తీగ లాగినా డొంక కదలదేం..?

9 Jan, 2018 11:30 IST|Sakshi

హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రిమాండ్‌లో రెంటచింతల వైస్‌ ఎంపీపీ సోదరుడు, అనుచరులు

బెట్టింగ్‌ కట్టడిపై స్పందించని జిల్లా పోలీసులు

బెట్టింగ్‌ భూతాన్ని తుదముట్టిస్తామని పోలీసు అధికారులు శపథాలు చేశారు.. బుకీల ఆటకట్టించి ఊచలు లెక్కబెట్టిస్తామని బీరాలు పలికారు.. పౌర సమాజం సహకరిస్తే ఎంతటి వారినైనా విడిచేది లేదని ప్రగల్భాలు పలికారు.. ఎవరు వివరాలు అందజేసినా తక్షణం స్పందిస్తామని అభయమిచ్చారు. తీరా జిల్లాకు చెందిన కీలక బుకీలను రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో అక్కడి పోలీసులు అరెస్టు చేసినా ఇక్కడ స్పందించే వారే కరువయ్యారు. తీగ లాగినా..డొంక కదిలించడంలో జిల్లా పోలీసులు విఫలమయ్యారు. ‘అధికారం’ అండతో గల్లీ నాయకులు రెచ్చిపోతున్నా చూస్తూ ఉండిపోతున్నారు.

సాక్షి, గుంటూరు: రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తూ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసులకు పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వీరి వల్ల ఇబ్బందులు పడిన అనేక మంది బాధితులు తెలంగాణా పోలీసులను చూసైనా జిల్లా పోలీస్‌ యంత్రాంగం స్పందించి బెట్టింగ్‌ ముఠా మూలాలను వెతికి పట్టుకుంటారని ఆశించారు. అయితే పోలీసుల నుంచి ఏమాత్రం కనీస స్పందన లేకపోవడం గమనార్హం. పల్నాడులో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అండదండలు ఉండటంతోనే రెంటచింతల నాయకులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఉదాసీన వైఖరితో బెట్టింగ్‌ పెచ్చరిల్లుతోందనే విమర్శలు వస్తున్నాయి.

భారీ సరంజామా స్వాధీనం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా వద్ద హైదరాబాద్‌ పోలీసులు భారీ మొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు సీజ్‌ చేయడం గమనార్హం. హైదరాబాద్‌ ప్రగతినగర్‌లోని లక్ష్మీనిలయం పెంట్‌ హౌస్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న రెంటచింతల మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడి సోదరుడు గొంటు రవికిరణ్‌రెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కాసాని కోటిరెడ్డి, ఎం.అజయ్‌రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి వద్ద నుంచి రూ.15,28,460 నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఒక నోట్‌ప్యాడ్, 33 సెల్‌ఫోన్లు, కమ్యూనికేటర్‌ బాక్స్, ఎల్‌ఈడీ టీవీ, రెండు కోడ్‌బుక్‌లు, నాలుగు చెక్‌బుక్‌లు, నాలుగు డెబిట్‌ కార్డులు, రెండు ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇన్నోవా వాహనం కూడా పోలీసులు స్వాధీనంలో తీసుకున్నారు. రవికిరణ్‌రెడ్డి మూడు మ్యాచ్‌లకు సంబంధించిన నగదును అరెస్టు అయిన రోజు ఉదయం ప్రధాన బుకీ అయిన వెంకిబాబుకు చేరవేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది.  ఒక్కరోజు ముందు పోలీసులు దాడి చేసి ఉంటే భారీ మొత్తంలో నగదు దొరికి ఉండేదని పోలీసులే అంచనా వేయడం గమనార్హం.

ఏజెంట్లను నియమించి మరీ ‘బెట్టింగ్‌’
రెంటచింతల మండలపరిషత్‌ ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్‌రెడ్డి సోదరుడు రవికిరణ్‌రెడ్డి గతంలో రెంటచింతల కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం నడిపేవాడని సమాచారం. అంచెలంచెలుగా బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చీకటి సామ్రాజ్యంలో ఎందరో బుకీలతో సంబంధాలు ఏర్పరుచుకుని రాష్ట్రవ్యాప్తంగా బుకీగా అవతారమెత్తాడు. అనేక జిల్లాల్లో ఏజెంట్లను నియమించి మరీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడంటే ఏ స్థాయికి చేరాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో రేషన్‌ మాఫియా సైతం సదరు వ్యక్తి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అండదండలతోనే ఈ తతంగమంతా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడిన రవికిరణ్‌రెడ్డికి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో బుకీలు, ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి,   ఆస్తులను రికవరీ చేయాలని బెట్టింగ్‌లతో నష్టపోయిన బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు