప్తంగా కూడా బహుళ ప్రాచుర్యం పొందిన ఉద్యమ నేతలు గద్దర్, ఆర్‌. కృష్ణయ్య, మంద కృష్ణమాదిగలు. ఒకరు విప్లవ ప్రజా కళాకారుడు కాగా, రెండవ వారు అణచివేతకు గురవుతోన్న బి.సి.ల నాయకులు కాగా మూడవ వారు దొంతర్ల కుల వ్యవస్థలో అణచబడ్డ సామాజిక న్యాయంలో అంతర్భాగమైన ఎస్‌.సి. వర్గీకరణ ఉద్యమకారులు. ఈ ముగ్గురూ మూడు సామాజిక వర్గాలకు చెందినవారు కావడం మరో విశిష్టత.  అయితే, చాలా బాధాకరమైన విషయమేమంటే, ఈ ముగ్గురూ తమ దశాబ్దాల కాలపు ఉన్నతమైన సామాజిక ఉద్యమ చరిత్రను తామే చెరిపివేసుకొనే విధంగా ఈ ఎన్నికల్లో వ్యవహరించడం.

ఆధిపత్యకులాల, సంపన్నవర్గాల, ప్రతినిధులుగా పనిచేసి, పరి పాలించి, అవినీతికి నిలయమైన, విప్లవాన్ని, సామాజిక వర్గాలని అణచివేసిన, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఆధిపత్యంలో ఉన్న దుష్టకూటమిలో కలగలసిపోవడం, చివరికి ప్రజలు తిరస్కరించిన భ్రష్టకూటమిలో వీరు కూడా భాగస్వాములు కావడం అత్యంత విషాదకరం. ‘‘రాజకీయాలలో హత్యలు ఉండవు! ఆత్మహత్యలే ఉంటాయి’’ అన్న సూక్తికి నిదర్శనంగా ఈ ముగ్గురూ నేడు నిలబడి ఉన్నారు.  

ఇప్పటికీ సంఘాలలో, ఉద్యమాలలో వివిధ స్థాయిల్లో పనిచేస్తోన్న నాయకులూ, కార్యకర్తలూ ఈ ముగ్గురి వ్యక్తిత్వాలను సరిగా అర్ధం చేసుకొని తమ తమ వర్తమాన భవిష్యత్‌ కార్యాచరణ విధానాలను బహు జాగ్రత్తగా మలచుకోవలసి వుంటుంది.  ప్రస్తుత దుష్ట వ్యవస్థలో పతనం ఎల్లవేళలా పొంచేవుంటుంది. తస్మాత్‌ జాగ్రత్త!  ఇప్పటికైనా ఆ ముగ్గురు నేతలూ తమ రాజకీయ తప్పిదాన్ని గ్రహించి, మహాత్మా జోతిరావ్‌ఫూలే, డా‘‘ బి.ఆర్‌. ఆబేండ్కర్‌ల సిద్ధాంతాల వెలుగులో సామాజిక, రాజకీయ ప్రత్యామ్నాయ విధానానికి తిరిగిరావడం అవసరం.  


వ్యాసకర్త : వై. కోటేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాది,
అధ్యక్షులు, సోషల్‌ జస్టిస్‌ పార్టీ 
మొబైల్‌ : 98498 56568

మరిన్ని వార్తలు