మధ్యవర్తుల మీదకు కథ మళ్లింది..!

22 Jan, 2018 08:14 IST|Sakshi

కిడ్నీ రాకెట్‌లో రెవెన్యూ అధికారులను తప్పించేందుకు యత్నం

కేవలం మధ్యవర్తులను బాధ్యుల్ని చేసేందుకు కుయుక్తులు

శాఖాపరమైన చర్యల్లోనూ రాజకీయ జోక్యం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నరసరావుపేట కేంద్రంగా నిర్వహించిన ఈ అక్రమ దందాలో పాలుపంచుకున్న రెవెన్యూ అ«ధికారులను కేసు నుంచి బయటవేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి, అనేక కీలక అంశాలను రాబట్టినట్లు తెలియవచ్చింది. తహసీల్దార్‌ కార్యాలయ అధికారి, సిబ్బంది సహాయంతోనే ఈ కిడ్నీ రాకెట్‌కు బీజం వేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపమో లేక రాజకీయ ఒత్తిడో తెలియదుకాని అసలు మూలకారకులైన రెవెన్యూ యంత్రాంగం జోలికి వెళ్లకుండా మధ్యవర్తులను మాత్రమే నిందితులుగా చూపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

నరసరావుపేటటౌన్‌ :కిడ్నీ రాకెట్‌ కేసులో అక్రమ పద్ధతిలో సర్టిఫికెట్‌లు మంజూరే చేసి అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ అధికారులపై అటు ఆ శాఖ ఉన్నతా«ధికారులు, ఇటు పోలీస్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లేని బంధుత్వాన్ని ఉన్నట్లుగా చూపి అక్రమ పద్ధతిలో కిడ్నీ మార్పిడికి అనుమతులు పొందడం...దీనికి నరసరావుపేట తహసీల్దార్‌ కార్యాలయం వెన్నుదన్నుగా నిలవడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం శాఖాపరమైన విచారణ చేపట్టకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. దుర్గికి చెందిన ముడావత్‌ వెంకటేశ్వర్లు నాయక్‌ నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన రవికుమార్‌గా ఆధార్‌కార్డు పేరు మార్చి కిడ్నీ మార్పిడికి రెవెన్యూ శాఖ ద్వారా అనుమతులు పొందాడు. పోలీస్‌ విచారణలో నకిలీ ఆధార్‌కార్డు బాగోతం బయటపడటంతో ఈ వ్యవహారం ఎక్కడ తమమెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఒక వెంకటేశ్వర్లు నాయక్‌ సర్టిఫికెట్‌తో రెవెన్యూ అక్రమ సర్టిఫికెట్ల మంజూరు ఆగలేదు. విచారణలో మరో మూడు కిడ్నీ మార్పిడి సర్టిఫికెట్‌లు అక్రమ పద్ధతిలో జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో దళారులతో రెవెన్యూ అధికారులు చేతులు కలిపి అక్రమ సర్టిఫికెట్‌ల మంజూరుకు తెరలేపిన విషయం బహిరంగ రహస్యమే.

దళారి చేతికి సర్టిఫికెట్స్‌తో బహిర్గతమైన అవినీతి..
కిడ్నీ మార్పిడికి సంబంధించి గతేడాది 9వ నెల నుంచి 11వ నెల వ్యవధిలో తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా ఐదు సర్టిఫికెట్‌లు మంజూరు చేశారు. వాటిలో కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పారిశ్రామిక వేత్త కారు డ్రైవర్‌ నాగమల్లేశ్వరరావు స్వయంగా సంతకం చేసి మూడు సర్టిఫికెట్‌లను కార్యాలయంలో పొందాడు. వెంకటేశ్వర్లు నాయక్‌ ఆధార్‌కార్డు మార్చిన విధంగానే మిగిలిన రెండు కిడ్నీ మార్పిడి వ్యవహారాల్లో రోగికి, దాతకు మధ్య లేని బంధుత్వాన్ని చిత్రీకరించేందుకు ఆధార్, రెసిడెన్స్‌ సృష్టించి అనుమతి çపత్రాలు పొందాడు. ప్రతి పనికి ఒక రేటుతో చక్కబెడుతున్న రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంలో కూడా భారీస్థాయిలో ముడుపులు తీసుకొని అక్రమ సర్టిఫికెట్‌లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న నాగమల్లేశ్వరరావు ఎవరెవరికి ఎంత ముట్టజెప్పింది విచారణలో కక్కాడు. దీంతో కంగుతిన్న అవినీతి అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి తమపై చర్యలు లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దుకొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

కిడ్నీ దందాలో రెవెన్యూ పాత్ర కీలకం
కిడ్నీ మార్పిడి వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి అడ్డదిడ్డంగా సర్టిఫికెట్‌లు  మంజూరు చేయడంతో కిడ్నీ రాకెట్‌ పురుడుపోసుకుంటుంది. సర్టిఫికెట్‌ల ప్రారంభ దశలో అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తే ఈ అక్రమానికి ఆస్కారం ఉండదనేది వాస్తవం. అయితే ఒక్క నరసరావుపేట తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఈ సర్టిఫికెట్‌ల మంజూరు పత్రాలు పొందడం ఇక్కడి అధికారులకు, దళారులకు మధ్య ఉన్న సత్సంబంధాలను చాటుతుంది. చిన్నచిన్న తప్పిదాలపై ఉక్కుపాదం మోపే ఉన్నతాధికారులు  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలించిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో అవినీతి రెవెన్యూ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అంతుచిక్కడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరికొన్ని గంటల్లో కోర్టుకు హాజరు
కిడ్నీ రాకెట్‌ కేసులో వెంకటేశ్వర్లు నాయక్, నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో పాటు తెనాలిలో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. మొత్తం ఏడు కిడ్నీ మార్పిడిలకు అనుమతులు తీసుకోవడంతో పాటు దాతలకు ఇప్పించినట్లు సమాచారాన్ని సేకరించారు. అయితే కిడ్నీ మార్పిడిలో డబ్బులు చేతులు మారినందుకు దాత, తీసుకున్న వ్యక్తులను కూడా ముద్దాయిలుగా చేర్చాలా, వద్దా అన్న సందిగ్ధంలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారులను విచారించక పోవడం వెనుక రాజకీయ ఒత్తిడి దాగుందన్న అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని గంటల వ్యవధిలో నిందితులను కోర్టుకు హాజరుపరుస్తుండటంతో ఇప్పటిదాకా అనేక మలుపులు తిరిగిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది.

మరిన్ని వార్తలు