అవగాహన లేమితోనే వైఫల్యం

16 Mar, 2018 00:46 IST|Sakshi

భారత్‌లో 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం మరణించింది. కానీ 21వ శతాబ్దంలోకూడా అది తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక జవాబుదారితనం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. అందుకే.. వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావజాలం చిరకాలం వర్ధిల్లాలి.

ఇటీవలే ఒక సోషల్‌ మీడియా కోణంగి నన్ను కమ్మీ–డాగ్‌ (కమ్యూనిస్టు కుక్క) అని పిలిచాడు. వెంటనే నేను తీవ్ర ఆలోచనలో మునిగిపోయాను. కుక్క అనే అంశాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకోవడం సులభమే. త్రిపురలో ప్రజా తీర్పు నేపథ్యంలో ప్రత్యేకించి బీజేపీ సోషల్‌ మీడియా పోకిరీలు పట్టలేని సంతోషంతో ఉండటమే కాకుండా కమ్యూనిస్టులపై తీవ్ర నిందాత్మక వ్యాఖ్యలు గుప్పిస్తున్న సందర్బం అది. దీన్ని పక్కనపెడితే, నేను కూడా తప్పకుండా కమ్యూనిస్టునే అయివుంటాను అని అతగాడు ప్రకటించిన అభిప్రాయమే నన్ను ఆలోచింపజేసింది. 

సోషల్‌ మీడియా కోణంగిలు నిరక్షర కుక్షిలే..!
‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ ఉత్పత్తి చేసిన కోణంగిల– ట్రోల్స్‌–నిరక్షరాస్యత కింద నేను దీన్ని కొట్టిపడేయాలి. నన్ను కమ్యూనిస్టుగా పిలవడానికి నాకున్న ఏకైక అర్హత ఏమిటంటే నేను జేఎన్‌యూలో చదవడం, గడ్డం పెట్టుకున్న వారిని సమర్థించడం, తరచుగా గుడ్డ సంచీ వాడటమే. ఇది మినహా నా జీవితం పొడవునా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం, దాని ఆచరణను విమర్శిస్తూ వచ్చాను. విద్యార్థిగా నేను సమతా యువజన్‌ సభలో చేరాను. 

ఇది జేఎన్‌యూలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐకి వ్యతిరేకంగా పనిచేసే సంఘం. తర్వాత గాంధియన్‌–సోషలిస్ట్‌ స్రవంతికి చెందిన సమతా సంఘటన్, సమాజ్‌వాదీ పరిషత్‌తో పనిచేశాను. ఇవి కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు చాలా దూరంగా ఉంటాయి. విద్యావిషయకంగా నేను 1980లు, 1990లలో ప్రాబల్యంలో ఉండిన మార్క్సిస్ట్‌ ఛాందసత్వం పట్ల అసమ్మతి తెలి పాను. పైగా నేను పనిచేస్తున్న సీఎస్‌డీఎస్‌ (వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్రం) తరచుగా వామపక్ష మేధావుల దాడికి గురయ్యేది. 

చాలా స్పష్టంగా ఈ బీజేపీ ట్రోల్స్‌కి ఇదేమాత్రం తెలీదన్నది స్పష్టం. నేను కొనసాగుతున్న మేధో ప్రపంచం అసలు ఉనికిలోనే ఉండదని వీళ్ల భావన కావచ్చు. వీళ్ల ప్రాపంచిక దృక్పథం చాలా సరళంగా ఉంటుంది. అదేమిటంటే పేదలు, విప్లవం గురించి మాట్లాడే ఎవరినైనా సరే వామపక్షం, కమ్యూనిస్టు, సోషలిస్టు, మావోయిస్టు, అర్బన్‌ నక్సలైట్, రెడ్‌ అని ముద్రలు వేసేయడమే వీరికి తెలిసిన విద్య. తగిన సాక్ష్యాధారాల విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఈ ట్రోల్స్‌ మరికొంత లోతైన భావనను సూచిస్తున్నారు. అదేమిటంటే వామపక్షానికి మన కాలంలో అర్థం మారిందన్నదే.

ఈరోజు వామపక్షానికి రెండు రకాల విశిష్ట అర్థాలున్నాయి. పాత అర్థంలో చూస్తే కమ్యూనిస్టులు అంటే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారు, సోవియట్‌ రష్యా తరహా ప్రభుత్వ సోషలిజాన్ని బలపర్చేవారు, భారత్‌లోని అనేక కమ్యూనిస్టు పార్టీలలో ఏదో ఒకదానికి చెంది ఉండేవారు అని అర్థం. వామపక్షానికి ప్రస్తుతం ఏర్పడిన కొత్త అర్థంలో సమానత్వ భావనవైపు నిలబడే ప్రతి ఒక్కరూ చేరతారు. కమ్యూనిస్టు వామపక్షాలు, గాంధియన్‌ సోషలిస్టులు, సోషలిస్టులు, అంబేద్కరి స్టులు, ఫెమినిస్టులు అందరూ ఈ కోవలోకి వస్తారు. ఈ అన్ని రకాల శ్రేణులకు చెందినవారు ఈ ముద్రను అంగీకరించరు. పైగా ఇది పెద్దగా ఉపయోగపడే వర్ణన కాదు కూడా. కానీ కొత్త ప్రపంచం వీళ్లను ఈ దృష్టితోనే చూస్తోంది.

అంతర్గత పోరు అంతిమ పతనాన్ని ఆపగలదా?
పాత వామపక్షం మరణించింది. త్రిపురలో 25 ఏళ్లుగా సాగిన సీపీఎం పాలన నాటకీయంగా పతనం కావడం.. భారతీయ కమ్యూనిస్టు పార్టీల పతనం, క్షీణతకు చెందిన సుదీర్ఘ ప్రక్రియను మరోసారి ఎత్తి చూపింది. 1970లలో వామపక్ష నిరోధక ప్రక్రియ మొదలయ్యాక, దాని ప్రభా వం కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలకు, జేఎన్‌యూకు మాత్రమే పరిమితమైపోయింది. 2011లో పశ్చిమబెంగాల్‌లో వామపక్ష పరాజయంతో కమ్యూనిస్టు పార్టీల అంతిమ పతనం ప్రారంభమయింది. 

వారు ఇప్పుడు కేరళలో పాలనలో ఉన్నప్పటికీ, సీపీఎంలో తీవ్రమవుతున్న అంతర్గత ముఠా పోరు దాని అంతిమ పతనాన్ని తిరగతోడే అవకాశాలను ఏరకంగానూ పెంపొందించదు. ఇక పార్లమెంటేతర కమ్యూనిస్టులుగా పేరొందిన చిన్న బృందం మావోయిస్టులు రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనే కాల్పనిక భ్రమను అనుసరిస్తున్నారు కానీ భారత భద్రతా బలగాల ముట్టడిలో అంతమయ్యేందుకు వీరు చేరువలో ఉన్నారు. 

స్వేచ్ఛ కోసం మానవ ఆకాంక్షను మరిస్తే ఎలా?
పాత వామపక్ష మరణం అనేది ఏమాత్రం విస్మరించలేని ముగింపు. యుఎస్‌ఎస్‌ఆర్‌ తరహా సోవియట్‌ సోషలిజానికి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. రాజ కీయంగా అది ప్రవచించిన సోషలిస్టు ప్రజాస్వామ్యం నియంతృత్వం ముసుగులో పార్టీ నియంతృత్వాన్ని ప్రతి పాదించే వాస్తవ ఉద్దేశాన్ని కలిగివుంది. సోవియట్‌ యూనియన్, తూర్పు యూరోపియన్‌ కమ్యూనిస్టు వ్యవస్థల పతనం ఆ తరహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పును స్పష్టంగా సూచించింది. తన పాలనలో స్టాలిన్‌ లక్షలాదిమంది రైతులను వధించడం, పోల్‌పాట్‌ సాగిం చిన మారణకాండ వంటివి కమ్యూనిజం ముసుగులో కొనసాగిన నిరంకుశాధికారపు అతి చర్యలకు తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోయాయి. 

కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛకోసం మానవుడి తృష్ణను గుర్తించడంలో విఫలం కాగా, కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ మార్కెట్‌ తర్కాన్ని, ఆర్థిక ప్రోత్సాహకాల అవసరాన్ని గుర్తించడంలో విఫలమైంది. ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం ఒక రకం సమానత్వాన్ని సృష్టించింది కానీ ఆర్థిక వ్యవస్థను అది అత్యల్ప సమతుల్యస్థితికి కుదించివేసి వాణిజ్యతత్వాన్ని, సృజనాత్మకతను చంపేసింది. ఇక ప్రభుత్వ సోషలిజం సృష్టించి పెట్టిన నిరంకుశాధికార వైపరీత్యం మార్కెట్లు దాంతో నడవవు అనే సత్యానికి అద్భుత తార్కాణంగా నిలిచిపోయింది. పైగా, పర్యావరణం, నిర్ణయాలను తీసుకోవడంలో కేంద్రీకరణకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థల రికార్డు భయానకంగా మిగిలిపోయింది.

నిస్వార్థ త్యాగమూర్తులు జాతి వ్యతిరేకులా?
అంతర్జాతీయ కారణాలతోపాటు, భారత్‌లో కమ్యూనిస్టు వామపక్షం కుప్పగూలడానికి ఇక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో దానికి ఎదురవుతున్న అసమర్థతే ప్రధాన కారణం. మన కమ్యూనిస్టుల సైద్ధాంతిక పార్శ్వం లోకి యూరోకేంద్రకవాదం జొరబడింది. దీంతో తాము పనిచేస్తున్న సమాజాన్ని వ్యవస్థాగతంగానే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో అసమానత్వ కేంద్రంగా కులం ఉందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో వీరు విఫలమయ్యారు. అలాగే భారత జాతీయ ఉద్యమం ప్రాధాన్యత స్వభావాన్ని అవగాహన చేసుకోవడంలో వైఫల్యం కూడా ఈ సమస్యలోంచే పుట్టుకొచ్చింది. మరింత లోతుగా చూస్తే, సగటు భారతీయుడి సాంస్కృతిక సున్నితత్వాన్ని తీర్చిదిద్దిన మత, సంప్రదాయిక ప్రపంచాన్ని గుర్తించి, ఎత్తిపట్టడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. వేలాది కమ్యూనిస్టుల నిస్వార్థపూరితమైన త్యాగాలను నిర్లక్ష్యం చేసి వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రించడం తప్పే అవుతుంది. కానీ బయట నుంచి వారు భారత్‌కు తీసుకొచ్చిన సిద్ధాంతమే వారి అంతిమ వైఫల్యానికి దారితీయడం విషాదకరం.

దీనర్థం ఏమిటంటే 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం ధోరణి మరణించింది. ఇది ఒకందుకు మంచిదే, కానీ రెండో కోణంలో మరింత లోతుగా చూస్తే, వామపక్షం 21వ శతాబ్దంలోకూడా తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. ఈ కోణంలో వామపక్షం సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామిక జువాబుదారీతనం కోసం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. దోపిడీ, అన్యాయంతో కూడిన బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ అది ‘వామపక్షం’ గానే ఉంటూ కొనసాగుతోంది. కానీ ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది.
చివరగా... వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావాలు చిరకాలం వర్ధిల్లాలి.

- యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు 
98688 88986

 

మరిన్ని వార్తలు