‘వాల్టా’తో బోరు బావులకు చెక్‌ !

8 Feb, 2018 10:18 IST|Sakshi
బోర్‌వెల్‌

జిల్లాలో 18 గ్రామాల్లో అడుగంటిన భూగర్భ జలాలు

బోర్లు, బావుల తవ్వకంపై నిషేధం

ఇసుక మైనింగ్‌పై కూడా ఆంక్షలు

భూగర్భ జలాలు బాగా అడుగంటిన గ్రామాల్లో వాల్టా చట్టం అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,227 గ్రామ పంచాయతీల్లో వాల్టా చట్టం – 2002 అమలులో ఉంటుందంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జనవరి 25న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలోని 18 గ్రామాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన గ్రామాల్లో కొత్తగా వ్యక్తిగత బోర్లు, బావుల తవ్వకాలపై ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న బోర్లు, బావుల నుంచి నీటి తోడకంపైనా ఆంక్షలు ఉంటాయి. వాల్టా చట్టంలోని ఛాప్టర్‌ – 3 సెక్షన్‌ 8 (2) ప్రకారం బోర్లు, బావుల నుంచి నీటి తోడకానికి ఉపయోగించే మోటార్లకు విద్యుత్‌ వినియోగంపైన ఆంక్షలు వర్తిస్తాయి. ఈ చట్టం అమలయ్యే గ్రామాల పరిధిలోని ఇసుక తవ్వకాలపైన కూడా నిషేధం ఉంటుంది. సామూహిక తాగునీటి అవసరాలకు భూగర్భ జల వనరుల శాఖ అధికారుల అనుమతితో మాత్రమే తవ్వకాలకు అవకాశం ఉంటుంది.

చిలకలూరిపేట : వాల్లా చట్టం అమలులో ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయా గ్రామాల్లో వాల్టా (వాటర్, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌) చట్టం అమలులో ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షాలు కురవని సందర్భాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువుకాటకాలు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రోజువారీ అవసరాల కోసం మనుషులతో పాటు పశువులకు తాగేందుకు సరిపడ నీరు దొరకని పరిస్థితులు ఉంటాయి. చెరువులు, వాగులు ఎండిపోవటంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి ప్రమాదాన్ని అంచనా వేసి ముందస్తు చర్యల్లో భాగంగా వాల్టా చట్టాన్ని ఆయా గ్రామాలలో అమలు చేస్తుంటారు.

అమలుకాని మార్గదర్శకాలు..
ఆయా గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరాయని, భవిష్యత్‌లో నీటి కష్టాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని భూగర్భ జల వనరుల శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో గత ఏడాది ఫిబ్రవరిలో 16.728 మీటర్ల అడుగున ఉన్న నీటి నిల్వలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 22.435 మీటర్లకు దిగజారాయి. మాచర్లలో 19.327 మీటర్ల అడుగున ఉన్న జలాలు ఈ ఏడాది 31.202 మీటర్ల అడుగుకు పడిపోయాయి. భూగర్భ జలాల వినియోగంపై సుప్రీం కోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం బోరు వేయటానికి 15 రోజుల ముందు సంబంధిత యజమాని భూగర్భ జల వనరుల అధికారులకు సమాచారం అందజేయాలి. వారి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు బోర్‌వెల్‌ తవ్వకం యంత్రాలు కలిగి ఉన్న నిర్వాహకులు విధిగా తమ పేర్లను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. గ్రామాలవారీగా బోర్ల వివరాలు పంచాయతీలు సేకరించాలి. అయితే వీటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోకపోవటంతో అవస్థలు తప్పటం లేదు.

జిల్లాలో సుమారు 50 వేల పైచిలుకు బోర్లు ఉన్నాయి. వర్షాభావంతో రైతులు భూగర్భ జలాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో భూగర్భ జలాల లభ్యత అడుగంటుతోంది. పట్టణ ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లకు సైతం విచ్చలవిడిగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా  ప్రైవేటు వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. విచ్చలవిడిగా వివిధ అవసరాలకు బోర్లు వేయకుండా ప్రజలను చైతన్యం చేయటం ద్వారానే భూగర్భ జలాలు పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాగుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు అధికం అయ్యాయని తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చట్టం ప్రకారం ఇసుక తవ్వకాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామాలలో మాత్రమే భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకొని వాల్టా చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరు మారని పక్షంలో జిల్లాలోని మరెన్నో గ్రామాలకు భూగర్భ జలాల లభ్యత లేకుండాపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటుందా... వాగులు వట్టిపోకుండా ఇసుక రవాణా నియంత్రించి భూగర్భ జలాల పెంపునకు సహకరిస్తుందా అనేది వేచి చూడాలి.

తవ్వకాలు చేయరాదు..
సంబంధిత 18 గ్రామాల్లో కొత్తగా బోర్లు, బావుల కోసం ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇసుక తవ్వకాలు చేయరాదు. సామూహిక తాగునీటి అవసరాల కోసం అనుమతితో మాత్రమే కొత్త బోర్లు వేయాల్సి ఉంటుంది. – ఎం. రామ్‌ప్రసాద్, డీడీ, భూగర్భ జల వనరుల శాఖ

మరిన్ని వార్తలు