ఒక్క ఫైర్‌ ఇంజిన్‌.. సరిపోతుందా!

6 Mar, 2019 12:15 IST|Sakshi

 ఐదు మండలాలకు కలిపి  అందుబాటులో ఒకే ఫైర్‌ ఇంజిన్‌

మండుతున్న భానుడు, ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు 

జరుగుతాయోనన్న ఆందోళనలో ప్రజలు 

సాక్షి, క్రోసూరు: అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు సమయానికి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడే అగ్నిమాపక యంత్రం, సిబ్బంది అందుబాటులో ఉంటే ప్రజలకు ఎంతో భరోసా ఉంటుంది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు మండలాలకు కలిపి ఒకే ఫైర్‌ ఇంజిన్‌ ఉండటంతో దూరాభారం కారణంగా, రోడ్లు బాగోలేకపోవటం, అందుబాటులోని నీటి సౌకర్యాలతో సమయానికి దూరప్రాంతాలకు చేరుకోలేక, అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఫలితంగా అగ్రిప్రమాద బాధితులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

క్రోసూరు మండల కేంద్రలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2004లో అగ్నిమాపక స్టేషన్‌ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి పరిధిలోని సహాయ అగ్నిమాపక అధికారి రామకృష్ణ నేతృత్వంలో ప్రస్తుతం స్టేషన్‌లో ఒకే ఒక ఇంజిన్‌తో ఇద్దరు డ్రైవర్లు, 13 మంది ఫైర్‌ మెన్లు పనిచేస్తున్నారు. అగ్నిమాపక శకటం ద్వారా క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండలో అన్ని గ్రామాలు, అమరావతి, పెదకూరపాడు మండలంలో సగం గ్రామాలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ఈ ఐదు మండలాల్లో కలిపి 110 గ్రామాలున్నాయి. పెదకూరపాడులో సగం అంటే కనీసం 100 గ్రామాలకు ఈ వాహనాన్నే వినియోగించాలి. అయితే ప్రమాదాలు సంభవించినపుడు సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది 100 ప్రమాదాలకు హాజరైతే ఈ ఏడాది ఇంకా ప్రమాదాలు సంభవించలేదు.

మండలానికి ఒక ఫైరఇంజిన్‌
ఏది ఏమైనప్పటికీ భానుడు తీవ్రతకు స్లాబ్‌ గృహాలే మండిపోతున్నందున పూరిళ్లు, పూరి పాకలు, చిన్నచిన్న షెడ్డులు, నిత్యం పొయ్యి మంటలతో వ్యాపారాలు నిర్వహించే వ్యాపార సంస్థలు, వంటగ్యాస్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మండలానికి ఒక ఫైర్‌ ఇంజిన్‌ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

కనీసం రెండు మండలాలకైనా..
పేదల ఆస్తిపాస్తులు, గడ్డివాములకు వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించి కట్టుబట్టలతో బయట పడిన కుటుంబాలకు తూతూ మంత్రంగా రేషన్‌ ఇచ్చి, ఐదు వేల నగదు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇది చాలా దారుణం. ప్రమాదాల నుంచి కాపాడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉండి కూడా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవరించడం శోచనీయం. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు సంభవించినపుడు, తక్షణమే ఆదుకునేందుకు కనీసం రెండు మండలాలకు ఒక అగ్నిమాపక శకటం అయినా ఏర్పాటు చేయాలి. 

కాల్వపల్లి ఏసురెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి, క్రోసూరు 
   

మరిన్ని వార్తలు