తెలుగు రాష్ట్రాల స్నేహ వారధి నేటి అవసరం

29 May, 2019 00:59 IST|Sakshi

సందర్భం 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో 2014లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయంలో ఫేస్‌బుక్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆంధ్రలో చంద్రబాబు గెలిస్తే లాభమా? లేక వైఎస్‌ జగన్‌ గెలిస్తే లాభమా? అన్న ప్రశ్నకు అప్పట్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇద్దరిలో ఎవరో ఒకరు అక్కడ అధికారంలోకి వస్తారు కనుక ఎవరు ఆంధ్రలో గెలవాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, మెజారిటీ వైఎస్‌ జగన్‌ గెలవాలని కోరుకున్నారు. నేను కూడా ఆంధ్రలో జగన్‌ అధికారంలోకి రావాలని కోరుకున్నాను. ఫేస్‌బుక్‌లో చర్చ అంతా తెలంగాణ ప్రయోజనాల కోణం నుంచే జరిగింది. జగన్‌ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రయోజనం అనే కోణంలో నా విశ్లేషణ సాగింది.

చంద్రబాబు గతంలో 9 ఏళ్లు ఏపీకి సీఎంగా పనిచేసినప్పుడు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాలతో ఎప్పుడూ ఘర్షణ వైఖరినే ప్రదర్శిం చారు. ముఖ్యంగా నదీజలాల విషయంలో కర్ణాటకతో, తమిళనాడుతో బాబు ప్రభుత్వం ఘర్షణ అందరికీ ఎరుకే. ఈ వైఖరితో సమస్యలు పరిష్కారం కాకపోగా తీవ్రమైన వైరుధ్యాలను సృష్టించింది. ఘర్షణ బాబు స్వభావంలో భాగం. ఇచ్చి పుచ్చుకొనే ధోరణి కాదు తనది. ఆ స్వభా వం వలన తెలంగాణతో కూడా అటువంటి ఘర్షణ వైఖరి తోనే అతని పరిపాలన ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వానికి ఇది నిరంతరం చికాకు కలిగించే వ్యవహారంగా ఉండబోతున్నదని భావించేవాడిని. 

చంద్రబాబుకు తెలంగాణలో బలమైన నిర్మాణం కలిగిన దళారి వర్గం ఉంది. బాబుకు సద్దులు మోసే ఈ దళారివర్గం అండతో తెలంగాణపై తన పెత్తనాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. రాష్ట్రం విడిపోయినా తెలం గాణ మీద ఆశను వదులుకోలేదు. ఎప్పటికైనా తెలంగాణలో తన దళారిని సీఎంగా నియమిస్తాను అని అతను భావించేవాడు. మరోవైపు జగన్‌ తెలంగాణని పూర్తిగా వదులుకున్నారు. ఆయన దృష్టి అంతా సీమాంధ్ర మీదనే ఉండేది. తెలంగాణలో సీఎంగా కేసీఆర్, ఆంధ్రలో సీఎంగా బాబు ఒకే ఒరలో ఇమడని రెండు కత్తుల్లాంటి వ్యవహారం. కేసీఆర్‌ని తోటి సీఎంగా గౌరవించే సౌజన్యం బాబుకు లేదు. తెలంగాణ ఆత్మగౌరవం మూర్తీభవించిన కేసీఆర్, బాబు ప్రదర్శించే సాంస్కృతిక ఆధిపత్య ధోరణిని భరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇటువంటి భిన్నధృవాలు విభజనానంతరం ఉత్పన్నం అయ్యే అనేక సమస్యలను కూర్చుని పరిష్కరించలేరు. అక్కడ వైఎస్‌ జగన్‌ సీఎం అయితే ఉమ్మడి సమస్యలను ఇద్దరు సీఎంలు మధ్యవర్తులు లేకుండానే ముఖాముఖి చర్చించుకొని పరి ష్కరించుకొనే వెసులుబాటు ఉంటుంది.

స్థూలంగా ఫేస్‌బుక్‌లో నా అభిప్రాయాల సారాంశమిది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రలో బాబు సీఎంలు కావడం జరిగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 2న ఏర్పడితే, ఆంధ్ర ప్రభుత్వం జూన్‌ 8న ఏర్పడింది. అయితే నా ఊహ మేరకే బాబు పాలన తెలంగాణతో ఘర్షణ వైఖరిగానే కొనసాగింది. తెలంగాణ ఏర్పడక ముందే మోదీ ప్రభుత్వం ద్వారా తెలంగాణకు వెన్నుపోటు పొడిపించాడు. రాత్రికి రాత్రే, రహస్యంగా ఖమ్మం జిల్లా పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని 7 మండలాలను ఏపీకి బదిలీ చేయించాడు. దీన్ని చూపించి పోలవరం నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రానికి ఇక ఏ సంబంధం ఉండదు కనుక పోలవరం గవర్నింగ్‌ బాడీ నుంచి, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నుంచి తెలంగాణ అధికారులను తొలగించాలని కేంద్రాన్ని కోరాడు. అధికారంలోకి రాగానే విభజన చట్టానికి విరుద్ధంగా విద్యుత్‌ ఒప్పందాల ఏకపక్షరద్దుకు నిర్ణయించాడు. తాగునీటి కోసమని చెప్పి సాగుకోసం 10 టీఎంసీల కృష్ణా నీటిని నాగార్జున సాగర్‌ డ్యాం నుంచి వదలమని తెలంగాణపై ఒత్తిడి పెట్టాడు. తెలం గాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పనిలో తెలంగాణ ప్రభుత్వం తలమునకలవుతుంటే ముందరి కాళ్ళ బంధం వేసే ప్రయత్నం చేసాడు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులపై పుంఖానుపుంఖంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు, కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందునుంచి పుండుమీద కారం చల్లినట్లు ఘర్షణ వైఖరిని, ఆధిపత్య స్వభావాన్ని బాబు ప్రదర్శిస్తూనే ఉన్నాడు.

ఈ ఐదేండ్లలో గుర్తించదగిన పరిణామాలు కొన్ని ఏర్పడ్డాయి. ఇటు తెలంగాణలో బాబు పెంచి పోషించిన దళారి వర్గం దాదాపు అంతరించింది. అటు ఆంధ్రలోబాబు మొత్తంగా ప్రజాదరణ కోల్పోయినాడు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్‌ జగన్‌ సునామీలో కొట్టుకుపోవడం మనం చూశాం. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల విభజన జరిగింది. ఉమ్మడి సంస్థల ఆస్తుల పంపకాలు దాదాపు పూర్తి అయ్యాయి. ఆంధ్ర రాజధాని అమరావతికి తరలిపోవడంతో ఉమ్మడి రాజధాని నామమాత్రంగానే ఉన్నది. ఉమ్మడి గవర్నర్‌ వ్యవస్థ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ ఐదేండ్లలో తెలంగాణా ప్రభుత్వం మహారాష్ట్ర్ట, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంది. ఘర్షణ వైఖని విడనాడి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించింది. ఆంధ్రతో అదే వైఖరిని ప్రదర్శించింది. కానీ, చంద్రబాబు మాత్రం తనకు అలవాటైన ఘర్షణాత్మక వైఖరినే ప్రదర్శిస్తూ పోయాడు.

ఇప్పుడు ఆంధ్రలో వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నది. గత ఐదేళ్ల పాటు అనేక అంశాల్లో కొనసాగిన ఘర్షణలు ఇక సమసిపోతాయని ఆశించవచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైద్ధాంతికంగా, విధానపరంగా పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలనే కోరుకుంటున్నారు కనుక ఆంధ్రతో స్నేహం బలపడుతుం దని ఆశించవచ్చు. రెండు రాష్ట్రాల మధ్య ప్రధానంగా ఘర్షణకు దారి తీసే అంశం నదీ జలాలు. గోదావరిలో రెండు రాష్ట్రాలు వాడుకోగా అంతకు రెండింతల నీరు సముద్రంలోకి పోతున్నది. కృష్ణాలో ప్రవాహాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. కాబట్టి పుష్కలంగా ఉన్న గోదావరి నీటిని వినియోగించుకోవడం ఒక్కటే రెండు రాష్ట్రాల ముందు ఉన్న కర్తవ్యం. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ అంశంలో స్పష్టత ఉంది. కాబట్టి గోదావరి బేసిన్‌లో తెలం గాణ వాటాను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, చనాక–కొరాట, తుమ్మడిహట్టి వంటి ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. ఆంధ్రలో కూడా గోదావరి జలాల వినియోగానికి తగిన ప్రాజెక్టులను రూపకల్పన చేసుకోవాలని ఆంధ్ర ప్రభుత్వానికి సూచన చేశారు.

ఏపీ సీఎంగా పదవీ ప్రమాణం చేస్తున్న వైఎస్‌ జగన్‌ వర్షాకాలం నాలుగు నెలల్లో పుష్కలంగా లభ్యమయ్యే గోదావరి జలాల సమర్థ వినియోగానికి ప్రథమ ప్రాధాన్యతని ఇస్తారని, ఇవ్వాలనీ మనం ఆశించవచ్చు. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు తెరపడుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని ప్రయోజనాలను, వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవడానికి రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు నడువాల్సిన సమయం ఇది. తెలంగాణ ఉద్యమ నినాదం కూడా అదే. ‘మనం రాష్ట్రాలుగా విడిపోదాం – ప్రజలుగా కలిసి ఉందాం’ ఈ నినాదం వాస్తవ రూపం తీసుకోవడానికి ఇది పూర్తిగా అనుకూల సమయం.

వ్యాసకర్త : శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే, తెలంగాణ సీఎం ఓఎస్‌డీ
 

మరిన్ని వార్తలు