అలుపెరగని పోరాట యోధుడు

27 Apr, 2018 10:02 IST|Sakshi

దగాపడ్డ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని విభజన నాటి నుంచి హోదా కోసం అన్ని వర్గాల నుండి మద్దతు కూడగట్టి అహర్నిశలూ ప్రత్యేక హోదాకోసం ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తూ చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న ప్రజా స్పందన సాక్షిగా ప్రజల హృదయాలలో జగన్‌ ఇప్పటికే నిలిచిపోయారు.

వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తి అవకూడదనే దురుద్దేశంతో పోలవరం కాలువలు పూర్తికాకుండా తన అనుచరులతో న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించి అడ్డంపడిన చంద్రబాబు తాను సీఎం అయిన తర్వాత చట్టానికి వ్యతిరేకంగా భూపరిహారాన్ని పెంచి, పంచి ఇచ్చాడు. బీజేపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టును 100% మేమే పూర్తి చేస్తామని కేంద్రం చెప్పినా తన కమీషన్ల కోసం కక్కుర్తిపడి 90% గ్రాంటుకే ఒప్పుకొని ప్రాజెక్టుని భుజానికెత్తుకొని ప్రతీవిభాగాన్నీ అవినీతి మయం చేశాడు. తనకిష్టం వచ్చినవారికి కాంట్రాక్టులిచ్చి, కమీషన్లు చాలక మరొకరిని మార్చి అంచనాలను మరింత పెంచాడు. అసెంబ్లీలో జగన్‌ వేసిన ప్రశ్నలకు కనీసం జవాబు చెప్పలేని పరిస్థితుల్లో అసెంబ్లీని దూషణలకే పరి మితం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.

పట్టిసీమ ప్రాజెక్టు ఉపయోగం లేని ప్రాజెక్టు అని న్యాయ పోరాటం చేసినా ఇప్పటికీ అవి కోర్టులో పెండింగ్‌లోనే ఉన్నాయి. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు పట్టిసీమ నిజస్వరూపాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా తన అనుకూల మీడియా ద్వారా అపర భగీరథుడిలా పొగిడించుకోవటం శోచనీయం. పైగా పట్టిసీమతో నదుల అనుసంధానం చేసేసినట్లు గొప్పలు చెప్పుకుంటు న్నాడు. నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంటు ఏజెన్సీ ప్రకా రం రాష్ట్రంలో నదుల అనుసంధానం కిందికి బ్రిటిష్‌ వారు నిర్మించిన కె.సి.కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టు మాత్రమే వస్తాయని పట్టిసీమ లిప్టు ఇరిగేషన్‌ అనుసంధానం క్రిందకు రాదని చెప్పినా పట్టించుకోవటం లేదు. పట్టిసీమ ప్రాజెక్టులో 30 పంపులు ఎస్టిమేట్‌లో పెట్టి వాస్తవానికి 24 పంపులే బిగించి, మొత్తం పంపులకు బిల్లు తీసుకున్నారని గతంలో వారి మిత్రపక్షమైన బీజేపీకి చెందిన విష్ణుకుమార్‌ రాజు స్వయంగా శాసనసభ సాక్షిగా నిరూపించినా, పట్టిసీమలోని అవినీతిని కాగ్‌ బయట పెట్టినా నిస్సిగ్గుగా బొంకుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో బీజేపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించిన సందర్భంలో నష్టాన్ని భర్తీచేయడానికి పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకహోదాను కాంగ్రెస్‌ ప్రకటించినా బీజేపీ దానికి వంతపాడి తీరా అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏపీకి మొండిచెయ్యి చూపించారు. అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కోవడమే కాకుండా ఓటుకు కోట్లు కేసు భయం వల్ల కేంద్రం చేతుల్లో చిక్కుకుపోయి ప్రత్యేక ప్యాకేజీని బీజేపీ ఇస్తానంటే ఒప్పుకుని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినారు. దగాపడ్డ  ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని విభజన నాటి నుండి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోను, ఏపీలోను విద్యార్థులతో సహా అన్ని వర్గాల నుండి మద్దతు కూడగట్టి అహర్నిశలూ ప్రత్యేకహోదాకోసం ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌మోహ న్‌రెడ్డిది. చివరకు ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి హోదాకోసం పార్టమెంటులో అవి శ్వాస తీర్మానాన్ని పెట్టించి హోదా ఇవ్వకపోతే రాజీనామాలు చేయడానికి సిద్ధపడినారు. రాజీనామాలు చేసిన తరువాత హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

దేశంలోనే ఎంతో సీనియర్‌నని గొప్పలు చెప్పుకుంటున్న బాబు అవిశ్వాసానికి సహకరిస్తానని ఒకరోజు మళ్ళీ వెంటనే మాట మార్చి, తానే అవిశ్వాస తీర్మానం పెడతాననీ పిల్లిమొగ్గలేస్తూ గతిలేని పరిస్థితుల్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని దిక్కులేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో సైతం అంటకాగడానికి వెనుకాడడం లేదు. ఏపీలో చంద్రబాబు, అతని అనుచరులు చేస్తున్న దోపిడీ, అరాచకాలను ప్రజలు గమని స్తున్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించి, రాజ్యాం గమే లేని రాష్ట్రంగా తీర్చిన ఘనత చంద్రబాబుదే. ఈ అవినీతి, అక్రమాలను ఎన్డీఏ మిత్రులే బయటపెడుతున్న సందర్భంలో నిజాలు మరింత బయటకు రావాలి. బాబుని నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.

ప్రజల కష్టాలను పూర్తిగా తెలుసుకున్న నాయకుడెవరైనా మంచి పరిపాలన అందివ్వగలడు. దివంగత నేత వైఎస్సార్‌ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకుని తిరుగులేని నేతగా ప్రజాహృదయాల్లో నిలిచిపోయారు. అదేబాటలో జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల హృదయాలలో మాట తప్పని నాయకుడిగా నిలిచిపోతున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడి అలుపెరగని పోరాటం చేస్తూ చంద్రబాబుకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న ప్రజా స్పందన సాక్షిగా ప్రజల హృదయాలలో జగన్‌ ఇప్పటికే నిలిచిపోయారు.


- కొవ్వూరి త్రినాథరెడ్డి
వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
మొబైల్‌ : 94402 04323

>
మరిన్ని వార్తలు