కౌన్సిల్‌ అవసరమా?

30 Jan, 2020 00:44 IST|Sakshi

సందర్భం 

మన రాష్ట్రంలో విధాన పరిషత్తు (లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) భవితవ్యంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్నది. విధాన పరి షత్తు స్వభావ స్వరూపాలను ఈ సందర్భంలో చర్చించుకొనడం అవసరం. విధాన పరిషత్తుల చట్టం ద్వారా 1958 జూలై మొదటి తేదీ నుండి మన రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు చేయబడింది. మనకు జూలై 1958లో కౌన్సిల్‌ ఏర్పడింది. అంతకు ముందు లేదు.

కర్నూలు రాజధానిగా అవతరించిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో కూడా లేదు. శాసనమండలికి వాస్తవంలో ఏవిధమైన అధికారాలు లేవు. శాసనసభ అంగీకరించిన బిల్లుకు శాసనమండలి సవరణలు చేసినా, తిరస్కరించినా, లేక పరిషత్తుకు సమర్పిం చబడిన తేదీ నుండి ఆ బిల్లు ఆమోదింపబడకనే మూడు మాసాలు దాటిపోయినా తిరిగి శాసనసభ దానిని పరిశీలించి మార్పులు చేర్పులతో లేదా యధాతధంగా తిరిగి ఆ బిల్లును రెండవసారి పాస్‌ చేసి మళ్ళీ పరిషత్తుకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ బిల్లును పరిషత్తు త్రోసిపుచ్చినా, లేక ఆ బిల్లు పాస్‌ చేయకుండా ఒక మాసం పాటు అలాగే మిగిలిపోయినా శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తు దానిని పాస్‌ చేసినా శాసనసభ రెండవమారు బిల్లును ఏ రూపంలో పాస్‌ చేసిందో అదే రూపంలో శాసనమండలిలో కూడా పాస్‌ చేయబడినట్లు భావించబడుతుందని రాజ్యాంగంలోని 197వ అనుచ్ఛేదము చెబుతున్నది.

అయితే ద్రవ్య సంబంధమైన బిల్లుల విషయంలో ఇంతమాత్రం ప్రాముఖ్యత కూడా శాసనమండలికి లేదు. విధాన పరిషత్తు సభ్యుల జీతభత్యాలకు అమితమైన వ్యయం తప్పదు. నెల జీతం రూ. 600, నియోజకవర్గం అలవెన్సు 300, ఫోనుకు వంద రూపాయలు. సభ్యుల దంపతులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొదటి తరగతికి ఒకటిన్నర రెట్లు ప్రయాణ భత్యం. రోజుకు రూ.45 దినభత్యం. సంవత్సరానికి మూడువేల రూపాయలు కిమ్మత్తు చేసే రైల్వే కూపనులు, వైద్య సౌకర్యం, ప్రభుత్వ అతిథి గృహాలలో వసతుల వంటి సౌకర్యాలనేకం. ఎం.ఎల్‌.ఎ. హాస్టళ్ళలో వీరికి జాగా చూపవలసిందే. రైల్వే కూపనులకు మారుగా నెలకు రూ.300 రొక్కంగా ఇవ్వమంటున్నారీ మధ్య. ఇవికాక, శాసనమండలి సమావేశాల ఏర్పాటుకు, ప్రసంగాలను అచ్చు వేయడానికి, సిబ్బందికి, ఇతరత్రా మరింత వ్యయం. ఇంకా శాసనమండలికొక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. వారికి కారు, ఫోను, సిబ్బంది వంటి సదుపాయాల కోసం మరొక మోపెడు ఖర్చులు.

రాష్ట్ర ప్రజానీకం అసలు ఆశయాలు, అభీ ష్టాలు నెరవేర్చాలనే మహదాశయంతో నందమూరి నాయకత్వాన ‘తెలుగుదేశం’ విశేష జనాదరణతో అధికారంలోనికొచ్చింది. అయితే ప్రస్తుతం శాసనమండలిలో ప్రభుత్వ పక్షానికి గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే సభ్యుడు కూడా లేడు. ఉమా వెంకట్రామిరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి జి. జగన్నాథరావు ఖాళీ చేసే స్ధానాలు త్వరలో అధికార పక్షానికి రాగలవు. పెద్దఎత్తున పార్టీ మార్పిడులు జరగకపోతే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టనున్న అభ్యుదయ పథకాలన్నిం టికి శాసనమండలి పెద్ద ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ మార్పిడులను ఎంతమాత్రం ప్రోత్సహించని వజ్రసంకల్పుడు ముఖ్యమంత్రి  నందమూరి. అటువంటప్పుడు ఈ యిబ్బందిని అధిగమించడానికి శాసనమండలిని రద్దు గావించడం వినా మార్గాంతరం లేదు.

 కొత్త మంత్రివర్గంలో అధిక శాతం యువకులు, కొత్తవారు, అనుభవం లేనివారు, కల్మశం అంతకన్నా లేనివారు. ఇక శాసనమండలిలో మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డితో సహా పెక్కుమంది మాజీలు ఉన్నారు. వారికి పాలనా రంగంలోని లొసుగులన్నీ కరతలామలకం. తమ వాగ్ధాటితో, కొంటె ప్రశ్నలతో యువకులైన మంత్రులను వీరు ఇబ్బంది పెట్టే అవకాశం లేక పోలేదు.అందువల్ల ఏ కోణం నుండి చూసినా శాసనమండలి రద్దు అనేది అత్యంత అభిలషణీయం. కొత్త ప్రభుత్వానికి దీనివల్ల వెసులుబాటు ఎక్కువవడమే కాక ప్రజాధనం  పన్ను చెల్లించే పేదవాని ధనం  దుబారా కాకుండా కొంతవరకైనా నివారణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ చర్యకు జనాదరణ మిక్కుటంగా లభిస్తుందనడంలో సందేహం లేదు. 
(నాటి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని రద్దు చేయ డంపై అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన విస్పష్ట ప్రకటనపై స్పందిస్తూ వ్యాసకర్త 19–01–1983న ఒక పత్రికలో రాసిన వ్యాసానికి సంక్షిప్త రూపం)


డా. యలమంచిలి శివాజి 
వ్యాసకర్త రాజ్యసభ మాజీ ఎంపీ
మొబైల్‌ : 98663 76735 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తలెత్తుకుని నిలబడిన భారత్‌

తొందరపాటు నిర్ధారణతో అనర్థం

అమెరికాలో మనవాళ్లు క్షేమమే

దురాచారమే అతిపెద్ద రోగం

స్వచ్ఛమైన నీటి జాడ ఎక్కడ?

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా