మలుపు తిరిగిన హోదా ఉద్యమం

7 Apr, 2018 01:44 IST|Sakshi

రాష్ట్ర అవతరణ కోసం, ముల్కి నిబంధనలకు వ్యతిరేకంగా, విశాఖ ఉక్కు పరిశ్రమకోసం, సమైక్యాంధ్ర కోసం జరిగిన ఉద్యమాలను ఆనాటి రాజకీయ నాయకులు, ప్రజలు కలిపి నడిపారు. అయితే ఈ నాటి ప్రత్యేకహోదా ఉద్యమం రాష్ట్ర ప్రజానీకాన్ని నడుపుతున్నది. ఢిల్లీ స్థాయిలో వైఎస్‌ జగన్‌ పోరాటం, గుంటూరులో నిరాహారదీక్ష, యువభేరి కార్యక్రమాలు, పబ్లిక్‌ మీటింగులలో ప్రత్యేకహోదా ప్రస్తావన, ఇప్పుడు తన పాదయాత్రలో ప్రత్యేకహోదా రాకపోవడం వలన రాష్ట్ర ప్రజలేమి నష్టపోయారో వివరించడంతో ప్రత్యేకహోదా అంశం జీవించి ఉందనేది నిర్వివాదం. అదే సమయంలో కమ్యూనిస్ట్‌ నాయకులు, ప్రత్యేకహోదా సాధన సమితి సభ్యులు వీధుల్లో పోరాడితే, సాక్షితో పాటు కొన్ని ఇతర టి.వి.చానల్స్‌ వివిధ కళాశాలల్లో నిర్వహించిన ప్రత్యేక చర్చలు, గోష్టిలు ప్రత్యేకహోదా అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పడంలో తనవంతు కర్తవ్యాన్ని పోషించాయి.

నాలుగేళ్ళపాటు ఉద్యమాన్ని అణచిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు ఉద్యమం ప్రజల గుండెల్లోకి వెళ్లిందని, సకల జనుల ఉద్యమం అయిందని గ్రహించారు. దీంతో రాజకీయంగా తమకు జరిగే నష్టాన్ని బేరీజు వేసుకొని, తాము కూడా ఉద్యమంలో భాగం కావాలనే దుర్బుద్ధితో పావులు కలిపారు. గతంలో హోదా అవసరమని, అవసరంలేదన్న టీడీపీ, ఇప్పుడు జనాగ్రహాన్ని పసికట్టి హోదా అవసరమేనంటూ నాలుక మడత పడకుండా పిల్లిమొగ్గలువేసి మాటలు మార్చడమే కాకుండా అందుకు ప్రజలందరూ కలిసి రావాలని కోరుకోవడం విచిత్రం. తమకు కావలసిన హామీలు కేంద్రం ఇస్తే టీడీపీ నేతలు తిరిగి ఉద్యమానికి నారచీరలు కట్టి అడవులకు పంపరని నమ్మకం లేదు. 

అవిశ్వాస తీర్మానం చర్చకే రాకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడటంతో నేటి నుంచి వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామా, ఆమరణ నిరాహార దీక్ష ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మూలమలుపు తిప్పనున్నాయి. ఈ సందర్భంగా జాతీయ మీడియా హోదా ఉద్యమంపై విస్తృత ప్రచారం చేస్తుండగా ఏపీలో ఒక వర్గం మీడియా ప్రభుత్వ అనుకూల బాణీతో ముందుకొచ్చి సృష్టిస్తున్న గందరగోళం పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా విషయంలో ఏమిచేసినా, చేయకపోయినా ‘అహో ఓహో’ అంటూ గొప్పలు రాయడం లేదా టి.వి. చానళ్లలో చూపడం ఈ వర్గ మీడియాకు సహజమైపోయింది. ప్రత్యేక హోదాతో సహా అన్ని అంశాల్లో వీరు రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ముకాసి తమకు అన్యాయం చేస్తున్న విషయం ప్రజలు గ్రహించాలి.

వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి, విశ్రాంతాచార్యులు ‘ 94400 44922 

మరిన్ని వార్తలు