మోగింది భేరి.. ఓటు హక్కుందా మరి! 

12 Mar, 2019 10:15 IST|Sakshi

సాక్షి, సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో తొలి విడతలోనే (ఏప్రిల్‌ 11న) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని రాజకీయ నాయకులతో పాటు అధికార యంత్రాంగంలోనూ హడావుడి మొదలైంది. జిల్లాలో ఓటు తొలగింపుల కోసం గత నెల 28 నాటికి 1,09,079  దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అధికారులు పరిశీలన ప్రక్రియలో నిమగ్న మయ్యారు. దీనిని వీలైనంత త్వరగా ముగించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లంతా జాబితాలను సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. జాబితాలో పేర్లులేని వారితోపాటు ఇప్పటి వరకు ఓటు పొందని అర్హులంతా ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఇంకా సమయం మూడు రోజులు మాత్రమే ఉండటంతో త్వరితగతిన ఓటు హక్కు నమోదుకు తరలాల్సి ఉంది.


జిల్లాలో ఓటర్లు.. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 37,51,071 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 18,43,098 మంది, మహిళలు 19,07,552 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 64,501 మంది అధికంగా ఉన్నారు. ఈ సంఖ్యలో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు 421 మంది ఇతరులు కూడా ఉన్నారు. 
 

అత్యధికం.. అత్యల్పం 
మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజక వర్గంలో 2,54,001 మంది ఓటర్లు ఉన్నారు.  వీరిలో పురుషులు 1,24,263 మంది, మహిళలు 1,29,709 మంది, ఇతరులు 29 మంది ఉన్నారు. అత్యల్పంగా బాపట్ల నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు. బాపట్ల నియోజకవర్గంలో మొత్తం 1,75,012 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 86,356 మంది, మహిళలు 88,650 మంది, ఇతరులు ఆరుగురు ఓటు హక్కు కలిగి ఉన్నారు.  
 

ఆన్‌లైన్‌లో ఇలా..
ఓటరుగా నమోదు చేసుకోవడానికి  డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ సీఈవోఆంధ్ర.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో సెర్చ్‌ యువర్‌ నేమ్‌ చోట క్లిక్‌ చేసి మీ నియోజకవర్గం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, నమోదు చేసుకోవాలి. వెంటనే మీకు ఓటు ఉందా, లేదా, ఉంటే ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉందో తెలుస్తుంది. ఈ వెబ్‌సైట్‌ నుంచి ఓటు హక్కు కోసం కూడా నమోదు చేసుకోవచ్చు.  దీనితో పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేకంగా ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని తహసీల్దార్, ఆర్డీవో, పురపాలక సంఘాల పరిధిలో, పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారి వద్ద   ఫారం–6 పూర్తి చేసి ఓటు హక్కు పొందవచ్చు.  

మరిన్ని వార్తలు